
-ఆగమేఘాలపై కదిలిన జిల్లా అధికారులు -గంటలో రైతు చేతికి పట్టాదార్ పాస్‌పుస్తకం -రైతుబంధు చెక్కును అందించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ -అక్రమాలకు పాల్పడిన ఆర్‌ఐ, వీఆర్వోపై వేటు -దేశానికి ప్రస్తుతం కావాల్సింది ఇలాంటి నాయకుడే -సీఎం చొరవపై సోషల్‌మీడియాలో హర్షాతిరేకాలు -ఫేస్‌బుక్‌లో సామాన్య రైతు ఆవేదనకు చలించిన సీఎం కేసీఆర్ -ఫోన్‌చేసి వివరాలు తెలుసుకుని.. పరిష్కారానికి ఆదేశాలు
తన తండ్రిపేరిట ఉన్న భూమిని అక్రమంగా వేరొకరి పేరుపై మార్చారంటూ మంచిర్యాలకు చెందిన ఓ రైతు అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు! ఎవరూ పట్టించుకోకపోవడంతో తన ఆవేదనను వీడియో రూపంలో ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేశాడు! అది సీఎం కండ్లల్లో పడింది! రైతు ఆవేదనతో ముఖ్యమంత్రి చలించిపోయారు! కట్‌చేస్తే.. సీఎంగారు మాట్లాడుతారు.. అంటూ సీఎం పేషీనుంచి సదరు రైతుకు ఫోన్! సమస్యపై ఆ యువరైతుతోనే ఆరాతీసిన కేసీఆర్.. నేనున్నా.. మీ సమస్య పరిష్కారమవుతుంది అంటూ భరోసా ఇచ్చారు. వెంటనే అధికారులను పురమాయించారు. అదే విషయాన్ని మళ్లీ స్వయంగా సదరు రైతుకు ఫోన్‌చేసి చెప్పారు. అప్పటికే సీఎం ఆదేశాలతో ఆగమేఘాలపై కదిలిన అధికారులు.. సీఎం అన్నట్టుగానే గంటలో సమస్యను పరిష్కరించి.. రైతుకు పట్టా, 1బీ, పహాణీలను అందించారు! అంతేకాదు.. రైతు నష్టపోయినదానికి పరిహారంగా వానకాలం పంట సీజన్‌కుగాను రూ.31,200 రైతుబంధు చెక్కు కూడా చేతికిచ్చారు. రైతుకు అన్యాయంచేసిన ఆర్‌ఐ, వీఆర్వోను సస్పెండ్ చేశారు. మాటల్లోకాదు.. చేతల్లో తాను రైతుబంధునని నిరూపించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేశానికి కావాల్సింది ఇలాంటి నాయకుడేనంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.
తాను రైతుపక్షపాతినని, రైతుబంధునని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మరోసారి చాటారు. తమకు జరిగిన అన్యాయంపై అధికారులు స్పందించకపోవడంతో ఫేస్‌బుక్‌లో ఆవేదనను వ్యక్తీకరించిన ఓ రైతుకు సత్వర న్యాయం చేశారు. ఆయనతో ఫోన్‌లో మాట్లాడి.. సమస్యను పరిష్కరించారు. తాను మీవెంటే ఉంటానని, తాను చేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రజల్లో చైతన్యం తేవాలని ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. బుధవారం సామాజిక మాధ్యమాల్లో, ఎలక్ట్రానిక్ చానళ్లలో హోరెత్తిన ఈ ఉదంతం వివరాలు ఇలా ఉన్నాయి..
