-పరిషత్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్న
-ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు టీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. లోకల్ బాడీల నుంచి లోక్‌సభ వరకు అన్ని స్థాయిల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందినవారు ఉండాలనే లక్ష్యంతో పార్టీ అధినేత కేసీఆర్ ముందుకెళ్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో అనుసరించే వ్యూహం, ప్రణాళికపై చర్చించడానికి ఈ నెల 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులతోపాటు రాష్ట్రమంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలుగా పోటీచేసిన అభ్యర్థులు, మాజీ మంత్రులు, రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులను ఆహ్వానించారు.
రాష్ట్రంలో 535 జెడ్పీటీసీ సభ్యుల స్థానాలకు, 5857 ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిని పార్టీ ప్రాతిపదికన పార్టీల గుర్తులపై నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సోమవారంనాటి సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు విస్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇటివల జరిగిన గ్రాపంచాయతీ ఎన్నికల్లో దాదాపు 80 శాతానికిపైగా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేస్తుందని సర్వేలు, నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయం ద్వారా అన్ని స్థాయిల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సజావుగా, వేగంగా సాగుతాయని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇందుకోసం పార్టీ నాయకులు అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా కృషిచేయాలని ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు.