-అసెంబ్లీలో నేనే ప్రకటిస్తా: సీఎం కేసీఆర్ -దళితుల కోసం బడ్జెట్లో కొత్త పథకం -రాష్ట్ర ప్రయోజనాలకోసం రాజీ లేదు.. -పరిమితులకు లోబడే రాష్ట్రం అప్పులు -రేషన్‌కార్డులు ఇచ్చింది మా సర్కారే -పెంచింది మేమే.. త్వరలోనే కొత్తవి -చెట్లు మీరు నరికితే.. నాటిన చరిత్ర మాది -పొట్టలు నింపినోళ్లమే.. కొట్టినోళ్లం కాదు -నాడు వీఆర్వోదే రాత.. ఎమ్మార్వోదే గీత -ఇవాళ ధరణి ఒక విప్లవాత్మకమైన సంస్కరణ -చెప్పామంటే వెనక్కి పోము.. 100% చేస్తాం -నాడు ఆత్మహత్యలు.. నేడు బతుకుకు భరోసా -ప్రాజెక్టుల నిర్వాసితులకు 7,500 ఇండ్లు -త్వరలోనే 57 ఏండ్ల వారికీ పింఛను -పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం -దేశంలో అత్యధిక వరిసాగు మనదే -రాష్ట్రంలో పైరవీకారు లేడు.. బ్రోకర్లేడు -డబ్బు వేయగానే లబ్ధిదారు ఖాతాలోకి -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు

కొన్ని గురుకులాల్లో, పాఠశాలల్లో ఎక్కువ కరోనా కేసులు వచ్చాయని నా దృష్టికి వచ్చింది. దీనిపై వెంటనే సమీక్ష కూడా చేశాను. అక్కడక్కడ స్కూళ్లు, హాస్టళ్లలో వస్తున్నదని భయపడు తున్నాం. స్కూళ్లను కొనసాగించడమా, లేదా.. ఏం చేయాలో రెండుమూడు రోజుల్లో వీలైతే సభలోనే స్టేట్మెంట్ ఇస్తా. ఎందుకంటే పిల్లలను మనం చెడగొట్టుకోలేం. ఏదో ఒక విధానాన్నైతే అవలంబించాల్సి వస్తది.
గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతులైన సాగునీరు, తాగునీరు, రోడ్లు, కరెంటు చాలా చక్కగా చేస్తూ పోతున్నాం. రానున్న రోజుల్లో వ్యవసాయరంగం, ఇతర రంగాల్లో మా కమిట్మెంట్ను ఇలాగే కొనసాగిస్తాం. భట్టి విక్రమార్క కొనుగోలు కేంద్రాల గురించి ప్రస్తావించారు. మాకు ఆ సోయి ఉన్నది. భారతదేశంలో మేం నంబర్‌వన్. మీరేదో నామమాత్రం కొనిపెట్టారు. కానీ మేం ప్రతిగింజా కొన్నాం. కరోనా సమయంలో ప్రజలు ఒక దగ్గర గుమిగూడొద్దని ప్రతిపంటా కొన్నాం. దేశంలో కరోనా ఉన్నా.. ఏ రాష్ట్రం కూడా కొనలేదు. కానీ సుమారు రూ.50 వేల కోట్లు ఇచ్చి ప్రతిధాన్యం గింజను కొన్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు కాలర్ ఎగరేసి ఇండియాలోనే మేం ఎక్కువ జీతం పొందుతున్నామని చెప్పుకొనేలా వేతనాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రెండుమూడు రోజుల్లో అద్భుతమైన పీఆర్సీని అసెంబ్లీలోనే ప్రకటిస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పెరుగుదలను నియంత్రించడానికి అన్ని చర్యలు తీసుకొంటున్నామన్నారు. పాఠశాలలు కొనసాగించడంపై రెండుమూడు రోజుల్లో నిర్ణయం తీసుకొంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పరిమితులకు లోబడి అప్పులు చేస్తున్నదని, పెట్టుబడి వ్యయంలో నంబర్ వన్‌గా ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రంతో రాజీపడేది లేదని.. అదేసమయంలో ప్రతిదానికీ ఘర్షణ పడబోమని స్పష్టంచేశారు. బడ్జెట్లో దళితులకు మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు సీఎం వెల్లడించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు బుధవారం ఆయన సమాధానం ఇస్తూ.. ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన, చేపట్టబోయే అంశాలపై మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