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన కొండపల్లి శరత్ తండ్రి కొండపల్లి శంకరయ్యకు సర్వే నంబర్ 271/1ఏలో ఏడెకరాల భూమి ఉన్నది. 50 ఏండ్లుగా శరత్ తాత, తండ్రి సాగు చేసుకుంటున్నారు. అయితే భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా కొందరు రెవెన్యూ అధికారులు ఈ భూమిని మరొకరి పేరిట రికార్డుల్లోకి ఎక్కించారు. ఇది అక్రమం అంటూ శంకరయ్య కొడు కు శరత్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. తమ భూమి ఇతరుల పేరిట మారిందని, సరిచేయాలని అర్జీలు పెట్టుకున్నారు. అయినప్పటికీ ఫలితం లేదు. అధికారులు పట్టించుకోకపోవడంతో.. చివరకు తనకు జరిగిన అన్యాయాన్ని వీడియో రూపంలో ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేశారు. ఇది అందరికీ షేర్‌కావడంతోపాటు.. విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికికూడా వెళ్లింది. బుధవారం ఈ వీడియో చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. నేరుగా రైతుతో మాట్లాడారు. వెంటనే మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరిని రైతు ఇంటికి పంపించారు.

విచారణ.. రైతుకు న్యాయం.. సీఎం ఆదేశాలతో నందులపల్లిలో రైతు ఇంటికి వచ్చిన కల్టెకర్ భారతి హోళికేరి.. రికార్డులన్నింటినీ పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ధరణి వెబ్‌సైట్‌లో తనిఖీచేశారు. భూమి శరత్ తండ్రిదేనని, రెవెన్యూ సిబ్బంది పొరపాట్లవల్లే రికార్డులు తారుమారయ్యాయని గుర్తించారు. వెంటనే సీఎం సెక్రటరీ స్మితాసబర్వాల్‌తో మాట్లాడారు. రికార్డులను సవరించి.. రైతు కొండపల్లి శంకరయ్యకు భూమి పట్టా, 1బీ, పహాణీలతోపాటు.. వానకాలం పంట సీజన్‌లో రైతు నష్టపోయినదానికి పరిహారంగా అత్యవసర నిధుల నుంచి రూ.31,200 రైతుబంధు చెక్కును స్వయంగా కలెక్టర్ అందజేశారు. జరిగిన పొరపాట్లు, వాటిని సరిదిద్దేందుకు తీసుకున్న చర్యలపై బుధవారం సాయంత్రానికల్లా ప్రభుత్వానికి నివేదిక పంపించారు.
రెవెన్యూ అధికారుల సస్పెన్షన్ శంకరయ్య భూమిని వేరేవారి పేర్ల మీద నమోదుచేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పెద్దిరాజు, వీఆర్వో కరుణాకర్‌లను జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి సస్పెండ్ చేశారు. పేరు మార్పు సమయంలో అక్కడ పనిచేసిన తహసీల్దార్ రాజలింగుపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.
నయా ట్రెండ్ కేసీఆర్ సార్.. తమది చేతల ప్రభుత్వమని ఆచరణలో రుజువుచేశారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు. శరత్ అనే రైతు ఫేస్‌బుక్ పోస్టుకు ఆయన సత్వరమే స్పందించి, పరిష్కరించిన తీరుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం సమస్య పరిష్కరించడమేకాకుండా.. ఇటువంటి విషయాల్లో సామాన్య ప్రజలను ఎలా చైతన్యపర్చాలో కూడా చెప్పి