– తిరిగి వడ్డీతో సహా సకాలంలోనే చెల్లిస్తాం.. – నీతి ఆయోగ్సైతం బలోపేతం అవుతుంది – విభజన బిల్లులో ఇచ్చిన హామీని నెరవేర్చండి – ఎఫ్ఆర్బీఎం పరిమితిని 3.5 శాతానికి పెంచండి – నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగారియతో సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అవసరమయ్యే నిధులను సమకూర్చే బాధ్యత నీతి ఆయోగ్ తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తిరిగి వాటిని చెల్లించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ అరవింద్ పనగారియ గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల నిర్వహణ, ప్రభుత్వ విధానాలు తదితర అంశాలపై చర్చజరిగింది. విభజన బిల్లులో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌ను కోరారు. అలాగే రాష్ట్ర ఎఫ్ఆర్బీఎం పరిమితిని 3నుంచి 3.5 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీనికి పనగారియ సానుకూలంగా స్పందించారు. ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన నీతిఆయోగ్ మరింత సమర్థవంతంగా పని చేయాలని సీఎం ఆకాంక్షించారు. గతంలో నీటి ప్రాజెక్టులకు ప్రణాళికా సంఘం నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు.
ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు నీతి ఆయోగ్ నిధులు ఇవ్వాలని, మళ్లీ వాటిని వడ్డీతోపాటు రాష్ర్టాల నుంచి తీసుకోవాలన్నారు. దీని వల్ల నీతి ఆయోగ్ కూడా బలోపేతమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, హరితహారం తదితర పథకాలను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియకు వివరించారు. నీటి పారుదల ప్రాజెక్టులతోపాటు, ఇతర సంక్షేమ కార్యక్రమాల గురించి తెలిపారు. కొత్త పారిశ్రామిక విధానంతోపాటు తెలంగాణ రాష్ట్రం చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ లాంటి కార్యక్రమాలను అరవింద్ పనగారియ అభినందించారు. కేంద్రం వద్ద మూలుగుతున్న కాంపా నిధులను వాటా ప్రకారం రాష్ర్టాలకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌ను కోరారు. సమావేశంలో మంత్రులు కే తారకరామారావు, జగదీశ్‌రెడ్డి, ప్రణాళికాబోర్డు ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రదీప్‌చంద్ర, బీపీ ఆచార్య, నర్సింగరావు, ఎంజీ గోపాల్, సోమేశ్‌కుమార్, రాజేశ్వర్ తివారీ, ఎస్కె జోషి, రేమండ్‌పీటర్, శాంతికుమారి, స్మితా సబర్వాల్, నీతి ఆయోగ్ అధికారులు తపస్య, అశోక్‌జైన్ పాల్గొన్నారు.
సీఎంతో సమావేశానికి ముందు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింగ్ పనగారియతో పాటు అధికారులు మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కిషన్‌నగర్ గ్రామాన్ని సందర్శించారు. నందిగాంలో మిషన్‌కాకతీయ పనులు, రాయికల్‌లో పాలీహౌస్‌జ్‌ను పరిశీలించారు.