-ఫార్మాసిటీ, కారిడార్లకు మొండిచేయి.. -ఆరేండ్లలో అరపైసా అదనంగా ఇచ్చారా? -నీతిఆయోగ్ సిఫారసులకూ దిక్కులేదా! -కేంద్రప్రభుత్వాన్ని నిలదీసిన మంత్రి కేటీఆర్ -చిచ్చుపెట్టి చలిమంట కాచుకోవడం వారిపని -రాష్ట్రాలను బాగుచేయాలనే సోయిలేదని ఫైర్ -కాళేశ్వరం, పాలమూరుకు జాతీయహోదా ఏదీ -రాష్ర్టానికి అధికంగా నిధులు తీసుకొచ్చారా? -లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కేటీఆర్ ప్రశ్న -శంషాబాద్‌కు మెట్రోరైలు విస్తరిస్తామని వెల్లడి -టీఆర్ఎస్లోకి 8 మంది శంషాబాద్ కౌన్సిలర్లు

‘కేంద్రంలో ఆరేండ్ల పాలనలోని ఆరుబడ్జెట్లలో తెలంగాణకు చట్టప్రకారం, రాజ్యాంగం ప్రకారం రావాల్సిన దానికంటే అరపైసా అదనంగా ఇచ్చారా?’అని బీజేపీ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటుచేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీకి రూ.3-4వేల కోట్లు కావాలని అడిగితే, మూడు పైసలు కూడా ఇవ్వలేదని, హైదరాబాద్ నుంచి వరంగల్, నాగ్‌పూర్, బెంగళూరుకు మూడు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు సాయమడిగితే మొండిచేయి చూపారని ధ్వజమెత్తారు. మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయకు రూ. 24వేల కోట్లు ఇవ్వాలని కేంద్రప్రభుత్వమే ఏర్పాటుచేసిన నీతిఆయోగ్ సిఫారసు చేస్తే, 24 పైసలైనా బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా? అని నిలదీశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ర్టానికి ఏమి తీసుకొచ్చారని ప్రశ్నించారు. కేంద్రం అదనంగా రాష్ర్టానికి ఏమిచ్చిందో చెప్పాలని సవాల్ విసిరారు. ఆదివారం తెలంగాణభవన్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గ నాయకుడు గణేశ్‌గుప్తా ఆధ్వర్యంలో శంషాబాద్ మున్సిపాలిటీకి చెందిన ఎనిమిది మంది ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ కౌన్సిలర్లు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణలో ఏ ఎన్నికలోనైనా విజయం సాధించాలంటే ప్రజల మనసు గెలుచుకోవాలి. అందుకోసం ఢిల్లీ నుంచి తెలంగాణకు ప్రత్యేకంగా ఏమైనా తేవాలని చెప్పాం. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయహోదా, నిధులు తీసుకొనిరమ్మన్నాం. అది చేతకాదు. తెలంగాణకు చట్టప్రకారం రావాల్సినదానికంటే అరపైసా ఎక్కువ తీసుకొచ్చావా లచ్చన్న’ అని ప్రశ్నించారు.
బీజేపీతో పొత్తుపై కాంగ్రెస్‌లోనే అసంతృప్తి తెల్లారిలేస్తే ఇండియా-పాకిస్థాన్, హిందూ-ముస్లిం ముసుగులో చిచ్చుపెట్టాలి.. చలిమంట కాచుకోవాలనే తాపత్రయమే తప్ప బీజేపీకి మరొకటి తెలియదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రాలు, నగరాలు, పల్లెలు బాగుచేసుకోవాలనే సోయిలేదని, మతచిచ్చు పెట్టి నాలు గు ఓట్లు రాల్చుకోవాలనేదే వారి ఆలోచనని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు పేరుకు జాతీయపార్టీలని, నీతి, సిద్ధ్దాంతంలేనివని ఘాటుగా విమర్శించారు. మూడు మున్సిపాలిటీల కోసం బీజేపీతో కలువడం ఏమిటని కాం గ్రెస్ సీనియర్‌నేత వీహెచ్ ప్రశ్నించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతలే బీజేపీ, కాంగ్రెస్ అపవిత్ర కలయికపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ములేక రెండు జాతీయపార్టీలు ఏకమయ్యాయని ఎద్దేవాచేశారు. గతంలో ఈవీఎంల మీద నమ్మకంలేదన్నారని, తర్వాత న్యాయవ్యవస్థ, ఎన్నికలసంఘంపైనా నమ్మకంలేదన్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి ధ్వజమెత్తారు. అన్ని వ్యవస్థలపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నమ్మకంపోయిందని.. నిజానికి దేశంలో కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకంపోయిందనే విషయాన్ని గ్రహించాలని చురకలంటించారు.
