Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రోడ్ల అభివృద్ధికి 10వేల కోట్లు

రాష్ట్రంలోని రోడ్లన్నింటినీ ఏడాదిలోగా అద్దంలా మారుస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇందుకోసం వచ్చే బడ్జెట్‌లో సరిపడా నిధులు కేటాయిస్తామని చెప్పారు. జిల్లాకు వేయి కోట్లచొప్పున పది జిల్లాలకు పదివేల కోట్లు ఖర్చుచేసి రోడ్లను అభివృద్ధిచేస్తామని చెప్పారు. పీవీ ఎక్స్‌ప్రెస్‌హైవే తరహాలో హైదరాబాద్‌లో మరో నాలుగు ఎలివేటెడ్ కారిడార్స్‌ను నిర్మించి జిల్లా కేంద్రాలనుంచి నగరానికి వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా చేయాలని అన్నారు.

KCR Review with Roads&Buildings Department

-జిల్లాకు వెయ్యి కోట్ల చొప్పున కేటాయింపు -ఏడాదిలోగా అద్దంలా రాష్ట్ర రహదారులు -ఫోర్ లేనర్స్‌గా నర్సాపూర్, మెదక్, బోధన్ రోడ్లు -రాజధానిలో మల్టీ స్టోరీడ్ పార్కింగ్ ప్రదేశాలు -అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం -సమీక్షలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నర్సాపూర్, మెదక్, బోధన్ రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరిస్తామని ప్రకటించారు. రోడ్ల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టీ రాజయ్య అధ్యక్షతన మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కేటీ రామారావు, నాయిని నర్సింహరెడ్డి, టీ హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, జోగురామన్న సభ్యులుగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో మంత్రులు, అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వరంగల్, కరీంనగర్, మెదక్, నల్లగొండ తదితర జిల్లా కేంద్రాలనుంచి ఔటర్‌రింగ్ రోడ్డుకు గంటన్నరలో చేరుకుంటున్నప్పటికీ.. అక్కడినుంచి నగరంలో గమ్యస్థానాలకు చేరుకోవడానికి రెండు గంటలు పడుతున్నదన్నారు. దీనివల్ల నగర ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ పరిస్థితిని నివారించడానికి జిల్లా కేంద్రాల రహదారులకు అనుబంధంగా పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్ హైవే తరహాలో నాలుగు ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మిస్తామని ప్రకటించారు.

వరంగల్‌నుంచి వచ్చే వారికోసం అవుటర్ రింగ్‌రోడ్డు నుంచి ఉప్పల్‌ వరకు, కరీంనగర్ నుంచి వచ్చేవారి కోసం ఔటర్‌నుంచి జూబ్లీ బస్‌స్టేషన్ వరకు, బోధన్, మెదక్ ప్రాంతాలనుంచి వచ్చేవారికోసం ఔటర్‌నుంచి ప్యారడైజ్ వరకు, నల్గొండనుంచి వచ్చేవారికోసం ఔటర్‌నుంచి ఎల్బీనగర్‌వరకు ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మించాలని నిర్ణయానికి వచ్చారు. నగరంలో పార్కింగ్ సమస్యను నివారించేందుకు మల్టీస్టోరీడ్ పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అభివృద్ధి చెందిన దేశాలలోని నగరాల్లో ఈ సౌకర్యం ఉందని అన్నారు. అదే విధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.

గ్రామీణ రహదారుల అభివృద్ధి సంస్థ!: తెలంగాణలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాన్ని రోడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా చేపట్టాలని, అవసరమైతే తెలంగాణ స్టేట్ రూరల్ రోడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల రోడ్లను అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మంత్రివర్గ ఉపసంఘం రెండు మూడు రోజుల్లో సమావేశమై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. నివేదిక అందగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

రహదారుల నిర్మాణం పనులుకూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో రహదారుల అభివృద్ధి కూడా కీలకాంశమని కేసీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వశాఖల కార్యదర్శులు నర్సింగరావు, నాగిరెడ్డి, రామకృష్ణారావు, స్మితా సబర్వాల్, అర్‌అండ్‌బీ ఈఎన్‌సీ రామకృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.