Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతు సమితులు విప్లవాత్మకం

-సేద్యం దండుగ కాదు.. పండుగ -రైతుల సంఘటితం కోసమే సమితులు -వీటికోసం రాష్ట్రవ్యాప్తంగా 2600 భవనాలు -అవసరమైతే రాష్ట్ర సమితి నిధి పెంపు -అర్హులైన రైతులందరికీ పెట్టుబడి -అందుకోసమే భూ రికార్డుల ప్రక్షాళన -టీఆర్‌ఎస్ వెంటే రైతులు.. సమితుల్లోనూ వారే -ఆదర్శరైతుల పేరిట దోచుకున్న ఘనత కాంగ్రెస్‌దే -కాంగ్రెస్ పాపాలు కడిగేందుకు శ్రమిస్తున్నాం -రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో రైతు సమితులను ఏర్పాటు చేయటం దేశంలోనే విప్లవాత్మక చర్య. దుక్కిదున్ని పంట పండించే రైతే ధర నిర్ణయించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అప్పుల ఊబిలో నుంచి బయటపడి రైతు ఆత్మగౌరవంతో బతుకాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. సస్యశ్యామల, ఆత్మగౌరవ తెలంగాణ సాధించటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయం. ఇందుకోసమే రాష్ట్రంలో రైతు సమన్వయసమితులు, భూరికార్డుల ప్రక్షాళన, ప్రాజెక్టుల రీడిజైనింగ్ వంటి కార్యక్రమాలను చేపట్టాం. అని రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

తెలంగాణను రైతు శ్రేయోరాజ్యంగా తీర్చిదిద్దటమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాతోపాటు జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో బుధవారం వేర్వేరుగా నిర్వహించిన రైతు సమన్వయసమితుల శిక్షణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మూడేండ్ల వ్యవధిలో తెలంగాణలో ఏం మార్పు వచ్చిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో రైతులు కరెంటు కోసం సబ్‌స్టేషన్లను ధ్వంసం చేశారని, రోడ్లెక్కి ఆందోళనలు చేపట్టారని గుర్తు చేశారు. కరెంటు ఇవ్వాలని నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చాంబర్ ముందు బైఠాయించిన తమనుతొక్కుకుంటూ పోయారేతప్ప కనికరించలేదని తెలిపారు. తెలంగాణ వస్తే చీకటి రాజ్యం వస్తుందంటూ పిల్లి శాపాలు పెట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి చీకట్లో కలిసిపోయారని విమర్శించారు.

తొమ్మిది గంటలు.. ఆరు గంటలు కరెంట్ ఇస్తామని చెప్పిన కాంగ్రెసోళ్లు ఏనాడూ రెండుగంటలకు మించి కరెంట్ ఇవ్వలేదని చెప్పారు. మూడేండ్ల వ్యవధిలోనే సీఎం కేసీఆర్ 24గంటల పాటు విద్యుత్‌ను ఇచ్చే స్థాయికి తెచ్చారని వివరించారు. సిరిసిల్ల్ల నియోజకవర్గంలోని జిల్లెల గ్రామంలో రైతులు కలిసి సార్ ఇరవై నాలుగు గంటల పాటు కరెంట్ వద్దుసార్, ఆటోమెటిక్ స్టార్టర్లతో నీళ్లు వెళ్లిపోతున్నాయని చెప్పటమే విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం అన్నారు. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం చెప్పులను సైతం బార్లుగా పెట్టి, ఎర్రని ఎండలో తారు రోడ్డుమీద బరికాళ్లతో నడిచిపోయిన దీనగాథ తెలంగాణ రైతులదన్నారు. సిరిసిల్ల్ల సమీపంలోని వెంకటాపూర్ గ్రామంలో మునిగె ఎల్లయ్య అనే రైతు మూడురోజులపాటు విత్తనాల కోసం వేచి చూసి చివరకు అక్కడే గుండెపోటుతో మృతి చెందాడని, అప్పుడు కాంగ్రెస్ నాయకులైన జీవన్‌రెడ్డి.. జానారెడ్డి ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. మూడేండ్లుగా ఏ ఒక్క రైతూ ఎరువుల కోసం, విత్తనాల కోసం రోడ్డు ఎక్కిన దాఖలాలు లేవని కేటీఆర్ తెలిపారు.