చేతల్లో సామాజిక న్యాయం సీఎం కేసీఆర్‌తోనే న్యాయం జరుగుతుందని, కష్టాలు తీరుతాయని ప్రజల మనసుల్లో ఉన్నదని.. అందుకే కేసీఆర్ పేదప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఢిల్లీ, గల్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కే పట్టం కడుతున్నారని గుర్తుచేశారు. సామాజికన్యాయంపై మున్సిపల్‌ఎన్నికల్లో మాటలుచెప్పకుండా చేతు ల్లో చూపించిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా బీసీలకు, ఎంబీసీలకు 45 చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులు కేటాయించామని గుర్తుచేశారు. బీసీ సంఘాల నేతలు కాళప్ప, జాజుల శ్రీనివాస్‌గౌడ్ వచ్చి తనకు ధన్యవాదాలు తెలిపారని చెప్పారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉంటే, 57 శాతం చైర్మన్ పదవులు ఇచ్చామని, ఆర్యవైశ్యులు 11 మంది చైర్మన్లు అయ్యారని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు.
సీఏఏకు మద్దతివ్వనందుకే మొండిచేయి సీఏఏకు మద్దతు తెలుపనందుకే, బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం కోత విధించిందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ఆరోపించారు. ఎంఎంటీఎస్‌కు నిధులు ఇవ్వలేదని, దక్షణాది రాష్ట్రాలను దూరం పెడుతున్నారని పేర్కొన్నారు. దేశానికి డైనమిక్ వ్యక్తి ప్రధాని కావాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. దక్షిణాది నుంచి ఒక్కోవ్యక్తి కేంద్రానికి రూ.17 వేలు పన్నురూపంలో చెల్లిస్తే, రూ.13 వేలు మాత్రమే తిరిగి ఇస్తున్నదని.. ఉత్తరాది నుంచి రూ.6 వేలు కేంద్రానికి వస్తే, రూ.30 వేలు తిరిగి ఇస్తున్నదని విశ్లేషించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ తిరుగులేని రాష్ట్ర సమితి అవుతుందని చెప్పారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని, కేటీఆర్ నాయకత్వంలో మున్సిపల్‌ఎన్నికల్లో ఘనవిజయం సాధించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీయూసీ చైర్మన్ ఏ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకులు అమరవాది లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్లో చేరినవారిలో శంషాబాద్ కౌన్సిలర్లు రేఖా గణేశ్‌గుప్తా, మహ్మద్ జహంగీర్‌ఖాన్, వై కుమార్, అజయ్, నజియాబేగం, సునీతానందు, భద్రునాయక్, విజయలక్ష్మి ఉన్నారు.
అగ్రశేణి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం తెలంగాణ ప్రజల ఆశీస్సులు, మన్ననలు, మద్దతు, ప్రోత్సాహం ఇదేవిధంగా ఉంటే తెలంగాణను దేశంలోనే అగ్రశేణిగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. శంషాబాద్‌కు మెట్రోరైలు పొడిగించే బాధ్యత ప్రభుత్వానిదని, అభివృద్ధిలో శంషాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని ముందుంచే బాధ్యత తీసుకుంటామని హామీఇచ్చారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేయాలనే సంకల్పం సీఎం కేసీఆర్‌కు ఉన్నదని, అందులో భాగంగానే ఎస్సార్డీపీ, సీఆర్ఎంపీ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే మంచినీరు, కరంటు సమస్యను పరిష్కరించుకున్నామని చెప్పారు. శంషాబాద్ మున్సిపాలిటిలో 25 కౌన్సిలర్ స్థానాలుంటే 14 స్థానాలను టీఆర్ఎస్, 8 ఫార్వర్డ్‌బ్లాక్, మిగిలిన రెండు కాంగ్రెస్, బీజేపీ గెలిచాయని.. శంషాబాద్‌లో ఉన్న పరిస్థితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నదని చెప్పారు. 3,148 మున్సిపల్వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరిగితే 1800-1900 వార్డులు టీఆర్ఎస్ గెలుచుకుందని, రెండోస్థానంలో ఇండిపెండెంట్లు, ఫ్వారర్డ్బ్లాక్ అభ్యర్థులు ఉన్నారని.. కాంగ్రెస్, బీజేపీలు మూడు, నాలుగో స్థానానికి పరిమితమయ్యాయని ఎద్దేవాచేశారు. భారీ డైలాగులు కొట్టే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు.. 1200 స్థానాల్లో కనీసం అభ్యర్థులను నిలుపలేకపోయారని విమర్శించారు.
ఆరు బడ్జెట్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అరపైసా అదనంగా ఇవ్వలేదు. ఆఖరికి కేంద్రం ఏర్పాటుచేసిన నీతిఆయోగ్ సైతం మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేస్తే, మోదీ ప్రభుత్వం 24 పైసలైనా ఇచ్చిందా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ర్టానికి ఏమి తీసుకొచ్చారు. మతచిచ్చుపెట్టి చలిమంట కాచుకోవడమే వారిపని.
– మంత్రి కే తారకరామారావు