అద్భుతంగా పీఆర్సీ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు కాలర్ ఎగరేసి ఇండియాలోనే మేమే ఎక్కువ జీతం పొందుతున్నామని చెప్పుకొనేలా వేతనాలు ఇస్తున్నాం. సభలో అన్ని పార్టీల వారు పీఆర్సీపై మాట్లాడారు. ఉద్యోగుల మీద వాళ్లకు ఎంత ప్రేమ ఉందో, మాకు ఎంత ప్రేమ ఉందో గత పీఆర్సీతోనే రుజువు చేశాం. కరోనా కష్టం వచ్చి రాష్ట్రం మీద దాదాపు లక్ష కోట్ల భారం పడింది. ప్రత్యక్షంగా రూ.52వేల కోట్ల ఆదాయం కోల్పోయాం. పరోక్షంగా మరో రూ.50 వేల నుంచి రూ.60 వేల కోట్లు నష్టపోయాం. కాబట్టి కొంచెం అతలాకుతలం అయ్యాం. యావత్ ప్రపంచానిదీ ఇదే పరిస్థితి. అందుకే కొన్నింటిలో వెనకాముందు ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ముగిసినందున ఇదే శాసనసభలో రాబోయే రెండు, మూడు రోజుల్లో అద్భుతంగా, గౌరవప్రదంగా ఉండే పీఆర్సీని నేనే ప్రకటిస్తాను. ఆనాడు ఉద్యోగులకు తక్కువ వేతనాలున్నాయి. ఉద్యమం నడిచే సమయంలో.. తెలంగాణ వస్తే బ్రహ్మాండమైన ధనిక రాష్ట్రం అవుతుందని, మా ఉద్యోగులు కాలర్ ఎత్తుకొని ఇండియాలో ఎక్కువ జీతం పొందుతున్నది మేమేనని చెప్పుకునేలా వేతనాలు ఇస్తామని చెప్పాం. దాన్ని ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. ఇప్పుడు నేను పీఆర్సీ ప్రకటించాక యావత్ లోకానికి అది తెలుస్తుంది.
కరోనాపై అలర్ట్‌గా ఉన్నాం గతవారం నుంచి రాష్ట్రంలో కరోనా పెరుగుదల కనిపిస్తున్నది. ప్రభుత్వపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నం. మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలో కేసులు భయంకరంగా పెరుగుతున్నయి. విదేశాల్లో సెకెండ్‌వేవ్ వచ్చి, తగ్గిపోయింది. మనదేశంలో ఇప్పుడే అందుకున్నది. కంట్రోల్ చేయడానికి వైద్యారోగ్యశాఖ తీవ్రంగా కృషిచేస్తున్నది.
స్కూళ్లపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం కొన్ని గురుకులాల్లో, పాఠశాలల్లో ఎక్కువ కేసులు వచ్చాయని నా దృష్టికి వచ్చింది. దీనిపై వెంటనే సమీక్ష కూడా చేశాను. అక్కడక్కడ స్కూళ్లు, హాస్టళ్లలో వస్తున్నదని భయపడుతున్నాం. స్కూళ్లను కొనసాగించడమా, లేదా.. ఏం చేయాలో రెండుమూడు రోజుల్లో వీలైతే సభలోనే స్టేట్మెంట్ ఇస్తా. ఎందుకంటే పిల్లలను మనం చెడగొట్టుకోలేం. ఏదో ఒక విధానాన్నైతే అవలంబించాల్సి వస్తది.
కాంగ్రెస్ కన్నా బాగా చేస్తున్నాం విద్యుత్తు వ్యవస్థను ఊహించని విధంగా పటిష్ఠపరిచాం. కాంగ్రెస్ హయాంలో తలసరి వినియోగం 1,110 యూనిట్లు కాగా, ఇప్పుడది 2,071 యూనిట్లు. ఆరేండ్లలో ఎక్కడినుంచి ఎక్కడికి పోయిందో ఆలోచించాలి. అప్పటికి, ఇప్పటికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. ఎన్టీపీసీ నుంచి కొత్తగా 4 వేల మెగావాట్లు రానున్నది. ఇంతకుముందు ఆల్ట్రా మెగా పవర్‌ప్లాంట్ తెలంగాణలో లేదు. ఇదే మొదటిది. దేశంలో ఇంతకుముందు ఎవరూ ఏమీ చేయలేదని మేమనడంలేదు. నెహ్రూ కృషిచేశారు. దేశాన్ని ముందుకు నడిపించారు. తొలిగించాలంటే చరిత్రలో నుంచి తొలుగుతదా? కాంగ్రెస్ పార్టీ దేశంకోసం ఎంతోకొంత కృషిచేసింది. అంతకన్నా మేము మెరుగ్గా చేస్తున్నామని చెప్తున్నాం.
నాడు ఉచిత కరెంటు.. ఉత్త కరెంటు.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉచిత కరెంటును ప్రారంభించారు. నేనే ప్రారంభించినా అని డబ్బా కొట్టుకోను. ఉచిత కరెంటు అని ప్రకటించారు కానీ కరెంటు వచ్చేది కాదు. అది ఉత్త కరెంటు కిందనే పోయేది. ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతదో ఆ దేవునికే తెలుసు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బాల్కొండలో వరద కాలువ మీద రైతులు వందల మోటర్లు పెట్టుకునేవారు. దాన్ని రిజర్వాయర్‌గా మార్చినం. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా ఒత్తితే నీళ్లు వచ్చేటట్లు 1.5 టీఎంసీల రిజర్వాయర్‌గా మార్చినం. సూర్యాపేట జిల్లాలో కాకతీయ కాలువ వస్తదని కలగన్నమా? సుమారు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసినం. ఈ రోజు నిండు గర్భిణి మాదిరిగా ఆ కాలువ నాలుగైదు నెలలపాటు పారుతా ఉన్నది. వీటన్నింటి ఫలితంగా యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో సాగుచేయగలుగుతున్నాం.
