Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతు కోసం.. మోదీపై మహా సంగ్రామం

-యాసంగి వడ్లు కొనాల్సిందే: కేంద్రానికి కేసీఆర్‌ 24 గంటల డెడ్‌లైన్‌
-వడ్లు కొనాలని వస్తే అవమానిస్తరా?
-దేశానికి అన్నం పెట్టడమే రైతుల నేరమా?
-ప్రజలు నూకలు తినాలనటం మర్యాదేనా?
-పీయూష్‌ గోల్‌మాల్‌వి అర్థం లేని మాటలు
-వడ్లు కొనిపిస్తమన్న కిషన్‌, బండి ఎక్కడ?
-సిగ్గులేకుండా ధర్నాలా?: సీఎం కేసీఆర్‌ ఫైర్‌

రైతుల కోసం మేం ఢిల్లీకి వస్తే, బీజేపీ నాయకులు హైదరాబాద్‌లో ధర్నా చేస్తున్నరు. బీజేపీ ధర్నా ఎందుకు? వరి పంట వేస్తే కేంద్రంతో కొనిపిస్తామన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఇప్పడు ఎక్కడున్నారో ఆచూకీ లేదు. ఆ పార్టీ నాయకులు సిగ్గుపడాలి. తెలంగాణ ప్రభుత్వం రైతులను గంగలోకి నెట్టే బలహీన ప్రభుత్వం కాదు. మా ప్రాణాలు పోయినా అలా జరగనివ్వం. మా రైతులను రక్షించుకుంటాం.
– కేసీఆర్‌

ఏడున్నర దశాబ్దాల చరిత్రలో రాజధాని ఢిల్లీ ఇలాంటి సన్నివేశాన్ని ఎన్నడూ చూసి ఎరుగదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యమంత్రి సహా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు.. సమస్త యంత్రాంగం.. 2000 కిలోమీటర్లకు పైగా తరలివచ్చి.. నినదించిన సందర్భం మునుపెన్నడూ తెలియనిది. తమ రైతులకు జరుగుతున్న తీరని అన్యాయంపై ఎర్రకోటే అదురుపాటుకు గురయ్యేలా ఒక సమాజం నుంచి పెల్లుబికిన ఆక్రోశం.. ఆవేశం ఉత్తరాదికెన్నడూ అనుభవంలోకి రాలేదు.

వడ్ల కంకిని గడ్డిపోచలా భావించిన బీజేపీ పాలకుల పాలిట ఆ గడ్డిపోచే బ్రహ్మాస్త్రమై దిగ్బంధం చేసింది. యాసంగి ధాన్యం కొనుగోలు కోసం ఏడాదికాలంగా టీఆర్‌ఎస్‌ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన చేస్తున్న పోరాటం ఢిల్లీ వీధులను దద్దరిల్లేలా చేసింది. రైతులతో పెట్టుకొంటే ఏమవుతుందో ఇప్పటికే చవిచూసిన ‘మాఫియోంకా సౌదాగర్‌’ మోదీకి తెలంగాణ రైతు రణన్నినాదం చేస్తే ఇంకెంత తీవ్రంగా ఉంటుందో రుచి చూపించింది.

ఇంత జరిగాక కూడా 7 లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధానికి కనికరం కలుగలేదు.. ఆగమేఘాల మీద తెలంగాణ సమాజపు వినతిని తృణీకరించేశారు. ఇక మిగిలిన ప్రత్యామ్నాయమల్లా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నట్టు మహాసంగ్రామమే.

ప్రధాని క్షమాపణలు చెప్పడంలో దిట్ట
భవిష్యత్తులో కూడా క్షమాపణ చెప్తారేమో
కొత్త వ్యవసాయ విధానం రావాల్సిందే
మీతో కాకపోతే భవిష్యత్తులో దించేస్తం
నూతన ప్రభుత్వంతోనైనా రూపొందిస్తం
మా ఓట్లు, సీట్లు కావాలి.. ధాన్యం వద్దా?