రైతు శరత్‌లో స్ఫూర్తి నింపారు. ఇలాంటి సమస్యలపై గొంతెత్తాలని, సామాజిక సమస్యను తుదముట్టించేలా వ్యవహరించాలని.. ఒక్కటికావాలని చెప్తూ సీఎం మాట్లాడిన విధానం నిజంగా ప్రజల్లో చైతన్యం నింపేదిగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకు ఏ సీఎం ఇలా స్పందించలేదు.. ఇదొక నయా ట్రెండ్ అంటూ నెటిజన్లు అభినందనల్లో ముంచెత్తుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలోని సామాన్య రైతు బాధను అర్థం చేసుకునే హృదయం కేవలం స్వతహాగా రైతు అయిన సీఎంకే సాధ్యమైందని పలువురు పేర్కొన్నారు. అది కేసీఆర్‌కు ఉన్న గొప్పతనమని పోస్టులు పెట్టారు. రాజకీయాల్లో ఇది నయా ట్రెండ్‌గా మారుతుందని.. సామాన్యులకు కూడా ఇదొక భరోసాలా నిలుస్తుందని.. దీనికి సీఎం కేసీఆర్ ఆద్యులుగా నిలిచారని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా రైతు హృదయాన్ని అర్థంచేసుకోవాలంటే.. రైతుకే పాలనాపగ్గాలు అప్పగించాలని, అప్పుడే సమస్య తీవ్రత తెలుస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
దేశం చూస్తున్నది ఇలాంటి నాయకుడి కోసమే నాయకుడంటే జనంకోసం పనిచేసేవారని సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించారని, ఇలాంటి నాయకుడే కావాలని దేశం ఎదురుచూస్తున్నదని పలువురు అంటున్నారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించి, రైతుల జీవితాల్లో మార్పు తీసుకురాగలరనే నమ్మకం కేసీఆర్‌పై సర్వత్రా వ్యక్తమవుతున్నది. ప్రజల సమస్యలను.. ముఖ్యంగా అణగారిన, దళిత, వెనుకబడిన, కర్షక, కార్మికరంగాల్లోనివారి సమస్యలు అర్థంచేసుకున్నవారే.. స్పందించి పరిష్కరించేవారే దేశ రాజకీయాల్లోనూ కీలకపాత్ర పోషించాలని సమాజం ఆశిస్తున్నది. వాస్తవానికి తెలంగాణ వచ్చిన అనంతరం పాలనా బాధ్యతలు స్వీకరించిన సీఎం కేసీఆర్.. ప్రతి సమయంలోనూ వివిధవర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపట్ల సానుకూలంగా స్పందిస్తూ వస్తున్నారు. ప్రతి సమస్య పట్ల అవగాహన ఉన్న సీఎం కేసీఆర్.. ఆ సమస్య ఎలా తీరుతుందో ఆలోచించి ప్రణాళికవేసి.. పకడ్బందీగా అమలుచేస్తున్నారు. ఈ క్రమంలోనే విప్లవాత్మక పథకం రైతుబంధు అమలుద్వారా దేశ చరిత్రలో ఇటువంటి చర్య తీసుకున్న తొలి సీఎంగా వినుతికెక్కారు. రైతుబంధు పథకంతో దాదాపు 58 లక్షల మంది రైతులకు అవసరమైన పంట పెట్టుబడిని ఏడాదికి ఎకరానికి 8వేల చొప్పున అందిస్తున్నారు. దీనిని ఎకరానికి పదివేలకు పెంచనున్నారు. అంతేకాదు.. దేశంలోనే మొదటిసారి రైతుబీమా పథకాన్ని అమలుచేసి.. ఐదు లక్షలు ఇవ్వడం ద్వారా పెద్ద దిక్కు కోల్పోయిన సామాన్య రైతుల కుటుంబాల్లో దీపం పెడుతున్నారు. ఇక సాగునీటి విషయంలో ప్రణాళికల సంగతి చెప్పాల్సిన పనేలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు వంటి అద్భుతాలను యావత్‌దేశం సంభ్రమాశ్చర్యాలతో గమనిస్తున్నది.