37వేల ట్యాంకుల ద్వారా సురక్షిత తాగునీటి సరఫరా ఇయ్యాల మంచినీళ్ల సమస్యలేదు.. బిందెల ప్రదర్శన లేదు. గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో 5,670 గ్రామాలకు అరకొర సరఫరా ఉండేది. అది కూడా ఉప్పునీళ్లు. ఈరోజు వందశాతం ఇండ్లకు శుద్ధిచేసిన రక్షిత జలం అందిస్తున్నాం. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్నవాళ్లు ఏ నీళ్లు తాగుతరో ఆదిలాబాద్ గోండుగూడెంలో, ఖమ్మం ఆదివాసీ గూడెంలో, నిజామాబాద్ లంబాడా తండాలో కూడా అవే నీళ్లు తాగుతున్నారు. వాటర్ బాటిళ్ల కన్నా మిషన్ భగీరథ నీళ్లు ఉత్తమమైనవి. అచ్చంపేట నియోజకవర్గంలో 600 మీటర్ల ఎత్తులో గుట్టల మీద ఉన్న ఆవాసాలకు, ఆదిలాబాద్‌లో గుట్టల మీద రోడ్డు సౌకర్యంలేని మారుమూల తండా రత్నాపూర్‌కు కూడా నీళ్లు ఇస్తా ఉన్నం. పట్టణ భగీరథ పనులు ఈ ఏడాదే పూర్తవుతాయి. వందశాతం ఇండ్లకు నీళ్లిచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర జలశక్తి మిషన్ ప్రశంసించింది.
వాళ్లు నరుక్కుంటూ పోతే.. మేం నాటినం తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఇప్పుడు దేశానికే టార్చ్ బేరర్‌గా (మార్గదర్శిగా) నిలిచింది. తెలంగాణలో 3.46% పచ్చదనం పెరిగిందని స్వయంగా కేంద్రం చెప్పింది. గత పాలకులు చెట్లను నరుక్కుంటూ పోతే.. మేము నాటుకుంటూ పోతున్నం. 66 లక్షల అటవీ భూములుంటే.. ప్రొఫెషనల్ స్మగ్లర్లను పెట్టి వాటిని నాశనం చేసినరు.
‘పోడు’ సమస్యపై వెనక్కిపోం కరోనాతో అందరూ ఒకేసారి వెళ్లడం వద్దనే ఉద్దేశంతోనే పోడు భూముల సమస్యల పరిష్కారానికి వెళ్లలేదు. వారి సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాం. మేము చెప్పామంటే వెనక్కి పోము. వందశాతం చేస్తాం. ఏడాదికాలంగా కరోనాతో రాష్ట్రం సహా ప్రపంచం వణుకుతున్నది. అందుకే మేము పోలేదు. వంద శాతం సమస్యను పరిష్కరించే బాధ్యత నాది. పరిష్కరిస్తామనే ధైర్యం, నిజాయతీ ఉన్నది కాబట్టి చెప్పగలిగాను. ఈ విషయంలో దేశానికి ఆదర్శంగా ఉంటాం.
మా కమిట్మెంట్ను కొనసాగిస్తాం గ్రామాలను, పట్టణాల్లో మౌలిక వసతులైన సాగునీరు, తాగునీరు, రోడ్లు, కరెంటు చాలా చక్కగా చేస్తూ పోతున్నాం. రానున్న రోజుల్లో వ్యవసాయరంగం, ఇతర రంగాల్లో మా కమిట్మెంట్ను ఇలాగే కొనసాగిస్తాం. భట్టి విక్రమార్క కొనుగోలు కేంద్రాల గురించి ప్రస్తావించారు. మాకు ఆ సోయి ఉన్నది. భారతదేశంలో మేం నెంబర్‌వన్. మీరేదో నామమాత్రం కొనిపెట్టారు. కానీ మేం ప్రతిగింజా కొన్నాం. కరోనా సమయంలో ప్రజలు ఒక దగ్గర గుమిగూడొద్దని ప్రతిపంటా కొన్నాం. దేశంలో కరోనా ఉన్నా.. ఏ రాష్ట్రం కూడా కొనలేదు. కానీ సుమారు రూ.50 వేల కోట్లు ఇచ్చి ప్రతిధాన్యం గింజను కొన్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే.
