Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రాష్ర్టాలకు ప్రముఖపాత్ర

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం, సహకారం, సమాన భాగస్వామ్యం తో కలిసి పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు సాధించగలమని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఆదివారం ఆయన నివాసంలో ముఖ్యమంత్రులతో జరిగిన నీతి ఆయోగ్ తొలి భేటీలో కేసీఆర్ ప్రసంగించారు. ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పడిన నీతి ఆయోగ్ దేశానికి గొప్ప ముందడుగు కావాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆకాంక్షించారు. ఒక నూతన దశకు దేశాన్ని తీసుకు వెళ్లడానికి ఈ సంస్థ పనితీరు ఎలా ఉండాలి, నిర్దిష్టంగా ఎలాంటి మెకానిజం రూపొందించాలి, అభివృద్ధి ప్రక్రియలో ఈ సంస్థ ఎలాంటి పాత్రను పోషించాలి అనే విషయమై ఆయన అనేక సూచనలు చేశారు.

CM KCR in Prime Ministers meeting

-సమన్వయం, సహకారం, సమాన భాగస్వామ్యం -టీమ్ ఇండియా లక్ష్యంతో సమిష్టి కృషి -నీతి ఆయోగ్ తొలి భేటీలో సీఎం కేసీఆర్ సూచన -నిధుల వినియోగంలో రాష్ర్టాలకు స్వేచ్ఛనివ్వాలి -ఉత్తమ ఫలితాలు సాధిస్తే లీడర్ గుర్తింపు -పథకాల అమలుకు సబ్‌గ్రూపులు -నీతి ఆయోగ్‌లో ప్రశంసలందుకున్న ప్రసంగం -విలువైన సూచనలిచ్చారన్న ప్రధాని మోదీ నీతి ఆయోగ్‌లో రాష్ర్టాల పాత్ర ప్రముఖంగా ఉండాలని కేసీఆర్ నొక్కి చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన నాలుగు ప్రధాన ప్రాజెక్టుల గురించి వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పలు సూచనలకు సమావేశంలో అభినందనలు లభించాయి. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ సైతం రావు గారు చేసిన సూచనలు చాలా విలువైనవి.. అంటూ వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్ వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలన్నా, ఆశించిన ఫలితాలను సాధించాలన్నా రాష్ర్టాలన్నింటికీ ఇందులో సమాన భాగస్వామ్యం ఉండాలని కేసీఆర్ స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలతో నిరంతరం సంప్రదింపులు జరిపే వ్యవస్థను రూపుదిద్దాలని, కేంద్రం-రాష్ర్టాల మధ్య జరిగే చర్చలు కూడా పరస్పరం సహకరించుకునే తీరులో ఉండాలని అన్నారు. టీమ్ ఇండియాఅనే లక్ష్యం సమిష్టి కృషితో అన్ని రాష్ర్టాలు కలిసి పని చేసినప్పుడు సాధ్యపడుతుందని అన్నారు. నీతి ఆయోగ్‌లో రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ర్టాలకు సమాన భాగస్వామ్యం ఇవ్వడంతో పాటు ప్రతి రాష్ర్టానికి ఒక నిర్ధిష్ట బాధ్యతను, తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

తద్వారా ప్రతిరాష్ట్రం కేంద్రస్థాయిలో తన శక్తిసామర్థ్యాలు చూపగలుగుతుందని చెప్పారు. రాష్ర్టాలు కేంద్ర ప్రభుత్వ గైడెన్స్ కింద పని చేస్తాయి..కనుక నీతి ఆయోగ్ రూపొందించే మార్గదర్శకాలు రాష్ర్టాలకు కరదీపికలాగా ఉండాలని సూచించారు. కేంద్రం ప్రవేశపెట్టే పథకాల అమలులో భేషజాలు లేకుండా కేంద్ర-రాష్ర్టాల మధ్య సమన్వయం, ఏకాభిప్రాయం, ఒకదానికి మరొకటి సహకరించుకునే ధోరణి చాలా ప్రధానమైనవన్నారు. ఇవి లేకుండా పథకాల అమలులో విజయం సాధించలేమని చెప్పారు. నిధుల వినియోగంలో స్వేచ్ఛ..: కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలుచేసే విషయంలో కేంద్రం నుంచి అందే నిధులను ఆయా రాష్ర్టాలు ఆ రంగాలకు స్వేచ్ఛగా వినియోగించుకునే సౌకర్యం ఉండాలని కేసీఆర్ నొక్కి చెప్పారు.

వివిధ రాష్ర్టాల్లో అన్నింటా ఒకే రకమైన అవసరాలుగానీ పరిస్థితులు గానీ ఉండవని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఒక విధానాన్ని రూపొందిస్తే దాన్ని అన్ని రాష్ర్టాలకు యథాతథంగా వర్తింపచేయలేమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యారంగాన్ని ఉదహరించారు. దేశంలో రాష్ర్టానికో రకంగా విద్యాప్రణాళికలు, విధానాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా ఉండే నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించుకుంటాయని, ఆయా ప్రాంతాల పరిస్థితిని బట్టి పథకాలు తెస్తాయని చెప్పారు.

అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి చెందిన విద్యా పథకం అమలును కేవలం కేంద్రం రూపొందించే కొలమానాల్లోనే అమలు చేయడం సాధ్యంకాదని అన్నారు. అందువల్ల రాష్ర్టాలకు ఇచ్చే నిధులను అదే రంగానికి ఖర్చు చేసేటప్పుడు ఏ రకంగా వినియోగించాలి అనే విషయంలో పూర్తిస్థాయిలో రాష్ర్టానికి స్వేచ్ఛ ఉండాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్ళారు. దీనికి ప్రధాని నుంచి సానుకూల స్పందన వచ్చింది.

పోటీపడే అవకాశముండాలి..: నీతి ఆయోగ్ ద్వారాగాని, కేంద్ర ప్రభుత్వం ద్వారాగాని ఆయా పథకాలను రాష్ర్టాల్లో అమలు చేసే విషయంలో నిర్ధిష్ట కాలంలో సాధించిన ఫలితాలను సమీక్షించి ఉత్తమ ఫలితాలను సాధించిన రాష్ర్టానికి గుర్తింపు ఇవ్వాలని కేసీఆర్ సూచించారు. దీనివ్లల మిగిలిన రాష్ర్టాల్లో కూడా ఇలాంటి ఫలితాలను సాధించేందుకు ఉత్సాహం సమకూరుతుందని అన్నారు. అలాగే ఉత్తమ ఫలితాల సాధనకు దారి తీసిన పరిస్థితులను, చేసిన కృషిని వివరించేందుకు సదరు రాష్ర్టానికి ఒక నోడల్ లేదా లీడర్ గుర్తింపునిచ్చి సమన్వయంతో అదే తరహా ఫలితాలను సాధించే బాధ్యతను ఇవ్వడం ద్వారా ఆరోగ్యకరమైన పోటీకి తెర తీయాలని అన్నారు. ఈ విధానం అన్ని రాష్ర్టాల్లోనూ అలాంటి ఫలితాలు సాధించి, పథకాలు దేశవ్యాప్తంగా విజయవంతమయ్యేందుకు దోహదపడుతుందని వివరించారు.

ముఖ్య పథకాలకు సబ్‌గ్రూపులుండాలి..: కేంద్ర ప్రభుత్వం సహజంగా కొన్ని పథకాల అమలును ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తుందని అలాంటి పథకాలు పటిష్టంగా పకడ్బందీగా అమలు కావాలంటే కేంద్రం ఆలోచనకు అనుగుణంగా రాష్ర్టాలు అందిపుచ్చుకునేందుకు తరచూ సమావేశాలు జరపాలని, సబ్ గ్రూపులను ఏర్పాటు చేసి వాటిల్లో రాష్ర్టాలకు భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. చర్చల ద్వారా ఒకే తరహా అభిప్రాయం ఏర్పడేందుకు, సబ్ గ్రూపుల ద్వారా ఆ పథకం సమర్థమైన ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉంటుందని కేసీఆర్ సూచించారు. ఈ సూచనకు ప్రతిస్పందనగా స్కిల్ డెవలప్‌మెంట్, స్వచ్ఛ భారత్, కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలను తగ్గించాలా? లేక రాష్ర్టాలకు బదిలీ చేయాలా? లేక కొన్నింటిని ఎత్తివేయాలా? అనే విషయంపై తలా ఒక సబ్‌కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాని ప్రతిపాదించారు. ఈ మేరకు ఈ సమావేశంలో తుది నిర్ణయం జరిగింది.

దీర్ఘకాలిక, బహుళ ప్రయోజనాలపై దృష్టి అవసరం..: అభివృద్ధి ప్రక్రియలో దీర్ఘకాలిక వ్యూహం, బహుళ ప్రయోజనాలపై దృష్టి ఉండాలని కేసీఆర్ సూచించారు. సమస్యలను మూలాలనుంచి గుర్తించాలన్నారు. తెలంగాణ రాష్ర్టానికి సంబంధించి సాగునీటిపారుదల రంగంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం గ్రామీణ ప్రాంతాల్లో, వ్యవసాయ రంగంలో ఏ విధమైన గుణాత్మకమైన మార్పును తీసుకొస్తుందో, దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూర్చబోతున్నదో ఆయన వివరించారు. అదే విధంగా ప్రతి ఇంటికీ రక్షిత త్రాగునీటిని అందించడం ద్వారా ప్రజల మౌలిక అవసరాలు తీర్చడంతో పాటు సమాజ శ్రేయస్సుకు కీలకమైన ఆరోగ్య పరిరక్షణకూడా ఎలా చేకూరబోతున్నదో వివరించారు.

దీని ఫలితంగా వైద్యచికిత్సలకు చేసే ఖర్చు ఆదాచేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా ఊతమిస్తుందో వివరించారు. ఈ పథకం కూడా దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తుందని, ఒక గుణాత్మకమైన మార్పును తీసుకొస్తుందని వివరించారు. అదే విధంగా పర్యావరణ పరిరక్షణతో పాటు అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి దోహదపడే హరితహారం పథకం గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగా వెన్నుదన్నుగా నిలిచే పారిశ్రామిక రంగం గురించి, తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక విధానం (ఇండస్ట్రియల్ పాలసీ) గురించీ కేసీఆర్ వివరించారు. దేశానికి నూతన దిశను చూపాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తపించిన రీతిలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా అలాంటి పెను మార్పులు తీసుకురావాలని అభిలషిస్తున్నదని చెప్పారు. ఒక ధృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ర్టాన్ని మిగిలిన రాష్ర్టాలకు ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని వివరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.