Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రెండేండ్లలో 24 గంటల విద్యుత్

– రైతులారా… మీపక్షాన మేమున్నాం, అధైర్యపడొద్దు – ఆందోళన చేసినవారిపై పోలీసులు లాఠీలు ఎత్తొద్దు – విడిపోయినా మనమీదే చంద్రబాబు కన్ను – రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి – టీఆర్‌ఎస్‌లో భారీగా చేరిన వనపర్తి కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు

Naini Narsimha Reddy

టీఆర్‌ఎస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నది. పింఛన్లు, రైతుల రుణమాఫీలపై క్యాబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. రైతులారా.. మీరు అధైర్యపడొద్దు. తెలంగాణ ప్రభుత్వం మీ పక్షాన ఉంది. ధైర్యంగా నిలబడాలి అని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి భరోసా ఇచ్చారు.

కరెంటుపై రైతుల ఆందోళనలో తప్పేమీ లేదన్న ఆయన విత్తనాలు వేసి అన్నీ సిద్ధం చేసుకున్న వాళ్లకు కరెంటు లేకపోతే నిజంగానే బాధ కలుగుతుందన్నారు. వాళ్ల బాధలు చెప్పుకొనేందుకు వచ్చే వారిపై పోలీసులు లాఠీలు, కట్టెలు ఎత్తవద్దని సూచించారు. రైతులు, నిరుద్యోగులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి ప్రణాళిక తయారుచేస్తున్నారని, మరో రెండేండ్లలో రైతులకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి కాంగ్రెస్, టీడీపీ స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీఎత్తున బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణభవన్‌లో ఈ చేరికలు జరిగాయి.

ఈ సందర్భంగా హోం శాఖ మంత్రి నాయిని మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరెంటు కష్టాల పాపం కాంగ్రెస్, టీడీపీలదేనని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం న్యాయం కాదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను చూసి కాంగ్రెస్, టీడీపీల్లో దడ పుడుతున్నదని పేర్కొన్నారు. పొన్నాల లక్ష్మయ్య ఏదేదో మాట్లాడుతున్నారు. పొన్నాలా.. మీ అవినీతిని ప్రజల ముందుంచుతాం. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మంచితనంతో తెలంగాణ పునర్నిర్మాణంలో కలిసిరావాలి. 60 రోజుల పాపలా ఉన్న ఈ ప్రభుత్వాన్ని అప్పుడే నడుస్తలేదు… కూర్చుంటలేదు.. అని అంటుండ్రు. జానారెడ్డి కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.

ఈ ఐదేండ్లలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజలే ఓడిస్తారని, అన్నీ నెరవేరుస్తే వాళ్లే గెలిపిస్తారని అన్నారు. రాష్ట్రం విడిపోయినా చంద్రబాబు కన్ను మాత్రం తెలంగాణ మీదే ఉందన్నారు. అడుగడుగునా అడ్డుపడుతున్నారని, తెలంగాణ ద్రోహులైన టీడీపీ నాయకులు జయశంకర్ పేరు మీద యూనివర్సిటీ పేరు పెడితే గవర్నర్‌కు ఫిర్యాదుచేశారని అన్నారు. ఇద్దరూ బాగుపడాలి కానీ.. ఒకరిని దెబ్బ కొట్టాలంటే మీరే దెబ్బతింటారని హెచ్చరించారు. తెలంగాణ టీడీపీ నాయకులు ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని, చంద్రబాబు మోచేతి నీళ్లు తాగకుండా తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని సూచించారు.

భారీగా చేరికలు.. అంతకుముందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పార్టీ వనపర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ వారిని కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. వనపర్తి పట్టణ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, ప్రస్తుత కౌన్సిలర్ లోకనాథరెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వెంకట్‌రావు, సర్పంచులు ఏ కల్పన, విష్ణువర్ధన్‌రావు, రాజశేఖర్‌గౌడ్‌తోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.

వీరి చేరికతో పార్టీని బలోపేతం చేసినందుకు నిరంజన్‌రెడ్డిని మంత్రులు అభినందించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తప్పకుండా గుర్తింపునిస్తారని అన్నారు. కార్యక్రమంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు. ఆచార్య జయశంకర్ సార్ సోదరుడు వాసుదేవరావు కూడా ఈ సందర్భంగా అక్కడికి రావడంతో ఆయనను మంత్రులు అందరికీ పరిచయం చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.