-పార్టీ సంస్థాగత అంశాలు,వార్షిక మహాసభపై చర్చ -దిశానిర్దేశం చేయనున్న అధినేత, సీఎం కేసీఆర్ -గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా కమిటీలు -మార్చి 1నాటికి సభ్యత్వ నమోదు పూర్తికి చర్యలు
తెలంగాణభవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనున్నది. రాష్ట్ర కమిటీ సభ్యులతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, నగర మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.
దేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేనివిధంగా టీఆర్ఎస్కు అంకితభావం గల నాయకులు, కార్యకర్తలున్నారని, అందరినీ కాపాడుకుంటామని సీఎం కేసీఆర్ అన్నట్టు సమాచారం. పార్టీ కమిటీల్లో చోటు కల్పించడమే కాకుండా అవకాశం ఉన్నచోట వారి సేవలను వినియోగించుకోవాలని నేతలను ఆదేశించినట్టు తెలిసింది. మార్చి 1 నాటికి పార్టీ సభ్యత్వ ప్రక్రియ పూర్తి చేయాలని శుక్రవారం నల్లగొండ నేతలకు సీఎం కేసీఆర్ వివరించినట్టు సమాచారం.
ఆదివారం నిర్వహించే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ నిర్మాణంపై సమగ్రంగా చర్చిస్తామని, ఈ మేరకు నల్లగొండ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. పార్టీ వార్షికోత్సవ సభ నిర్వహించేనాటికే ఒకవైపు సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీల ఏర్పాటుతోపాటు అందుబాటులో ఉన్న పార్టీ కార్యాలయాలను ప్రారంభించుకోవాలని, ఇంకా నిర్మాణం పూర్తికాని వాటిని త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అన్నట్టు సమాచారం.