Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రేపటినుంచి హరితహారం

-రంగారెడ్డిజిల్లా చిలుకూరులో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ -40కోట్ల మొక్కలు సిద్ధం -5న లక్సెట్టిపేటలో గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభంHaritha-Haram-Logo

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని చిలుకూరులో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ర్టానికి హరితహారం వేయడానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా నర్సరీలలో మొక్కలు పెంచారు. మూడేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 230కోట్ల మొక్కలను నాటాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మొదటి దశగా ఈ వానాకాలంలో సుమారు 40కోట్ల మొక్కలను నాటాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకొంది. సెప్టెంబర్‌లో వానాకాలం ముగుస్తుంది కనుక ఆలోగా ఒక్కో శాసనసభా నియోజకవర్గానికి దాదాపు 30 నుంచి 40లక్షల మొక్కల చొప్పున నాటాలని నిర్ణయించింది. కోతులు వాపసు పోవాలి.. వానలు వాపసు రావాలి అన్న నినాదంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నడుం బిగిస్తున్నారు. మొదటిదశ హరితహారంలో 40కోట్ల మొక్కలు నాటడానికి అవసరమైన ఏర్పాట్లను నోడల్ ఏజెన్సీగా ఉన్న అటవీశాఖ పర్యవేక్షిస్తున్నది. మొదటి దశ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా 4,135 నర్సరీలలో దాదాపు 39కోట్ల 53లక్షల మొక్కలు సిద్ధమయ్యాయి. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎస్‌బీఎల్ మిశ్రా, నోడల్ ఆఫీసర్, అడిషన్ పీసీసీఎఫ్ మనోరంజన్ బాంజా ఎప్పటికప్పుడు పనులను పరిశీలిస్తున్నారు.

వారంపాటు సీఎం హరితహారం టూర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఈ నెల 3 నుంచి 10 వరకు కొనసాగుతున్నది. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరులో హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రజలను ఈ ఉద్యమంలో భాగస్వాములను చేసేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హరితహారం కార్యక్రమంలో వారంపాటు పాల్గొంటారు. తెలంగాణ అంతటా పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5న అదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట ప్రాంతంలో రూ.124 కోట్లతో మూడు టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు నిర్మించిన గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న లిఫ్ట్ ఇరిగేషన్ ట్రయల్ రన్ కూడా పూర్తయింది.

3వ తేదీ శుక్రవారం సీఎం కేసీఆర్ చిలుకూరు బాలాజీ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి, స్థానిక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్‌లో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి శివారులో మేడిపల్లి, నారపల్లిలో కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని తిరిగి నగరానికివస్తారు.

4వ తేదీ శనివారంనాడు హైదరాబాద్ నుంచి బయలుదేరి తూంకుంట, శామీర్‌పేట, తుర్కపల్లి, సిద్దిపేట, మెట్‌పల్లి, పాలమాకుల, బద్దిపడగ,బస్వాపూర్, హుస్నాబాద్, చిగురుమామిడి, కొత్తపల్లి, తిమ్మాపూర్, ఎల్‌ఎండీ కాలనీలలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని రాత్రి కరీంనగర్‌లో బస చేస్తారు.

5వ తేదీ ఆదివారంనాడు కరీంనగర్ పట్టణం, పెద్దపల్లి, ధర్మారం, లక్సెట్టిపేట(గూడెంలిఫ్ట్ ఇరిగేషన్), జన్నారం, కడెం, ఖానాపూర్, నిర్మల్‌లలో హరితహారంలో పాల్గొని నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో రాత్రి బస చేస్తారు.

6వ తేదీ సోమవారం వేల్పూర్, మోతె, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, సదాశివనగర్ చెరువు, కామారెడ్డి టౌన్ కళాశాల, రామాయంపేట, మాసాయిపేటలలో జరిగే హరితహారం కార్యక్రమాలలో పాల్గొని అక్కడి నుంచి వ్యవసాయ క్షేత్రానికి కేసీఆర్ వెళతారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.