కొత్తగా ఏర్పాటైన తెలంగాణ అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాల కల్పన, సామాజిక పథకాల అమలుకు కార్పొరేట్ల సాయం తీసుకోవాలన్న సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ఓ కీలక ముందడుగు వేసింది. టీ-హబ్, విద్యుత్, చౌక ఇండ్ల పథకం సహా రాష్ట్రప్రభుత్వం చేపట్టిన కీలక ప్రాజెక్టుల అమలులో భాగస్వామిగా కావాలన్న రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తి పట్ల ప్రముఖ పారిశ్రామిక సంస్థ టాటా సన్స్ సుముఖత వ్యక్తంచేసింది. వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు టాటాసన్స్ అనుబంధ సంస్థలు ముందుకొచ్చాయని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు చెప్పారు.

-ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడులు.. విద్యుత్ రంగంపై టాటా ఆసక్తి -టీ-హబ్, ఇన్నోవేషన్ ఫండ్లలో భాగస్వామ్యానికి రెడీ -త్వరలో టాటాసన్స్ బృందం పర్యటన -మంత్రి కేటీఆర్‌తో భేటీలో సైరస్ మిస్త్రీ, టాటా ప్రతినిధుల హామీ మంగళవారం ఆయన నేతృత్వంలో రాష్ట్రప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం ముంబైలోని టాటాసన్స్ ప్రధాన కార్యాలయంలో సంస్థ సీఎండీ సైరస్మిస్త్రీ సహా తొమ్మిది అనుబంధ సంస్థల సీఈవోలతో సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇండస్ట్రి పాలసీ, జలహారం, టీ-హబ్, ఇండస్ట్రి కారిడార్, ఆర్ఐసీహెచ్, స్మార్డ్సిటీ, సోలార్ పవర్ ప్రాజెక్టు, ఏరోస్పేస్ పార్క్, పేదల గృహనిర్మాణ పథకం, సామాజిక పథకాలు, గ్రీన్‌హౌజ్ వ్యవసాయం తదితర 12 పథకాల తీరుతెన్నులను టాటా ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి టాటాసన్స్ టాటా ప్రతినిధులు ఆసక్తి ప్రదర్శించారన్నారు.
విద్యుత్ లోటును ఎదుర్కొంటున్న రాష్ర్టాన్ని గట్టెక్కించేందుకు 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు టాటా పవర్ అంగీకరించిందని ఆయన తెలిపారు. వృథా భూముల్లో బయోమాస్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదంతోపాటు పవన విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలిస్తామని టాటా పవర్ హామీనిచ్చిందని రాష్ట్ర ఐటీమంత్రి వివరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న సోలార్పార్కులో సోలార్ ప్లాంట్, . స్మార్ట్‌సిటీ ఏర్పాటు, ఎలక్ట్రికల్ పార్కులో పెట్టుబడులకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు తారకరామారావు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు కూడా టాటా పవర్ సిద్ధంగా ఉన్నదని చెప్పారు.
టీ-హబ్‌లో భాగస్వామ్యానికి టాటాగ్రూప్ సిద్ధంగా ఉన్నదని తెలిపారు. టీ హబ్ ఇన్నోవేషన్ ఫండ్‌లో టీసీఎస్ సాప్ట్వేర్ గ్రూప్ భాగస్వామ్యం అవుతుందని హామీ ఇచ్చినట్లు తారకరామారావు తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రి టౌన్షిప్, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పాలసీకి మద్దతునిస్తామని టాటా ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టుకు అనుసంధానంగా తేలికపాటి నిర్మాణాల అంశాన్ని పరిశీలిస్తామని టాటాసన్స్ తెలిపినట్లు కేటీఆర్ చెప్పారు. ఆదిభట్లలోని ఏరోస్పెస్ విస్తరణకు సహకరిస్తామని సైరస్మిస్త్రీ వెల్లడించినట్లు తెలిపారు.
హైదరాబాద్‌లోని మురికివాడల అభివృద్ధికి తక్కువ ఖర్చుతో ఇండ్ల నిర్మాణంలో పెట్టుబడులు పెట్టడానికి టాటా హౌజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ సిద్ధమని కేటీఆర్ వివరించారు. త్వరలో టాటాసన్స్ ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించి పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తారని టాటా సన్స్ సీఈఓ సరైస్ తమతో అన్నారని కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో ఐటీశాఖ కార్యదర్శి హరిప్రీత్ సింగ్, పరిశ్రమలశాఖ కమిషనర్ జయేష్‌రంజన్, హౌజింగ్శాఖ చీఫ్ ఇంజినీర్ ఈశ్వరయ్య పాల్గొన్నారు.
అనిల్ సర్థన్ (టాటా పవర్), సంజయ్ ఉబేల్ (రిటైల్/ఇన్ఫ్రాసక్చర్), వినాయక్ దేశ్‌పాండే (టాటా ప్రాజెక్ట్స్), పునీత్ శర్మ (టాటా క్యాపిటల్), సుకరణ్‌సింగ్ (టాటా అడ్వాన్స్డ్ సిస్టం), రామనన్ (సీఎంసీ), సుమీత్ సప్రూ (టాటా హౌజింగ్), రవి పిసౌర్డీ (టాటా మెటార్స్)తదితరులతో కేటీఆర్ ప్రతినిధి బృందం చర్చలు జరిపింది.