Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రాష్ర్టానికి పచ్చతోరణం

-నాలుగో విడుత హరితహారానికి గజ్వేల్ నుంచి శ్రీకారం -ఇందిరాపార్కు వద్ద లాంఛనంగా మొక్కనాటిన సీఎం కేసీఆర్ -ఆ వెంటనే హరిత ఉద్యమంలో చేయి కలిపిన ప్రజలు -లక్షా 116 లక్ష్యాన్ని మించి నాటుకున్న మొక్కలు -సింగాయపల్లి ఫారెస్ట్‌లో కలియదిరిగిన ముఖ్యమంత్రి -అడవుల పునర్జీవంపై అధికారులకు ప్రశంస -5 లక్షల రివార్డు ఇవ్వాలని సీఎస్‌కు ఆదేశం -అడవుల సంరక్షణకు గ్రీన్ బెటాలియన్లు -నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి -ప్రజాప్రతినిధులకు సీఎం సూచన -గజ్వేల్‌లో రోడ్లు, కాల్వలకు 100 కోట్లు మంజూరు

వేల సంఖ్యలో బారులుతీరిన విద్యార్థులు, యువతీయువకులు, ప్రజలు! ప్రతి ఒక్కరి చేతిలో ఒక మొక్క! ఒక గొప్ప పనిలో తామూ భాగస్వాములమవుతున్నామన్న సంతోషం! సరిగ్గా మధ్యాహ్నం 12.13 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మొక్క నాటగానే దాదాపు 300 మైకుల్లో మోగిన సైరన్! ఆ వెంటనే జోరుగా మొక్కలు నాటే కార్యక్రమం! ఆహ్లాదకర వాతావరణంలో.. వేల చేతులు భూమాతను అపురూపంగా తడిమి.. మొక్కలు నాటుతున్న దృశ్యాలు! పిల్లలు సైతం పాలుపంచుకుని.. భావితరానికి భారీ వృక్షాలనందించేందుకు చేసిన ప్రయత్నాలు! వెరసి.. లక్షా నూటపదహారు మొక్కల లక్ష్యాన్ని మించి నాటుకున్న మొక్కలు! తనకిష్టమైన పచ్చదనాన్ని పెంచేందుకు సాగుతున్న మహాయజ్ఞానికి పులకించిన ప్రకృతిమాత.. ఆశీర్వదిస్తూ కురిపించిన హర్షపు చినుకులు! ఇది బుధవారం గజ్వేల్ పట్ణణంలో ఆవిష్కృతమైన అద్భుత దృశ్యం!

తెలంగాణకు హరితహారం నాలుగో విడుత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో లాంఛనంగా ప్రారంభించారు. లక్షానూటపదహారు మొక్కలు నాటే ప్రణాళికతో సాగిన కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, వృద్ధులు అనే తేడా లేకుండా వేల సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు.. లక్ష్యాన్ని మించి మొక్కలు నాటడంతో గజ్వేల్ పట్ణణం పచ్చగా కళకళలాడింది. పట్టణంలోని ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ కదంబ మొక్కను నాటి నాలుగో విడుత కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం మొక్క నాటగానే పట్ణణంలోని మసీదుల్లో సైరన్ మోగడంతో గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలంతా ఒకేసారి మొక్కలు నాటారు. అంతకుముందు సీఎం కేసీఆర్ రాజీవ్ రహదారి పక్కనే తుర్కపల్లి, ములుగు, ప్రజ్ఞాపూర్ గ్రామాల్లో మొక్కలు నాటారు. వర్గల్ మండలంలోని సింగాయపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. సుమారు రెండు కిలోమీటర్లు అందులో కలియతిరిగారు. అటవీ సంరక్షణకు అధికారులు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను అభినందించారు. ఈ సందర్భంగా అటవీ అధికారులకు రూ.5 లక్షల రివార్డు ఇవ్వాలని ఉన్నతాధికారులను అదేశించారు. గజ్వేల్ పట్టణంలోని సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేశారు.