మోదీకి రైతు ఉద్యమాలను అవమానించడం కొత్తేమీ కాదు. రాకేశ్‌ టికాయిత్‌ ఉద్యమం చేస్తే చివరకు సాగు చట్టాలను వెనకుతీసుకొని మోదీ క్షమాపణ చెప్పారు. ‘మాఫియోంకా సౌదాగర్‌ మోదీ’. తెలంగాణ వడ్ల సేకరణలో ద్వంద్వ విధానాలపైనా క్షమాపణ చెప్పే రోజు వస్తది.

కార్పొరేట్లకు వ్యవసాయం కట్టబెట్టే కుట్ర
రైతుకు రక్షణ లభించేదాకా పోరాటమే
కలిసొచ్చేవారితో దేశంలో భూకంపమే
పీయూష్‌ గోల్‌మాల్‌ పరుగెత్తాల్సిందే
బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతామంటున్నారు. ఎవరిని జైలుకు పంపుతరు. దమ్ముంటే జైల్లో పెట్టండి. ప్రతిపక్ష నాయకులపై సీబీఐ, ఈడీ, ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ను ప్రయోగిస్తున్నారు. మీ పార్టీలో అంతా సత్యహరిశ్చంద్రులు, సత్యహరిశ్చంద్రుని సోదరులే. ఒక్క నాయకుడిపై ఈడీ, సీబీఐ దాడులు ఉండవేం.

రాష్ట్రంలో చేయాల్సినంత చేసుకున్నాం
ఇక భారతదేశం కోసం బయలుదేరాం
కుట్రల కుంభస్థలాన్ని బద్దలుకొడతాం

ఢిల్లీ నిరసన దీక్షలో కేసీఆర్‌ హెచ్చరిక
ప్రధాని మోదీ ఎవరితోనైనా పెట్టుకో. కానీ, రైతులతో పెట్టుకోకు. దేశ చరిత్రను ఒకసారి చూడు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేకపోయింది. రైతు కంట కన్నీళ్లు వస్తే అది రాజ్యానికి మంచిది కాదు. మీరు, మీ మంత్రివర్గం దేశ రైతాంగం పట్ల వ్యవహరిస్తున్న తీరు బాగాలేదు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎవ్వరితోనైనా పెట్టుకోవచ్చు కానీ, రైతులతో పెట్టుకోవద్దు.. వారి జీవితాలతో చెలగాటం మంచిది కాదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రంగా హెచ్చరించారు. ‘దేశ చరిత్రను ఒకసారి చూడండి.. రైతులతో పెట్టుకొన్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేకపోయింది. రైతు కంట కన్నీళ్లు వస్తే అది రాజ్యానికి మంచిది కాదు. మీరు, మీ మంత్రివర్గ సహచరులు దేశ రైతాంగం పట్ల వ్యవహరిస్తున్న తీరు బాగాలేదు. చాలా నీచంగా, దారుణంగా ఉన్నది. ఇది మీకు సమంజసం కాదు’ అని హితవు పలికారు. ఇప్పటికే రైతు వ్యతిరేక సాగు చట్టాలను తీసుకొచ్చి భంగపడ్డారని, వాటిని వెనుకకు తీసుకొని రైతాంగానికి క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు.

తెలంగాణలో యాసంగి వడ్ల సేకరణ విధానం సరిగాలేదని ఇక్కడి రైతులకు సైతం మోదీ క్షమాపణ చెప్పాల్సి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం 24 గంటల్లోగా తెలంగాణ రైతుల నుంచి ధాన్యం సేకరణకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాచరణను రూపొందిస్తాయని ప్రకటించారు. దేశానికి ఇప్పటి వరకు సమగ్ర వ్యవసాయ విధానం లేకపోవడం దారుణమని, సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించాలని డిమాండ్‌చేశారు. కేంద్రం తెలంగాణ రైతుల నుంచి ధాన్యం సేకరించాలని, జాతీయ స్థాయిలో ఒకే విధమైన ప్రొక్యూర్‌మెంట్‌ విధానం ఉండాలని కోరుతూ సోమవారం ఇక్కడ ఢిల్లీలోని తెలంగాణభవన్‌ ఆవరణలో టీఆర్‌ఎస్‌ నిర్వహించిన నిరసన దీక్ష రాజధానిని దద్దరిల్లేలా చేసింది. దేశ చరిత్రలోనే యావత్‌ రాష్ట్ర ప్రభుత్వం రెండువేల కిలోమీటర్లకు పైగా తరలివచ్చి నిరసన తెలిపిన మొట్టమొదటి సందర్భం ఇది. ఈ ధర్నాలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

