Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రాష్ట్రంలో హెచ్‌పీ కేంద్రం

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు బోయింగ్, హెచ్‌పీ సుముఖత వ్యక్తంచేశాయి. ఐటీ, ఎలక్ట్రానిక్ దిగ్గజం హెచ్‌పీ సంస్థ హైదరాబాద్‌లో ప్రింటర్ల కేంద్రాన్ని నెలకొల్పేందుకు సిద్ధమని ప్రకటించింది. విమానాల తయారీలో అగ్రగామిగా వెలుగొందుతున్న బోయింగ్ సంస్థ హైదరాబాద్‌లో వైమానిక పరిశ్రమ విస్తరణకు ఉన్న అవకాశాలు పరిశీలిస్తామని తెలిపింది. కరీంనగర్‌లో ఆరోగ్యసేవల విస్తరణ కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు ఏక్‌లాట్ హెల్త్ సొల్యూషన్స్ సంస్థ సంసిద్ధత వ్యక్తంచేసింది.

KTR Met with Boeing Representatives

-మంత్రి కేటీఆర్‌కు హెచ్‌పీ సంస్థ హామీ -త్వరలో రాష్ర్టానికి బోయింగ్ ప్రతినిధి బృందం -అమెరికా పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ వరుస భేటీలు -మిషన్ కాకతీయకు ఎన్నారైల విరాళం 50 వేల డాలర్లు అమెరికాలో రెండు వారాల పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు గురువారం బోయింగ్ సంస్థ అధ్యక్షుడు మార్క్ అలెన్, హెచ్‌పీ ఉపాధ్యక్షుడు సుపర్లో బెనర్జీతో వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానం, రాష్ట్రంలో పెట్టుబడులకుగల అవకాశాలు, మౌలికవసతుల గురించి వివరించారు. అమెరికాలో భారత రాయబారి అరుణ్‌కుమార్‌సింగ్‌తో విందు సమావేశంలో పాల్గొన్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు.

త్వరలోనే బోయింగ్ ప్రతినిధుల రాష్ట్ర పర్యటన రాష్ట్రంలో వైమానిక పరిశ్రమలో పెట్టుబడులకుగల అవకాశాలను పరిశీలించేందుకు త్వరలోనే తమ ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటిస్తారని మంత్రి కేటీఆర్‌కు బోయింగ్ సంస్థ అధ్యక్షుడు మార్క్ అలెన్ తెలిపారు. అలెన్‌తో సమావేశం సందర్భంగా తెలంగాణలో ఇప్పటికే ఉన్న ఏరోస్పేస్ పరిశ్రమలు, వాటికున్న అవకాశాలను కేటీఆర్ వివరించారు. భారతదేశంలో వైమానికరంగంలో ప్రైవేట్ పెట్టుబడులు ఊపందుకుంటున్న నేపథ్యంలో తమ కంపెనీ విస్తరణ దిశగా కసరత్తు చేస్తున్నట్లు అలెన్ తెలిపారు.

పెట్టుబడులకు హెచ్‌పీ అంగీకారం రాష్ట్రంలో పెట్టుబడులకు ఐటీ దిగ్గజ సంస్థ హ్యులెట్ ప్యాకర్డ్ (హెచ్‌పీ) ఆసక్తి కనబర్చింది. సంస్థ ఉపాధ్యక్షుడు సుపర్ణో బెనర్జీతో మంత్రి కేటీఆర్ సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. హెచ్‌పీ ప్రింటర్ల తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేయాలని, కంపెనీ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణలో ట్రామా సెంటర్ నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. దీనికి హెచ్‌పీ యాజమాన్యం వెంటనే అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో విద్య, వైద్యం తదితర రంగాల్లో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు బెనర్జీ తెలిపారు.

ఫోర్డ్ మోటార్ కంపెనీ, లాక్‌హీడ్ మార్టిన్, ఫైజర్, విప్రో, మాస్టర్ కార్డ్ తదితర సంస్థల సీనియర్ ప్రతినిధులు కేటీఆర్‌తో సమావేశమై పెట్టుబడుల గురించి చర్చించారు. ఏక్‌లాట్ హెల్త్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ జెర్రీ జోర్గెసెన్ మంత్రి కేటీఆర్‌ను కలిసి ఆరునెలల్లో 200 మంది ఉద్యోగులతో కరీంనగర్‌లో ఆరోగ్యసేవల విస్తరణ కేంద్రం, విశ్లేషణ కంపెనీని ప్రారంభిస్తామని తెలిపారు.

తెలంగాణ పారిశ్రామిక విధానంపై భారత రాయబారి ప్రశంసలు రాష్ట్రప్రభుత్వం కొత్తగా రూపొందించిన పారిశ్రామిక విధానంపై అమెరికాలో భారత రాయబారి అరుణ్‌కుమార్‌సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. అరుణ్‌కుమార్‌సింగ్‌తో మంత్రి కేటీఆర్ గురువారం యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్‌ఐబీసీ) సీనియర్ ప్రతినిధులతో కలిసి హే అడమ్స్ హోటల్‌లో విందు సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వం గత పది నెలల్లో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా పారిశ్రామిక పాలసీని రూపొందించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను భారత రాయబారి ప్రత్యేకంగా అభినందించారు. పారిశ్రామిక విధానం అద్భుతంగా ఉందని ప్రశంసించారు.

మిషన్ కాకతీయకు 50 వేల డాలర్ల విరాళం పర్యటన మొదటిరోజు వాషింగ్టన్ నగరంలో బిజిబిజీగా గడిపిన కేటీఆర్ సాయంత్రం నగరంలోని తెలుగువారితో కూడా సమావేశమయ్యారు. నగరంలో స్థిరపడ్డ తెలుగు వృత్తి నిఫుణులు, ఎన్నారైలు హాజరైన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన జలహారం, మిషన్ కాకతీయ, రెండు పడకగదుల ఇండ్లు తదితర పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మిషన్ కాకతీయ పథకానికి ఎన్నారైలు 50,000 డాలర్ల విరాళమిచ్చేందుకు ముందుకొచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.