Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

‘రైతుబంధు’ తోడ రంజిల్లు సంక్రాంతి

ఈరోజు జనవరి 10, రాష్ట్రమంతా పండుగ రోజు. నాలుగురోజుల ముందే సంక్రాంతి ‘లక్ష్మి’ ఇళ్లిల్లూ అలరించిన శుభ సందర్భం. అన్నదాతల దశ-దిశ మార్చిన ‘రైతుబంధు’ సీఎం కేసీఆర్‌ పాలనలో గత వారం రోజులుగా జరుగుతున్న సంబురాలకు పతాక దృశ్యం నేడు!

‘అప్పుడప్పుడె విచ్చి యలరు చేమంతుల
కమ్మన్నినెత్తావి గడలుకొనఁగ,
రత్న కంబళ మట్లు రాణించు బీళులఁ
బలువన్నెపూవులు బలిసివిరియ,
వ్రాలఁబండిన రాజనాల కేదారంబు
పంటలక్ష్మికి నాటపట్టుగాఁగ,
ప్రొద్దునిగ్గులు సోకి పొగమంచు మబ్బులు
బంగారు వలిపంబు పగిది వ్రేల
ఈనిమేషమందు నిల యెల్ల నందమై
స్వర్గశిల్పి యింద్రజాల శక్తి
వ్రాసినట్టి చిత్రపటమన విలసిల్లె;
దొంగిచూడు మిపుడు తూర్పుదిక్కు!

ఆ అందమైన ఆకుపచ్చ దృశ్యం 1942లో దువ్వూరి రామిరెడ్డి ‘కృషీవలుడు’లోని స్వప్నం. ఇప్పుడు అది తెలంగాణలో సాక్షాత్కారం! ఈ మాటల్లో కొంచెం కూడా అతిశయోక్తి లేదు!! ఇదెట్లా సాధ్యమైంది? సంకల్ప బలం. కార్యశూరత. మొక్కవోని దీక్ష. రైతుబంధువుగా నిలిచిపోవాలన్న తపన. వీటన్నిటి రూపం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.చదవగానే భజన అనిపించవచ్చు గాక. అట్లా అనుకునేవారు ఉంటనే ఉంటరు. సులువు కదా నాలుగు రాళ్లేయడం, నొసలు విరవడం, నోళ్ళతో వెక్కిరించడం. అయితే, వారొకసారి గతాన్ని తరచిచూడాలి. విత్తనాలు కొనాలంటే పాతబాకీ తీర్చలేదని షావుకారు తరిమేస్తడేమో అని భయం. ఎరువులు, పురుగుమందులు అడుగుదామంటే పంట మొత్తం రాసియ్యి అని సేటు అంటడేమో అని బుగులు. కూలీ రేట్లు ఇయ్యనీకె పైసలు సాలక, ఇంటిమంది మొత్తం పొలంలో దిగిరెక్కలు ముక్కలు చేసుకున్న గోస. ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయి, మోటార్లు కాలిపోయి, అప్పులు పెరిగిపోయి, ప్రాణాలు గాలిలో కలిసిపోయిన దృశ్యాలు మన మనోఫలకంలో ఉన్నది వాస్తవమే కదా? ఇది కేసీఆర్‌ పాలన రాకముందు తెలంగాణ రైతాంగం పరిస్థితి, వ్యవసాయరంగ దుస్థితి అన్నది కల్ల కాదు కదా?
ఇపుడవన్నీ పాత బాధలు. వ్యవసాయాన్ని టీఆర్‌ఎస్‌ పండుగ చేయకంటే ముందు ఉన్న యథార్థ గాథలు. రోజులు మారినయ్‌. మన రాష్ట్రం వచ్చింది. మన పాలన కండ్లముందుకు వచ్చింది. ఫలితాలు మన ఇండ్లలోకి వచ్చినయ్‌. గత ఏడేండ్లలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన సాగు, పంటల దిగుబడులు.. అన్నదాతల జీవితాల్లో ఆనందం తెలంగాణ సాధనకు సార్థకత. కాబట్టే, కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి స్వప్న సాకారం సాహితీ సమరాంగణ సార్వభౌముడు కేసీఆర్‌ పాలనలో జరిగింది అనేది!
2018, మే 10న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి- ఇందిరానగర్‌ వద్ద ‘రైతుబంధు’ పథకాన్ని ప్రారంభించిన్రు ముఖ్యమంత్రి కేసీఆర్‌. నీచమానవుల కోసం ఒక వివరణ- అపుడు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక లేదు మొట్టమొదటిసారిగా ధర్మరాజుపల్లి వాసులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్‌ పాసుపుస్తకాలు అందుకున్నారు.