తెలియకుంటే నేర్చుకొంటాం అన్ని రంగాలలో మాకు దేవుడిచ్చిన శక్తిని బట్టి, మాకుండే పరిజ్ఞానాన్ని బట్టి, మాకు తెలియని విషయాలను తెలుసుకుంటూ ముందుకుపోతున్నాం. 58 ఏండ్ల సమైక్య పాలనలో హైదరాబాద్ బస్తీలను వదిలేశారు. బస్తీ దవాఖాన ఏందో మనకు తెలియదు. మేం ఢిల్లీ నుంచి నేర్చుకున్నాం. ఢిల్లీకి అధికారులను పంపించి, అక్కడి వాటిని పరిశీలించి, మన దగ్గర 250 బస్తీ దవాఖానలు పెట్టినం. చాలా విజయవంతంగా బస్తీ ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. మేమే సర్వజ్ఞులమనే భావన మాకులేదు. మాకు తెలియని విషయాలు నేర్చుకొని, దాన్ని ఇంకా మెరుగుపరచి ఇక్కడ అందిస్తున్నాం. కేసీఆర్ కిట్ మా సృష్టి కాదు. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు తమిళనాడులో అమ్మ కిట్ అని అక్కడ ప్రారంభించారు. దాన్ని ఇంప్రూవ్ చేసి, అక్కడ రూ.3 వేలు ఇస్తే మనం ఇక్కడ రూ.12 వేలు, రూ.13 వేలు ఇస్తున్నాం. మంచి ఫలితాలు వస్తున్నాయి.
కొత్త సచివాలయంలో ప్రార్థన మందిరాలు పాత సచివాలయంలో వివిధ మతాలకు చెందిన ప్రార్థన మందిరాలుండేవి. ప్రస్తుతం నిర్మిస్తున్న నూతన సచివాలయంలో అన్ని మతాలకు చెందిన ప్రార్థన మందిరాలను అద్భుతంగా పునర్నిర్మిస్తాం. ఇందులో ఎలాంటి సందేహంలేదు.
రేషన్‌కార్డులు ఇచ్చింది.. పెన్షన్ పెంచిందీ మేమే… రేషన్ కార్డులు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇది అబద్ధం. తెలంగాణ వచ్చాక గణనీయమైన సంఖ్యలో కొత్త కార్డులిచ్చాం. 2014కు ముందు రాష్ట్రంలో 29 లక్షల కార్డులే ఉండేవి. ఇప్పుడు 39 లక్షలకు పైగా ఉన్నాయి. పెన్షన్లు కూడా ఇచ్చాం. ఆరోజు రూ.200 ఇస్తే, ఈరోజు రూ.2,016 ఇస్తున్నాం. ఇది లోకమంతటికీ తెలుసు. గతం కంటే ఇది చాలా ఎక్కువ. పేదల మీద వాళ్లకు, మాకు ఉన్న ప్రేమకు తేడా ఇది. ఇది కూడా తప్పేనా! ఇది పేదల సంక్షేమం కాదా? ఇంతకుముందు రాష్ట్రంలో 29,21,828 పింఛన్లు ఉంటే.. ఇప్పుడు 39,36,520 మందికి ఇస్తున్నాం. వివిధ సందర్భాల్లో 3,59,974 మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చాం. పేదలను ఆదుకోవాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం. 1,15,901 టన్నుల బియ్యం ఇచ్చేవాళ్లు. ఇప్పుడు మేం 1.78 లక్షల టన్నుల బియ్యం పంపిణీచేస్తున్నాం. అప్పుడు ఒక్కొక్కరికి 4 కిలోల బియ్యం మాత్రమే ఇచ్చి.. కుటుంబానికి 20 కిలోల పరిమితి పెట్టారు. ఇప్పుడు కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోలు ఇస్తున్నాం. కుటుంబంలో ఎందరుంటే అందరికీ ఇస్తున్నాం. మేము పొట్టలు నింపినోళ్లమే కానీ కొట్టినోళ్లం కాదు. కొత్త రేషన్‌కార్డు దరఖాస్తులు, కొన్ని పెన్షన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని త్వరలోనే పరిష్కరిస్తాం. పెన్షన్ల అర్హత వయస్సు 57 ఏండ్లకు తగ్గిస్తమని చెప్పాం. తప్పకుండా తగ్గిస్తాం. ఎప్పటినుంచి ఇస్తాం.. ఎలా ఇస్తాం అనేది కూడా చెప్తాం.