2014 తదుపరి తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని అన్నారు. మెదక్, నారాయణఖేడ్, పాడేరు, వరంగల్‌లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు 99 సీట్లను టీఆర్‌ఎస్‌కు కట్టబెట్టి కాంగ్రెస్ పార్టీకి గుండు కొట్టారని వ్యాఖ్యానించారు. ఈ విజయాలన్నీ రైతులు, ప్రజలు టీఆర్‌ఎస్‌తో ఉన్నారని రుజువు చేశాయని, అలాంటప్పుడు రైతు సమన్వయసమితుల్లో ఉన్నవాళ్లు సహజంగానే టీఆర్‌ఎస్ వాళ్లు అవుతారన్నారు. టీఆర్‌ఎస్ వాళ్లకు దోచిపెట్టడం కోసం సమన్వయ సమితులు పెడుతున్నారని కాంగ్రెస్ వాళ్లు విమర్శించడంలో అర్థంలేదన్నారు. దోచుకోవడం… దాచుకోవడం కాంగ్రెస్ పార్టీకే తెలిసిన విద్య అని విమర్శించారు. పాన్‌డబ్బాల్లో పనిచేసేవాడు, మెకానిక్, ట్రాక్టర్ డ్రైవర్ ఇలా ఎవరిని పడితే వారిని ఆదర్శరైతులుగా పెట్టి, దోచిపెట్టిన చరిత్ర అందరికీ తెలిసిందేనని మంత్రి విమర్శించారు. తెలంగాణకు కృష్ణా, గోదావరి నదుల్లో 1200టీఎంసీల నీటి వాటా ఉందని, దాన్ని పూర్తిగా వినియోగించుకుంటే 1.20కోట్ల ఎకరాల భూమిని సాగు చేయవచ్చునన్నారు. తెలంగాణ వాటాను వినియోగించుకొని, గోదావరిపై నిర్మించిన ఎస్సారెస్పీ ప్రాజెక్టు క్రమంగా తన ఉనికిని కోల్పోతుందని గుర్తించిన సీఎం కేసీఆర్ ఒక ఇంజినీర్‌లా ఆలోచించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వరద కాల్వ ద్వారా రివర్స్ పంపింగ్ పథకానికి వ్యూహరచన చేశారన్నారు. భూసేకరణ లేకుండా రూ.వెయ్యి కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి, ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయనున్నామని మంత్రి చెప్పారు. 55సంవత్సరాల పాటు పాలించిన కాంగ్రెస్ వాళ్లు 4లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను మాత్రమే నిర్మించారనీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడేండ్ల వ్యవధిలో రూ.1024 కోట్లు వెచ్చించి 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను నిర్మించిందన్నారు.

సీఎం కేసీఆర్ మొండోడు…అనుకున్నది సాధించి తీరుతాడు అని కాంగ్రెస్ వారికి తెలుసనీ, అందుకే కోర్టులకు వెళ్లి సమన్వయసమితులను ఆపాలని చూస్తున్నారని విమర్శించారు. అయితే వారికి కోర్టులు చెంపపెట్టులాంటి తీర్పును చెప్పాయని కేటీఆర్ తెలిపారు. రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అనేక చర్యలు చేపట్టారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2600 మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమించారన్నారు. వీరు ఒక్కొక్కరూ ఐదువేల ఎకరాల పరిధిలో రైతులకు సేవలు అందిస్తారన్నారు. భూసార పరీక్షలు జరిపించడం, రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడం, మద్దతు ధర కల్పించడంలో సాయపడటం వంటివి చేస్తారన్నారు. రైతుల ఆత్మహత్యలకు పెట్టుబడి లేకపోవడమే కారణమని గుర్తించిన సీఎం రైతులకు ప్రభుత్వం నుంచే పెట్టుబడి అందజేయాలని నిర్ణయించారన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కావొద్దన్న ఉద్దేశంతో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టారన్నారు. నిజాం రాజు తరువాత ఎనభై ఐదేండ్లకు మళ్లీ రికార్డుల ప్రక్షాళన చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రైతులకు పెట్టుబడిని అందించడంతో పాటు, గిట్టుబాటు ధరను సైతం కల్పించాలని భావించిన సీఎం కేసీఆర్ రైతు సమన్వయసమితులకు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యానికి దళారులు ధరను నిర్ణయించే దుర్మార్గమైన పద్ధతి పోయి, రైతులే ధరను నిర్ణయించుకోవాలనేది సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. సమన్వయసమితుల సమావేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2600భవనాలు ఒక్కొక్కటిని రూ15లక్షలతో నిర్మిస్తున్నామన్నారు. సమితిసభ్యులు బాధ్యతగా మెలగాలని, ఒకేరకమైన పంటలు వేయడం, ఒకేసారి ఉత్పత్తులను మార్కెట్‌లకు తీసుకురావడం లాంటి సంప్రదాయ పద్ధతులను వీడి, ప్రగతిశీలంగా ఆలోచించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కోరుట్ల ఎమ్మెల్యే, రాష్ట్ర హామీల కమిటీ చైర్మన్ కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కఠారి చంద్రశేఖర్‌రావు, మున్సిపల్ చైర్మన్ శీలం వేణు పాల్గొన్నారు.

1.10కోట్ల ఎకరాలకు పెట్టుబడి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి వచ్చే సంవత్సరం రాష్ట్రంలోని కోటి పది లక్షల ఎకరాలకు ఎకరానికి రూ. 4 వేల చొప్పున పంట పెట్టుబడి అందిస్తామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రాజన్నసిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు, కులమతాలకతీతంగా అందజేస్తామన్నారు. కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్‌వో శ్యాంప్రసాద్‌లాల్ జిల్లాకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.