మా శక్తి ఏమిటో చూపిస్తాం
దేశ చరిత్రను ఒకసారి చూడు.. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనగడ సాగించలేకపోయింది. రైతు కంట కన్నీళ్లు వస్తే అది రాజ్యానికి మంచిది కాదు. మీరు, మీ మంత్రివర్గ సహచరులు రైతాంగం పట్ల వ్యవహరిస్తున్న తీరు బాగోలేదు. చాలా నీచంగా, దారుణంగా ఉన్నది. ఇది మీకు మంచిది కాదు. మా రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వద్దకు వస్తే.. తెలంగాణ ప్రజలకు నూకలు తినడం నేర్పించండి అంటూ అవమానకరంగా మాట్లాడారు. ఇది ఎంతమాత్రం మర్యాద కాదు. పీయూష్‌ గోయల్‌ కాదు.. పీయూష్‌ గోల్‌మాల్‌. ఉల్టా మాట్లాడితే చెల్లుతుందనుకుంటున్నారు. మమ్మల్ని బానిసలకన్నా దారుణంగా చూశారు. ఇదే భారత ప్రభుత్వ విధానమా? న్యాయ సమ్మతమైన డిమాండ్‌తో వచ్చిన వారి పట్ల ఇలా వ్యవహరిస్తారా? మేం దీన్ని ఉపేక్షించబోం. తగిన విధంగా బదులిస్తాం. మా రైతుల సంఘటిత శక్తి ఎలాంటిదో చూపిస్తాం. అసలు పీయూష్‌ గోయల్‌కు దేశంపై ఉన్న అవగాహన ఏపాటిదో అర్థం కావడంలేదు. ఆయన అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారు.

24 గంటలు టైమిస్తున్నా..
మెల్లమెల్లగా దేశం మీ తీరును అర్థం చేసుకొన్నది. ఇక దేశం మౌనంగా ఉండదు. తెలంగాణలో మేం చేసుకోవాల్సినంత చేసుకొన్నాం. ఇక భారతదేశం కోసం పనిచేయాల్సిఉన్నది. మేము బయలుదేరాం. రెండు చేతులు జోడించి ప్రధానమంత్రిని, పీయూష్‌ గోయల్‌ని మరోసారి అభ్యర్థిస్తున్నా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ధాన్యాన్ని ఎలా కొంటున్నారో, తెలంగాణలో కూడా అలాగే కొనండి. మీ నుంచి వచ్చే నిర్ణయం కోసం 24 గంటలపాటు వేచిచూస్తాం. తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్ట ప్రకటన రావాలి. లేకపోతే తాము సమగ్ర కార్యాచరణ రూపొందిస్తాం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు నేను చేసే విన్నపం ఒకటే. రైతుల జీవితాలతో ఆడుకోవద్దు.

ధాన్యం కొనాలని ప్రధాని ఆదేశిస్తే మంచిది. లేకపోయినా పర్లేదు. మేమంత బీదవాళ్లం కాదు. ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతాం. నేడో రేపో ఓ నిర్ణయం తీసుకుంటాం. తర్వాత వీరి వెంట పడతాం. దేశ రైతు ప్రయోజనాలను పరిరక్షించేందుకు మేము పోరాడుతూనే ఉంటాం. ఏం చేయాలో మాకు తెలుసు. ఏం చేయాలో అది చేస్తాం. దాని తర్వాత మీ వెంట పడతాం. రాష్ట్రంలో పనులను అప్పగించి నేను దేశం కోసం బయలుదేరుతా. ఇక చూడండి ఏం జరుగుతుందో. విషయం ఎక్కడి నుంచి ఎందాకా వెళ్తుందో.

