-రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల హర్షం.. తొలిరోజు సాయం రూ.587 కోట్లు
-19.98 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి
-ఉదయం 8 గంటల నుంచే మోగిన ఫోన్లు
-ఊరూరా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం
-నేడు రెండెకరాల్లోపు రైతులకు రైతుబంధు
-16.32 లక్షల మంది రైతులకు 1,234 కోట్లు
-రైతుల బతుకులు మారాయి: నిరంజన్‌రెడ్డి
-కేంద్రం ఇబ్బందులు పెట్టినా రైతుబంధు
-సాయం అందించాం: మంత్రి హరీశ్‌రావు
రాష్ట్రవ్యాప్తంగా ఎకరం భూమిలోపు ఉన్న రైతుల ఖాతాల్లో ఈ వానకాలం పెట్టుబడి సాయం మంగళవారం జమయ్యింది. తొలిరోజు 19.98 లక్షల మంది రైతులకు రూ. 586.65 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద జమచేసింది. మొత్తం 11.73 లక్షల ఎకరాలకు రైతుబంధు అందింది. ఉదయం 8 గంటల నుంచే రైతుల ఫోన్లకు మెసేజ్‌లు రావడం మొదలైంది. ఆ సందేశాలను చూడగానే రైతుల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. వెంటనే ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకొని సంబురపడ్డారు. ఊరూరా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. బుధవారం రెండెకరాల రైతులకు రైతుబంధు సాయం అందనున్న ది. రెండెకరాల్లోపు భూములున్న 16.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,234.09 కోట్లు జమ కానున్నాయి. ‘రైతు బంధు పైసలు పడ్డయని ఫోన్‌కు మెసేజ్ రాంగనే బ్యాంకుకు పోయి విడిపించిన. మా అసోంటి రైతులకు పెట్టుబడుల బాధ లేకుంట చేసిన కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటం’ అని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ రైతు పల్లపు మల్లేశ్ సంబురపడ్డారు.
రైతుబంధుతో అప్పుల బాధ తప్పిందని ఖమ్మం రూరల్ మండల రైతుబంధు సమితి కన్వీనర్ అక్కినపల్లి వెంకన్న తెలిపారు. ‘ఇదివరకు కరెంట్ లేక, నీళ్లు రాక చాలా గోసపడ్డం. సాగుకు నీళ్లు పుష్కలం ఉన్నయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు రంది లేకుంట జేశిండు. నాకు ఏడాదికి రూ.5వేలు బ్యాంకుల పడ్తానయ్. పొలం నాటు వేసేందుకు పైసలు సరిపోతున్నయ్’ అని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటవాసి దూరు శ్రీమతి సంతోషం వ్యక్తం చేశారు.
రైతుబంధు సొమ్ము లేకపోతే వడ్డీకి తీసుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడా అవసరం లేకుండా పోయిందని ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ రైతు వెలుతూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ‘గతంల పెట్టుబడికి పైసలు లేక మస్తు కష్టమైతుండె. కేసీఆర్ రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం చేసుడుతోటి మస్తు సౌలత్ అయితుంది. సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటం’అని నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ కొత్తతండావాసి కిషన్ చెప్పారు. పెట్టుబడి సాయం రైతులకు అందడంపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, రైతుల బతుకులు మారాయని తెలిపారు.
ఇవి అంకెలు కావు.. సీఎం అంకితభావానికి ఆనవాళ్లు: మంత్రి హరీశ్‌రావు
కేంద్రం రాష్ర్టాన్ని అర్థికంగా అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టినా సీఎం కేసీఆర్ రైతుబంధును విజయవంతంగా పంపిణీ చేస్తున్నారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అన్నదాతలకు లోటు రానివ్వొద్దనే సీఎం కేసీఆర్ దృఢ సంకల్పానికి యావత్ రైతులోకం జేజేలు పలుకుతున్నదని చెప్పారు. ‘ఇవి అంకెలు కావు. రైతు సంక్షేమం పట్ల సీఎం కేసీఆర్ అంకితభావానికి సిసలైన ఆనవాళ్లు. ప్రభుత్వం మొత్తం 68.10 లక్షల మంది రైతులకు రూ.7,521 కోట్లు అందించనున్నది’ అని పేర్కొన్నారు. ‘రైతుకు ప్రకృతి ఇచ్చిన వరం.. తొలకరి. అన్నదాతకు ప్రభుత్వం అందిస్తున్న వరం.. రైతుబంధు. ఇది రైతు ప్రభుత్వం.. రైతు బిడ్డ పరిపాలిస్తున్న ప్రభుత్వం’ అని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
యాళ్లకు పైసలు అచ్చినయి
సీఎం సార్‌కు రైతుల బాధలు తెలుసు. అందుకే యాళ్లకు పంట పెట్టుబడి పైసల్ అకౌంట్‌ల జమచేసిండు. మా అసొంటోళ్లకు ఈ పైసల్ మస్తు అక్కరకు అస్తయి. అకౌంట్ల వడ్డ పైసలతోటి ఇత్నాలు, ఎరువులు తెచ్చుకుంటా.
–రాజిరెడ్డి క్యాంపు తండా,బాన్సువాడ, కామారెడ్డి జిల్లా
మళ్లోసారి కేసీఆరే రావాలి
కేసీఆర్ రైతుల పాలిట దేవుడు. ఆయన వల్లనే ఎవుసం రంది లేకుండా ఉన్నది. పొద్దంతా కరెంటు, అప్పుమాఫీ, ఎవుసానికి పుల్లు నీళ్లు ఇత్తున్నరు. ఇంకా రైతుబంధు పైసలు కూడా ఇయ్యవట్టే. మాకు ఇంకేంగావాలె. మళ్లోసారి కూడా ఈ సర్కారే రావాలి.
– పుట్టపాక కొమురయ్య,ఇప్పల్ నర్సింగాపూర్, హుజూరాబాద్
పెట్టుబడికి ఇబ్బందుల్లేవు
గతంలో వానకాలం వచ్చిందంటే రైతులకు పంట పెట్టుబడికి శానా ఇబ్బందులు ఉండేవి. వడ్డీ వ్యాపారులను దగ్గరకు పోవాల్సి వచ్చేంది. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత రైతుల కష్టాలు తీరినయి. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నరు. నీళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఏడాదికి రెండుసార్లు ఎకరానికి ఐదు వేల చొప్పున ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
-గంగిరెడ్డి సైదిరెడి,్డ చిలుకూరు, సూర్యాపేట జిల్లా