Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రాష్ర్టానికి హౌజింగ్ పాలసీ

రాష్ట్రంలో చేపడుతున్న ఇండ్ల నిర్మాణాలకోసం రాష్ట్ర హౌజింగ్ పాలసీ తీసుకురావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ ఏడాది 400 చొప్పున ఇండ్లు కట్టి, వచ్చే ఏడాదినుంచి ఈ సంఖ్యను పెంచుకుంటూ పోవాలని అన్నారు. బలహీనవర్గాల గృహనిర్మాణాలను దశలవారీగా చేపట్టాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బలహీనవర్గాలకోసం చేపడుతున్న గృహనిర్మాణాలపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా గృహ నిర్మాణాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

KCR review meet on New Housing Policy

నియోజకవర్గానికి 400 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఈ ఏడాది 400 చొప్పున ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించినందున దానికి సంబంధించి అత్యంత అవసరమైన వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం చెప్పారు. 5 లక్షల 4వేల రూపాయల వ్యయంతో 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇండ్ల చుట్టూ పశువులు, వ్యవసాయ పనిముట్ల కోసం ఖాళీ జాగా ఉండేలా డిజైన్లు రూపొందించాలన్నారు. భవిష్యత్తులో మరో అంతస్తు నిర్మించుకోవడానికి వీలుగా నిర్మాణం ఉండాలని సూచించారు.

-ఈ ఏడాది నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు – డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ – అన్నిరకాల వసతులు కల్పించాలని సూచన -వరంగల్ సిటీ, ఎర్రవల్లి కోసం ఇండ్ల నమూనాల పరిశీలన – వరంగల్ అంబేద్కర్‌నగర్‌లో జీప్లస్3 పద్ధతిలో 592 గృహాలు, ఎస్‌ఆర్ నగర్‌లో 792 ఇండ్లు -ఎర్రవల్లిని శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశం -మేడారం జాతర నిర్వహణపైనా సమీక్ష వరంగల్ మహానగరంలోని అంబేద్కర్‌నగర్‌లో 592 గృహాలను జీప్లస్3 పద్ధతిలో నిర్మించేందుకు రూపొందించిన నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించి, ఆమోదించారు. ఇదే నగరంలోని ఎస్‌ఆర్‌నగర్‌లో 792 కుటుంబాలకోసం నిర్మించనున్న గృహనిర్మాణ నమూనాను కూడా ముఖ్యమంత్రి ఖరారుచేశారు. వరంగల్‌లో ఇండ్ల నిర్మాణం చేపట్టేముందు అక్కడి అధికారులు హైదరాబాద్‌లో నిర్మించిన ఐడీహెచ్ కాలనీని సందర్శించాలని సూచించారు. తాను దత్తత తీసుకున్న మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామంలో నిర్మించే ఇండ్ల నమూనాలను కూడా కేసీఆర్ ఖరారుచేశారు.

ఎర్రవల్లిని మిగతా గ్రామాలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలి గజ్వేల్ నియోజకవర్గంలో ఎర్రవల్లి గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిచేసి ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దాలని, మిగతా గ్రామాలు ఎర్రవల్లిని చూసి ప్రణాళికలు రూపొందించుకునేలా తయారు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక అధికారి హనుమంతరావుతోపాటు ఎర్రవల్లికి చెందిన ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలతో ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు. ఎర్రవల్లిలో నివాసగృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజలందరూ వినియోగించుకునే ఇతరత్రా సౌకర్యాలు ఎక్కడ ఎలా ఉండాలనే విషయంపై కన్సల్టెన్సీలు రూపొందించిన నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించి ఆమోదించారు.

శిక్షణ కేంద్రంగా ఎర్రవల్లి ఎర్రవల్లి గ్రామంలో ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని అందించడంతోపాటు లేఅవుట్‌కు అనుగుణంగా స్వచ్ఛందంగా ఇండ్లు తొలగించుకున్నవారికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కట్టించాలని సీఎం నిర్దేశించారు. గ్రామంలో వివిధప్రాంతాల్లో ఇంటి నిర్మాణం చేపట్టడంతోపాటు గ్రామం మధ్యనుంచి పెద్ద రహదారి, గ్రామం పక్కనుంచి బైపాస్ రోడ్డు నిర్మించనున్నారు. 1200మందికి సరిపోయే కమ్యూనిటీ హాల్‌తోపాటు గ్రంథాలయం, బ్యాంకు, బస్‌బే, పార్కులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, కూరగాయలు, మాంసం మార్కెట్, పశువైద్యశాల, గోదాములు, జిమ్-యోగా సెంటర్, దేవాలయాలు, మసీదు, చర్చి, అంగన్‌వాడీకేంద్రం, అతిథిగృహం నిర్మించాలన్నారు.

తెలంగాణ రాష్ర్టాన్ని విత్తన భాండాగారంగా మార్చే ప్రక్రియకూడా ఎర్రవల్లినుంచే ప్రారంభం కావాలన్నారు. తాను వ్యవసాయం చేస్తున్న ప్రాంతంతోపాటు గ్రామపరిధిలోని వ్యవసాయ భూములన్నింటిలో భూసార పరీక్షలు నిర్వహించాలని, వాటి ఫలితాల ఆధారంగా విత్తనాలను ఉత్పత్తి చేసేలా రైతులను ప్రోత్సహించాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్‌రావును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. గ్రామాన్ని వందశాతం విత్తన ఉత్పత్తి గ్రామంగా మారుస్తామన్నారు. బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటుచేసి, ఖర్చులేని వంట విధానాన్నికూడా తీసుకువస్తామన్నారు. అన్నిరకాలుగా గ్రామాన్ని అభివృద్ధి పరిచి ఎర్రవల్లిని శిక్షణా కేంద్రంగా మార్చాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, టీ హరీశ్‌రావు, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి దానకిశోర్, వరంగల్, మెదక్ జిల్లాల కలెక్టర్లు వాకాటి కరుణ, రోనాల్డ్ రాస్, మెదక్ జాయింట్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు.. వచ్చే ఏడాది జరిగే మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. మేడారం జాతరకు సంబంధించి ప్రభుత్వం ఎక్కువ నిధులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వరంగల్ కలెక్టర్ వాకాటి కరుణ సీఎంను కోరారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి.. జాతరకోసం ఏయే పనులు చేపడుతున్నారో నిర్ణయించి, ప్రతిపాదనలు పంపితే అవసరమైనన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ట్రాఫిక్ నియంత్రణకు, రహదారుల నిర్మాణానికి, మంచినీటి వసతుల కల్పన, విద్యుదీకరణ, పారిశుధ్య పనులకు, స్నానఘట్టాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. ఇటీవల ముగిసిన గోదావరి పుష్కరాల సందర్భంగా అధికారులు బాగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారని, మేడారం జాతరలోకూడా అలాగే పనిచేయాలని కోరారు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.