-హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో కొత్త దవాఖానల నిర్మాణంపై సీఎం కేసీఆర్ ఆదేశం -డిజైన్లు రూపొందించి వెంటనే టెండర్లు పిలవాలి -వెయ్యిపడకల సామర్థ్యంతో ఉస్మానియా దవాఖాన టవర్స్ నిర్మాణం -ఆసుపత్రుల నిర్మాణంపై సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ -ఆర్థిక సహకారానికి ముందుకు వచ్చిన రాబో బ్యాంకు

హైదరాబాద్‌తోపాటు ఖమ్మం, కరీంనగర్‌లలో కొత్తగా నిర్మించే పెద్ద హాస్పిటల్స్‌ను రెండేండ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వెంటనే డిజైన్లు రూపొందించి, టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. ఉస్మానియా హాస్పిటల్ టవర్స్‌ను వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మించాలని సూచించారు. కొత్త హాస్పిటల్స్ నిర్మాణంపై సీఎం కేసీఆర్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. గాంధీ, ఉస్మానియా దవాఖానల తరహాలో మొదటిదశలో హైదరాబాద్‌లో మూడు పెద్ద హాస్పిటల్స్‌ను నిర్మించాలని అధికారులకు సూచించారు. ఒక్కో హాస్పిటల్లో 750 పడకలు ఏర్పాటు చేయాలని, వీటిలో 500 పడకలు మల్టీ స్పెషాలిటీ వైద్యం కోసం, 250 పడకలు మహిళలు, చిన్నపిల్లలకోసం కేటాయించాలని చెప్పారు.
-హైదరాబాద్‌లో 3 కొత్త హాస్పిటల్స్ -ఒక్కో దవాఖానలో 750 పడకలు – మల్టీ స్పెషాలిటీ కోసం 500 పడకలు – మహిళలు, చిన్నపిల్లలకు 250 పడకలు -ఉస్మానియా టవర్స్‌లో 1000 పడకలు -కరీంనగర్, ఖమ్మంలో ఒక్కో హాస్పిటల్లో 500 పడకలు -కొత్త దవాఖానల్లో మొత్తంగా పడకల సంఖ్య 4250 కరీంనగర్, ఖమ్మంలో ఒక్కో హాస్పిటల్‌ను 500 పడకల సామర్థ్యంతో నిర్మించాలని సూచించారు. హాస్పిటల్స్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, వ్యాప్కోస్ సంస్థ సాంకేతిక సహకారంతో డిజైన్లు రూపొందించాలని చెప్పారు. కొత్త దవాఖానలు నిర్మిస్తే అదనంగా 4,250 పడకలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. సమీక్షలో వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీనియర్ అధికారులు రామకృష్ణారావు, రాజేశ్వర్ తివారీ, సంతోష్‌రెడ్డి, రమణి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎంతో రాబో బ్యాంకు ఉపాధ్యక్షుడి భేటీ రాష్ట్రంలో కొత్త దవాఖానల నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు నెదర్లాండ్స్‌కు చెందిన రాబో బ్యాంకు ఆసక్తి చూపుతున్నది. ఈ మేరకు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో రాబో బ్యాంకు ఉపాధ్యక్షుడు హన్బార్టెల్డ్స్ నాయకత్వంలోని ప్రతినిధుల బృందం సీఎం కేసీఆర్‌ను కలిసింది. హాస్పిటల్స్ నిర్మాణంలో ఆర్థిక సాయం అందిస్తామని, నిర్మాణాల్లోనూ భాగస్వామ్యమవుతావని ఈ సందర్భంగా వారు సీఎం కేసీఆర్‌కు తెలిపారు. శ్రీలంకతోపాటు అనేక దేశాల్లో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్‌ను నిర్మించిన అనుభవం రాబో బ్యాంకుకు ఉన్నది