రైతు ఉద్యమాలను అవమానించడం మోదీ సర్కారుకు కొత్త కాదు
కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి రైతు ఉద్యమాలను అవమానించడం, రైతులను అవమానించడం కొత్తేమీ కాదు. రాకేశ్‌ టికాయిత్‌ ఉద్యమం చేసినపుడు ఆయనతో ఉన్న రైతులను ఖలిస్థాన్‌, పాకిస్థాన్‌ టెర్రరిస్టులతో పోల్చారు. 13 నెలలపాటు ఉద్యమం జరిగితే రోజుకోవిధమైన ఆరోపణలు చేశారు. చివరకు తాము చేసిన నల్ల చట్టాలను వెనకుతీసుకొని ఉద్యమాలు చేసిన రైతులకు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ క్షమాపణలు చెప్పారు. ‘మాఫియోంకా సౌదాగర్‌ నరేంద్రమోదీ’. తెలంగాణ వడ్ల సేకరణలో అవలంబిస్తున్న ద్వంద్వ విధానాలపైనా క్షమాపణ చెప్పే రోజు వస్తుంది. దేశరైతులు తమ హకులు అడుగుతున్నారు. బిచ్చం అడగటం లేదు. వాళ్లేమీ బిచ్చగాళ్లు కాదు. దేశానికి సమగ్ర నూతన వ్యవసాయ విధానం ఉండాలి. దీనికోసం పోరాటం చేస్తాం. పంట పండించడమే పాపమా? మీరు ఎవరినైనా అవహేళన చేయండి. కానీ రైతులను చేయవద్దని మోదీని హెచ్చరిస్తున్నా.

ధన్‌ నహీ.. యా మన్‌ నహీ
ఇంత పెద్ద కేంద్ర ప్రభుత్వం, పెద్ద మాటలు మాట్లాడే ప్రధానమంత్రికి చిన్న రాష్ట్రమైన తెలంగాణ రైతులు పండించిన పంటను కొనేందుకు డబ్బులు లేవా? లేదా నరేంద్ర మోదీకి మనసు లేదా? తెలంగాణలో మీకు ఓట్లు కావాలి. కానీ ధాన్యం వద్దా? తెలంగాణలో సీట్లు కావాలి. కానీ ధాన్యం వద్దా. ఇదేనా మీ రాజనీతి? ఇది మీరు అమలుపరిచే కుట్ర. ధాన్యం కొనాలని గొంతెత్తితే, దీనికి ప్రతిగా హైదరాబాద్‌లో బీజేపీ నాయకులు ధర్నా చేస్తున్నరు. మీకు సిగ్గుండాలి. ఇకపై ఈ కుట్రలు దేశంలో నడవవు. మేం ఇవాళో, రేపో ఇక్కడినుంచి వెళ్తాం. ఈ సమస్యకు సమాధానం వెతుకుతాం. తిరిగి వచ్చి ఢిల్లీలోనే కూర్చుంటాం. సర్కారు విధానమేంటో తేలుస్తాం. రాజకీయ నాయకులందరినీ ఏకంచేస్తాం. ఈ దేశ రైతులకు రాజ్యాంగపరంగా మద్దతు ధర లభించేదాకా చివరి రక్తపు బొట్టువరకు పోరాడుతూనే ఉంటాం.

