Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రేవంత్‌ బ్లాక్‌మెయిలర్‌

-అక్రమాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌
-జీవో 111 పరిధిలో రేవంత్‌ ఫాంహౌజ్‌ నిర్మించుకోలేదా?
-గోపనపల్లిలో దళితుల భూమిని అన్యాయంగా కబ్జా చేయలేదా..
-ఆధారాలను బయటపెట్టిన ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌
-మంత్రి కేటీఆర్‌ను ఎదుర్కొలేకే తప్పుడు ప్రచారమని ఆగ్రహం

ఎంపీ రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని టీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. వట్టినాగులపల్లిలో 111జీవో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఫాంహౌస్‌పై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వవిప్‌ కర్నె ప్రభాకర్‌, పీయూసీ చైర్మన్‌ ఏ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ టీ భానుప్రసాద్‌, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్న భూమికి కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. పెయింటర్‌గా జీవితాన్ని ప్రారంభించిన రేవంత్‌కు కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

వట్టినాగులపల్లిలో 111 జీవో పరిధిలో సర్వేనంబర్‌ 66/EE /2 లో ఏ రేవంత్‌రెడ్డి పేరిట 22 గుంటలు, 66/EE/6లో ఆయన బావమరిది ఎస్‌ జయప్రకాశ్‌రెడ్డి పేరిట 20 గుంటలు భూమి ఉన్నదని, అందులో నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నారంటూ వాటి చిత్రాలను మీడియాకు చూపించారు. రాజకీయంగా కేటీఆర్‌ను ఎదుర్కొలేక, ఎదుగుదల చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గోపనపల్లిలో దళితుల భూముల లాక్కున్నదానిపై రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. జీవో 111 పరిధిలో భవనాలు నిర్మించిన కాంగ్రెస్‌ నేతల వివరాలన్నింటినీ త్వరలో బయటపెడుతామని హెచ్చరించారు. కేటీఆర్‌ ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలన్నీ వెల్లడించారని, బురద చల్లడం కాకుండా వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు.

వ్యక్తిగత ఆరోపణలపైనే ఆయన దృష్టి
రేవంత్‌ ఎప్పుడూ సంచనాల కోసమే మాట్లాడుతుంటారని.. వ్యక్తిగత ఆరోపణలపైనే దృష్టి పెడుతారని ప్రభుత్వవిప్‌ కర్నె ప్రభాకర్‌ ఆరోపించారు. ఇలాంటి నేతలు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమని చెప్పారు. ఆయన ఆరోపిస్తున్నట్టుగా ఆ భూమి తనది కాదంటూ మంత్రి కేటీఆర్‌ స్పష్టంగా చెప్పారని తెలిపారు. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీకి సూచించారు. 111జీవో పరిధిలో కాంగ్రెస్‌ నాయకులకు ఫాంహౌస్‌లు ఉన్నాయంటూ ఆ పార్టీకి చెందిన సీనియర్‌నాయకుడు వీ హనుమంతరావు కూడా చెప్పారని గుర్తుచేశారు. ప్రజలంతా ఒకవైపు ఉంటే రేవంత్‌ మరోవైపు ఉంటారని మండిపడ్డారు.

ఒక పెయింటర్‌ కోట్ల రూపాయలు ఎక్కడ్నుంచి వచ్చాయో చెప్పాలని పీయూసీ చైర్మన్‌ ఏ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రేవంత్‌ను పెయింటర్‌రెడ్డిగా అభివర్ణించారు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మునిగిపోవడం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో అనేకమంది సీనియర్లు ఉన్నప్పటికీ.. రేవంత్‌లాంటి క్రిమినల్‌ను పక్కన పెట్టుకొని మాట్లాడటం ఆ పార్టీకే సిగ్గుచేటని ఎమ్మెల్సీ టీ భానుప్రసాద్‌ అన్నారు. పేరు ప్రతిష్టలు ఉన్న నాయకుల మీద విమర్శలు చేయడం ద్వారా గుర్తింపు పొందవచ్చనే తపన ఆయనదని విమర్శించారు. మంత్రి కేటీఆర్‌ యూత్‌ ఐకాన్‌ అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఉప్పల్‌లో రేవంత్‌ కొనుగోలుచేసిన భూముల సంగతేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రేవంత్‌.. కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పాలి
రాజకీయ దురుద్దేశంతోనే రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేస్తుంటారని తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ చైర్మన్‌ కొంతం గోవర్ధన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోపణలను వెనక్కి తీసుకుని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.