Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రాష్ర్టాల హక్కులే రాజ్యాంగస్ఫూర్తి

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులు కొందరు హైదరాబాద్‌లో తమ పోలీస్‌స్టేషన్లు నెలకొల్పుకుంటామని మాట్లాడుతున్నారు. వారి పాలనా హక్కు వారి రాష్ట్ర సరిహద్దు పరిధిలోనే ఉంటుందని తెలియదా? పోలీసు, పాలనాధికారాలు పూర్తిగా స్టేట్ లిస్టులోనివి మాత్రమేనని, హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని మరోసారి చెప్పాల్సి ఉన్నది.

Keshava Rao

రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్ష న్-8 గురించి కొందరు అనవసర చర్చను, అనుమానాలను సృష్టిస్తూ ..రాజ్యాంగ నిబంధనలనే వ్యతిరేకిస్తున్నారు. ఈ మధ్యనే హైకోర్టులో దాఖలైన ఓ పిల్‌ను నిరాకరిస్తూ ఆ సందర్భంగా సెక్షన్-8ను అమలు చేయాలనడం అసంబద్ధమైనది, అనవసరమైనదని వ్యాఖ్యానించింది. దాని పై రాద్ధాంతం చేస్తున్న వారికి సరైన సమాధానాన్నిచ్చింది.

ఇదంతా చూస్తున్న వారికి తేలికగా అర్థమయ్యే విషయమే. చంద్రబాబు అనుంగు అనుచరులు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి, దాన్ని పక్కదారి పట్టించడం కోసం చేస్తున్న అనవసర రభస. దీనికి సమానంగా వారి అధినేత స్వీయ గొంతుతో మాట్లాడి కుట్రలో తన పాత్ర తక్కువేమీ కాదని రుజువు చేసుకున్నారు. అయితే ఇందులో కుట్రదారుల పాత్ర ఏ స్థాయిలో ఏ తీరుగా కూడుకుని ఉన్నదో విచారణ సంస్థలు తేల్చవలసి ఉన్నది.

అయితే సెక్షన్-8 మీదనే ఎందుకు ఇంత రభస చేస్తున్నారో తెలుసుకోవాలి. ఇక్కడే మనం రాజ్యాంగాన్ని ఫెడరల్ సూత్రాలపై రాసుకున్న రాజ్యాంగం గా, దానిలో రాష్ర్టాలు, కేంద్రం వాటి మధ్యన అధికారాల విభజన, విధులు విధానాలు స్పష్టంగా విభజింపబడి ఉన్నాయని గుర్తుంచుకోవాలి. రాజ్యాంగంలోని పదకొండవ విభాగం.. పాలనాధికారాల గురించి కేంద్ర, రాష్ర్టాల విధులు, పరిమితుల గురిం చి స్పష్టంగా ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఏడవ షెడ్యూల్‌లో లిస్ట్-2లో రాష్ర్టాలకు ఉన్న శాసనాధికారాలూ పొందుపర్చబడ్డాయి. దీన్నే స్టేట్ లిస్టుగా పిలుచుకుంటాం. ఒక ప్రత్యేకమైన పరిస్థితులు, అసాధారణమైన పరిస్థితులలో తప్ప కేంద్రం రాష్ర్టాల పాలనాధికారాల్లో జోక్యం చేసుకోదు.

అసాధారణ పరిస్థితుల్లో, జాతీయ ప్రయోజనాల (ఆర్టికల్ 249) కోసం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కేంద్రం రాష్ట్ర పాలనాధికారా ల్లో తలదూర్చుతుంది. అదీ ఏదో ఆషామాషీగా కాదు, రాజ్యసభలో మూడింట రెండొంతుల మెజారిటీ తీర్మానంతో మాత్రమే కేంద్ర జోక్యానికి అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భంలో నూ తలెత్తిన పరిస్థితుల్లో ఒక సంవత్సరం మాత్రమే కేంద్రం పాలనాధికారం చేతుల్లోకి తీసుకుంటుంది. ఒకవేళ ఇంకా పరిస్థితులు అనుకూలించకపోతే మరోఏడాది పొడిగించుకునే అవకాశమున్నది.

ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే రాష్ర్టాలకు సంబంధించిన పాలనాధికారాల్లో కేంద్ర జోక్యం ఉంటుంది. స్టేట్ లిస్ట్‌గా చెప్పబడుతున్న రాష్ట్ర పాలనాధికారాలు ఏడో షెడ్యూల్‌లోని లిస్టు-2లో స్పష్టంగా పేర్కొనబడ్డాయి. కాబట్టి రాష్ట్ర చట్టసంబంధ పాలనాధికారాలు, పోలీసు అధికారాల్లో ఇతరుల జోక్యం వర్తించదు. ఇదే అప్పటి ప్రతిపక్షనేత అరుణ్ జైట్లీ పార్లమెంటులో చెప్పారు. రాష్ట్రంలో చట్ట, పాలనాధికారాలు, పోలీసు అధికారాలు పూర్తిగా ప్రజలతో ఎన్నుకోబడిన స్థానిక ప్రభుత్వానికే ఉంటాయి. ఈ అధికారాలను మంత్రివర్గం గవర్నర్‌కు ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వదు.. రాజ్యాంగంలో సవరణ చేస్తే తప్ప ఈ పరిస్థితి ఏర్పడదు.

అయితే అది కూడా రాజ్యాంగ వ్యతిరేకమైనదే అవుతుంది.రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 74,163 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్‌లు చట్టసభలు, మంత్రి మండలి సూచనల మేరకే నడుచుకోవాలి. మన రాజ్యాంగం స్వతంత్రంగా చట్టసభలు, మంత్రి మండలికతీతం గా ఈ అధిపతులకు స్వతంత్ర అధికారాలు ఇవ్వలేదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆర్టికల్ 162 (2)ప్రకారం గవర్నర్ ప్రత్యేక అధికారాలతో వ్యవహరించవచ్చు. ఆ పరిస్థితులు.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మెజారిటీని కోల్పోయినప్పుడు, లేదా చట్ట, సంప్రదాయాల కనుగుణంగా ఎన్నికైన పాలనా ప్రభుత్వం నడుచుకోవడానికి నిరాకరించడం, మధ్యప్రదేశ్‌లో లాగా రాష్ట్రపతి సూచన మేరకు రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన సూచనలు అమలు కానప్పుడు.. కేంద్ర జోక్యంతో గవర్నర్‌కు పాలనాధికారాలు చేతికి వస్తాయి.

ఇలాంటి చర్చకు దేశంలో సుదీర్ఘ చరిత్ర ఉన్నది. 1950లలో స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లోనే.. ప్రధాని నెహ్రూ, రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ మధ్య కూడా ఈ విషయంలో విభేదాలుండేవి. భారత దేశంలో రాష్ట్రపతి పదవి, బ్రిటన్‌లో రాజు మాదిరిగా గౌరవప్రదమైనది, అధికారాల్లో నామమాత్రమైనది మాత్రమేనని ప్రధాని నెహ్రూ వాదించారు. దీంతో ఈ విషయాన్ని అటార్నీ జనరల్ ఎంసీ సెతల్వాద్‌కు అప్పగించారు. ఆ తర్వాత ఆయన భారత రాష్ట్ర పదవి పూర్తిగా రాజ్యాంగబద్ధమైన గౌరవ ప్రదమైన పదవేనని తేల్చారు. అలాగే ఆయన చట్టసభలు, మండలి సలహా, సూచనల మేరకే నడుచుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. ఆ తర్వాత కాలంలో సరిగ్గా ఈ విషయంపైనే 1974 ప్రాంతంలో సుప్రీంకోర్టులో ఏడుగురు సభ్యుల ధర్మాసనం కూడా సుదీర్ఘంగా చర్చించి తీర్పును ప్రకటించింది.