మాతో కలిసి వచ్చే ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు రాకేశ్‌ టికాయిత్‌కు వెన్నంటి ఉంటాం. వీరందరి సహకారంతో దేశంలో భూకంపం సృష్టిస్తాం. ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. ఈ దేశ ప్రజలు బికారీలు కాదు. అడుక్కోవడం లేదు.. రైతులు వారి హక్కులు కోరుతున్నారు. ఒక కొత్త వ్యవసాయ విధానాన్ని రూపొందించాలని మరోసారి ప్రధానమంత్రిని కోరుతున్నా. మేము కూడా సహకరిస్తాం. ఒకవేళ మీతో కాకపోతే, భవిష్యత్తులో మిమ్మల్ని తొలిగించి, కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వంతోనైనా భారతదేశ సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించి, అమలయ్యేలా చేస్తాం. తెలంగాణ యుద్ధానికి బయలుదేరితే, అంతిమ విజయం చేకూరేదాకా విశ్రమించదు. ఈ రోజు దాదాపు 2000 కిలోమీటర్ల నుంచి మండే ఎండలో తెలంగాణ ప్రజాప్రతినిధులు, రైతుబంధువులు, రైతుసంఘాల ప్రతినిధులు ఢిల్లీకి ఎందుకు రావాల్సి వచ్చింది? వారిని ప్రభావితం చేసిందేమిటి? తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు?

కార్పొరేట్లకు వ్యవసాయం కట్టబెట్టే కుట్ర
కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యవసాయరంగాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేయాలనే విధానంతో సాగుతున్నదనే విషయాన్ని నేను దేశ రైతులకు చెప్పదల్చుకున్నా. రైతులు తమ భూములను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించి, అవే భూముల్లో వారు పనిచేయాలని కేంద్రం భావిస్తున్నది. కేంద్రం విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు పెట్టాలంటున్నది. మీటర్లు పెట్టండి. రక్తాన్ని పీల్చండి. ఇదేనా దేశాన్ని నడిపించే విధానం? విద్యుత్తు సంస్కరణల పేరుతో రైతులను కేంద్రం మోసం చేస్తున్నది.

బీజేపీ నాయకులు సిగ్గుపడాలి
అందరు ప్రజాప్రతినిధులు రైతుల కోసం ఢిల్లీకి వస్తే, కుట్రపూరితంగా బీజెపి వారు హైదరాబాద్‌లో ధర్నా చేస్తున్నారు. చూడండి ఇది ఎంత అసహ్యకరమైన విషయం. ఎందుకు ధర్నాలు చేస్తున్నారు ? కొంచమైనా సిగ్గు తెచ్చుకోండి. మేం అంత బలహీనులం కాదనే విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను. తెలంగాణ ప్రభుత్వం రైతులను గంగలోకి నెట్టేంత బలహీన ప్రభుత్వం కాదు. అలా జరగదు. మా ప్రాణాలుపోయినా అలా జరగనివ్వం. మా రైతులను రక్షించుకుంటాం. కానీ కేంద్ర నాయకులు ఎక్కడెక్కడ ఎలాంటి వ్యవహారాలను నడుపుతున్నారో దేశ మొత్తానికి తెలియాలి. రైతుల విషయంలో కేంద్ర వైఖరేంటో రాకేశ్‌ టికాయిత్‌ వాస్తవాలను తెలిపారు. ఈ ప్రభుత్వం కుట్రల ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు.

పంట మార్పిడి గురించి ఎప్పుడో రైతులకు చెప్పాం..
కేంద్ర ప్రభుత్వం తీరు తెలిసిన తర్వాత.. ఇక తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనేందుకు కిరికిరి పెడుతున్నదనే తెలంగాణలో పంట మార్పిడిని ప్రోత్సహించాం. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు.. ఇతర ప్రజాప్రతినిధులు రైతులను పంట మార్పిడి వైపు ప్రోత్సహించారు. అనేక అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశాం. మార్పు ఒక రోజుతో రాదు.. ప్రయత్న లోపం లేకుండా పనిచేస్తూనే ఉన్నాం. తెలంగాణ రైతాంగాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. రైతులను కాపాడుకుంటాం

