Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రెండేళ్లలో వందేళ్లకు పునాది

-ప్రతి నిర్ణయంలో మానవీయ దృక్పథం తెలంగాణ వైపు యావత్ దేశం చూపు -విశిష్ట పథకాలు, విభిన్న పాలన, వినూత్న ఆచరణ -స్వావలంబన దిశగా హుందాగా అడుగులు -ప్రజలే మా బాసులు.. వారు బతుకుడే లక్ష్యం -పొరుగు రాష్ర్టాలతో తగాదాలు పెట్టుకోం -అలాగని రాష్ట్ర హక్కులపై రాజీ ప్రసక్తే లేదు -కుట్రలు భగ్నం.. సుస్థిరత భద్రం -ఇది ఉద్యమాలతో రాటుదేలిన తెలంగాణ -2019లోనూ అధికారంలోకి వస్తాం -జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర -ఇక ప్రాంతీయ పార్టీలదే హవా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూ వివరాలు

CM_KCR

రెండేళ్లలోనే తెలంగాణ అసాధారణమైన ముందడుగు వేసిందని, వందేళ్ల ప్రగతికి పునాదులు వేసిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రతి నిర్ణయంలో మానవీయ దృక్పథంతో వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై ఇప్పుడు యావత్ దేశం దృష్టిసారించిందని అన్నారు. కరెంటు సమస్యను పరిష్కరించింది. కుట్రలను ఛేదించి రాజకీయ సుస్థిరతను సాధించింది. సంక్షేమంలో దేశం గర్వించదగిన వినూత్నమైన, మానవీయమైన, నిర్మాణాత్మకమైన నిర్ణయాలెన్నింటినో అమలులో పెట్టింది. తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకుంటూ, పునర్నిర్వచించుకుంటూ, ఆవిష్కరించుకుంటూ, మార్చుకుంటూ జాతి నిర్మాణంలో సమున్నతమైన పాత్రను నిర్వహించేందుకు పాటుపడుతున్నది.

దేశంలో గర్వించదగిన రాష్ట్రంగా ఎదగడానికి వడివడిగా అడుగులు వేస్తున్నది అని ఆయన వివరించారు. విశిష్ట పథకాలు, విభిన్న పాలన, వినూత్న ఆచరణతో.. స్వావలంబన దిశగా తెలంగాణ సాగుతున్నదని సీఎం అన్నారు. అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. జూన్ 2న తన ద్వితీయ ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకోనున్న నేపథ్యంలో నమస్తే తెలంగాణకు ఆయన ప్రత్యేకంగా సమయం వెచ్చించి.. సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పటిదాకా చేసిన కృషిని వివరిస్తూనే.. భావి తెలంగాణకు బంగారు బాటను ఏర్పాటు చేయనున్న క్రమాన్ని విశదీకరించారు. పచ్చటి పొలాలతో కళకళలాడే ఆకుపచ్చని తెలంగాణను స్వప్నించిన సీఎం.. దానిని తమ ప్రభుత్వం నిజంచేసి తీరుతుందని ఘంటాపథంగా చెప్పారు. ఇంకా మూడేండ్లలో చేయాల్సింది చాలా ఉందంటూ బాధ్యతను గుర్తు చేశారు. ప్రజలు బతుకుడే ప్రభుత్వానికి ముఖ్యమని, ఎవ్వరూ ఉపవాసం ఉండకూడదన్నదే లక్ష్యమని సీఎం చెప్పారు. ప్రస్తుత మంత్రులంతా బాగా పనిచేస్తున్నారన్న సీఎం.. ఎవరిపైనా అసంతృప్తిలేదని, ఇప్పుడు ఎవరినీ మార్చే యోచనలేదని స్పష్టంచేశారు.

