Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతే గొప్ప ఆవిష్కర్త.. నూతన ఆవిష్కారాలు ఎవరి సొత్తూ కాదు

-వారికి తెలిసినన్ని విషయాలు మనకూ తెలియవు
-నూతన ఆవిష్కారాలు ఎవరి సొత్తూ కాదు
-యువరైతులకు అగ్రిహబ్‌ సరైన వేదిక కావాలి
-సామాన్యులకు ఉపయోగపడని టెక్నాలజీ నిష్ఫలం
-ఏడేండ్లలోనే దేశ ధాన్యాగారంగా మారిన తెలంగాణ
-గాల్లోనే కలిసిపోయిన కేంద్ర ప్రభుత్వ హామీలు
-నినాదంగానే మిగిలిన ‘రైతుల ఆదాయం రెట్టింపు’
-అగ్రిహబ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌
-అగ్రి ఆవిష్కరణలకు ఇది తొలి అడుగు: నిరంజన్‌రెడ్డి

ప్రపంచంలో రైతులను మించిన ఇన్నోవేటర్లు (ఆవిష్కర్తలు) లేరని పురపాలక, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రైతులకు తెలిసినన్ని విషయాలు మరెవరికీ తెలియవని పేర్కొన్నారు. వారికి సమస్య ఏమిటో తెలుసు.. పరిష్కారమూ తెలుసని.. మనం ఆ పరిష్కారానికి సాంకేతిక మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన అగ్రిహబ్‌ను సోమవారం మంత్రి కేటీఆర్‌.. సహచర మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, నాబార్డ్‌ చైర్మన్‌ జీఆర్‌ చింతలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతున్నదని, అందుకు అనుగుణంగా సాంకేతిక వినియోగం పెరగాలని అన్నారు. అగ్రిహబ్‌ ద్వారా రైతులకు మెరుగైన సాంకేతిక సహకారం అందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

యువ రైతులను ప్రోత్సహించాలి
ఇన్నోవేషన్‌ ఎవరి సొత్తూ కాదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గ్రామీణ యువతకు అగ్రిహబ్‌ ఓ వేదిక కావాలని ఆకాంక్షించారు. ఆవిష్కరణల్లో వారిని భాగస్వాములను చేయాలని వర్సిటీ అధికారులకు సూచించారు. వారు రూపొందించే ప్రతి పరికరాన్ని అగ్రిహబ్‌ వేదికగా మరింత అభివృద్ధిపరచాలని చెప్పారు. అగ్రిహబ్‌లో ప్రతి బోర్డును తెలుగులో ఏర్పాటుచేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 2601 రైతు వేదికలకు టీ-ఫైబర్‌ ద్వారా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో రైతులంతా వర్సిటీలోని శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆయిల్‌ పామ్‌ సాగును పెంచేందుకు దేశంలో మరే రాష్ట్రం చేయని కృషి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నదని తెలిపారు.

సీఎం అడిగేది అదొక్కటే..

‘మీరు అమలుచేసే నూతన టెక్నాలజీతో సామాన్యులకు, రైతులకు ఏం లాభం?’ అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నిస్తారని కేటీఆర్‌ చెప్పారు. సామాన్యులకు, రైతులకు ఉపయోగపడని ఎంత గొప్ప సాంకేతికత అయినా అది నిష్ఫలమనేది సీఎం భావన అని తెలిపారు. రైతును మించిన ఇన్నోవేటర్‌ లేనేలేడని అన్నారు. ఒకసారి రైతువేదిక ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు అక్కడ ఓ రైతుకు టెక్నాలజీపై గల పట్టును చూసి ఆశ్చర్యపోయానన్నారు. సీఎం కేసీఆర్‌కు వ్యవసాయం అంటేనే మక్కువ అని, అందుకే ఏడేండ్ల స్వల్వ కాలంలోనే ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో సాధించని విధంగా వ్యవసాయం, సాగునీటి రంగాల్లో అద్భుత ప్రగతి సాధించామని వెల్లడించారు. ‘చైనా, అమెరికా.. పలు ప్రాజెక్టులను అత్యంత వేగంగా నిర్మించాయని వింటుంటాం. అలాంటిదే ఇప్పుడు తెలంగాణలో సాధ్యమైంది. మూడున్నరేండ్లలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మించాం. ఏడేండ్లలో రాష్ట్రంలో ధాన్యం దిగుబడి గణనీయంగా పెరిగింది. ఇప్పుడు తెలంగాణ దేశానికి ధాన్యపు భాండాగారంగా మారింది’ అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

