Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రాష్ర్టానికి ఇండియా టుడే ఉత్తమ అవార్డు

ప్రతి ఏటా ఇండియా టుడే నిర్వహించే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ కాంక్లేవ్ కార్యక్రమంలో భాగంగా ఈసారి తెలంగాణ రాష్ర్టానికి మౌలిక సదుపాయాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో ఉత్తమ అవార్డు లభించింది. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు, మౌలిక సదుపాయాల రంగం ఉపాధ్యక్షుడు జయేష్ రంజన్ ఈ అవార్డును ఢిల్లీలో శుక్రవారం అందుకున్నారు. అనంతరం పరిపాలనా రంగానికి సంబంధించిన అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, ఆయా రాష్ర్టాలకు ఎన్ని ప్రాంతీయ అవసరాలు, ప్రాధాన్యాలు ఉన్నా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు బాధ్యత కూడా ఉంటుందని చెప్పారు. -ఐటీ, మౌలిక సదుపాయాల్లో అందజేత -అవార్డు స్వీకరించిన ఐటీ మంత్రి కేటీఆర్ -కేంద్రం అన్ని రాష్ర్టాలనూ సమదృష్టితో చూడాలి -రాష్ర్టాలు బలపడితేనే కేంద్రానికి బలమని వ్యాఖ్య

KTR  01

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, సహకారం రాజకీయాలకు అతీతంగా ఉండాలని, అప్పుడే అభివృద్ధి పైనుంచి కిందిదాకా సంతృప్తికరంగా, ఆశించిన స్థాయిలో ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాధాన్య రంగాల్లో తేడా ఉంటున్నా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ పథకాల అమలు కూడా సమర్థవంతంగా ఉండాలని అన్నారు. పరిపాలన ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలన్న కేటీఆర్.. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పట్ల ప్రజల్లో చాలా ఎక్కువ ఆశలు, నమ్మకాలు ఉన్నాయని, వీటిని పరిపూర్తి చేసే దిశగానే పరిపాలన సాగుతున్నదని తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాజీల, మౌలిక వసతుల కల్పన తదితర రంగాల్లో తెలంగాణకు ఉత్తమ అవార్డు రావడం సంతోషంగా ఉందని చెప్పారు.

ఇతర రాష్ర్టాలతో ఆరోగ్యకరమైన పోటీ సహజంగానే ఉంటుందన్నారు. వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదంలాంటి ఎన్ని సమస్యలు ఉన్నా స్థానిక ప్రయోజనాలు ఒకవైపు, అంతిమంగా దేశ ప్రయోజనాలు మరొకవైపు అనే విధానాలకు అనుగుణంగానే రాష్ర్టాల ఆచరణ, పరిపాలన, రూపొందించే విధాన నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జరిగిన చర్చలో పాల్గొన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు.. కేంద్రం వివిధ రాష్ర్టాలను కలుపుకొని పని చేయాలని భావిస్తున్నదని, ఇదే అంశాన్ని ప్రధాని మోదీ సైతం నొక్కి చెప్పారని తెలిపారు.

గత ఐదు నెలలుగా తమ ఆచరణ ఈ దిశగానే ఉందని తెలిపారు. కేంద్రం మొత్తం దేశ ప్రజల అవసరాలను గుర్తించి పథకాలను రూపొందిస్తుందని, వాటిని పకడ్బందీగా అమలుచేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత ఉంటుందని అన్నారు. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో ప్రజల దగ్గరకు తీసుకెళ్ళే బాధ్యత స్థానిక సంస్థలకు ఉంటుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించదల్చిన రెండు పడకగడులు, హాలు, వంటగదితో కూడిన ఇండ్ల పథకాన్ని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం అందరికీ గృహవసతి అనే పథకంలో భాగంగా ఇండ్ల నిర్మాణం చేయాలని భావిస్తున్నదని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు పడకగదుల ఇండ్లను నిర్మించనుందని, అయితే ఈ విషయంలో కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకాభిప్రాయానికి వచ్చాయని తెలిపారు. కేంద్ర పథకానికి తగిన నిధులు లేనందున ఒక పడకగది ఖర్చును తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ చెప్పారని, సంయుక్తంగా ఈపథకాన్ని విజయంతం చేద్దామన్నారని వెంకయ్యనాయుడు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సమ్మతి తెలియజేసిందని పేర్కొన్నారు. ఏ పథకమైనా సంయుక్త సహకారంతో, కృషితో విజయవంతమవుతాయని అన్నారు.

అందువల్లనే రాజకీయాలకతీతంగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్రం సహకారం కోరుతున్నదని చెప్పారు. రాష్ర్టాలు కూడా సహకార ధోరణితో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, కేంద్రంలో ఒక్కోసారి ఒక్కో పార్టీకి చెందిన ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయని, రాష్ర్టాల్లో మరో పార్టీకి చెందిన ప్రభుత్వాలు ఉంటుంటాయని, అయితే ఈ రెండింటి మధ్య సమన్వయం ఉండడం అవసరమని అన్నారు.

