-స్వయంగా అందిం చనున్న సీఎం కేసీఆర్ -మధ్యాహ్నం గజ్వేల్‌లో కార్యకర్తలతో సీఎం భేటీ
అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి తమ పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలను అందజేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమంలో పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు చేతులమీదుగా అభ్యర్థులకు బీ ఫారాలు అందించనున్నారు. పార్టీ అభ్యర్థులుగా ఎంపికైన వారందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించారు. అంతకుముందు మధ్యాహ్నం సమయంలో సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తలతో భేటీ కానున్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియతోపాటే ఎన్నికల ప్రచారాన్ని మరింత తీవ్రం చేయాలని టీఆర్‌ఎస్ భావిస్తున్నది. బీ ఫారాలు అందుకున్న అనంతరం అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 11 నుంచి 19వ తేదీల మధ్య మంచిరోజును చూసుకొని, ముహూర్తాలు ఖరారు చేసుకుంటున్నారు. శుక్ర, శనివారాల్లో అష్టమి, నవమి ఉన్నందున అభ్యర్థులు ఆ రెండు రోజులు నామినేషన్లు వేసేందుకు ముందుకు రాకపోవచ్చు. నామినేషన్ల కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు పలు నియోజకవర్గాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు.
మరికొన్ని నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియను సాదాసీదాగా ముగించి, సీఎం కేసీఆర్ బహిరంగ సభలను భారీగా నిర్వహించాలని భావిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా నిర్వహించే ఎన్నికల సభల తేదీలను కూడా ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేయనున్నట్లు సమాచారం. మొదట్లో రోజుకు రెండు మూడు నియోజకవర్గాల్లో సభలు జరిగే విధంగా, నామినేషన్లు పూర్తయిన తరువాత రోజుకు మూడు లేదా నాలుగు నియోజకవర్గాల్లో సభలు ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకేచోట భారీ బహిరంగసభను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా తెలిసింది.
సీఎం కేసీఆర్ రాసిన పాటల రికార్డింగ్ పూర్తి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం సీఎం కేసీఆర్ స్వయంగా కొన్ని పాటలు రాశారు. వాటిని ట్యూన్ చేయించి రికార్డింగ్ కూడా పూర్తిచేశారు. ఇతర ప్రముఖ కవులతో కూడా ఊపును, ఉత్సాహాన్నిచ్చే పాటలు రాయించారు. పార్టీ ప్రచార సామగ్రిని సిద్ధం చేసి, కొన్నిచోట్ల అభ్యర్థులకు అందించారు. అసంతృప్తివాదులతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తిచేశారు. వారందరు కూడా అలకలు వీడి పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారంలో నిమగ్నమయ్యారు.
రేపు మధ్యాహ్నం గజ్వేల్‌లో కార్యకర్తల సభ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఆదివారం మధ్యాహ్నం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సమావేశం జరుగనుంది. నియోజకవర్గంలోని దాదాపు15వేల మంది కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరవుతారని, వారినుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.