నీటిపారుదల ప్రాజెక్టులపై వస్తున్న విమర్శల గురించి మీరేమంటారు? నదుల్లో నీటి లభ్యత, నీటిపారుదల ప్రాజెక్టుల రీడిజైనింగ్, నీటి వినియోగ సామర్థ్యం, రిజర్వాయర్ల అవసరం, సాగు లక్ష్యాలు.. ఇలా అన్ని అంశాలపై అసెంబ్లీ సాక్షిగా చర్చ జరుగాలని ఆశించాను. అందుకే మునుపెన్నడూ లేనివిధంగా అసెంబ్లీ రికార్డుల్లో ఉండాలనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాను. ప్రజలు, మేధావులు, ఇంజనీర్లు అందరికీ అన్ని విషయాలు తెలియాలని భావించాను. ఆ సమావేశాల నుంచి కాంగ్రెస్ ఎందుకు పారిపోయింది? ఏం సాధించదల్చుకుంది? తమకేదో బాగా తెలిసినట్టు తామూ చెప్తామన్నారు. ఏమైంది? ఎప్పుడు చెప్తారు? కాంగ్రెస్ నాయకులు విపరీతమైన గందరగోళంలో ఉన్నారు. వాళ్లో పద్ధతికి అలవాటు పడ్డారు. అందరూ తమలాగే ఉంటారని అనుకుంటారు. కొత్తగా ఆలోచించడం వారెప్పుడో మరిచిపోయారు. పాపం వాళ్లెప్పుడూ స్వతంత్రంగా ఒక రాష్ర్టాన్ని నడిపించలేదు. ఆంధ్రా నాయకుల కిందే పనిచేశారు. అప్పుడో ఇప్పుడో మనవాళ్లు పీసీసీ అధ్యక్షులు అయినా వాళ్లను పనిచేయనిచ్చేవారు కాదు. అందువల్ల వారికి స్వతంత్రంగా ఆలోచించడం, పనిచేయడం అసలు తెలియదు. అందుకే వెర్రిమొర్రిగా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపైనా అడ్డగోలు విమర్శలకు దిగుతున్నారు. అందుకే వారిని ప్రజలు పదేపదే తిరస్కరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ను తమ మేలుగోరే పార్టీగా ఎంచుకుంటున్నారు.

ఎన్ని జిల్లాలు ఏర్పాటవుతున్నాయి? జిల్లాల సంఖ్య ఇంకా ఖరారు కాలేదు. ముందుగా మండలాల విభజన జరగాలి. ఆ తర్వాత రెవెన్యూ డివిజన్ల విభజన జరగాలి. చివరగా జిల్లాల విభజన. భౌగోళిక సామీప్యత, పాలనా సౌలభ్యం ప్రాతిపదికగా మండలాలు, డివిజన్లు, జిల్లాల విభజన జరుగుతుంది. ఏ నాయకులకోసమో, ఎవరో డిమాండ్ చేశారనో విభజన చేయరు. చిన్న జిల్లాలు పాలనను వికేంద్రీకరిస్తాయి. అధికారులు టార్గెటెడ్‌గా పనిచేస్తారు. పథకాల ఫలాలు అందరికీ చేరేవిధంగా మానిటరింగ్ చేయడం సులువవుతుంది. చిన్నప్రాంతం కావడంవల్ల సమాచారమంతా అవగాహనలో ఉంటుంది. అవినీతి, లోపాలు అరికట్టడం తేలికవుతుంది.

విద్యుత్ రంగంలో ఇంత గుణాత్మకమైన మార్పు ఎలా తీసుకురాగలిగారు? అధికారంలోకి రాగానే ఒక విధాన నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణలో ప్రైవేటు రంగంలో విద్యుత్ ఉత్పత్తిని అనుమతించరాదని విధానపరంగా నిర్ణయించుకున్నాం. ప్రభుత్వరంగంలో విద్యుత్ ఉత్పత్తి జరిగితే రేపు అదనపు ఉత్పత్తి ఫలాలు ప్రజలకు దక్కుతాయి. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా మరింత అభివృద్ధి సాధించి, విద్యుత్ వాడకం పెరిగితే వచ్చే లాభాలు మన డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు, ట్రాన్స్‌కోకు దక్కుతాయి. కంపెనీలు లాభాల్లోకి వస్తే ప్రజలకు విద్యుత్ చార్జీలు తగ్గించడం సాధ్యమవుతుంది.

తెలంగాణ సాధించిన విజయాలు చెప్పండి? మన నిధులు మనకే. మన ప్రణాళిక మనదే. మన భవిష్యత్తు మన చేతుల్లోనే- ఇదీ తెలంగాణ సాధించిన విజయం. గత అరవయ్యేళ్ల చరిత్రలో ఎప్పుడూ ఖర్చు చేయనన్ని నిధులు సంక్షేమం, అభివృద్ధి, మౌలిక రంగాలలో ఖర్చు చేస్తున్నాం. నీటిపారుదల ప్రాజెక్టులకోసం 2004-2014 మధ్య పదేళ్లలో రూ.42 వేల కోట్లు కేటాయిస్తే గత మూడు బడ్జెట్లలోనే రూ.42 వేల కోట్లు కేటాయించగలిగింది తెలంగాణ. ఇంతకంటే విజయం ఏం కావాలి?

మరో విజయం, తెలంగాణను అస్థిరపర్చాలని చూసినవారి కుట్రలను భగ్నం చేయడం. తెలంగాణ రాకుండా చివరిదాకా అడ్డుపడ్డవాళ్లు, రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేనివాళ్లు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కుట్రలు కొనసాగించారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు అర్భకులు.. వారికి పాలించడం చేతకాదు.. వాళ్లను ఆగంపట్టించవచ్చు అనుకున్నారు. రాజకీయ అస్థిరత సృష్టించవచ్చు అనుకున్నారు. చంద్రబాబునాయుడు 2014లో ఎన్నికల ఫలితాలు వచ్చాయో లేదో 2019కి ముందే తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రకటన చేశారు. ఆ కుట్రలో భాగంగానే ఐదు కోట్లతో ఒక్క ఓటును కొనుగోలు చేద్దామని ప్రయత్నించి దొరికిపోయారు. వారి కుట్రలు భగ్నమ య్యాయి. వారే అర్భకులుగా తేలిపోయారు. నేటి తెలంగాణ అమాయక తెలంగాణ కాదు. పోరాడి రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ. కుట్రలు, సవాళ్లను అధిగమించి ఉద్యమాలలో రాటుతేలిన తెలంగాణ.

టీఆర్‌ఎస్ ఎక్కడుంది? ఖమ్మంలో లేదు. హైదరాబాద్‌లో లేదు. దక్షిణ తెలంగాణలో లేదు. వీళ్ల వల్ల ఏమవుతుంది అన్నారు. కానీ ఈ రెండేళ్లలో ఏమి రుజువయింది?.. వరంగల్‌లో అపూర్వ విజయం ఇచ్చారు. హైదరాబాద్ ప్రజలు ఘనవిజయం సాధించిపెట్టారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఒక్క టీఆర్‌ఎస్సే 99 స్థానాలు గెల్చుకుంది. మా మిత్రపక్షం మరో 44 స్థానాలు గెల్చుకుంది. ప్రతిపక్షం ఎక్కడ? ఖమ్మంలో ఏం జరిగిందో చూశాం. సానుభూతిగాలిని కూడా కాదని ప్రజలు టీఆర్‌ఎస్‌పై విశ్వాసం ఉంచారు. రాజకీయ శక్తుల ఏకీకరణ జరిగింది. రాజకీయ సుస్థిరత ఏర్పడింది. టీఆర్‌ఎస్ అజేయమైన శక్తిగా ఎదిగింది. అయినా ప్రతి సందర్భంలో మా వాళ్లకు గర్వపడవద్దని, అహంభావం చూపవద్దని చెబుతున్నాను. ప్రజా నాయకులుగానే ప్రజల మధ్యే ఉండాలంటున్నాను. ప్రజలు మనకు ఇప్పుడు రెండేండ్లకే సర్టిఫికెట్ ఇచ్చారు. వందేండ్లు నిలిచిపోయే పునాదులు వేశాం. ఇంకా మూడేండ్ల కాలం ఉంది. మనం ఇంకా చేయాల్సింది చాలా ఉందని భావిస్తున్నా. ఈ పునాదుల ఫలాలు అందడానికి 2019లో కూడా టీఆర్‌ఎస్‌కే ఘనవిజయం చేకూర్చుతారన్న నమ్మకం నాకుంది. – కే చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర ముఖ్యమంత్రి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.