ప్రమాద స్థలానికి వెంటనే తరలివెళ్లిన రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎన్డీఎంఏ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి గురువారం గాలింపు దళాలను సమన్వయం చేస్తున్న ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ తదితర విభాగాల బాధ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

రోజువారీ జరుగుతున్న గాలింపు చర్యలకు అదనంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించే అంశంపై, గాలింపు చర్యలకు ఎదురవుతున్న అవాంతరాలను అధిగమించడానికి తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాల గురించి చర్చించారు. గల్లంతైనవారి ఆచూకీ తెలిసేంతవరకు గాలింపు చర్యలను కొనసాగించాలన్న నిర్ణయంలో మార్పులేదని వారు స్పష్టం చేశారు.