ప్రతి రాజకీయ పార్టీ, ప్రత్యేకించి ఎన్నికలప్పుడు రైతే రాజు – ఇదే మా విధానం. రైతు దేశానికి వెన్నెముక. రైతు లేనిదే రాజ్యమే లేదు అని వాగ్దానాలు చేయడం, మనం వినడం పరిపాటే. కానీ చాలా సందర్భాల్లో వారి ఎన్నికల ప్రకటనలు వాగ్దానాలకే పరిమితమవుతాయి. ఒక చిన్న సన్నకారు రైతు పడే ఇబ్బందులు నా చిన్నతనంలో చూసిన సంఘటనలు ఒకసారి నెమరేసుకుంటే రైతు సమస్యలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. గ్రామీణ ప్రాంతంలో పచ్చదనం ఉంటే బ్లూ రెవల్యూషన్ (చేపల పెంపకం), వైట్ రెవల్యూషన్ (క్షీర విప్లవం), బ్రౌన్ రెవల్యూషన్ (మాంస పరిశ్రమ) గీత, నేత, కుమ్మరి, కమ్మరి, రజక, నాయీబ్రాహ్మణ, సన్నాయి వాయిద్యాల నుంచి మల్టీప్లెక్స్‌లో సినిమా హాల్స్ వరకు కళకళలాడుతాయి. అందుకే రైతే రాజయితే రాజ్యం అన్ని రకాలుగా సుభిక్షంగా ఉంటది.

పొలాలు పచ్చగా ఉంటే కలిగే ఆనందం, పైర్లు ఎండిపోయినప్పుడు కలిగే దుఃఖం, చివరికి మార్కెట్ యార్డు ల్లో పడే తిప్పలు.. ఇలా రైతు కష్టాలను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా దాదాపు యాభై ఏండ్ల తర్వాత ఈ రోజు కూడా ఇవన్నీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నవి. చిన్నప్పుడు రోజూ ఉదయం మూసీ ప్రాజెక్ట్ ఎంత నిండిందో మార్కె ట్ యార్డ్‌లో ఉన్న బ్లాక్ బోర్డు మీద చూసి రావడం ఇంకా గుర్తు ఉంది. ఓసారి మూసీ నీళ్లు మధ్యలో ఆగిపోతే పొట్టకు వచ్చిన వరి పొలం ఎండిపోయింది. దాంతో మా నాన్న కోపంతో తగులబెడితే కండ్లారా చూసిన. నీళ్లు చాలీచాలని సమయంలో దసరా నాడు గూడా రాత్రంతా పాలేరు తో కలిసి మా నాన్న పొలం మళ్లకు కంపెటేషన్‌లో నీళ్లు మళ్లించడం ఇం కా నిన్ననే జరిగినట్లు ఉంది. ఒకవైపు ఎంబీబీఎస్ సీటు వచ్చిందని సం తోషం. ఫీజు కట్టాలి. కానీ పంట చేతికి రాలేదు. అలాంటి క్లిష్ట సమయంలో వేరుశనగ పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే ఒకటే వర్షం. మూడు రోజులు కుప్ప దగ్గర కాపలా కాశాను. పందులు, గొడ్లు, మనుషుల నుం చి కాపాడుకొని, వాళ్లు ఇచ్చిన ధరకు అమ్ముకొని, వచ్చిన సొమ్ము తీసుకొని పరుగు పరుగున అడ్మిషన్ చివరిరోజున ఎంబీబీఎస్‌లో చేరిన సం గతి ఇంకా మర్చిపోలేదు. ప్రతి సంవత్సరం కాలేజీ ఫీజు కట్టాలి. హాస్టల్ ఫీజు కట్టాలి. కాలం కలిసిరావడం లేదు. గత్యంతరం లేక ప్రతి సంవ త్సరం కొంత పొలం అమ్ముకొని చదివిన జ్ఞాపకాల తడి ఆరనేలేదు. ఇది సగటున చిన్న, సన్నకారు రైతు జీవన్మరణ సమస్య. అదే సమయం లో మా అక్కకు తెలుగు పండిట్‌గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత కలిగిన ఆర్థిక వెసులుబాటు. ఒక రైతుకు, ప్రభుత్వ ఉద్యోగికి మధ్య వ్యత్యాసాన్ని తెలిపింది.
