-మూడేండ్లలో మిగులు రాష్ట్రంగా తెలంగాణ -జెన్‌కోతో 6వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి -విద్యుత్ సమస్యలకు గత ప్రభుత్వాలే కారణం -శాసనమండలిలో మంత్రి హరీశ్‌రావు

వచ్చే రెండేండ్లలో 12వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. వచ్చే మూడేండ్లలో విద్యుత్తు ఉత్పత్తిరంగంలో తెలంగాణ రాష్ర్టాన్ని సర్‌ప్లస్‌గా తీర్చి దిద్ది తీరుతామని అన్నారు. విద్యుదుత్పత్తి రంగంలో గత ప్రభుత్వం నుంచి వచ్చిన అన్ని సమస్యలను అధిగమిస్తున్నామని, తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యుదుత్పత్తి, రైతుల కష్టాలు, విద్యుదుత్పత్తిని పెంచుకునేందుకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై శాసనమండలిలో బుధవారం సుదీర్ఘ చర్చ జరిగింది. గంటన్నరపాటు జరిగిన చర్చలో సభ్యులడిగిన ప్రతి ప్రశ్నకు మంత్రి సావధానంగా సమాధానం చెప్పారు. ప్రతిపక్షనేత ధర్మపురి శ్రీనివాస్, సభ్యులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, ఫారూఖ్‌హుస్సేన్, టీడీపీ సభ్యుడు నర్సారెడ్డి, ఇతర సభ్యులు టీ భానుప్రసాదరావు, ఎంఎస్ ప్రభాకర్‌రావు తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పందించారు. విద్యుత్ సమస్యలు గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా వచ్చాయని అన్నారు.
రాష్ట్ర జెన్‌కోతో ఆరువేల మెగావాట్లు, ఎన్టీపీసీతో 4వేల మెగావాట్లు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీర్ఘకాలిక పద్ధతిలో 2 వేల మెగావాట్లు, సోలార్‌ఎనర్జీ ద్వారా 500 మెగావాట్లు ఉత్పత్తి చేసేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచే ఎన్టీపీసీ ద్వారా విద్యుత్తును సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడిని పెంచామని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే విషయంపై ప్రధానితో, కేంద్ర విద్యుత్ మంత్రితో, కేంద్రంలోని ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపామని, ఆ కృషి ఫలితంగానే రామగుండం దగ్గర 1800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి నిర్ణయం జరిగిందని వివరించారు.
భూపాలపల్లి థర్మల్‌స్టేషన్ ద్వారా 600 మెగావాట్లు అందుబాటులోకి రానున్నదని చెప్పారు. అన్నీ ప్రయత్నాలు చేస్తూనే గత నాలుగు నెలల్లో విద్యుత్ కొనుగోలుకు రూ.2500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వ్యవసాయరంగంలోని 25లక్షల పంపుసెట్లకు విద్యుత్తును సరఫరా చేసేందుకు తమ ప్రభుత్వం శ్రమిస్తున్నదని చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐ)తో ఒప్పందాలు చేసుకోవడంలో విఫమైనందువల్లనే దక్షిణ ప్రాంతానికి చెందిన విద్యుత్ మొత్తం తమిళనాడుకు వెళ్లిందని, ఈ విషయంలో జాగ్రత్త వహించి ఉంటే మనకు ఎక్కువ విద్యుత్తు వచ్చేదని చెప్పారు.
నిజామాబాద్ డిచ్‌పల్లి వద్ద పీజీసీఐకి కావాల్సిన 72 ఎకరాల భూమిని అందుబాటులోకి తెచ్చామని, దీని ద్వారా కూడా మనకు విద్యుత్ వస్తుందని చెప్పారు. విద్యుత్ కష్టాలను ముందుగా ఊహించే.. ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్లు కొనుగోలు చేసుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నామని, మరో 1000 మెగావాట్లు కొనుగోలుకు కూడా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. బీహెచ్‌ఈఎల్ వద్ద 1080 మెగావాట్ల విద్యుత్తు ఉత్ప త్తి సామర్ధ్యం గల టర్బైన్లు సిద్ధంగా ఉన్నాయని, అందుకే ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకున్నామని, వారికి కావాల్సిన 1000 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చామని చెప్పారు.
మణుగూరు, రామగుండం, భూపాలపల్లిల్లో కలిపి 1880 మెగావాట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. బడ్జెట్‌లో విద్యుత్తు రంగానికి రూ.1,000 కోట్లు మాత్రమే కేటాయించారన్న విమర్శపైన ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ బడ్జెట్‌లో కూడా కేటాయించనంత మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని బదులు చెప్పారు. జెన్‌కో అధికారి ప్రభాకరరావు సమర్థుడని చెప్తూనే ఆయన్ను గత ప్రభుత్వం తెలంగాణ అధికారి కావడంతో పక్కకు పెట్టేసింది. తమ ప్రభుత్వం ప్రతిభకు పట్టం కడుతూ ఆయన్ను జెన్‌కోకు చైర్మన్‌ను చేసింది అని అన్నారు.
నాణ్యతలేని బొగ్గు సరఫరా అంశంపై సమాధానమిస్తూ.. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని దీనిపై పర్యవేక్షణ జరుగుతున్నదని చెప్పారు. బొగ్గురవాణాలో జరుగుతున్న అక్రమాలను నివారిస్తామని అన్నారు. ప్రస్తుతం థర్మల్‌రంగంతో 2282 మెగావాట్లు, జలవిద్యుత్తుతో 2081మెగావాట్లు ఉత్పత్తి ఉన్నదని వివరించారు. మరో ప్రశ్నకు సమాధానం చెప్తూ.. విద్యుత్ కోతలు లేని మహానగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు విశ్లేషణాత్మకంగా సమాధానాలు చెప్పిన మంత్రి హరీశ్‌రావును ప్రతిపక్ష నేత ధర్మపురి శ్రీనివాస్ అభినందించారు.