తెలంగాణ గోసే వేరు
మా తెలంగాణ రాష్ట్రం కథ వేరే. ఒకనాడు కేంద్రం మా తెలంగాణ ప్రాంతాన్ని బలవంతంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన తర్వాత ఎన్నో బాధలు పడాల్సి వచ్చింది. మా కోసం చేపట్టిన ప్రాజెక్టుల ప్రయోజనాలు మాకు దక్కలేదు. ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులను దశాబ్దాల దాకా నిలిపివేశారు. కాలువలు, చెరువుల ద్వారా నీరు లభించకపోవటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో భూగర్భ నీటి వనరులపై ఆధారపడ్డాం. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో పెద్ద సంఖ్యలో 30 లక్షల బోర్‌వెల్స్‌ ఉన్నాయి. తెలంగాణ రైతులు తమ రక్తం, చెమట చిందించి వీటిని తవ్వించుకున్నారు. దీంతో నీరు అడుగంటి పోయి 800 ఫీట్లు, 900 ఫీట్లు, 1000 ఫీట్లకు చేరింది. కరెంటు 5, 6 గంటలు కూడా సరిగా రాదు. రైతులు ఇక ఏం చేయాలి ? మహబూబ్‌నగర్‌ అనే జిల్లా నుండి 20 లక్షల మంది పొట్ట చేతబట్టుకొని దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వలస పోయారు. ఇది మా దుఃఖం. వ్యవసాయం చేసే రైతులు వలసపోవడంతో ఈ రంగం పై ఆధారపడ్డ ప్రజలు కూడా ఛిన్నాభిన్నమయ్యారు. తెలంగాణ తెచ్చుకొని అధికారం చేపట్టిన నాటినుంచి ప్రభుత్వం వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. రాష్ట్రంలో ఉన్న గ్రామాల్లో 46 వేల జలాశయాలను నీటితో నింపాం.

దేశం మొత్తం గందరగోళంలో ఉన్నది
దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం ఉన్నది. గుజరాత్‌ రైతులు కరెంటు కోసం డిమాండ్‌ చేస్తూ రోడ్డునపడ్డారు. తెలంగాణలో మాత్రమే అన్ని వర్గాల ప్రజలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు అందుతున్నదని గర్వంగా చెప్తున్నాను. రాకేష్‌ టికాయిత్‌గారు చెప్పినట్టు దేశవ్యాప్తంగా 24 గంటల కరెంటును అందించేది కేవలం తెలంగాణ మాత్రమే. మా జలాశయాలు నిండాయి. విద్యుత్తు సమస్య తీరింది. 30 లక్షల బోర్లు పనిచేస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డ మరుక్షణం నుంచే రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. అవన్నీ సత్ఫలితాలు ఇచ్చాయి. అందుకే ఇప్పుడు తెలంగాణ దేశంలోనే ధాన్యం పండించడంలో అగ్రస్థానంలో నిలిచింది.

రాకేశ్‌ టికాయిత్‌కు మద్దతు
మా సోదరుడు రాకేశ్‌ టికాయిత్‌ దేశంలో త్వరలోనే రైతుల మహాసంగ్రామం ప్రారంభమవుతుందని చెప్తున్నారు. వారి మాటలను స్వాగతిస్తున్నా. యావత్‌ తెలంగాణ ప్రజలు, రైతులు ఏకమై టికాయిత్‌ వెంట నిలబడుతారు. మహాసంగ్రామం ప్రారంభం కావాల్సి ఉన్నది. నేను మిమ్మల్ని అభినందిస్తున్నా. శుభాకాంక్షలు తెలుపుతున్నా. టికాయత్‌ అన్నట్టు రైతులకు విద్యుత్తు ఉచితంగా అందించాలి. 1978, 1980వ దశకంలో నేను యూత్‌ లీడర్‌గా ఉన్నప్పుడు మహేంద్రసింగ్‌ టికాయిత్‌ ఒక్క పిలుపుతో లక్షలమంది రైతులను సమీకరించేవారు. కిసాన్‌ర్యాలీలు చేపట్టేవారు. ఆయన గొప్ప నాయకుడు. రాకేశ్‌ టికాయిత్‌ వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. దేశ రైతుల పక్షాన నిలబడుతున్నందుకు మీరంటే మాకు ఎంతో గౌరవం. రైతుల కోసం పోరాడేవారి పక్షాన వారు నిలబడాలి.