అయితే.. ఈ సందర్భంగా న్యాయమూర్తులు రెండు విభాగాలుగా విడిపోయి రెండు విధాలైన తీర్పులు ఇచ్చారు. ఒక తీర్పుకు చీఫ్ జస్టిస్ రాయ్, అతని తీర్పుతో ఏకీభవించిన నలుగురు న్యాయమూర్తులు బాధ్యులైతే, మరో తీర్పుకు జస్టిస్ కృష్ణయ్యర్ నేతగా ఉన్నారు. ఈ రెండు తీర్పులు కూడా.. కేంద్ర స్థాయిలో రాష్ట్రపతి, రాష్ట్రం స్థాయిలో గవర్నర్‌కు స్వతంత్ర అధికారాలు ఉండవని తమ తమ తీర్పుల్లో స్పష్టం చేస్తూ, కేవలం వారు అక్కడి చట్టసభలు, మంత్రి మండలి సూచనలు, సలహా మేరకే నడుచుకోవాలని ప్రకటించాయి. అలాగే.. చీఫ్ జస్టిస్ రాయ్ ప్రకారం.. ఏ మంత్రి మండలి అయినా, రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి, గవర్నర్ అయినా.. ఆర్టికల్స్ 77(3), 166(3)ప్రకారం నడుచుకోవాలి.

ఈ ఆర్టికల్స్ రాజ్యాంగ అధిపతులకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడం లేదు. కృష్ణయ్యర్ తీర్పు ప్రకారం అక్కడి ప్రభుత్వం మెజార్టీ కోల్పోయినప్పుడు మాత్రమే రాజ్యాంగాధిపతులకు ప్రత్యేక అధికారాలుంటాయి. ఈ తీర్పులు ఇప్పటి పరిస్థితుల నేపథ్యంలో చూసినప్పుడు వారికి ప్రత్యేక అధికారాలుంటాయని చెప్పడానికి ఏమీ లేదు. అలాగే ప్రత్యేక అధికారాలను ఉపయోగించడానికి ఇప్పడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు లేవు . కాబట్టి ఆర్టికల్స్ 163(2), 371ఏ, 371 డీ2, 372 బీ నుంచి ఎఫ్, ఆరో షెడ్యూలు పేరా 9(2)కూడా వర్తించవు. కాబట్టి అలాంటి చర్చకే తావులేదు.

ఈ నేపథ్యంలో ఆలోచించినప్పుడు సెక్షన్-8 అమలు, గవర్నర్ అధికారాల గురించి చర్చ చేయడం అసమంజసం. అలాగే రాజ్యాంగబద్ధం కూడా కాదు. ఇంకా సూటిగా, సరళంగా చెప్పుకోవాలంటే.. ఏ రాష్ట్రం కూడా రాజ్యాంగానికి లోబడకుండా నడుచుకునే అధికారాలను కట్టబట్టలేదు. అదే సందర్భంలో దాని అధికారాల మీద మరొకరి జోక్యానికి కూడా తావులేదు. ఇదే ఫెడరల్ స్ఫూర్తి. ఇదే సందర్భంలో పార్లమెంటుకు పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను మార్చుకునే అధికారం రాజ్యాంగం కట్టబెట్టింది. కానీ రాజ్యాంగ మౌలిక భావనలకు విరుద్ధంగా చట్టసభలు నడుచుకోవడానికి అవకాశం లేదు. కేశవానంద భారతి కేసు విషయంలో కూడా రాజ్యాంగంస్ఫూర్తి ఇదే.

