Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రోజుకు 48 గంటల కరంట్ ఇస్తారేమో!

-టీఆర్‌ఎస్ పథకాలను కాపీ కొడుతూ హామీలు గుప్పిస్తున్న కాంగ్రెస్: కేటీఆర్
-కరంట్ అడిగితే కాల్చిచంపిన చరిత్ర చంద్రబాబుది
-ముదిగొండలో పేదోళ్లపై బుల్లెట్లు దింపింది కాంగ్రెసోళ్లు
-పాము, ముంగిస కలిసి రాష్ర్టాన్ని దోచుకోనికి చూస్తున్నాయి
-చేవెళ్ల నియోజకవర్గం రోడ్‌షోలో మంత్రి కేటీఆర్ హెచ్చరిక

టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలను కాపీ కొడుతూ కాంగ్రెస్ పార్టీ సోయి లేకుండా హామీల మీద హామీలు గుప్పిస్తున్నదని మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. ఇదేమని అడిగేటోళ్లు లేకుంటే రోజుకు 48 గంటల కరంట్ కూడా ఇస్తామని చెప్తారని ఎద్దేవాచేశారు. కరంట్ అడిగితే కాల్చిచంపిన చరిత్ర చంద్రబాబుది అయితే.. ముదిగొండలో పేదోళ్లపై బుల్లెట్ల వర్షం కురిపించింది కాంగ్రెసోళ్లు.. ఈ రెండు పార్టీలకు ఓటుతో గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లి, నవాబ్‌పేట, చేవెళ్ల, మొయినాబాద్ మండలాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కాలె యాదయ్యకు మద్దతుగా మంత్రి కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహించారు. ఆయా మండలాల్లో మహిళలు బోనాలతో ఘనస్వాగతం పలికారు. గొల్లకుర్మలు గొంగడి, గొర్రె పొటేల్‌ను బహూకరించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ సర్కార్ రైతులకు రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీచేసిందని, మరోసారి అధికారంలోకి రాగానే రైతులకు మరో లక్ష రుణమాఫీ, రైతు బంధు కింద ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని హామీఇచ్చారు. రైతులకు పెట్టుబడి ఇచ్చిన నాయకుడు ఒక్క కేసీఆరే అని చెప్పారు. ఇంటి కిరాయి కూడా ఉత్తమ్ కడతాడంటా అని విమర్శించారు. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను కాపీ కొట్టారు.. మా పథకాలను అటుఇటూ మార్చి చెప్తున్నారు అని ఎద్దేవాచేశారు. ఒక్క కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి సంక్రాంతి పండుగకు వచ్చే గంగిరెద్దుల మాదిరిగా నాలుగు కండువాలు వేసుకొని వస్తున్నారు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పాము, ముంగిసలు కలిసి రాష్ర్టాన్ని దోచుకోవడానికి చూస్తున్నాయన్నారు.

ప్రజల ఆశీర్వాదంతో గెలిచాం
మోదీ ఇక్కడ కరంట్ లేదంటున్నాడు.. ఒకసారి వచ్చి ఇక్కడి కరంట్ తీగలు పట్టుకొంటే ఏమైతదో తెలుస్తుందని మంత్రి కేటీఆర్ చమత్కరించారు. తమది కుటుంబపాలన అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మేం ఉద్యమాల్లో పాల్గొని ప్రజల ఆశీర్వాదంతో గెలిచి అధికారంలోకి వచ్చామని స్పష్టంచేశారు. తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ దెబ్బతింటుందని ఆసత్యప్రచారాలు చేసిన నాయకులకు.. నేడు రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనుకున్నదానికంటే ఎక్కువగా డిమాండ్ పెరిగిపోయిందని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు తెచ్చి ఆడపడుచులకు మేనమామలాగా ఉండి పెండ్లి సాయం చేస్తున్నారని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా 95 శాతం ఇండ్లకు నల్లానీరు అందిస్తున్నామని, మిగతావారికి త్వరలోనే అందిస్తామని పేర్కొన్నారు. ఆగం కాకండి.. అభివృద్ధిని చూసి ఓటేయండి.. గులాబీని ముద్దిచ్చుకొని కాలె యాదయ్యను గెలిపించండి అని పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో చేవెళ్ల టీఆర్‌ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు స్వప్నసతీశ్, ఉపాధ్యక్షురాలు అనిత, టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పట్నం అవినాశ్‌రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ రాంరెడ్డి, ఎంపీపీ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతుబంధు రద్దు చేసే కాంగ్రెస్‌కు ఓటెందుకెయ్యాలె
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధు పథకాన్ని ఎత్తేస్తానంటున్నది.. రైతు సమన్వయ సమితులను రద్దుచేస్తానంటున్నది.. రైతుబంధును రద్దు చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటెందుకెయ్యాలో ప్రజ లు ఆలోచించుకోవాలి. టీఆర్‌ఎస్ అధికారం చేపడితే ఏడాదికి ఎకరానికి రూ.8వేలు ఇస్తున్న రైతుబంధు సాయాన్ని రూ.10వేలకు పెంచుతాం. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో సింగూరు ప్రాజెక్టును నిండు కుండలా నింపి నారాయణఖేడ్ నియోజకవర్గానికి కాల్వల ద్వారా సాగునీరందిస్తాం. -నారాయణ్‌ఖేడ్ సభలో మంత్రి హరీశ్‌రావు

సింగూర్ నుంచి లక్ష ఎకరాలకు సాగు నీరు
సింగూర్ నుంచి జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న లక్ష ఎకరాలకు సాగు నీరు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. పేదలను ఆర్థికంగా అందుకోనేందుకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేసి దేశంలోనే ఆదర్శంగా రాష్ట్రం ఉంది. -జహీరాబాద్ సభలో ఎంపీ బీబీ పాటిల్,

కేసీఆర్ హయాంలో సుపరిపాలన
ప్రపంచంలోనే అత్యున్నతమైన సుపరిపాలన, సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమయ్యాయి. తల్లికి పెద్ద కొడుకులా, పెన్షన్ తీసుకునే చెల్లెళ్లకు అన్నలా, పెండ్లి చేసుకునే ఆడబిడ్డలకు మేనమామలాగా, రైతుకు రైతుబాంధవుడిలాగా సీఎం కేసీఆర్ ఉన్నారు. బాన్సువాడలో జరుగుతున్న సభ చూస్తుంటే ఆనందం కలుగుతున్నది. ఇంత పెద్ద సంఖ్య లో జనంతో కూడిన ఈ సభ జీవితంలో మరిచిపోలేనిది. -బాన్సువాడ సభలో మంత్రి, టీఆర్‌ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి

ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ కలిసి వస్తున్నాయ్
కాంగ్రెస్, టీడీపీలు కలసి ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రంలో తిరిగి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం. – జహీరాబాద్ సభలో ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.