మీ వెంట నేనుంటా నేను చేస్తున్నది ప్రజల్లో చైతన్యం తేవాలనే అవినీతిని అరికట్టేందుకు ధరణి వెబ్‌సైట్ రైతులందరి సమస్యల పరిష్కారానికి ఆలోచనలు రైతు శరత్‌తో సంభాషణల్లో ముఖ్యమంత్రి కేసీఆర్
శరత్‌తో సీఎం కేసీఆర్ మొదటి సంభాషణ: సీఎం : శరత్, ఏ ఊరు మీది? శరత్ : నందుపల్లి గ్రామం. నెన్నెల మండలం. వీఆర్వోకు డబ్బులు ఎందుకు ఇచ్చినవ్? వీఆర్వో ఎవరికి పట్టా చేసిండు? వాళ్లు హైదరాబాద్‌లో జాబ్ చేస్తరు. మీ ఊరోళ్లేనా? అవును సార్.. ఇరువైఏండ్ల కింద ఇక్కడే ఉండేవాళ్లు. ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదు. వాళ్లకు ఇక్కడ భూములు ఉన్నాయా? అవును సార్.. ఉన్నాయి. డబ్బులు ఇచ్చి పట్టాలు చేసుకున్నారా?v అవును సార్. డబ్బులు ఇచ్చి పట్టా చేసుకుండ్రు. మీకు ఎంత భూమి ఉంది? ఎక్కడిది? సార్.. మా తాత నుంచి మా నాన్నకు వారసత్వంగా వచ్చింది సార్. మీ సొంత భూమేనా? అవును సార్. 52 సంవత్సరాల నుంచి రికార్డులు మా పేరిట ఉన్నయ్. రెవెన్యూ భూప్రక్షాళన పేరుతో కార్యక్రమం చేస్తున్నం. మధ్యలో అసెంబ్లీ రద్దు, ఎన్నికల నేపథ్యంలో ఆ కార్యక్రమం ఆగింది. మీరు పెట్టిన వీడియోలో కొందరు నన్ను తిట్టారు. మీరు చూశారు కదా! అవును సార్, చూసిన. మీ గురించి నాకు తెలుసు సార్. ఫర్వాలేదు. తిట్టేవాళ్లు చాలామంది ఉంటరు. కుక్క మొరిగిందని భయపడం కదా! బాధకూడా పడం. కొన్ని కామెంట్లు చూసిన. పెద్దగా ఇబ్బంది ఏం కాదు. వాళ్లకు ఏదో అభిప్రాయం ఉంటుంది. ఎన్నో పార్టీలు ఉంటాయి. చేసే మంచిని మెచ్చుకోకుండా ఇలాంటివి చేస్తుంటారు. నెగెటివ్ ప్రచారం చేశారు. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? నందులపల్లిలో ఉన్నాను సార్. వ్యవసాయం చేసుకుంటా. పట్టా చేసుకున్నవాళ్లు మీ ఊరికి వచ్చారా? లేదు. రాలేదు సార్. కానీ రైతుబంధు డబ్బులు కూడా తీసుకున్నారు సార్. (నవ్వుతూ) రైతుబంధు డబ్బులు కూడా తీసుకున్నారా! ధరణి వెబ్‌సైట్ తెస్తున్నాం. జూన్‌లో వస్తుంది. రైతులకు తహసీల్దార్ కార్యాలయం వెళ్లే పని ఉండదు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న అవినీతిని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నం. పోస్ట్‌పెట్టి సంతోషపడి నీలాంటివాళ్లు ఊరుకోవద్దు. నీలాంటివాళ్లు చాలామంది బాధపడుతున్నారు. దీనిని కంట్రోల్ చేయాలంటే వ్యవస్థ మార్చాలి. ఒక శరత్ సమస్య పరిష్కారం అయితేనే కాదు కదా! ప్రజలందరి సమస్య. నువ్వు పోస్ట్ పెట్టినవ్. నోరులేని దళిత రైతులు, బీసీ రైతులు చెప్పుకోలేని వాళ్లు చాలామంది ఉన్నరు. అసలు అమ్మకాలు, కొనుగోళ్లు బంద్ చేద్దామనుకున్నం. అవును సార్. అసలు నీకు ఫోన్ చేసిన విషయం ఏమిటంటే.. కలెక్టర్‌ను పంపిస్తా. అవసరమైతే నా సెక్రటరీని పంపిస్తా. నీ సమస్య