-కుట్రలతో అభివృద్ధిని అడ్డుకోలేరు -విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి

పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్ పాలనలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రామవరంలో 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేశ్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రజ లు కలలను సాకారం చేసినప్పుడే నిజమైన రాష్ర్టాన్ని సాధించినట్లని చెప్పారని గుర్తుచేశారు. ఇందుకు అనుగుణంగానే నేడు అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని దేశంలోనే అభివృద్ధి చేస్తూ విమర్శకుల నోర్లు మూయిస్తున్నామని చెప్పారు.
రాష్ర్టాభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే, ఆంధ్రాప్రాంతానికి చెందిన నేతల మోచేతినీళ్లు తాగే తెలంగాణలోని కొందరు నాయకులు అభివృద్ధిని అడ్డుకునేలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. సీమాంధ్ర నేతలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఏమాత్రం అడ్డుకోలేరని స్పష్టంచేశారు. కొన్ని పత్రికలు సీమాంధ్ర నేతలకు తలొగ్గుతూ రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా కథనాలు ప్రచురిస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుతం రైతులకు ఆరు గంటలకు బదులుగా ఏడు గంటలు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి సాగునీటిని అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎన్‌పీడీసీఎస్ సీఎండీ వెంకటనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు పాలకుర్తి సారంగపాణి, సర్పంచ్ తోట సంధ్య తదితరులు పాల్గొన్నారు.