రైతు మేలు కోరే ఏకైక ప్రభుత్వం..
రైతులకు మేలు చేసేలా అధిక నిర్ణయాలు తీసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కేటీఆర్‌ తెలిపారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుతోపాటు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి రైతుకు ఉచితంగా బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. అన్ని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ రైతు పండించిన ప్రతి గింజను గ్రామాలకు వెళ్లి కొనుగోలు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

పౌష్టికాహారం సవాల్‌
దేశంలో ఇప్పుడు పోషకాహారం అందించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని, ఆ దిశగా మనందరి ఆలోచన సరళి మారాలని కేటీఆర్‌ అన్నారు. వ్యవసాయంలో ఉత్పత్తి, ఉత్పాదకత, లాభం కీలకమైనవని చెప్పారు. ప్రస్తుతం పంటల ఉత్పత్తి పెరిగిందన్న మంత్రి కేటీఆర్‌.. ఉత్పాదకత, లాభం మరింత పెరగాల్సి ఉన్నదని అభిప్రాయపడ్డారు. అమెరికాలో 1.3% జనాభా వ్యవసాయంపై ఆధారపడితే.. ఆ దేశ జీడీపీలో 5% ఆదాయాన్ని సమకూరుస్తున్నారని తెలిపారు. అదే మనదేశంలో 60% మంది ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగం వాటా దేశ జీడీపీలో 16-20% వరకు ఉన్నదని అన్నారు.

వ్యవసాయ ఆవిష్కరణలకు తొలి అడుగు: మంత్రి నిరంజన్‌రెడ్డి
అగ్రిహబ్‌ ప్రారంభోత్సవం తెలంగాణలో వ్యవసాయ ఆవిష్కరణలకు తొలి అడుగని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతులు సంప్రదాయ వ్యవసాయం నుంచి సాంకేతిక వ్యవసాయం వైపు మళ్లాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సగటున ఏటా సుమారు రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని వెల్లడించారు.

మోడల్‌గా అగ్రిహబ్‌: జీఆర్‌ చింతల
అగ్రిహబ్‌ను ఇతర రాష్ర్టాలకు మోడల్‌గా చూపుతామని నాబార్డ్‌ చైర్మన్‌ గోవిందరాజులు చింతల చెప్పారు. తమ రాష్ర్టానికి, తాను చదువుకున్న విశ్వవిద్యాలయానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో అగ్రిహబ్‌ నిర్మాణానికి నాబార్డ్‌ నుంచి రూ.9 కోట్ల గ్రాంట్‌ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు పలు పుస్తకాలను ఆవిష్కరించారు. వర్సిటీ అధికారులు పలు స్టార్టప్‌లతో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్‌, సుధీర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సంజయ్‌కుమార్‌, రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ అనితా హరినాథ్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

డ్రోన్స్‌ ద్వారా అడవుల అభివృద్ధి
పోస్టర్‌ ఆవిష్కరించిన కేటీఆర్‌ ‘హరా బహార’ పేరుతో రాష్ట్రంలో డ్రోన్ల ద్వారా అడవులను అభివృద్ధి చేసేందుకు మారుత్‌ డ్రోన్స్‌ సంస్థ సరికొత్త ప్రయోగాన్ని నిర్వహిస్తున్నది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం అగ్రిహబ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సంస్థ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 12వేల హెక్టార్లలో 50 లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. హరితహారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. బంజరు భూముల్లో, ఖాళీ అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా విత్తన బంతులను విడిచి మొక్కలు పెరిగేలా చేస్తారు. దేశంలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా అడవుల అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ సంస్థ చేపట్టింది.

కేంద్రం మాటల మూటలు
కేంద్ర ప్రభుత్వం చేసే కొన్ని నినాదాలు.. ఆచరణలోకి రాకుండానే మిగిలిపోతున్నాయని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఇందుకు కేంద్రం చెప్పిన రైతుల ఆదాయం రెట్టింపు నినాదమే ఉదాహరణ అన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సీఎం కేసీఆర్‌ తీసుకున్న పలు విప్లవాత్మక నిర్ణయాలతో తెలంగాణలో రెండో హరిత విప్లవం, నీలి, శ్వేత, పింక్‌ విప్లవాలు ప్రారంభమైనట్లు తెలిపారు. తెలంగాణలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయన్నారు. సిరిసిల్లలో గతంతో పోల్చితే భూగర్భ జలాలు ఆరు మీటర్లు పైకి వచ్చాయని, దీనిని ముస్సోరిలోని ఐఏఎస్‌ల శిక్షణ కేంద్రంలో పాఠ్యాంశంగా చేర్చారని తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.