రైతుకే ఈ కష్టం!:
ఈ మధ్యనే తిరుపతికి వెళ్లినప్పుడు ఒక హోటల్‌లో భోజనం చేసి, బయటనే ఒక చిన్న చెక్క మీద పాన్, వక్కచెక్క అమ్ముతున్న వ్యక్తిని చూశా. మా కుటుంబ సభ్యులందరికీ స్వీట్ పాన్ ఇప్పించి, అతని బిజినెస్ వివరాలు అడిగిన. సగటున రోజూ రెండువేల రూపాయల కలెక్షన్. అంటే నెలకు అరువై వేలు. ఖర్చులకు సంపాదనలో ఒక యాభై శాతం పోయినా నెలకు 30 వేలు మిగులుతాయి. నాకు తెలిసినంతవరకు ఒక మోతుబరి రైతుకు కూడా ఆదాయం అంతగా ఉండదు. నన్ను ఎప్పుడూ ఒక ప్రశ్న వేధిస్తుంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువునూ అంటే ఒక గుండుసూది దగ్గరి నుంచి మోటారు బండివరకు అమ్మేవాడు నిర్ణయించిన ధరకే కొంటాం. కానీ రైతు పండించే పంటను మాత్రమే కొనేవాడు ధర నిర్ణయిస్తాడు. ఎందుకిలాగా అని. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అమ్మే వ్యాపారులు గానీ, బోర్లు వేసే యజమానులు గానీ, పంట కొనే ఏజెంట్లు గానీ చివరికి పంటను తిరిగి అమ్మే వ్యాపారులు గానీ ఆత్మహత్య చేసుకోగా ఎప్పుడూ చూడలేదు.. వినలేదు. కానీ అందరికీ ఉపాధి కల్పించే రైతు మాత్రం ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఏమిటీ ఈ విచిత్రం. అందుకే కలియుగం అంటారేమో!
రైతే రాజయితే..!:
తాజాగా జరిగిన తెలంగాణ రైతు సమగ్ర సర్వేలో తేలిన అంశాలేమంటే, తెలంగాణలో కోటి కుటుంబాలు ఉంటే దాదాపు 46 లక్షల మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వీరికి టీఏ, డీఏ, సెలవు లేవు. 365 రోజుల్లో 24 గంటలూ పనిచేయాల్సిందే. తెలంగాణ అభివృద్ధి నిజంగా జరుగాలంటే 50 శాతం జనాభా ఆధారపడి ఉన్న వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి, రైతు ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి ఒక దృఢ సంకల్పంతో రైతును రాజును చేయాలనీ, ఈ రైతు సమన్వయ సమితి అనే బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రైతుకు ముచ్చటగా మూడు విషయాల్లో ప్రభుత్వం చేయూతనివ్వా ల్సి ఉన్నది. ఒకటి నీళ్లు (సాగునీరు గాని, భూగర్భ జలాలు, వాటికి అవసరం అయ్యే కరెంటు). రెండు విత్తనాలు, ఎరువులు. ఎరువుల అవసరం అయ్యే సమయంలో ఆర్థిక తోడ్పాటు. మూడు గిట్టుబాటు ధర.నీళ్ల విషయంలో ఇప్పటికే చాలారకాలుగా పనులు మొదలుపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు, తుపాకుల గూడెం బ్యారేజీ, సీతారామ ప్రాజెక్టు, గోదావరి నది మీద, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం, కృష్ణా నది మీద, మిషన్ కాకతీయ ద్వారా, నాణ్యమైన కరెంట్ ద్వారా కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందుల విషయంలో చూస్తే వచ్చే ఏడాది నుంచి వానకాలం, యాసంగి పంటలకు కోసం చిన్నా, పెద్ద రైతు అని తేడా లేకుండా భూమి ఉండి వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ఎకరానికి రూ.8 వేలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఇక పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఒక మూలనిధి ఏర్పాటుచేసి రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రణాళిక సిద్ధంగా ఉంచారు.