నాడు ఆత్మహత్యలు.. నేడు బతుకు భరోసా ఆనాడేమో రైతుల ఆత్మహత్యలు.. నేడు బతుకుమీద భరోసా.. ఆనాడేమో వ్యవసాయం దండగ అనే డైలాగ్‌లు.. ఇవాళ తెలంగాణలో పండగ.. ఇది నిజం. ఆ రోజు కాగితాల మీద ప్రాజెక్టులు.. ఈ రోజు గ్రౌండ్ మీద ప్రాజెక్టులు.. ఆ రోజు విద్యుత్తు కోతలు, పరిశ్రమలకు పవర్ హాలిడేలు.. పరిశ్రమల మూసివేతలు.. ఇప్పుడు విరజిమ్మే వెలుగుల తెలంగాణ. ఆ నాడు తాగునీటి తండ్లాట.. నేడు ప్రతి ఇంట్లో నల్లాలు.. ఆ రోజు పేదలకు నాణ్యమైన విద్య చాలాకష్టం. ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా ప్రపంచ స్థాయి, అంతర్జాతీయ స్థాయి విద్య. ఆనాడు స్కూల్ పిల్లలకు ఇచ్చింది దొడ్డు బియ్యం.. ఇవాళ ఇచ్చేది సన్నబియ్యం. నష్టాలో ఉన్న మన ఆర్టీసీని కాపాడుతున్నాం. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుతున్నాం. ఆ రోజు జిల్లా కేంద్రానికి పోవాలంటే పెద్ద యాతన.. ఇవాళ పరిపాలన సంస్కరణ పుణ్యం, బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతున్నది. పరిపాలన ప్రజలకు చాలా దగ్గరికి పోయింది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నరు. ఆ రోజు మూత పడిన పరిశ్రమలు.. ఈరోజు పరిగెత్తుకొని వస్తున్న పరిశ్రమలు.. ఆ రోజు ఎప్పుడుపడితే అప్పుడు కర్ఫ్యూలు.. ఇవాళ కర్ఫ్యూలనేవి గగన కుసుమం. అద్భుతమైన శాంతిభద్రతలు ఉన్నాయి.
గవర్నమెంట్ ఇచ్చింది కాక.. భట్టి ఇచ్చింది చదువుతారా! ప్రభుత్వం రాసిచ్చినదాన్ని గవర్నర్ చదివారని అంటున్నారు. ప్రభుత్వం రాసిచ్చింది చదువకపోతే.. భట్టి విక్రమార్క రాసిచ్చింది చదువుతరా? స్వాతంత్య్రం వచ్చిననాటినుంచి ప్రభుత్వం ఇచ్చిన, క్యాబినెట్ ఆమోదించిన దాన్నే గవర్నర్లు చదువుతారు. ఇదేమీ కొత్తకాదు. గతంలో కూడా చెప్పిన. గత ఆరేండ్ల సమీక్షను చాలా అద్భుతంగా చెప్పారు. బుక్ చాలా పెద్దగా ఉన్నది. దీన్ని చదువడానికి గవర్నర్ చాలా కష్టపడ్డారు. మేం చేసింది చాలా పెద్దగా ఉన్నది కాబట్టి.. బుక్ పెద్దగా వస్తుంది. చదివే ఓపిక కావాలె. వినేవాళ్లకు కూడా ఓపిక కావాలె. అర్థం చేసుకోవాలనే ఇంగితం ఉంటే అర్థమవుతుంది. ముందుగానే ఓ అభిప్రాయాన్ని మనసులో పెట్టుకొంటే అంతంతే అర్థమవుతుంది. వాస్తవానికి మేం చేసిన దాంట్లో చెప్పింది చాలా తక్కువ.
త్వరలో పాలమూరు స్విచ్ఆన్ రాష్ట్రంలో పాజెక్టులు అన్నీ కంప్లీట్ కాబోతున్నాయి. ఇటీవల నేను ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షపెడితే ‘ప్రతి సంవత్సరం 15 నుంచి 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు యాడ్ అవుకుంటూ పోతది సర్’ అని చెప్పారు. ప్రాజెక్టుల డిస్ట్రిబ్యూటరీస్, సబ్మైనర్స్, చానెల్స్ పూర్తిచేసుకుంటూ విస్తరించుకుంటూ పోతుం టాం. అలా పోతా ఉన్న కొద్దీ ఆయకట్టు పెరుగుతుందని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో రాబో యే వానకాలంలో ఎనీ టైం స్విచ్ ఆన్ చేసుకొనే దిశగా పనులు జరుగుతున్నాయి. ఇలా కొత్త ప్రాజెక్టులు యాడ్ అయితే.. అలా ఆయకట్టు, వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి. అదంతా అమ్ముడు పోవాలి. మొత్తం మనమే తినలేం కాబట్టి ఆ విధంగా ప్లానింగ్ చేస్తున్నాం. మార్కెట్లలో ఎంత కొందాం? ఏ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు పెడుదాం? అనే దానిపై వ్యవసాయ, పౌరసరఫరా శాఖల మంత్రులు రాబోయే వారంరోజుల్లో ఒక నిర్ణయానికి వస్తారు. భగవంతుని దయతో కరోనా పూర్తిగా పోతే వచ్చే వర్షాకాలం నుంచి మళ్లీ మార్కెట్లలో పంటను అమ్ముకునేలా చేసుకోవచ్చు.