ఆ సభలో సీఎం కేసీఆర్‌ మాటలను మరోసారి మననం చేసుకోవాల్సిన సందర్భం ఇది! ‘..మీకు పరిపాలించే మొఖం లేదు అని ఆనాడు అన్నారు. కానీ 24 గంటల కరెంట్‌ సాధించుకున్నాం. భూ ప్రక్షాళన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రూ.6000 కోట్లు నిన్ననే బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసినం. 2014 ముందు కరెంట్‌ ఉంటే వార్త. ఇపుడు కరెంట్‌ పోతే వార్త. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం. రైతులకు మద్దతు ధర ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెద్దాం. ఆంధ్ర పాలకుల వివక్షాపూరిత ఏలుబడిలో జరగని అభివృద్ధి నేడు తెలంగాణ వచ్చినంక సాధించుకున్నాం. రిజిస్ట్రేషన్‌ విధానంలో మార్పు తీసుకొస్తున్నాం. పాస్‌బుక్కులు మన ఇంటికే వస్తాయి. వ్యవసాయరంగంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎరువులు, విత్తనాలు దొరుకుతున్నాయి. పోరాడి, కోట్లాడి తెచుకున్నాక తెలంగాణ కోటి ఎకరాలకు నీళ్లందించేవరకు నేను నిద్రపోను. అగ్రకులాలు అని పేరు ఉన్న పేదలకు తగిన స్కీములు కూడా త్వరలోనే ప్రకటిస్తాం. ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల బీమా ఇస్తున్నాం. 58 లక్షల రైతులకు చెక్కులు, పాసు పుస్తకాలు నేటినుంచి ఇవ్వబోతున్నాం. వ్యవసాయం దండగ కాదు, పండగ అని రాబోయే రోజుల్లో చేసి చూపిస్తాం. 60 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. టీఆర్‌ఎస్‌ తెలంగాణ సాధించిన పార్టీ. కాంగ్రెస్‌ తెలంగాణను వేధించిన పార్టీ. న్యాయం, ధర్మం వైపు మీరుంటారు కాబట్టి మీ ఆశీర్వాద బలంతో ఇంకా ముందుకువెళ్లి అభివృద్ధి సాధించుకుందాం..’

ఎన్నికల కోసమే స్టంట్లు అని నేడు సెటైర్లు వేస్తున్న ఈటల రాజేందర్‌ నాటి ప్రసంగ సారాంశం ఇదిగో.. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పంట పెట్టుబడి పథకం దేశానికే ఆదర్శం. సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడు. ప్రజాహిత కార్యక్రమాలతో సీఎం కేసీఆర్‌ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. కరీంనగర్‌ జిల్లాను వాటర్‌హబ్‌గా తీర్చిదిద్దారు. ఇప్పటికే వేలాది కోట ్లరూపాయలతో పల్లెలన్నీ బాగుపడ్డాయి.’. అదేదో సినిమాలో రావుగోపాలరావు అన్నట్టు.. చరిత్ర అనేది చింపేస్తే చిరిగిపోదు.

రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేస్తున్నది. వానకాలం, యాసంగి సీజన్లకు ఎకరానికి రూ. 5,000ల చొప్పున రెండుసీజన్లకు కలిపి రూ.10 వేలు పెట్టుబడిగా ఇస్తున్నది. ఈ పథకం కింద నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ ఇస్తారు. రైతులు తాము తీసుకున్న రుణాలపై ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా 66 లక్షలకు పైగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నది ప్రభుత్వం. రైతుబంధు పథకం కింద పెట్టుబడి సహాయం పొందుతున్న వ్యవసాయదారుల్లో 90 శాతం చిన్నరైతులు, సన్నకారు రైతులే ఉన్నారు. 66 లక్షల కుటుంబాలు అంటే, కుటుంబానికి నలుగురు సభ్యుల లెక్క తీసుకుంటే రెండున్నర కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ విధానం ఇది. కాదా మనకిది గర్వకారణం! రైతుబంధు రూపంలో రూ.50,680 వేల కోట్ల రూపాయలను రైతన్నలకు పంచి ఇచ్చిన కేసీఆర్‌ సహృదయానికి, వ్యవసాయం పట్ల ఆయన మక్కువకు రైతులోకం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నది. అందుకే గత వారం రోజుల నుంచీ రాష్ట్ర రైతాంగం ‘రైతుబంధు సంబురాలు’ చేసుకుంటున్నది. ప్రతి గ్రామంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ఊరేగింపులతో మొదలుపెట్టి రైతువేదికల వద్ద పండుగ వాతావరణంలో నేడు ముగింపు సంబరాలను ఘనంగా చేయబోతున్నది. నాలుగురోజుల ముందే తెలంగాణకు సంక్రాంతి శోభ సంతరించబోతున్నది.

చివరగా ఒక్కమాట.. యాసంగిలో వరి వేయకండి. కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల కొనుగోళ్లుండవు. కాబట్టి నష్టపోకండి. మన ముఖ్యమంత్రి విజ్ఞప్తిని వినండి. ప్రత్యామ్నాయ పంటలకు మళ్లండి. ఇప్పటికే రాష్ట్రంలో ముప్పావు వంతు రైతాంగం వరి నుంచి ప్రత్యామ్నాయ పంటలకు మళ్లుతున్నది. కూరగాయలు, పండ్లు, పూలు, పప్పు దినుసులు, నూనెగింజల సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. ‘వరి వేయండి, ఎట్లా కొనరో చూస్తాం’ అంటున్న బండి సంజయ్‌, రేవంత్‌ రెడ్డిల బాధ్యతారాహిత్యాన్ని ఎన్నో ప్రజాసంఘాలు, వ్యవసాయరంగ నిపుణులు కూడా నిరసిస్తున్నరు.

రైతుబంధు సంబురాలపై విమర్శలు చేసే రాజకీయపార్టీలను పక్కనపెట్టి, రైతు ఆత్మహత్యల పట్ల ఆవేదన చెందే వ్యవసాయరంగ నిపుణుల, ప్రజాసంఘాల సూచనలు స్వీకరించవలసిందే. అయితే, దశాబ్దాల గోసలు ఒక్కసారిగా తీరవు. ఇటుక ఇటుకా పేర్చినట్టు రాష్ట్ర నిర్మాణం, ప్రజల జీవన ప్రమాణాల పెంపు ఒక యజ్ఞంలా సాగుతున్న తెలంగాణలో ప్రతి మనిషి, ప్రతి ఇల్లు, ప్రతి పల్లె కళకళలాడాలనే ఆకాంక్షతో ఉన్న ఎవరైనా నిర్మాణాత్మక సూచనలు ఇవ్వండి. తప్పక ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటది. తెలంగాణను ఉన్నతంగా నిలుపుకొనే దారిలో కలసిరండి.. కదలిరండి. ముఖ్యంగా రైతన్నలు మనోనిబ్బరంతో ఉండండి. ఇది మన ప్రభుత్వం. కష్టా లు కడతేరే కాలం మన ముందున్నది.

  • శ్రీశైల్‌రెడ్డి పంజుగుల
MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.