రైతులు మిలమిల.. వ్యాపారాలు కళ కళ:
వీటన్నింటిని అమలు చేయడానికి, రైతుల అభివృద్ధి రైతుల చేతి మీదుగా జరుగాలనే ఒక సంకల్పం ఉంది. ఇందుకోసమే రైతు సమన్వయ సమితులకు శ్రీకారం చుట్టారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో ఒక గ్రామ రైతు సమన్వయ సమితి 15, మం డల కమిటీ మండల సమితికి 24, జిల్లా సమితిలో 24, రాష్ట్ర కమిటీకి 42 మంది సభ్యులుంటారు. ప్రతి వ్యవసాయ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పరిధిలో, ముడి గ్రామ కమిటీలకు కలిపి ఒక రైతు వేదిక ఉంటుంది. ఒక గ్రామ వ్యవసాయానికి కావాల్సిన యాంత్రీకరణ, క్రాప్ ప్లానింగ్, మార్కెటింగ్ అవసరాలు ఈ సమన్వయ సమితి ద్వారా అమలు చేయ డం జరుగుతుంది. వచ్చే ఏడాది నుంచి అమలుకు వచ్చే రైతు వ్యవసా య చేయూత, ఆర్థిక సహాయం కూడా రైతు వేదికల ద్వారా ఇవ్వబడుతుంది. మున్ముందు ఏర్పాటుచేసే మూలనిధి లేదా గిట్టుబాటు ధరలు ఇచ్చే వెసులుబాటు కూడా ఈ రైతు సమన్వయ సమితులు నిర్వహించాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాదాపు 2500 రైతు వేదికలు ఏర్పాటుచేసి, వాటిని రైతు అభివృద్ధి కి కేంద్ర బిందువుగా మార్చడం తక్షణ కర్తవ్యం. అంతిమంగా రైతే రాజు అనే నినాదమే విధానం కావాలని, బంగారు తెలంగాణకు రైతులే బాట వేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. రైతుల ఆత్మహత్యలు లేని తెలంగాణ రాష్ట్రం కోసం, వ్యవసాయం అంటే ఒక గుదిబండగా కాకుం డా అందరికీ అండగా ఉండేలా రైతు సమన్వయ సదస్సులు సమన్వయంతో పనిచేస్తాయి. రాజకీయాలకు తావులేకుండా ఈ బృహత్తర యత్నానికి అన్ని పక్షాలు రైతుల పక్షాన నిలుస్తాయని ఆశిస్తున్నాం.
ఒకసారి కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వగలిగితే దానివల్ల నేరుగా వచ్చే ఆర్థిక లాభం రెండు పంటలకు కలిపి ఎకరాకు 50 వేల రూపాయ లు ఆదాయం వస్తుంది. కోటి ఎకరాల పంటతో కనీసం 50 వేల కోట్ల ఆదాయాన్ని సృష్టించవచ్చు. రైతు దగ్గర డబ్బులుంటే విత్తనాలు, ఎరువుల కంపెనీలు, ప్రైవేట్ విద్య, వైద్యశాలలు, రియల్ ఎస్టేట్ బిజినెస్, బట్టల దుకాణాలు, బంగారం దుకాణాలు, సెల్ ఫోన్‌లు, టీవీలు, బైకు లు, మోటార్ కార్లు తదితర వ్యాపారాలన్నీ అభివృద్ధి చెందుతాయి. అలానే గ్రామీణ ప్రాంతంలో పచ్చదనం ఉంటే బ్లూ రెవల్యూషన్ (చేప ల పెంపకం), వైట్ రెవల్యూషన్ (క్షీర విప్లవం), బ్రౌన్ రెవల్యూషన్ (మాంస పరిశ్రమ) గీత, నేత, కుమ్మరి, కమ్మరి, రజక, నాయీబ్రాహ్మ ణ, సన్నాయి వాయిద్యాల నుంచి మల్టీప్లెక్స్‌లో సినిమా హాల్స్ వరకు కళకళలాడుతాయి. అందుకే రైతే రాజయితే రాజ్యం అన్ని రకాలుగా సుభిక్షంగా ఉంటది. వ్యాసకర్త : భువనగిరి పార్లమెంటు సభ్యులు – డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ నమస్తే తెలంగాణ