పరిష్కరిస్తా. వ్యవస్థలో మార్పురావాలంటే కఠినంగా వ్యవహరించాలి. అలా కఠినంగా వ్యవహరిస్తే కొందరు మళ్లీ కేసీఆర్‌దే తప్పు అని మాట్లాడుతరు. నెగెటివ్‌గాళ్లు కేసీఆర్‌పై ఓ రాయి వేయాలనుకుంటున్నరు. ప్రభుత్వం మంచి పనిచేస్తే మీబోటివాళ్లు సపోర్టు చేయాలి. అర్థం అయ్యింది సార్. నీ ఫోన్ నంబర్ ఉంది. నా పేరుమీద ఒక్క అప్లికేషన్ రాయి. నాకు పంపించు. కలెక్టర్‌తో మాట్లాడుత. నీ భూమి అన్యాయంగా వేరేవారికి పట్టా చేశారని దానిలో స్పష్టంగా రాయి. ఫ్యాక్స్ నంబర్ రాసుకో. నా రైతుబంధు డబ్బులు కూడా తీసుకున్నారు సార్.. నీ సమస్య ఖతం అయితది. ఒక్క నీ సమస్యే కాదు కదా. 60 లక్షల మంది రైతులున్నారు. అందరు రైతుల బాధ నా బాధ కదా! ఫ్యాక్స్ నంబర్ రాసుకో.. 08454244446. నాకు వచ్చినంక మీ కలెక్టర్‌కు పంపుతా. మా సెక్రటరీకి కూడా చెప్తా. స్మితాసబర్వాల్. ఆమె న్యాయంగా పనిచేస్తరు. నేను మళ్లీ టచ్‌లో ఉంట. మీరు ఎక్కడివాళ్లు అక్కడే ఉండకుండా చైతన్యవంతంగా ఉండాలి. గుడ్‌లక్. థ్యాంక్యూ సర్
శరత్‌తో సీఎం కేసీఆర్ రెండో సంభాషణ.. సీఎం : శరత్.. మీ కలెక్టర్‌గారితో, స్మితాసబర్వాల్‌గారితో మాట్లాడిన. మీకు ఫ్యాక్స్ చేసే సౌకర్యం ఉందా? శరత్ : వేరే ఊరికి (బెల్లంపల్లి) వెళ్లాలి సార్. 20 కిలోమీటర్లు ఉంటుంది. అంతదూరం వెళ్లకు. నాకు సైట్‌లో పెట్టు. నేను తీసుకుంట. కలెక్టర్ వస్తరు. సమస్య పరిష్కారమవుతుంది. థ్యాంక్యూ సార్. థ్యాంక్యూ చెప్పి ఊరికే ఉండొద్దు. మళ్లీ పోస్ట్ పెట్టాలి. ముఖ్యమంత్రిగారు నాతో మాట్లాడారు. యుద్ధంలాగా చేయాలి.. అరాచకాలు అరికట్టాలి.. అనే పోస్ట్‌కూడా పెట్టాలి. తప్పకుండా పెడతాను సార్. పార్లమెంటు, జిల్లాపరిషత్ ఎన్నికలు కాగానే ధరణి వెబ్‌సైట్ చేస్తాం. జూన్ తర్వాత రైతుల బాధ పోతుంది. అప్పుడు మీలాంటివాళ్లు పడుకోవద్దు. ప్రజలకోసం చేసే పనికోసం అందరూ ఒక్కటికావాలి. సామాజిక సమస్య నోటిమాటతో పోదు. సమాజం అంతా ఒక్కటి కావాలి. పంచాయతీరాజ్ చట్టం తెచ్చిన. చాలా కఠినంగా ఉంది. జూన్ తర్వాత మీరే చూస్తారు. పనిచేయకపోతే వేలమంది సర్పంచులు ఎగిరిపోతరు. టీఆర్‌ఎస్ వాళ్లు అయితే ముందు వాళ్లనే తీసేయమని చెప్పిన. అవును సార్ పేపర్లలో చూసిన. నువ్వు పెట్టిన పోస్టులో కొందరు నన్ను తిట్టిండ్రు. వారికి సత్తా, కత్తా? పోస్ట్ పెట్టడం సమస్య కాదు. దీని తరువాత పెట్టు. స్పందించేవాళ్లని గుర్తించే తెలివి ఉండాలి అని పెట్టు. సారు.. వీఆర్వో ఇంత ఘోరంగా మోసం చేశాడు. ఎలాంటి శిక్ష లేదా సార్! ఉంటది. ఖచ్చితంగా. మధ్యాహ్నంవరకు కలెక్టర్ మీ ఊరికి వస్తరు. ఒక్క వీఆర్వో కాదు. నీకు ఒక్కడి బాధ అనిపిస్తున్నది.. ఇలాంటివి చాలా ఉన్నాయ్. ఈ బాధలు అన్నీ పోవాలె. నా స్టేట్‌లోనే ప్రభుత్వం తరఫున ప్రచారం చేయాలె. నీకు టచ్‌లో ఉంటా.