కేంద్ర నిబంధనల ప్రకారమే పరిహారం హైదరాబాద్, వరంగల్‌లో ఇచ్చే భూసేకరణ రేటు పల్లెల్లో ఇవ్వరు. దానికి కేంద్రం తెచ్చిన చట్టాల నిబంధనల ప్రకారమే ఇస్తున్నాం. నిర్వాసితులెవరికీ నష్టంచేయం. గజ్వేల్ పక్కన మరో గజ్వేల్ మాదిరిగా దాదాపు 7,500 ఇండ్లతో ఇండియాలోనే ఎక్కడాలేని విధంగా కాలనీ నిర్మిస్తున్నాం. నిర్వాసితులందరికీ ఇస్తున్నాం. ఎస్సారెస్పీ తర్వాత భారీ నీటి సామర్థ్యం గల ప్రాజెక్టు మల్లన్నసాగర్. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టులో కొన్ని ఊర్లు మునిగినయ్. దీన్ని రాజకీయం చేస్తున్నారు. ప్రపంచంలో తొలి ప్రాజెక్టు కడుతున్నట్లు, ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమే వారిని ముంచేస్తున్నట్లు నానా యాగీ చేస్తున్నారు. కానీ వాళ్ల కుతంత్రాలు పనిచేయలేదు. ఒక్క ప్రాజెక్టుపై 371 కేసులువేశారు. వీటన్నింటినీ విజయవంతంగా ఎదుర్కొని ప్రాజెక్టును పూర్తి చేసుకుంటున్నాం. జూన్వరకు ప్రాజెక్టు పూర్తవుతుంది. నిర్వాసితులను పూర్తిగా సంతృప్తిపరిచేలా, దేశంలో మరోచోట ఇవ్వని విధంగా పరిహారమిచ్చి ఆదుకొంటున్నాం. ఇంకా ఆదుకొంటాం.
మాయమైన కొబ్బరికాయ.. తంగేడుపుల్ల మేం మిషన్ కాకతీయ కింద చెరువులు బలోపేతం చేసినం. అందుకే ఈ ఏడాది, గతేడాది రాష్ట్రంలో అద్భుతమైన వర్షాలు పడ్డా చెరువులు తెగలే. శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి చెరువులను బాగు చేయించినరు. 99% పనులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ హయాంలో బోర్లు సూపీయనీకి కొబ్బరికాయ, రాగి పుల్ల, తంగేడుపుల్ల, తాళపుచేతుల గుత్తులు పట్టుకొని ఒస్తుండే. నా పొలంకాడనే 37 బోర్లు ఏశిన. అందులో ఐదారింట్లో మాత్రమే నీళ్లు వచ్చినయి. అది తెలంగాణ అనుభవించిన గోస. చెరువులను నిర్లక్ష్యం చేయడం వల్ల, నీటి పారుదల ప్రాజెక్టులు రాకపోవడం వల్ల 900 ఫీట్ల దాకా బోర్లు తొవ్విన పరిస్థితులు ఉండే. ఇప్పుడు వాళ్లంతా మాయమైనరు. బోర్ల మిషన్లు అమ్ముకొని పోయిండ్రు. ఈరోజు తెలంగాణలో బ్రహ్మాండంగా భూగర్భ జలాలు పెరిగినయి. అత్యధికంగా భూగర్భ జలాలు పెరిగిన రాష్ట్రం తెలంగాణ అని ఇటీవల కేంద్ర జలశక్తిశాఖ పార్లమెంట్‌కు నివేదిక ఇచ్చింది. తెలంగాణను చూసి నేర్చుకోవాలని నీతి ఆయోగ్ వాళ్లు మిగతా 28 రాష్ర్టాల సీఎంలకు లేఖ రాసినరు. ఇప్పటికీ దాదాపు 90% చెరువులు నిండు చెరువుల్లా ఉన్నాయి. కొన్ని చెరువులు అలుగు పోస్తున్నాయి. కచ్చితంగా మిషన్ కాకతీయ ఒక సక్సెస్ స్టోరీ.
