Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రేపే గులాబీ ప్లీనరీ

– ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు – మంత్రులు, పార్టీ ముఖ్యుల పర్యవేక్షణ – పార్కింగ్‌కు పక్కా ఏర్పాట్లు: హోంమంత్రి నాయిని వెల్లడి – ఉద్యమ స్ఫూర్తిని చాటేలా ప్లీనరీ: మంత్రి మహేందర్‌రెడ్డి

TRS plenary

రాష్ట్రవ్యాప్తంగా గులాబీదళం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న టీఆర్‌ఎస్ ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధిష్ఠానం నియమించిన ఏడు కమిటీల బాధ్యులు ఆయా ఏర్పాట్లను పూర్తి చేయగా.. మంత్రులు, పార్టీ ముఖ్యులు ప్రతిక్షణం వాటిని పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీ తొలిసారిగా నిర్వహిస్తున్న కార్యక్రమం కావడంతో ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కూడా ఏర్పాట్లపై సమీక్షిస్తున్నట్లు తెలిసింది. మరో ఇరవై నాలుగు గంటల్లో గులాబీ ప్లీనరీ మొదలుకానుంది. ఎల్బీ స్టేడియంలో వేదిక, ప్రాంగణం ఏర్పాట్లతో పాటు నగర అలంకరణ కూడా పూర్తయింది. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, కటౌట్లు, హోర్డింగులు దర్శనమిస్తున్నాయి.

హోర్డింగులపై తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రాచుర్యం కల్పించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి 300 మంది చొప్పున ప్రతినిధులు సిద్ధమవుతున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జెడ్పీ చైర్‌పర్సన్లు, అన్ని కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీఎంఎస్/డీసీసీబీ చైర్‌పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్లు, టీఆర్‌ఎస్ పార్టీ గ్రామ, మున్సిపల్ వార్డులు, సిటీ ఏరియా కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, టీఆర్‌ఎస్ అనుబంధ విభాగాల గ్రామ, మున్సిపల్ వార్డులు, సిటీ ఏరియా కమిటీల అధ్యక్షులు, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా, మండల కార్యవర్గ కమిటీలు (అందరూ సభ్యులు), టీఆర్‌ఎస్ పార్టీ అనుబంధ విభాగాలు జిల్లా, మండల కమిటీల అధ్యక్షులకు ఆహ్వానాలు వెళ్లాయి. ప్లీనరీ ఉదయం నుంచి రాత్రి వరకు జరుగనుండటంతో మంచినీరు, చల్ల, భోజన వసతి, ఇతరత్రా అన్నీ ఏర్పాట్లు పక్కాగా చేశారు. ప్లీనరీ వేదికపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతోపాటు మంత్రులు, స్టీరింగ్ కమిటీ, పార్లమెంటరీ కమిటీకి సంబంధించి 42 మంది ఆసీనులయ్యే అవకాశమున్నది.

మూడు చోట్ల వాహనాల పార్కింగ్‌కు అనుమతి: నాయిని టీఆర్‌ఎస్ ప్రతిష్ఠాత్మకంగా ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఇందులో భాగంగా పార్కింగ్‌కు పక్కా ఏర్పాట్లు చేశామని పార్కింగ్ కమిటీ చైర్మన్, రాష్ట్ర హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. కమిటీ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం ఆయన తెలంగాణభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్లీనరీకి ఆరు వేల వాహనాలు వస్తాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇందుకుగాను ఎన్టీఆర్ స్టేడియం, ఎగ్జిబిషన్ గ్రౌండ్, నెక్లెస్ రోడ్డు, మక్తా, సంజీవయ్య పార్కు, పబ్లిక్ గార్డెన్, టెన్నిస్ కోర్టు, వ్యవసాయ కమిషనర్ కార్యాలయం దగ్గర పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశామన్నారు. ప్లీనరీకి వచ్చిన ప్రతినిధులను ఎల్బీ స్టేడియంకు సమీపంలో దింపిన తర్వాత ఆయా వాహనాలు కేటాయించిన చోట పార్కింగ్ చేయాలన్నారు. 36వేల మంది ప్రతినిధులకు ఆహ్వానం పంపినప్పటికీ శ్రేణుల ఉత్సాహం చూస్తుంటే 50వేల మంది వరకు వచ్చే అవకాశముందని నాయిని పేర్కొన్నారు.

ప్లీనరీలో సంబురాల వాతావరణం: మహేందర్‌రెడ్డి రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నిర్వహిస్తున్న తొలి ప్లీనరీ, బహిరంగ సభలు ఉద్యమకాలంనాటి స్ఫూర్తి, అమరుల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉంటాయని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎల్‌బీ స్టేడియంలో ఈ నెల 24న జరుగనున్న టీఆర్‌ఎస్ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్లీనరీ, బహిరంగ సభల కోసం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సంబురాల వాతావరణం తలపించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 27న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు తెలంగాణ పది జిల్లాల నుంచి పది లక్షల మంది హాజరవుతారని తెలిపారు. ప్లీనరీకి ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున 36వేల నుంచి 40వేలమంది వరకు హాజరవుతారని తెలిపారు. మంత్రి వెంట శ్రీరాంరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

TRS

తీర్మానాలపై ప్రత్యేక దృష్టి ప్లీనరీలో ముఖ్యంగా తీర్మానాలపై ఎక్కువ దృష్టిసారిస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం, టీఆర్‌ఎస్ ప్రాధమ్యాలు, లక్ష్యాలు, ఇకముందు దృష్టిసారించే అంశాలకు తీర్మానాల్లో చోటు కల్పించారు. వీటితోపాటు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు అవగాహన కల్పించడంతోపాటు వారు క్షేత్రస్థాయిలో వాటిపై ప్రచారం నిర్వహించేందుకు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన మెటీరియల్‌ను కూడా ప్లీనరీలో సరఫరా చేయనున్నారు. ప్లీనరీలో చేసే తీర్మానాలను కూడా బుక్‌లెట్ రూపంలో ఇవ్వనున్నారు.

జూడాల వైద్య శిబిరం టీఆర్‌ఎస్ ప్లీనరీలో జూనియర్ వైద్యుల తరపున ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండెగాని శ్రీనివాస్ తెలిపారు. ఉస్మానియా, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్లు అందుకు సంబంధించిన అంబులెన్స్, మందులు, ఇతరత్రా పరికరాలు సమకూరుస్తున్నట్లు చెప్పారు. 50 మంది పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లు, గాంధీ, ఉస్మానియా నుంచి నిపుణులు ఇందులో పాల్గొంటారని చెప్పారు. తమ సమస్యలపై సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి ఎప్పటికప్పుడు సానుకూలంగా స్పందిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఇక ముందు కూడా ప్రభుత్వానికి తమ నుంచి మద్దతు ఉంటుందన్నారు. ప్లీనరీలో ఏర్పాటు చేసే వైద్య శిబిరాన్ని టీఆర్‌ఎస్ శ్రేణులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.