దమ్ముంటే జైల్లో పెట్టు
బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతామంటున్నారు. దమ్ముంటే జైల్లో పెట్టండి. రైతులను గందరగోళపరిచే, అపహాస్యం చేసే విధానాలు ఇక నడవవు. దీనికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని అవమానిస్తు న్నారు. అణచివేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులపై సీబీఐ, ఈడీ, ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ను ప్రయోగిస్తున్నారు. వీరి పార్టీ (బీజేపీ)లో మాత్రం అందరూ సత్య హరిశ్చంద్రులు, సత్య హరిశ్చంద్రుని సోదరులే. అందరూ సచ్ఛీలురే. ఒక్క నాయకుడిపై ఈడీ, సీబీఐ దాడులు ఉండవు. వీరికి వ్యతిరేకంగా ప్రశ్నలు లేవనెత్తితే ప్రతిరాష్ట్రంలో తమాషా చేస్తున్నరు. కేసీఆర్‌పై కూడా ఇలాంటి దాడులు తప్పవని బీజేపీలోని కొంతమంది చెప్తున్నారు. కేసీఆర్‌ను ముట్టుకొనే దమ్ముం దా? ముట్టుకొని చూడండి. ఎవరిని జైలుకు పంపుతారు? దమ్ముంటే రమ్మని నేనన్నా. ప్రతి రాష్ట్రంలో వీళ్ల పార్టీ నేతలు ముఖ్యమంత్రిని జైలుకు పంపుతామని మొరుగుతున్నారు. దేశం మీ కుట్రలను అర్థం చేసుకున్నది. నేను స్పష్టంగా చెప్తున్నా.. మీరు నడుపుతున్నది జనతంత్ర రాజ్‌ (ప్రజాస్వామ్య) కాదు, షడ్‌యంత్‌ (కుట్రపూరిత) రాజ్‌.

రాజకీయాలపై మళ్లీ వస్తా
ఇప్పుడు మేము ధాన్యం సమస్యపై మాత్రమే మాట్లాడుతున్నాం. రైతుల సమస్యలపై మాత్రమే మాట్లాడుతున్నాం. నేను మళ్లీ ఢిల్లీ వచ్చి రాజకీయం చేస్తా. కేంద్ర ప్రభుత్వ కుట్రలేందో, కథేందో చెప్పి వీళ్ల కుంభస్థలాన్ని బద్దలుకొడతాం. ఢిల్లీ వచ్చి స్నేహితులు, శేయోభిలాషులను సమీకరించి వీరి వ్యవహారం ఏమిటో తేలుస్తాం. రాష్ట్రపతి ఎన్నికల సమయం కూడా వచ్చింది. కేంద్రం విధానాలపై త్వరలో పూర్తిగా మాట్లాడుతా. కేంద్ర ప్రభుత్వం వెంటపడతాం. టీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ ఒక పనిని మొదలు పెట్టారంటే విజయాన్ని ముద్దాడేవరకు వదిలిపెట్టరు. మేం రైతుల అంశాన్ని ఎత్తుకున్నాం. రైతులకు న్యాయంచేసే వరకు విశ్రమించేది లేదు. ప్రస్తుతం రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీలో దీక్ష చేస్తున్నాం. తెలంగాణ రైతులు ఇప్పుడు ఢిల్లీకి కదిలి వచ్చారు. ఇక దేశ రైతాంగం కదిలిరావాలి. రైతుల తరఫున ఢిల్లీలో సమగ్ర ఆందోళనలకు శ్రీకారం చుడుతాం. రైతులకు అనుకూలమైన చట్టాలు వచ్చేవరకు.. రక్షణ వచ్చే వరకు పోరాటం చేస్తాం. జాతీయ స్థాయిలో కలిసి వచ్చే రాజకీయ, ప్రజా, రైతు సంఘాలతో కలిసి పనిచేస్తాం. భూకంపం సృష్టిస్తాం.

