Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రుణ పరిమితి పెంచండి

-ఆదాయం పన్ను నుంచి హెచ్‌ఎండీఏను మినహాయించండి -ద్వితీయ శ్రేణి పట్టణాల అభివృద్ధిపై దృష్టి సారించండి -కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కోరిన సీఎం కేసీఆర్

CM-KCR-met-Union-finance-minister-Arun-Jaitley

దేశంలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ర్టాల్లో గుజరాత్ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉన్నదని, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు అవసరమైన ఆర్థిక వనరులను వివిధ ద్రవ్యసంస్థల నుంచి రుణాల రూపేణా సమకూర్చుకునేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం (ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) పరిమితిని ప్రస్తుతం ఉన్న 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు విజ్ఞప్తి చేశారు. ప్రజాసేవారంగ సంస్థ అయిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)ని ఆదాయం పన్ను నుంచి మినహాయించాలని కూడా కోరారు. ఢిల్లీలో మంగళవారం మధ్యాహ్నం ఆయనతో సుమారు అరగంటకు పైగా భేటీ అయిన కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల గురించి వివరించారు. కేసీఆర్ వెంట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, ప్రత్యేక ప్రతినిధులు రామచంద్రు తెజావత్, వేణుగోపాలచారి, ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితరులు ఉన్నారు. ఈ భేటీలో ప్రధానంగా ఎఫ్‌ఆర్‌బీఎం గురించి చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిందని, వీటికి అవసరమైన ఆర్థికవనరులను సమకూర్చుకోడానికి ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచాలని కోరారు. అదనపు బడ్జెట్ కలిగిన రాష్ర్టాలు వివిధ ద్రవ్యసంస్థల నుంచి రుణాన్ని తీసుకునే గరిష్ట పరిమితిని పెంచవచ్చంటూ ఇటీవల 14వ ఆర్థిక సంఘం తన సిఫారసుల్లో పేర్కొన్నదని, ఇందుకు అవసరమైన అన్ని అర్హతలూ తెలంగాణకు ఉన్నాయని వివరించారు. అనేక రాష్ర్టాలు విద్యుత్ రంగంలో లక్షల కోట్ల రూపాయలమేర బకాయిపడిన నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితిని పెంచడానికి కేంద్రం సుముఖత చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మిగులు బడ్జెట్ కలిగిన తెలంగాణకు ఆర్థికసంఘం మార్గదర్శకాల ప్రకారం కూడా అదనపు రుణపరిమితి పొందేందుకు అన్ని అర్హతలూ ఉన్నట్లు కేసీఆర్ వివరించడం గమనార్హం.

CM-KCR-with-Arun-Jaitley

ద్వితీయశ్రేణి పట్టణాలూ ముఖ్యమే కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్‌తో పాటు అనేక పట్టణాభివృద్ధి పథకాల్లో ఎక్కువగా ప్రథమ శ్రేణి పట్టణాలపైనే దృష్టి సారించిందని, సమీప భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుంటే ద్వితీయ శ్రేణి పట్టణాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్రమంత్రికి కేసీఆర్ వివరించారు. స్మార్ట్‌సిటీలకు ఎంపికైన అనేక నగరాల్లో ఈ పథకం ద్వారా లభిస్తున్న కేంద్ర ఆర్థికసాయం కంటే స్థానికంగా వివిధరూపాల్లో ఆర్జిస్తున్న ఆదాయమే ఎక్కువగా ఉన్నదని, అందువల్ల పట్టణాభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలంటే ద్వితీయ శ్రేణి పట్టణాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. హైదరాబాద్ అభివృద్ధి గురించి వివరిస్తూ, ఇప్పటికే గణనీయమైన స్థాయిలో అభివృద్ధి చెందిన ఈ మహానగరానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్నదని, దీనిని మరింతగా అభివృద్ధి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.

నగరంలో బహుళ అంతస్థుల భవనాలతో పాటు ైఫ్లె ఓవర్లు, స్కైవేలు మొదలైనవి నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, ఇలాంటివాటికి కూడా కేంద్రం నుంచి తగిన సహకారం అవసరమవుతుందని అన్నారు. పట్టణాభివృద్ధి కృషిలో హైదరాబాద్ చాలా ప్రధానమైనదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ఆర్థికంగా వెనకబడిన జిల్లాలతో పాటు కరువు సమస్య ఉన్న గ్రామీణ ప్రాంతాలకు కేంద్రం వివిధ రూపాల్లో ఆర్థిక సాయం చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కరువు కారణంగా రైతాంగం ఇబ్బంది పడుతున్నారని, ఆర్థిక సమస్యల కారణంగా కుటుంబాన్ని పోషించడం కూడా కష్టమవుతోందని, అందువల్ల కేంద్రం నుంచి విడుదల కావాల్సిన వెనకబడిన ప్రాంతాల గ్రాంట్లను సకాలంలో విడుదల చేయాలని కోరారు. తెలంగాణలో ఎనిమిది జిల్లాలు వెనకబడినవనేనని గుర్తు చేశారు.

