Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రాష్ట్రంలో ఉద్యోగ పర్వం

-ఇక ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌
-యూపీఎస్సీ తరహాలో వార్షిక ప్రణాళిక.. సత్వరమే ఖాళీల గుర్తింపు
-రాష్ట్రంలో మరో భారీ సంస్కరణకు తెరలేవనున్నది. ఉద్యోగపర్వం మొదలుకానున్నది. ఏడేండ్ల క్రితం ఏర్పడిన కొత్త రాష్ట్రంలో.. ఒక్కటొక్కటిగా ప్రతిరంగాన్నీ సదురుకుంటూ, సంస్కరించుకుంటూ వస్తున్న ప్రభుత్వం ఇక ఉద్యోగవ్యవస్థను పూర్తిస్థాయిలో పటిష్ఠం చేయాలని నిర్ణయించింది.

ప్రస్తుతం వివిధస్థాయిల్లో, హోదాల్లో, విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని కొత్తజోన్లు, కొత్తజిల్లాల వారీగా పునఃపంపిణీ చేయనున్నది. దీంతోపాటు అనేకవిభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నిశ్చయించింది. ఈ మేరకు నియామక ప్రక్రియను సత్వరమే ప్రారంభించనున్నది. వీటితోపాటు పలు కీలక అంశాలపై క్యాబినెట్‌ ఏడున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించింది. ఈ చర్చ బుధవారం కూడా కొనసాగనున్నది.

రాష్ట్రంలో ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ చేపట్టడానికి వీలుగా వార్షిక నియామక క్యాలెండర్‌ (జాబ్‌ క్యాలెండర్‌) ను రూపొందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏటా విధిగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఉద్యోగాల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపుతోపాటు పలు అంశాలపై చర్చించింది. ఉద్యోగ నియామకాలు, ఖాళీల గుర్తింపు, జాబ్‌ క్యాలెండర్‌ నిర్వహణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకొనేందుకు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశం కావాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారి వరుసగా రెండోరోజు బుధవారం మంత్రివర్గ సమావేశం కొనసాగనున్నది. ఈ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులు పూర్తి వివరాలతో హాజరుకావాలని మంత్రివర్గ సమావేశం ఆదేశించింది.

సమగ్రంగా క్యాలెండర్‌ రూపకల్పన
ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియ సత్వరమే చేపట్టాలని అధికారులకు క్యాబినెట్‌ స్పష్టంచేసింది. అన్ని రకాల పోస్టుల్లో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్‌మెంట్‌ కోసం ‘వార్షిక నియామక క్యాలెండర్‌’ ను తయారుచేయాలని ఆదేశించింది. వార్షిక నియామకాల క్యాలెండర్‌ రూపకల్పనకు ఆమోదం లభించడంతో.. ఉద్యోగాల నియామకాలపై ఎప్పటికప్పుడు ఒక స్పష్టత వస్తుంది. ఎప్పుడు ఏయే ఉద్యోగాలను భర్తీచేస్తారో, రాత పరీక్షలు ఎప్పుడు ఉంటాయో ఈ క్యాలెండర్‌లో సమగ్రంగా పొందుపరుస్తారు. ఒకేసారి పదుల నోటిఫికేషన్లు జారీకావడం, పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం చాలకపోవడం వంటి సమస్యలకు ఇకపై పరిష్కారం లభించనున్నది. దేశవ్యాప్తంగా యూపీఎస్సీ నిర్వహించే మాదిరిగానే తెలంగాణలోనూ జాబ్‌ క్యాలెండర్‌ను అమలుచేయనున్నారు. ఇందులో భాగంగా ఏడాది కాలంలో భర్తీచేసే పోస్టుల వివరాలు, పరీక్ష తేదీ, పరీక్షల విధానం, సిలబస్‌, సూచనలు, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం సహా మరికొన్ని వివరాలుండనున్నట్లు తెలుస్తున్నది. దీని ప్రకారం ప్రతి ఏటా జనవరిలో వార్షిక ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదలచేస్తారు. ఏ నెలలో ఏ తేదీలలో ఏయే ఉద్యోగాలను భర్తీచేయనున్నారో, ఆ వివరాలను అందులో పొందుపరుస్తారు. కేరళలోనూ ఇదే తరహాలో వార్షిక ఉద్యోగాల క్యాలెండర్‌ను అమలుచేస్తున్నారు. అక్కడ ఉద్యోగి పదవీ విరమణకు 6 మాసాల ముందుగానే ఆ ఉద్యోగాన్ని ఖాళీగా నోటిఫై చేసి, భర్తీచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తరహా క్యాలెండర్‌ను ప్రభుత్వం గత జనవరిలో ప్రకటించింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.