రాష్ర్టాలు బలపడితేనే దేశానికి బలం ఇండియా టుడే నిర్వహించిన స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ కాంక్లేవ్ కార్యక్రమంలో ఉత్తమ అవార్డు తెలంగాణకు రావడం సంతోషంగా ఉందని అనంతరం మీడియాతో కేటీఆర్ అన్నారు. రాష్ర్టాలు ఎంత ఎక్కువ శక్తిమంతంగా ఎదిగితే దేశం అంత శక్తిమంతమవుతుందని చెప్పారు. రాష్ర్టాలకు కేంద్రంతో ఉండే సంబంధాల్లో రాజకీయ ప్రభావం, పొత్తులు, మిత్రపక్షంలాంటి తేడాలు ఉండరాదన్నారు. కేంద్రం కూడా అన్ని రాష్ర్టాలనూ సమదృష్టితో చూసి అభివృద్ధికి దోహదపడాలని కోరారు.

రాష్ట్రంలోని మౌలిక వసతుల విషయంలో, క్షేత్రస్థాయిలో డిమాండ్ల విషయంలో ప్రజల అంచనాలకు, ఆకాంక్షలకు అద్దం పట్టేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే అధికారం కేంద్రం ఇవ్వాలని అన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి నడిస్తేనే పథకాల అమలు కిందిస్థాయి వరకూ పకడ్బందీగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రవిశంకర్ ప్రసాద్‌లను కూడా కలిసి మాట్లాడానని, ఆయా రంగాల్లో కొత్త రాష్ట్రంగా ఉనికిలోకి వచ్చిన తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం ఇవ్వాలని కోరానని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి అంశంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరినట్లు తెలిపారు.

ఉల్లంఘనలు చంద్రబాబువే -టీడీపీ చిల్లర రాజకీయాలు పద్ధతికాదు.. -ఢిల్లీలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు టీడీపీ తెలంగాణ నాయకులు రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలపడంకోసమే ఢిల్లీకి వచ్చారని, బస్సుయాత్ర పేరుతో చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ఇప్పుడు తెలంగాణ అవసరాల గురించి విజ్ఞప్తి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని కాదని, అన్ని చట్టాలను తుంగలో తొక్కుతూ, తెలంగాణను అంధకారంలోకి నెట్టివేస్తున్న చంద్రబాబునేనని అన్నారు.

ఇండియా టుడే నుంచి ఉత్తమ అవార్డు అందుకోడానికి శుక్రవారం ఢిల్లీకి వచ్చిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నది చంద్రబాబేనని అన్నారు. టీ టీడీపీ నేతలు ముందు చంద్రబాబును నిలదీసి, ఆ తర్వాత ఢిల్లీకివచ్చి కేంద్రం పెద్దలను కలిస్తే అర్థముంటుందిగానీ ఆ పని చేయకుండా కేవలం రాజకీయం కోసమే రాజకీయ చేయడం తగదని హితవు పలికారు.

తెలంగాణమీద విష ప్రచారంచేసి బద్నాంచేసే ఉద్దేశంతో ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలపడానికి ప్రయత్నించడం ముమ్మాటికీ ఖండించదగిందని అన్నారు. రాష్ట్రం లోపల ఉన్నప్పుడు ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా ఒక రకంగా ఉంటుందిగానీ, రాష్ట్రం వెలుపలమాత్రం ఆ రాష్ట్ర ఔన్నత్యాన్ని పరిరక్షించే విధంగానూ, ప్రతిష్ఠను కాపాడే విధంగానూ వ్యవహరించడం మంచి పద్ధతి అనిపించుకుంటుందని చెప్పారు. కాబట్టి తొలుత రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలే తప్ప విఘాతం కలిగించే తీరులో ప్రవర్తించరాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలంగాణ తెలుగుదేశం నాయకులకు సూచించారు.

చంద్రబాబుకు మూడు ప్రశ్నలు విద్యుత్ సంక్షోభం, రెండు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల విషయంపై మాట్లాడుతూ చంద్రబాబును సూటిగా మూడు ప్రశ్నలను అడుగుతున్నాను. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులో తెలంగాణ పెట్టుబడులు కూడా ఉన్నందున న్యాయంగా విద్యుత్ వాటా రావాల్సిందే. కానీ ఆంధ్ర ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వడంలేదు? లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టునుంచి తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను ఆంధ్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వడంలేదు? ఒకవైపు కరెంటు కోతల పేరుతో ధర్నాలు,

బస్సుయాత్రలలాంటి వీధినాటకాలు ఆడుతూ మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని ఆపివేయాలని తెలుగుదేశం ఎందుకు డ్రామాలు ఆడుతున్నది? చట్టాన్ని ఉల్లంఘిస్తున్నది చంద్రబాబు కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నదాంట్లో ఏదైనా తప్పు ఉన్నట్లయితే ప్రశ్నించవచ్చని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే విషయాలను ప్రస్తావిస్తే వీటికి సమాధానం చెప్పలేక చంద్రబాబు ముఖం చాటేసుకున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.