హెచ్‌ఎండిఎపై మెమొరాండం హెచ్‌ఎండీఏను ఆదాయం పన్ను నుంచి మినహాయించాలని కోరిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈఅంశంపై కేంద్రమంత్రికి ప్రత్యేకంగా వివరించడంతో పాటు ఒక మెమొరాండం కూడా సమర్పించారు. హెచ్‌ఎండీఏ నిజానికి ఎలాంటి వాణిజ్యపరమైన కార్యకలాపాలను నిర్వహించడంలేదని, పట్టణాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను మాత్రమే అమలుచేస్తున్నదని వివరించారు. ఈసంస్థను ఆదాయం పన్ను నుంచి మినహాయించాల్సిందిగా ఫిబ్రవరి 5వ తేదీన విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. ఈ లేఖకు స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ మే 20వ తేదీన ఒక లేఖ రాసిందని, అందులో హెచ్‌ఎండీఏ అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 10(46) ప్రకారం మాత్రమే పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం కుదురుతుందని తెలిపిందని వివరించారు.

అయితే వాస్తవంలో హెచ్‌ఎండీఏను ఈ సెక్షన్ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రం పలుమార్లు నిరాకరించిందని గుర్తు చేశారు. హెచ్‌ఎండీఏ అనేది పట్టణ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించి అమలు చేసే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ మాత్రమేనని కేసీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా లైసెన్సు ఫీజు, అభివృద్ధి రుసుములను వసూలుచేస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నదని, సంస్థ కార్యకలాపాల్లో ఎక్కడా వాణిజ్య స్వభావం అనేదే లేదని తెలిపారు. 2002 వరకూ ఇలాంటి స్వభావంతో కూడిన పట్టణాభివృద్ధి సంస్థలను ఆదాయపు పన్ను నుంచి మినహాయించే వెసులుబాటు ఉండేదని గుర్తు చేశారు. పట్టణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు శాయశక్తులా కృషి చేస్తున్నాయని, పట్టణాభివృద్ధి సంస్థలు స్థానిక స్థాయిలో ఆదాయాన్ని సంపాదించుకునేలా ప్రోత్సహించాలని అన్నారు.

హెచ్‌ఎండీఏ లాంటి పట్టణాభివృద్ధి సంస్థలు ఆర్జిస్తున్న ఆదాయాన్ని మళ్ళీ ప్రజల సౌకర్యాల కోసం, అభివృద్ధికోసమే వెచ్చిస్తున్నాయని, ప్రైవేటు ప్రయోజనాలు లేవని, లాభాపేక్ష అసలే లేదని, అలాంటప్పుడు అవి ఆర్జించే ఆదాయంపై పన్ను వసూలు చేయడం భావ్యం కాదని సూచించారు. ఈ నేపథ్యంలో పట్టణాభివృద్ధి సంస్థల నుంచి కేంద్రం ఆదాయం పన్ను వసూలు చేయడంపై పున సమీక్ష జరగాలని, పన్ను నుంచి ఈ సంస్థలను మినహాయించేలా విధాన నిర్ణయాలు జరగాలని కేంద్ర ఆర్థికమంత్రికి కేసీఆర్ సూచించారు. ఇందుకు అనుగుణంగా వచ్చే 2016 ఫైనాన్స్ బిల్లులో తగిన సవరణలు చేయాలని కోరారు. ఈ విధంగా చేయడం ద్వారా పట్టణాభివృద్ధి సంస్థలను ప్రోత్సహించినట్లవుతుందని తెలిపారు.

పెట్టుబడులు ఆశాజనకం ఇటీవల ముఖ్యమంత్రి జరిపిన చైనా పర్యటన గురించి ఆర్థికమంత్రి అడిగి తెలుసుకున్నారు. పర్యటన అనంతరం వస్తున్న పెట్టుబడుల గురించి మంత్రి అడిగితే, ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయని, పర్యటన అనంతరం పరిస్థితి ఆశాజనకంగా ఉందని కేసీఆర్ వివరించారు. ఎఫ్‌ఆర్‌బీఎం కింద 3.5% వరకూ రుణాన్ని సమకూర్చుకునేందుకు అనుమతి ఇచ్చినట్లయితే వాటిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్దగల మార్గాలేమిటని కూడా అరుణ్‌జైట్లీ అడిగి తెలుసుకున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎంపై సానుకూలంగా స్పందించిన అరుణ్‌జైట్లీ వెంటనే వినిమయ విభాగం (ఎక్స్‌పెండిచర్ డిపార్ట్‌మెంట్) అధికారులను ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా ఆదేశించారు.

అనంతరం ఈ విషయమై సంబంధిత అధికారులతో ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్ సుమారు గంటపాటు సమావేశమై రాష్ట్ర బడ్జెట్ స్వరూపాన్ని, మిగులు బడ్జెట్ ఏ విధంగా వస్తుందో వివరించారు. అనంతరం అరుణ్‌జైట్లీ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి పెంపుపై చర్చించారని, దీనికి సంబంధించి అనేక అనుబంధ విషయాలపై కూడా చర్చించామని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ గురించి తెలుసుకోవడంతో పాటు పలు సూచనలు చేశానని తెలిపారు. కేసీఆర్ కూడా పలు అంశాలపై సూచనలు చేశారని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.