300 మైకుల్లో సైరన్ హరితహారం కార్యక్రమం కోసం గజ్వేల్, ప్రజ్ఞాపూర్ పట్టణాల్లోని వివిధ కూడళ్లలో మొత్తం 300 మైకులు ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 12.13 గంటలకు గజ్వేల్‌లోని ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద మొక్క నాటగానే అధికారులు సైరన్ మోగించారు. అప్పటికే మొక్కలతో సిద్ధంగా ఉన్న విద్యార్థులు, యువతీయువకులు, అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహభరిత వాతావరణంలో మొక్కలునాటారు. ఈ మహాయజ్ఞంలో 13 వేల మంది ఉపాధి హామీ కూలీలు, 1778 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 8600 మంది ఇంటర్, డిగ్రీ విద్యార్థులతో పాటు 12 వేల కుటుంబాలకు చెందిన 45 వేల మంది ప్రజలు పాల్గొన్నారు. లక్షానూటపదహారు మొక్క లు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ప్రజల నుంచి వచ్చిన అనూహ్య స్పందనతో అంతకు మించి 1.36 లక్షల మొక్కలు నాటారు. కొబ్బరి, జామ, దానిమ్మ, మామిడి, అల్లనేరడు వంటి 75 వేల పండ్ల మొక్కలు, 16 వేల పూల మొక్కలు, 10 వేల అటవీ జాతులకు చెందిన మొక్కలు నాటారు. ఇండ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల ఆవరణ, రోడ్లు, వీదులకు ఇరువైపులా మొక్కలునాటడంతో సందడివాతావరణం కనిపించింది. మొక్కలు నాటే కార్యక్రమం ముగిసిన తరువాత పట్టణంలో వర్షం కురియడంతో అం దరూ సంతోషించారు. సీఎం కేసీఆర్ మొక్కల పండుగ చేశారు.. గజ్వేల్‌కు వానొచ్చింది అంటూ మురిసిపోయారు.

గ్రీన్ బెటాలియన్లు ఏర్పాటు చేయాలి… గజ్వేల్‌కు వెళ్తూ మార్గమధ్యంలో వర్గల్ మండలం సింగాయపల్లి ఫారెస్టును సీఎం కేసీఆర్ సందర్శించారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర అడవిలో కాలినడకన కలియదిరిగిన సీఎం.. అక్కడ నిర్మించిన చిన్నపాటి చెక్‌డ్యాములు, మొక్కల సంరక్షణ, అడవి చుట్టు కంచెలా గచ్చకాయ చెట్ల పెంపకాన్ని పరిశీలించారు. అడవుల సంరక్షణ కోసం అధికారులు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా, అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియాల్‌లతోపాటు సీసీఎఫ్ సిన్హా, డీఎఫ్‌వో శ్రీధర్, ఎఫ్‌ఆర్వో రామారావులకు రూ. 5 లక్షల చొప్పున రివార్డులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని సీఎం ఆదేశించారు. సింగాయపల్లి తరహాలోనే మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని నర్సాపూర్, వెల్దుర్తి, కొల్చారం అటవీ ప్రాంతాల్లో సంరక్షణ చర్యలు చేపట్టాలని సీఎంవో ఓఎస్డీ, హరితహారం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్, సీఎంవో అధికారి భూపాల్‌రెడ్డిలను సీఎం ఆదేశించారు. అడవుల సంరక్షణకు గ్రీన్ బెటాలియన్లు ఏర్పాటుచేయాలని చెప్పారు. అటవీ ప్రాంతాలను దత్తత తీసుకుని, ఈ బెటాలియన్ల ద్వారా ప్రతి వారం ఎక్కడో ఓ చోట శ్రమదానం వంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సింగాయపల్లిలో అటవీ సంరక్షణ ఎలా చేపడుతున్నారో రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులకు చూపించి అక్కడే వనభోజనాలను ఏర్పాటుచేయించాలని చెప్పారు.

