-మున్సిపల్ ఎన్నికలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్
-పలు ఇతర అంశాలపైనా చర్చ జరిగే అవకాశం
-ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర కమిటీ సభ్యులకు ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం (ఈ నెల 4) ఉదయం 11.30 గంటలకు తెలంగాణభవన్‌లో జరుగనున్నది. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లతోపాటు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లను ఈ సమావేశానికి ఆహ్వానించారు. త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలపై ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
మున్సిపోల్స్‌కు ఈ నెల 7న నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. సుదీర్ఘంగా కొనసాగే ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ నాయకులతో కలిసి భోజనం చేయనున్నారు. మున్సిపల్ చట్టాన్ని సమర్థంగా అమలుచేయడం, ప్రభుత్వ ఆలోచనలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించనున్నారు. జిల్లా పార్టీ ఆఫీస్‌లను ప్రారంభించి నాయకులకు శిక్షణ ఇవ్వడంపై మరింత స్పష్టత ఇవ్వనున్నారు. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రభుత్వ పథకాలపై చర్చించే అవకాశమున్నది.
మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఇప్పటికే పలుమార్లు సమీక్షా సమావేశాలను నిర్వహించి అత్యధిక స్థానాల్లో గెలిచేలా వ్యూహా న్ని సిద్ధంచేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలు, మున్సిపాలిటీలవారీగా ఇంచార్జీలను నియమించి నివేదికలు తెప్పించుకున్నారు. పార్టీపరంగా రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీని కేటీఆర్ త్వరలో ప్రకటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం నియోజకవర్గాలవారీగా సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్న కేటీఆర్.. ప్రస్తుత పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సర్వే చేయించారు. టీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్‌కు ప్రజల్లో అద్భుత ఆదరణ ఉన్నదని, అత్యధిక స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకుంటుందని సర్వేలో తేలినట్టు సమాచారం.