
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వాలు స్వీకరించి పార్టీకి, ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది బడ్జెట్లో బీసీలకు అందులోనూ కుల వృత్తులకు పెద్దపీఠ వేయడంతో అన్ని వర్గాల ప్రజలు కలిసి వస్తుండటంతో రికార్డుస్థాయిలో సభ్యత్వాలు నమోదవుతున్నాయి. బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగల కొనసాగింది. వికారాబాద్ జిల్లా పరిగిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో మంత్రులు ఈటల రాజేందర్, పట్నం మహేందర్‌రెడ్డి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లోని వీరన్నపేటలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మక్తల్ మండలం దండు గ్రామంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం వెంకటాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సభ్యత్వాలు అందజేశారు.

