Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రాష్ర్టానికి రక్ష టీఆర్‌ఎస్

-ప్రతి ఎన్నికల్లోనూ పార్టీకి ప్రజలు అద్భుత విజయాన్ని అందించారు
-వారి విశ్వాసాన్ని నిలుపుకోవడానికి ఇంకా బాగా పనిచేయాలి
-పార్టీని మరింత బలోపేతం చేసుకుందాం: కేసీఆర్
-21న వాడవాడలా కాళేశ్వరం ప్రారంభ సంబురాలు
-24న అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన
-27న పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం
-జూలై నెలాఖరుకల్లా గ్రామకమిటీలు
-టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రానికి టీఆర్‌ఎస్ పార్టీ రక్షణ కవచం లాంటిదని ప్రజలు భావించారని, అందుకే ప్రతి ఎన్నికల్లోనూ అద్భుత విజయాలను అందిస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ప్రేమను పొందామని, దానిని నిలుపుకోవడానికి ఇంకా బాగా పనిచేయాల్సి ఉన్నదని చెప్పారు. ఇందుకోసం పార్టీని మరింత బలోపేతం చేసుకుందామని పేర్కొన్నారు. తెలంగాణభవన్‌లో బుధవారం టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయన అధ్యక్షత వహించారు. ఒకనాడు టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఖాళీచేయించిన నాటి పరిస్థితి నుంచి.. నేడు ప్రతి జిల్లాలో శాశ్వత కార్యాలయాలు నిర్మించుకునే స్థాయికి పార్టీ ఎదిగిందని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని తెలిపారు.

24 గంటల విద్యుత్ సరఫరాతోపాటు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నామన్న సీఎం.. రాబోయే రెండేండ్లలో పెద్దఎత్తున సాగునీటిని అందించనున్నామని వివరించారు. రాష్ట్రంలో ఎక్కడైనా నీది ఏ కులం అంటే గురుకులం అంటున్నారని, అంతగా గురుకులాలు ప్రాచుర్యం పొందాయన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామని చెప్పారు. 2001లో టీఆర్‌ఎస్ పార్టీని జలదృశ్యంలో ప్రారంభించామని, ఆ తరువాత ఐదేండ్లలో హైదరాబాద్‌లో శాశ్వత కార్యాలయాన్ని నిర్మించుకున్నామని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో పార్టీకి శాశ్వత భవనాలను నిర్మించుకునేస్థాయికి ఎదిగామన్నారు. పార్టీ కార్యాలయాల నమూనాను సిద్ధంచేశామని, పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఎవరినీ నిధులు అడుగాల్సిన అవసరం లేదని, రాష్ట్ర పార్టీ నుంచే 32 జిల్లాల కార్యాలయాల నిర్మాణానికి ఒక్కో జిల్లాకు రూ.60 లక్షల చొప్పున రూ.19.20 కోట్లను ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ నెల 24న శంకుస్థాపన చేసి దసరానాటికి ప్రారంభోత్సవం చేసుకోవాలని సూచించారు.

డీఎంకే లాగా ఉండాలి
టీఆర్‌ఎస్ పార్టీ పటిష్ఠంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, డీఎంకే మాదిరి టీఆర్‌ఎస్ తయారుకావాలని, పార్టీ బాగుంటేనే అందరం బాగుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. తమిళనాడులో డీఎంకే పార్టీకి ప్రస్తుతం 1400 మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు, మాజీ ఎంపీలు, రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నారని కేసీఆర్ తెలిపారు. అక్కడ ఒక్కో కుటుంబం నుంచి మూడు నాలుగు తరాలు ఆ పార్టీలో పనిచేస్తారని చెప్పారు. వారు తరుచుగా పార్టీలు మారబోరని, సొంత ప్రయోజనాలు కాకుండా ప్రజల ప్రయోజనాలకోసం, పార్టీ స్థాపించిన లక్ష్యంకోసం పనిచేస్తారన్నారు. అందుకే అక్కడ వేరేపార్టీలకు అవకాశం లేకుండా ఆ రెండు పార్టీలే అధికారంలో ఉంటున్నాయన్నారు. డీఎంకే స్థాపించిన నాటినుంచి అంత పటిష్ఠంగా పార్టీని తయారుచేశారని తెలిపారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం హిందీని దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు నిబంధన పెట్టాలని భావిస్తే ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిందని, దీంతో ఒక్క రోజులోనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఆ నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నదని చెప్పారు. డీఎంకే నిర్ణయానికి కేంద్రం తలవంచాల్సి వచ్చిందన్నారు. అంత పటిష్ఠంగా డీఎంకే అక్కడ పాతుకుపోయిందని, దానికి సిద్ధాంతపరమైన క్యాడర్ ఉన్నదని తెలిపారు. డీఎంకే పార్టీకి అక్కడ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.6 వేల కోట్ల ఆస్తులున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు.

పార్టీ బలంగా ఉంటేనే ప్రజలకు మేలు
పార్టీ బలంగా ఉంటే ప్రజలకు కూడా మంచి జరుగుతుందని, ప్రజలు కూడా ఇదే భావించారని, అందుకే టీఆర్‌ఎస్‌ను 2014, 2018 లోనూ గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారని చెప్పారు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో 32 జెడ్పీలను టీఆర్‌ఎస్‌కు కట్టబెట్టారని, అత్యధిక ఎంపీ స్థానాలను, సర్పంచులను గెలిపించారంటేనే, టీఆర్‌ఎస్‌పై ఎంత విశ్వాసం, నమ్మకంతో ప్రజలున్నారో అర్థమవుతుందని చెప్పారు. ఇలాంటి విజయాలు మరే పార్టీకి మరే రాష్ట్రంలోనూ సాధ్యంకాలేదని సీఎం తెలిపారు. ప్రజలు మనవైపు ఉన్నప్పుడు వారికి మరింతగా సేవచేయాల్సిన అవసరం ఉందన్నారు. అఖండ విజయంతో పార్టీ కార్యకర్తలు, నాయకులపై బాధ్యత కూడా మరింత పెరుగుతుందన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నవారికి ఇప్పటివరకు అనేక అవకాశాలు వచ్చాయని, రాబోయే రోజుల్లోనూ అవకాశాలు మొదట రాష్ట్ర కమిటీలోని వారికి వస్తాయని భరోసాఇచ్చారు. అందరు ఓపికతో ఉండాలని, క్రమంగా అందరికీ అవకాశాలు వస్తాయన్నారు. కొత్తగా జిల్లాలు చేయడంతో పలువురికి పదవులు వచ్చిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు.

కాళేశ్వరం ప్రారంభం పండుగ కావాలి
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ వస్తున్నందున భద్రతాకారణాల దృష్ట్యా రాష్ట్ర కమిటీ సభ్యులను అక్కడికి ఆహ్వానించలేకపోతున్నానని సీఎం కేసీఆర్ తెలిపారు. మరోసారి అక్కడికి వెళ్దామని తెలిపారు. రైతులతో మమేకమై పార్టీ ప్రతినిధులు సంబురాలు చేసుకోవాలని చెప్పారు. పటాకులు కాల్చి సంబురాలు జరుపుకోవాలని సూచించారు.

గ్రామస్థాయిలో అనుబంధ కమిటీలు
ఈ నెల 27 నుంచి పార్టీ సభ్యత్వ నమోదుచేసుకుందామని సీఎం కేసీఆర్ చెప్పారు. వచ్చే నెలాఖరుకల్లా సభ్యత్వం పూర్తిచేయడంతోపాటు గ్రామ కమిటీలను వేసుకుందామన్నారు. ప్రతిగ్రామంలో సామాజిక వర్గాలవారీగా కమిటీలు వేసుకోవాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కమిటీలను వేసుకోవాలని సూచించారు. ఆయా వర్గాలు లేని దగ్గర కమిటీలు అవసరం లేదన్నారు. వీటన్నింటిని వచ్చే నెలాఖరుకల్లా పూర్తిగా పనిచేయించాలన్నారు.

కాళేశ్వరంపై కేసీఆర్‌కు అభినందనలు: పల్లా
టీఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశం వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో 45లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టును తక్కువ సమయంలో పూర్తిచేసినందుకు రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ తీర్మానం చేసిందని తెలిపారు. రాష్ట్రకమిటీ సభ్యులు రైతులతో మమేకమై ఎక్కడివారక్కడ సంబురాలు జరుపుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ గత 18 సంవత్సరాలుగా తెలంగాణ సమాజానికి రక్షణ కవచంలాగా ఉంటున్న విషయాన్ని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వివరించారన్నారు. 32 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలకోసం రూ.19.20 కోట్లు పార్టీ నిధుల నుంచి విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపారు. వీటి నిర్మాణ బాధ్యతలను నాయకులకు త్వరలోనే అప్పగిస్తారని చెప్పారు. ఈనెల 24న సోమవారం అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా చెప్పారు. వచ్చే దసరా నాటికి వీటి నిర్మాణాలను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 27న టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని పల్లా వెల్లడించారు. అదేరోజు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో తొలి సభ్యత్వాన్ని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ స్వీకరించి సభ్యత్వ నమోదును శ్రీకారం చుడ్తారన్నారు.

ఈ కార్యక్రమ పర్యవేక్షణకు ప్రతి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఇంచార్జిని నియమించనున్నట్లు వివరించారు. జూలై 20 కల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. జూలై నెలాఖరుకల్లా గ్రామ కమిటీలను పూర్తిచేస్తామని, అనంతరం శిక్షణ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. కార్యవర్గంలో ఉండి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారని పల్లా చెప్పారు. రాష్ట్ర కమిటీలో ఉంటూ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఐదుగురు.. నియోజకవర్గాలకు పూర్తిసమయం కేటాయించాల్సి ఉన్నందున వారు రాష్ట్ర కమిటీకి రాజీనామా చేశారు. వారి రాజీనామాలను కేసీఆర్ ఆమోదించారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఉన్న సుంకే రవిశంకర్, బీసీ సెల్ అధ్యక్షుడిగా ఉన్న ముఠా గోపాల్, ప్రధానకార్యదర్శి మైనంపల్లి హన్మంతరావు, కార్యదర్శులుగా ఉన్న పట్నం నరేందర్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. తెలంగాణభవన్‌ను ఆనుకొని నిర్మిస్తున్న క్యాంటీన్‌ను సీఎం పరిశీలించారు. దీని నిర్మాణ పురోగతిని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్‌రెడ్డి వివరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.