Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రీడిజైనింగ్‌కు ఓకే..

ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా రూపొందించిన ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. ప్రాణహిత , దేవాదుల, కంతనపల్లి, రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్, ఎస్సారెస్పీ వరద కాలువ ప్రాజెక్టు రీడిజైనింగ్ ఆవశ్యకతను క్యాబినెట్ అంగీకరించింది. అలాగే గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల కోసం మహారాష్ట్రతో ప్రభుత్వం చేసుకున్న అవగాహన ఒప్పందాన్ని పూర్తిగా సమర్థించింది. త్వరితగతిన సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలని కోరింది. కాగా తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ దుష్ప్రచారాలు, కృష్ణా నదీజలాల బోర్డు ఏకపక్ష వైఖరిపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిసి వాస్తవాలు తెలియజెప్పాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఒక బృందం ఢిల్లీకి బయలుదేరుతున్నది.

-రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు -కృష్ణాబోర్డు ఏకపక్ష వైఖరిపై కేంద్రానికి ఫిర్యాదు -వరంగల్ జిల్లాలో అగ్రికల్చర్, వెటర్నరీ కాలేజీలు.. -పాలమూరులో ఫిషరీస్ సైన్స్ కాలేజీ ఏర్పాటు -అసైన్డ్ భూముల వాస్తవ పరిస్థితి పరిశీలనకు ఆదేశం -అర్చకుల వేతనాలపై సబ్ కమిటీ నియామకం -ఆలయాల ట్రస్ట్ బోర్డుల్లో సభ్యుల సంఖ్య పెంపు -డబుల్ బెడ్‌రూం ఇండ్లకు స్థలాలవారీగా టెండర్లు -ఇంజినీరింగ్, బీఈడీ విద్యపై విధాన రూపకల్పన -నిమ్జ్, ఫార్మాలకు రూ. 784 కోట్ల హడ్కో రుణం -జీహెచ్‌ఎంసీలో మార్కెట్లు, బస్‌బేలు, టాయ్‌లెట్లకు భూకేటాయింపు -వచ్చే నెలలో తెలంగాణకు హరితహారం -నేడు ఢిల్లీకి వెళుతున్న మంత్రి హరీశ్‌రావు బృందం

శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా సమావేశమై కీలకమైన 34 అంశాలపై నిర్ణయం తీసుకుంది. ఇందులో 18 టేబుల్ ఎజెండా అంశాలున్నాయి. మంత్రివర్గ నిర్ణయాలలో ప్రధానంగా అసైన్డ్ భూములపై అధ్యయనం, అర్చకులకు జీతాల చెల్లింపుపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, వరంగల్ జిల్లాలో అగ్రికల్చర్, వెటర్నరీ కాలేజీల ఏర్పాటు, పాలమూరులో ఫిషరీస్ సైన్స్ కాలేజీ, ఉద్యానవనశాఖలో 247 పోస్టుల భర్తీ తదితర అంశాలున్నాయి. వచ్చే నెలలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టాలని, ఈ కార్యక్రమంలో ప్రభుత్వ యంత్రాంగమంతా భాగస్వామ్యం కావాలని కూడా క్యాబినెట్ తీర్మానించింది.

అసైన్డ్ భూముల నిగ్గు తేల్చాలి.. రాష్ట్రంలో అసైన్డ్ భూముల నిగ్గు తేల్చేందుకు ఈ భూములపై లోతుగా అధ్యయనం చేయాలని సీసీఎల్‌ఏను మంత్రివర్గం ఆదేశించింది. పంచిన భూముల ప్రస్తుత పరిస్తితి ఏమిటి? అవి ఎవరి చేతుల్లో ఉన్నాయి తేల్చాలని ఆదేశించింది. పేదలకు అసైన్డ్ చేసిన తరువాత గ్రామాల్లో అవసరం కోసం కొందరు అమ్మారు. తెలియక అమాయక ప్రజలు కొన్నారు. ఇలా జరిగిన లావాదేవీల్లో అనేక సార్లు చేతులు మారినవి కూడా ఉన్నాయి. వీటన్నింటి పరిస్థితి ఏమిటో? గుర్తించాలని సూచించింది. దీనితో పాటు కమతాల ఏకీకరణ, భూముల క్రమబద్ధీకరణతో పాటు ప్రభుత్వ శాఖల వద్ద నిరుపయోగంగా ఉన్న భూముల వినియోగం కోసం అవసరమైన విధానం రూపొందించాలని రెవెన్యూశాఖను ఆదేశిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. సాదా బైనామాలు, మ్యుటేషన్లు, పాతీల విషయంలో ప్రభుత్వం ఇటీవల తెచ్చిన సంస్కరణలను కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించింది.

వరంగల్, మహబూబ్‌నగర్‌లకు కళాశాలలు.. వరంగల్ జిల్లాకు రెండు వృత్తి విద్యా కళాశాలలు, పాలమూరుకు మరో కళాశాలను మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. వరంగల్‌లో అగ్రికల్చర్ కళాశాల, అదే జిల్లా మామునూర్‌లో వెటర్నరీ సైన్స్ కళాశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిషన్ కాకతీయ వల్ల చెరువులు బాగుపడుతున్నందున చేపల పెంపకాన్ని ప్రోత్సహించి పెద్ద ఎత్తున మత్స్యసంపదను సృష్టించేందుకు పాలమూరులో ఫిషరీస్ సైన్స్ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

అర్చకుల జీతాలపై సబ్ కమిటీ.. దేవాలయ అర్చకులకు ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా జీతాలు చెల్లించడానికి అవసరమైన విధానాన్ని రూపొందించేందుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులు శ్రీనివాస్‌యాదవ్, నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావులతో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేవాలయాల ఆదాయం, ఆలయ మాన్యాలు, అక్రమాల నియంత్రణ, హుండీ ఆదాయం దుర్వినియోగం తదితర అంశాలపై కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన దేవాలయాలకు పూర్వవైభవం తేవడానికి కృషి చేయాలని మంత్రివర్గం ఆకాంక్షించింది.

ట్రస్ట్ సభ్యుల సంఖ్య పెంపు.. మరోవైపు ఆలయాల్లో పరిపాలనను మెరుగుపరిచేందుకు దేవాదాయ, ధర్మాదాయ సంస్థల్లో ట్రస్ట్ మెంబర్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. రూ. కోటి ఆదాయం దాటిన ఆలయాల్లో సభ్యుల సంఖ్యను 9 నుంచి 14కు, రూ. 25 లక్షల నుంచి కోటి వరకు ఆదాయం ఉన్న ఆలయాల్లో 8 నుంచి 14 వరకు సభ్యుల సంఖ్యను పెంచేందుకు ఆమోదించింది. ఇక రూ.25 లక్షల ఆదాయం కలిగిన సంస్థల్లో సభ్యుల సంఖ్య 5 నుంచి 7 వరకు, రూ. 2 లక్షల ఆదాయంలోపు ఉన్న వాటిల్లో మూడు నుంచి 5 వరకు ట్రస్ట్ సభ్యుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది.

డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం స్థానికులకే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం వేగంగా జరుగడానికి స్థానికులకే నిర్మాణ బాధ్యతలు అప్పగించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ దిశగా టెండ్లర్లను సైట్ వైజ్‌గా పిలవాలని నిర్ణయించింది. ఈ పథకానికి హడ్కో రూ.12549 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించి గృహనిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో మొదటి విడతగా రూ.4500 కోట్ల రుణం విడుదల చేయడానికి వీలుగా బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఇంజినీర్లు, టీచర్ల కోసం విధానం.. రాష్ర్టానికి వాస్తవంగా ఎంత మంది ఇంజినీర్లు, ఎంత మంది టీచర్లు అవసరం? ప్రతి ఏటా ఎంతమంది ఇంజినీరింగ్, బీఈడీ కాలేజీలనుంచి వస్తున్నారు? ఉద్యోగ అవకాశాలు లేకున్నా అవసరాన్ని మించి ఇలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే విషయంలో అవసరమైన విధానం రూపొందించాలని విద్యాశాఖను మంత్రివర్గం ఆదేశించింది.

ఇతర నిర్ణయాలు.. -అదిలాబాద్ జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులకోసం తీసుకున్న 261.30 ఎకరాల అటవీభూమికి ప్రత్యామ్నాయంగా అంతే విస్తీర్ణం కలిగిన భూమిని సీసీఎల్‌ఏ సిఫారసుల మేరకు ఆటవీశాఖకు ఇస్తూ నిర్ణయం. -నల్లగొండ జిల్లా బొమ్మలరామారంలో బీఎస్‌ఎఫ్ బెటాలియన్‌కు 56 ఎకరాల భూమి కేటాయింపు. -ప్రభుత్వ, మిగులు, యూఎల్‌సీ భూముల్లో నిర్మించుకున్న ఇండ్ల క్రమబద్ధీకరణకు అంగీకారం. -మైక్రో ఇరిగేషన్‌ను ప్రోత్సహించడానికి వ్యవసాయశాఖకు నాబార్డునుంచి రూ. వేయి కోట్ల రుణానికి గ్యారెంటీ. -మెదక్ జిల్లాలో నిమ్జ్, హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం టీఎస్ ఐఐసీ రూ.784 కోట్ల హడ్కో రుణం పొందడానికి గ్యారెంటీ.

-రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు,శాస్త్రీయంగా శీతల గిడ్డంగుల నిర్మాణం కోసం వ్యూహాన్ని ఖరారు చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలకు ఆదేశం. -జీహెచ్‌ఎంసీ పరిధిలో మోడల్ మార్కెట్లు, బస్‌బేలు, పబ్లిక్ టాయ్‌లెట్లకు గృహనిర్మాణశాఖ స్థలాలను ఇవ్వాలని నిర్ణయం. -పరిశ్రమలశాఖలో 18 మంది పరిశ్రమల ప్రోత్సాహక అధికారుల పోస్టులను అడిషనల్ డైరెక్టర్స్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం.

నేడు ఢిల్లీకి హరీశ్‌రావు బృందం కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏకపక్ష వైఖరిని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతికి వివరించేందుకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శనివారం సాయంత్రం ఢిల్లీలో ఆమెతో భేటీ కానున్నారు. ఈ మేరకు తమతో సమావేశానికి రావాలని కేంద్ర జలవనరుల కార్యాలయం నుంచి రాష్ట్ర అధికారులకు సమాచారం అందింది. సాయంత్రం 6 గంటలకు హరీశ్‌రావుతో పాటు ఎంపీలు, ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషీ తదితరులు కేంద్ర మంత్రిని కలుస్తారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వైఖరిని వివరిస్తారు. ఈ విషయంలో ఇప్పటికే సీఎం కే చంద్రశేఖర్‌రావు, మంత్రి హరీశ్‌రావు వేర్వేరుగా కేంద్రమంత్రికి లేఖలు రాశారు. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా ఈ విషయంపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హరీశ్‌రావు బృందం శనివారం మధ్యాహ్నం రెండుగంటలకు న్యూఢిల్లీకి బయలుదేరుతున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.