ఈ ఏడాదే భూముల సమగ్ర సర్వే భూముల సమగ్ర సర్వేను ఈ ఏడాదే మొదలుపెడుతాం. తెలంగాణలోని భూమి యావత్తును కొలిచి కో ఆర్డినేట్స్ ఇస్తాం. దాన్ని ప్రపంచంలో ఎవరూ ట్యాంపర్ చేయలేరు. రైతులు, నిరుపేదలు, ఎన్నారైలు నిశ్చింతగా ఉండొచ్చు. రెవెన్యూ, భూ రికార్డులకు సంబంధించి ధరణి ఒక విప్లవం. మూడేండ్లు కఠోర శ్రమచేసి తెచ్చిన పోర్టల్ ఇది. దాదాపు 16 రాష్ర్టాల నుంచి బృందాలు వచ్చి అధ్యయనం చేశాయి. కేంద్ర బృందం వచ్చి పరిశీలించింది. ఎక్కడైతే భూ రికార్డులు పారదర్శకంగా ఉంటాయో, డిజిటలైజ్ అయ్యాయో అక్కడ 3-4% జీడీపీ పెరుగుతున్నదని, నేరాలు తగ్గుతున్నాయని, వ్యవసాయం పెరుగుతున్నదని ప్రపంచం మొత్తం చెప్తున్నది. తెలంగాణ భూ విస్తీర్ణం 2.77 కోట్ల ఎకరాలు. 1.60 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములుంటే.. 1.53 కోట్ల భూమి ధరణిలోకి వచ్చింది. వీటిని ఎవరూ మార్చలేరు. 66,35,000 ఎకరాలు అటవీ భూములు, 35-36 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూమి, మిగతావి ఆవాస ప్రాంతాలుగా, దేవాలయ, వక్ఫ్ భూములుగా, ఇతర రూపాల్లో ఉన్నది. ఇందులో 1.50 లక్షలకు పైచిలుకు భూములు డిజిటలైజ్ అయ్యి ధరణిలోకి ఎక్కింది.
గతంలో వీఆర్వో రాసిందే రాత.. ఎమ్మార్వో గీసిందే గీత అన్నట్టు ఉండేది. ఆర్డీవో, కలెక్టర్ల దగ్గర రికార్డులు కూడా ఉండేవి కాదు. నా వ్యవసాయ క్షేత్రం దగ్గర ఒక ముదిరాజ్ సోదరుడికి మూడెకరాల భూమి ఉండేది. ఒకరోజు ఏడ్చుకుంటూ వచ్చి ‘సార్.. నా భూమి వేరేవాళ్లకు రాసిన్రు’ అని చెప్పిండు. అప్పుడు నేను ఉద్యమనాయకుడిగా ఉన్న. నాలుగైదు రోజులు అధికారుల చుట్టూ తిరిగి, ప్రయాసపడితే మళ్లా అతని భూమిని అతనికి రాసిన్రు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రజలకు, రైతులకు ధరణి వరంగా మారితే.. పేదల నోరు కొట్టేవాళ్లకు, పైరవీల మీద బతికేవాళ్లకు, లంచాలు మెక్కేవాళ్లకు అశనిపాతంగా మారింది. రాష్ట్రం మొత్తం కలిసి నాలుగైదు లక్షల మంది రైతులకు సమస్యలు ఉండొచ్చు. వాళ్లు ‘మీ సేవ’కు వెళ్లి దరఖాస్తు చేసుకొమ్మని చెప్తున్నం. ఒకప్పుడు రిజిస్ట్రేషన్‌కు ప్రయాస పడేది. ఇప్పుడు 15 నిమిషాల్లో మండల కేంద్రంలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరిగిపోతున్నాయి. ధరణిలో ఇప్పటివరకు 3.30 లక్షలకుపైగా లావాదేవీలు జరిగాయి. 1.08 లక్షల పెండింగ్ మ్యుటేషన్లను పూర్తి చేసిన్రు. కొందరు ఎమ్మార్వోలు ధరణిని అపహాస్యం చేసేందుకు ‘సమస్యలు ఉంటే సీసీఎల్ఏకు వెళ్లండి’ అని బోర్డులు పెడుతున్నరు. ఇప్పుడు స్పష్టంగాచెప్తున్నా.. భూ రికార్డులకు సంబంధించి ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏమీ జరుగొద్దనేదే మా ప్రభుత్వ పాలసీ. ఒకటిరెండు సమస్యలున్నాయని మిత్రులు చెప్తున్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో వాటికీ సొల్యూషన్ వస్తది. ఒక విప్లవాత్మక మార్పు వచ్చినప్పుడు సమస్యలు సహజం.
సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు -మైనార్టీ స్కూళ్ల అద్దెలు, కాలేజీల సమస్యలు, పాతబస్తీ ప్రజలకు ఇండ్లు.. వంటి సమస్యలను పరిష్కరిస్తాం -వెంటిలేటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. -సోలార్ పవర్ సామర్థ్యం 4,840 మెగావాట్లకు చేరింది. 24 గంటల విద్యుత్తును అందిస్తున్నాం. -కాల్వలమీద రైతు మోటర్లను తీయొద్దని చెప్పినం. -చెరువుల్లో నీళ్లు లేవని చెప్పిన దగ్గర కాలువలోకి నీళ్లు వదిలి చెరువులు నింపుతున్నం. -ప్రతి రోజూ 70 కోట్ల శాంపిళ్లను టెస్ట్ చేస్తూ సురక్షితమైన నీటిని అందిస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రంలోని మొత్తం ట్యాంకుల సంఖ్య 37,002. వీటన్నింటి ద్వారా ఇంటింటికీ నీరు అందుతున్నది. -కాంగ్రెస్ పింఛన్ రూ.200 ఇస్తే మేము రూ.2016 ఇస్తున్నం. ఆ రోజు 29 లక్షల మందికి ఇస్తే మేము రూ.39 లక్షలు ఇస్తున్నం. వాళ్లు రూ.860 కోట్లు ఖర్చు చేస్తే.. మేము రూ.8,710 కోట్లు ఖర్చుపెట్టినం. -ప్రతినెల గ్రామాలకు రూ.308 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.140 కోట్లు రిలీజ్ చేస్తున్నం. ప్రతి ఊరికీ నర్సరీ, డంపింగ్ యార్డులు, ట్రాక్టర్లు, వైకుంఠ ధామాలు వచ్చినయి -కులవృత్తులను నిలబెడుతున్నం. తెలంగాణ 77 లక్షల పైచిలుకు గొర్రెలు మేము పంపిణీ చేస్తే కోటి పైచిలుకు గొర్రెలు పునరుత్పత్తి అయినయి. -చేనేత కార్మికుల ఆత్మహత్యలను ఆపేసినం. రూ.16-20 వేల ఆదాయం వచ్చేలా చేసినం. -రైతుబంధు సాయం ఈ దేశంలో ఎక్కడా లేదు. రైతు బీమా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా గుంట భూమి ఉన్న రైతైనా ఇస్తున్నాం. ఏ కారణంతో చనిపోయినా బీమా వర్తింపచేస్తున్నాం. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించినం. రాష్ట్రం లో 2,601 రైతు వేదికలు నిర్మించి ఇచ్చాం. రూ. 567 కోట్లు ఖర్చుపెట్టి రైతు వేదికలు కట్టించాం. లక్ష మంది రైతులకు కల్లాలు కడుతున్నాం. -కల్యాణలక్ష్మి లాంటి పథకం మరే రాష్ట్రంలో లేదు. -బీడీకార్మికులకు కడుపునిండా, మిగిలిన వారితో సమానంగా రూ.2,016 పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ ఒక్కటే. -బోధకాలు వ్యాధిగ్రస్తులకు, ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చేది మన రాష్ట్రమే. -ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు రిస్క్ అలవెన్స్ ఇస్తున్న ఒకే రాష్ట్రం తెలంగాణ. -ఆటోరిక్షాలకు, వ్యవసాయ ట్రాక్టర్లకు కంప్లీట్‌గా ట్యాక్స్ రద్దు చేసిన ఒకే రాష్ట్రం తెలంగాణ. -హైదరాబాద్‌లో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ బిల్డింగ్ అద్భుతమైన మోడ్రన్ టెక్నాలజీతో దేశానికే తలమానికంగా నిర్మిస్తున్నాం. -గత ప్రభుత్వాల ప్రాజెక్టులు పేపర్లపై ఉంటే.. టీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులన్నీ ప్రజల కండ్లముందే ఉన్నాయి. కావాలంటే ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. -కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధమైనవి. ప్రతిదానికీ పేచీ పెట్టుకొని, బస్తీమే సవాల్ అంటే కుదరదు. అవసరమైన చోట ఘర్షణ పడుతూ రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతాం. -తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నదని ఇప్పటికే అనేకసార్లు కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన అనేక నివేదికలు ఇదే విషయాన్ని తెలిపాయి. అయినప్పటికీ ప్రతిపక్షాలు అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నాయి. -నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే.. అసలు నిరుద్యోగి ఎవరనే నిర్వచనం తేలాలి. -భృతి ఇస్తామని చెప్పాం.. ఇచ్చి తీరుతాం. దీనిపై ఎవరూ బెంగ పెట్టుకోవాల్సిన అవసరంలేదు. -‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతం కాదు. దీన్ని అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. రాష్ట్ర గీతం రాసుకున్న తర్వాత పాడుతాం. -ఎన్నికల్లో రైతులకు హామీ ఇచ్చిన విధంగా లక్ష రూపాయల రుణమాఫీ చేసి తీరుతాం. ఇప్పటికే 25 వేల లోపు రుణాన్ని మాఫీ చేశాం. మిగిలిన వాటి గురించి ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో వివరంగా చెప్తారు. -ఇండియాలో తెలంగాణ పోలీస్ నం.1. శాంతి భద్రతలు కాపాడటంలో, లక్షలమంది పాల్గొనే జాతరలను ప్రశాంతంగా నిర్వహించడంలో, నేరాలను గుర్తించడంలో మన పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారు. మంచిగా పనిచేసే మన పోలీసులను కించపరుచుకోవడం సరికాదు. -సాగు చట్టాల మీద దేశవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చితి కొనసాగుతున్నది. ఈ విషయంలో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. స్పందించాల్సిన సమయంలో నేను స్పందించాను. స్వయంగా ప్రధాని మోదీకే విషయాన్ని చెప్పాను. కానీ ప్రధాని బలమైన విశ్వాసంతో ఉన్నారు.