ఈ నేపథ్యంలోనే సెక్షన్-8 ఏం చెప్పింది, దానిలో ఏముంది అనేది పెద్ద చర్చకు తావిచ్చే విధంగా ఏమీ లేదు. దానికి ఇంకా భాష్యాలు అవసరం లేదు. కానీ ఇప్పుడు సెక్షన్-8 చెబుతున్న దాని గురించి సాగుతున్న చర్చలు, వక్రీకరణలు అందరినీ అటువైపు చూసేలా చేస్తున్నాయి. మంత్రి మండలిని కాదని గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టాలనడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్3, 4 ప్రకారం ఇరు రాష్ర్టాలకూ స్పష్టమైన సరిహద్దులు గీయబడ్డాయి. ఏపీ ప్రభుత్వానికి పాలన చేసుకోవడానికి తాత్కాలికంగా హైదరాబాద్‌లో చోటు కల్పించబడ్డది. ఏపీ ప్రభుత్వ పాలనాధికారం దానిలోని పదమూడు జిల్లాల పరిధికి మాత్రమే వర్తిస్తుంది. అంతే కానీ మరో భూ భాగంలో మరో ప్రభుత్వం పాలనాధికారాలు చెలాయించే పరిస్థితి ఉండదు.

ఇక్కడ చట్టసభల అధికారాలకు సంబంధించినది. చట్టసభ, మంత్రి మండలి మాత్రమే పాలనాధికారాలు సంపూర్ణంగా కలిగి ఉంటాయి. మరే ఇతర అధికార కేంద్రం చట్టసభల పరిధికి ఆవల అస్తిత్వంలో ఉండదు. ఇదే విషయం .. రాయ్ సాహెబ్ రామ్ జవాయ కపూర్ ఇంకా ఇతరులు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ (ఏఐఆర్ 1955, ఎస్‌సీ 549)లో స్పష్టంగా తేల్చిచెప్పడం జరిగింది. ఈ తీర్పులు, సందర్భాలన్నీ.. చట్టసభల అధికారాలు, విధులు, పరిధిల గురించి స్పష్టంగా పేర్కొన్నాయి.

ఈ తీర్పులన్నీ మరిచిపోయి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులు కొందరు హైదరాబాద్‌లో తమ పోలీస్‌స్టేషన్లు నెలకొల్పుకుంటామని మాట్లాడుతున్నారు. వారి పాలనా హక్కు వారి రాష్ట్ర సరిహద్దు పరిధిలోనే ఉంటుందని తెలియదా? పోలీసు, పాలనాధికారాలు పూర్తిగా స్టేట్ లిస్టులోనివి మాత్రమేనని, హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని మరోసారి చెప్పాల్సి ఉన్నది. పాలనా వ్యవహారాలను తెలంగాణ ప్రభుత్వం తన భూభాగంలో తానే చూసుకుంటుంది. గవర్నర్ మంత్రిమండలి సలహా మేరకు నడుచుకుంటారు. గవర్నర్ స్వతంత్రంగా పాలనాధికారాలను చేతుల్లోకి తీసుకోవడం జరగదు.

ఒక వేళ తీసుకుంటే.. అది రాజ్యాంగ వ్యతిరేకమే. పార్లమెంటు కానీ, చట్టం కానీ పాలనా వ్యవహారాలు, పోలీసు చట్టాలను గవర్నర్ చేతిలో పెడితే అది పూర్తిగా రాజ్యాంగ నిర్మాణానికి వ్యతిరేకమైనది. ఫెడరల్ స్ఫూర్తిలో భాగంగా రాష్ర్టాలు, కేంద్రం మధ్యన ఉన్న అధికారాల విభజనకు వైరుధ్య పూరితమైనది. ఇలాంటి పరిస్థితులు పార్లమెంటులో ఇంతవరకు జరగలేదు. కాబట్టి సెక్షన్-8 గురించి ఎవరెన్ని వక్రభాష్యాలు చెప్పినా, రచ్చచేసి నా తెలంగాణలో సెక్షన్-8 ప్రసక్తే ఉత్పన్నం కాదు.

-(రచయిత: రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.