-కూటమికి ఓటేస్తే సీతారామ ప్రాజెక్టును అడ్డుకొనేందుకు తీర్పిచ్చినట్లే -కేసీఆర్ పాలనే రాష్ర్టానికి శ్రీరామరక్ష.. రైతుబంధు మొత్తం పెంచుతాం -సత్తుపల్లిలో ఫుడ్‌పార్క్.. మధిరలో లెదర్‌పార్క్ స్థాపించే బాధ్యత నాదే -ఉమ్మడి ఖమ్మం సత్తుపల్లి, మధిర, అశ్వారావుపేట సభల్లో మంత్రి కేటీఆర్
రైతు బంధు పేరుతో పంట పెట్టుబడిగా రూ.8 వేలు రైతులకు అందిస్తున్నా సీఎం కేసీఆర్ ఇంకా సంతృప్తి చెందలేదు. రైతన్నలకు ఇంకా ఏదో చేయాలనే తపనతో ఈ దఫా రైతుబంధు మొత్తాన్ని రూ.10 వేలకు పెంచి ఇవ్వబోతున్నట్టు మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చుపెడితే అందులో 43 పైసలు పేదల సంక్షేమానికి వెచ్చిస్తున్నామని చెప్పారు. బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని సత్తుపల్లి, అశ్వారావుపేట, మధిర అసెంబ్లీ సెగ్మెంట్లకు పోటీచేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో కేటీఆర్ ప్రసంగించారు. సిద్ధాంతాలు, జెండాలు పక్కనబెట్టి కేవలం అధికారమే పరమావధిగా కూటమిగా వస్తున్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ అభ్యర్థులకు ఓట్లేస్తే తెలంగాణ ప్రజలకు మరణశాసనమే అని అన్నారు. టీడీపీకి ఓటేస్తే సీతారామ ప్రాజెక్టును అడ్డుకోవాలంటున్న చంద్రబాబు వాదనలకు మనమే బలం చేకూర్చి నట్లవుతుందన్నారు. పేదవాడికిచ్చే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి ఎమ్మెల్యే సంతకం పెట్టాలని, కానీ ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందోనని ఆర్నెల్లు, ఎనిమిది నెలలు సంతకాలు పెట్టకుండా పేదింటి ఆడపిల్ల నోటికాడ కూడును కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క లాక్కున్నాడని దుయ్యబట్టారు. ఇలాంటి ఎమ్మెల్యేకు మళ్లీ ఓటేసి గెలిపిస్తారా? లేక మీకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు చేసుకుంటా అంటున్న టీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌కు ఓటేస్తరా? ప్రజలు తేల్చుకోవాలన్నారు.
ఈరోజు కేసీఆర్ మాటగా చెప్తున్నా కమల్‌రాజ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించి పంపితే రాబోయే రోజుల్లో ప్రతీ పేదవాడికి ఎక్కడ ఖాళీ జాగ ఉంటే అక్కడే రూ.5లక్షలు ఇచ్చి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించే భాద్యత తనదేనన్నారు. మడుపల్లిలో లెదర్‌పార్క్ కట్టిస్తామని చెప్పిన భట్టి మర్చిపోయారన్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండే మాదిగ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా మడుపల్లిలో లెదర్‌పార్క్‌ను ఏర్పాటుచేసి ఉపాధి అవకాశాలు కల్పించే భాద్యతను వ్యక్తిగతంగా తీసుకుంటున్నా అని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. బోనకల్లో డిగ్రీ కళాశాల, వైరా నదిపై బ్రిడ్జి, మడుపల్లిని మున్సిపాలిటీ నుంచి తీసివేయాలని కోరుతున్నారని, తప్పకుండా వారి కోరికలను నెరవేరుస్తామన్నారు.
టీఆర్ఎస్ను ఎందుకు దించాలి? కేసీఆర్‌ను గద్దె దింపేందుకు కూటమి కుట్ర పన్నాయని, అసలింతకు కేసీఆర్‌ను ఎందుకు గద్దె దించాలో దుష్టకూటమి చెప్పలేకపోతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. గోదావరి, కృష్ణా జలాల్లో మనకు న్యాయంగా రావాల్సిన 200 టీఎంసీల నీటిని తెలంగాణ బీడు భూములకు అందించే ప్రయత్నం చేసినందుకా? వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంట్ ఇస్తున్నందుకా? ఏ నాయకుడు చేయనివిధంగా ఎకరాకు రూ.8 వేలు ఇచ్చి రైతుబందు పథకం పెట్టినందుకా? ఎవరైనా రైతు చనిపోతే రూ.5లక్షల ఉచిత బీమా అందించినందుకా? ఎందుకు కేసీఆర్‌ను అధికారం నుంచి దించాలో ప్రజలు ఆలోచించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగభృతి కింద నెలకు రూ.3వేలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేట్డి, ఎమ్మెల్సీ బాలసాని, టీఆర్ఎస్ అభ్యర్థులు డాక్టర్ పిడమర్తి రవి, తాటి వెంకటేశ్వర్లు, లింగాల కమల్‌రాజ్, జెడ్పీ అధ్యక్షురాలు గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శులు తాతా మధు, నూకల నరేశ్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు షేక్ బుడాన్ బేగ్, కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.