రెచ్చగొట్టారు.. రచ్చ చేస్తున్నారు..
మా రైతులు ధాన్యం పండించారు. ధాన్యం కొనమంటే రచ్చరచ్చ చేస్తున్నారు. కేంద్రం పంట మార్పిడి పద్ధతిని అమలుచేయమన్నది. మేము కూడా పంటమార్పిడి చేయమని రైతులను కోరాం. మంత్రుల, ఎమ్మెల్యేలు, గ్రామసర్పంచ్‌లు కూడా పంటమార్పిడి చేయమని రైతులను కోరారు. కానీ వీరి పార్టీకే చెందిన కేంద్ర క్యాబినెట్‌ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. వరి పంట వేయాలని రైతులను పురికొల్పారు. ముఖ్యమంత్రి మాటలను పట్టించుకోకండి అని చెప్పారు. కిషన్‌రెడ్డి ప్రతి గింజ కొంటామని చెప్పారు. వారిప్పుడు ఎక్కడున్నారో ఆచూకీ తెలియడం లేదు.

పీయూష్‌ నీకు ఎందుకంత అహంకారం
తెలంగాణ ఏం అద్భుతం చేసిందని పీయూష్‌ గోయల్‌ అంటున్నారు. అవును తెలంగాణ అద్భుతమే చేసింది. మీరు అర్థం చేసుకోలేకపోతే మేమేం చేయగలం? మా పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు రాజ్యసభలో ప్రశ్నలు లేవనెత్తితే మీరు నా సమజ్‌ (తెలివి తక్కువవాళ్లు) అని గోయల్‌ ఎద్దేవాచేశారు. ఎవరు నా సమజ్‌.. పీయూష్‌ గోయలా? కేశవరావా? ఇంత అహంకారం ఎక్కడినుంచి వచ్చింది మీకు? ఎందుకలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నా. తెలంగాణలో అద్భుతం ఆవిష్కృతమైంది. 2014 తో పోల్చి చూస్తే 2022 నాటికి నీటిపారుదలరంగంలో కోటి ఎకరాల పెరుగుదల నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఎనిమిదేండ్లలో ఇంత పెద్ద స్థాయిలో రైతులు పంటలు పండిస్తున్నారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇకడి రైతులను మెచ్చుకోవాలి. కానీ, దురదృష్టం.. మన ప్రధానమంత్రి ప్రతీది రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. మమ్మల్ని దోషుల్ని చేస్తున్నారు. పంట పండించడమే నేరమా? ఈ దేశానికి అన్నం పెట్టడమే పాపమా? మీకేం పని పాట లేదా అని గోయల్‌ అంటారు? ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తారు. ఆఫీసుకు వెళ్తే మంత్రులను 3 గంటలపాటు వేచి ఉండేలా చేస్తారు. వారు తిరిగి వెళ్ళిపోయి బద్నాం కావాలని ఆయన కుట్ర. ఇదెక్కడి రాజనీతి ? మా ఎంపీలందరూ వెళితే, ఎంపీలతో కూడా ఇదే వ్యవహారశైలి. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే తీరు ఇదేనా? ఇది నడవదు. ఇదే కాదు ఇంకా చాలా మా మనస్సులో ఉన్నది. యావత్‌ దేశ ప్రజల హృదయాల్లో రగులుతున్న అగ్ని జ్వాల మా హృదయంలో కూడా రగులుతున్నది. ఈ అగ్నిజ్వాల వ్యాపిస్తుంది. మిమ్మల్ని నాశనం చేసేవరకు వదలదు. పీయూష్‌ గోల్‌మాల్‌ లాంటివారు పరుగెత్తుతూ, పరుగెత్తుతూ కనిపిస్తారు. మేం చాలా చూశాం. హిట్లర్‌ పోయాడు. నెపోలియన్‌ పోయాడు. ముస్సోలినీ పోయాడు. వీళ్ళెంత. వీరేమైనా వెయ్యేండ్లు పాలించేందుకు వచ్చారా. ఇక్కడ ఎవరు శాశ్వతం?

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.