మా ఇంటికి కేసీఆర్ సారొచ్చిండు.. గజ్వేల్ కార్యక్రమానికి వెళ్తూ, తిరిగివస్తూ మార్గమధ్యంలో పలుచోట్ల ఇండ్లలో సీఎం కేసీఆర్ మొక్కలు నాటారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి తమ ఇంటికి రావడమేకాకుండా.. మొక్క నాటడంతో ఆ కుటుంబాల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. రాజీవ్ రహదారిపై ఉన్న ములుగు చౌరస్తాలో ఇరుపాక భాగ్యమ్మ ఇంటి వద్ద ఆగిన సీఎం కేసీఆర్ వారి ఇంటి ఆవరణలో కొబ్బరి మొక్క నాటా రు. పచ్చదనాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని, ఇందుకోసం అందరూ విరివిగా మొక్కలు నాటాలని భాగ్యమ్మతోపాటు స్థానికులకు సూచించారు. ప్రజ్ఞాపూర్‌లోని కూర భారతమ్మ ఇంట్లో కూడా సీఎం కొబ్బరి మొక్క నాటారు. ఇంటికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు భారతమ్మ కుటుంబసభ్యులు మంగళహారతులతో స్వాగతం పలికారు. మొక్కనాటిన తరువాత సీఎంతో కలిసి ఫొటో దిగి మురిసిపోయారు. గజ్వేల్‌కు వస్తున్న సమయంలోనే రాజీవ్హ్రదారిపై తుర్కపల్లి చౌరస్తాలో కూడా కేసీఆర్ మొక్క నాటారు. ప్రత్యేక బస్సులో గజ్వేల్‌కు వచ్చిన సీఎం కేసీఆర్ మహా హరితహారం కార్యక్రమానికి వచ్చిన వేలమందిని చూసి సంతోషించారు. అన్ని చోట్ల బస్సులోంచి విద్యార్థులు, పట్టణ ప్రజలకు అభివాదం చేశారు. ఇందిరాపార్క్ వద్ద మొక్క నాటడానికి ముందు స్థానికులను పలకరించారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించాలని, ఆ బాధ్యతను గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజాప్రతినిధులు తీసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ అరుణకు సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని విజయంతం చేశారంటూ జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, గడా అధికారి హన్మంతరావులతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులను సీఎం అభినందించారు.

పక్కా ప్రణాళిక.. గ్రాండ్ సక్సెస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పక్కా ప్రణాళికతో పనిచేయడంతో గజ్వేల్‌లో హరితహారం గ్రాండ్‌సక్సెస్ అయింది. కార్యక్రమం చేపట్టాలని అనుకున్న 12 రోజుల్లోనే పకడ్బందీగా ఏర్పాట్లుచేశారు. మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు సమీక్షించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, గడా ప్రత్యేక అధికారి హన్మంతరావు ఇతర అన్నిశాఖల అధికారులు, సిబ్బంది సమన్వయం చేశారు. ప్రతి 200 మొక్కలకు ఇద్దరు మండలస్థాయి అధికారులు, 25 మంది కూలీలు, ప్రతి వెయ్యి మొక్కలకు జిల్లాస్థాయి అధికారిని నియమించారు. పట్టణాన్ని ఎనిమిది క్లస్టర్లుగా విభజించి, ఇబ్బందుల్లేకుండా చూశారు. దాదాపు 100 మంది మహిళా అధికారులతో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. వీరు ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా నాటిన మొక్కల సమాచారం తెలుసుకున్నారు.

మొక్కల దత్తత హరితహారంలో భాగంగా ఇండ్ల ముందు నాటిన మొక్కలను దత్తత తీసుకోవడానికి స్థానికులు ముందుకు వచ్చారు. ఇంటి ఆవరణలో నాటిన మొక్కలను ఎవరు దత్తత తీసుకున్నారో వారి పేర్లను ప్రత్యేకంగా వారి ఇంటి గోడలపైన అధికారులు రాయిస్తున్నారు. ప్రజ్ఞాపూర్‌లో భారతమ్మ కుటుంబం మొక్కలను దత్తత తీసుకోగా వారి ఇంటి గోడకు కుటుంబసభ్యుల పేర్లు, వారు దత్తత తీసుకున్న మొక్కల పేర్లు గోడపై రాయించారు.

మహాహరితహారంతో ప్రకృతి హర్షించింది మంత్రి హరీశ్‌రావు గజ్వేల్‌లో చేపట్టిన మహాహరితహారం కార్యక్రమంతో ప్రకృతి హర్షించిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లక్షా 116 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో 1.36 లక్షల మొక్కలు నాటారని చెప్పారు. సీఎం కేసీఆర్ మొక్కనాటి వెళ్ళగానే వర్షం కురువడంతో ఆయన ఎంతో సంతోషించారని అన్నారు. అన్ని వర్గాల వారు కులమతాలకు అతీతంగా హరితయజ్ఞంలో పాల్గొనడంపై మంత్రి సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన కలెక్టర్, గడా ప్రత్యేక అధికారితోపాటు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులను మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి జోగురామన్న, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, సతీశ్‌కుమార్, చింతా ప్రభాకర్, పుట్ట మధు, యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు శేరి సుభాష్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, బాలమల్లు, భూపతిరెడ్డి, భూంరెడ్డి, వాస్తు శిల్పి సుద్దాల సుధాకర్‌తేజ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.