Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతుబంధుకు నేడే శ్రీకారం

-కర్షకలోకానికి రైతుబాంధవుడి కానుక -హుజూరాబాద్ శాలపల్లి-ఇందిరానగర్‌వద్ద లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం శ్రీ కేసీఆర్ -మొదటి లబ్ధిదారులు ధర్మరాజుపల్లి వాసులు -298 మందికి చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ -ఉద్వేగంతో ఎదురుచూస్తున్న రైతులు -కట్టుదిట్టమైన ఏర్పాట్లు.. మంత్రి ఈటల పర్యవేక్షణ -రాష్ట్రవ్యాప్తంగా చెక్కుల పంపిణీకి అంకురార్పణ -నల్లగొండ, యాదాద్రిలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ -మహబూబ్‌నగర్, వనపర్తిలో మంత్రి పోచారం -రైతుబంధు చెక్కులపై 100% సంతకాలు పూర్తి

సాగు కష్టాలకు ఇక తెరపడబోతున్నది! పంటకు సిద్ధమవ్వాల్సిన సమయంలో పెట్టుబడికోసం కాళ్లరిగేలా తిరిగే రైతన్నలకు భారీ ఊరట లభించనున్నది! అన్నదాతలను కష్టాల కడలి నుంచి బయటపడేసి.. వారికి అపూర్వ కానుక అందబోతున్న అరుదైన సందర్భం.. రైతును రాజును చేయాలన్న సంకల్పం కార్యరూపం దాల్చనున్నాయి! దేశంలో ఎక్కడా లేనివిధంగా, దేశంలో ఏ నాయకుడూ ఆలోచించని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎకరానికి నాలుగు వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందించే పథకం రైతుబంధు మరికొద్ది గంటల్లో సాక్షాత్కరించనుంది!

దేశచరిత్రలో నిలిచిపోయే రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని శాలపల్లి-ఇందిరానగర్ వద్ద జరిగే కార్యక్రమంలో గురువారం ఉదయం 10 గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా లక్షమందితో ఏర్పాటుచేయనున్న భారీ బహిరంగసభకు అంతా సిద్ధమైంది. బహిరంగసభ ఏర్పాట్లను ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సీఎం ప్రారంభించిన అనంతరం 11 గంటలకు ఆయా జిల్లాల్లో చెక్కులు పంపిణీచేస్తారు. నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొంటారు. ఇతర జిల్లాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని చెక్కులు పంపిణీచేస్తారు. మహమూద్ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రతిరోజూ నాలుగు జిల్లాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొని చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందజేయనున్నారు. రాష్ట్రంలోని 58.33 లక్షల మంది రైతులకు సంబంధించిన సుమారు 1,43,27,000 ఎకరాల సాగుభూమికి పంట సాయం అందనుంది. ఈ మేరకు రూ.5,730 కోట్ల విలువైన 58.98 లక్షల చెక్కులను మే 10 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా 10,833 గ్రామాల్లో పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రైతుబంధు పథకం కింద అందజేయనున్న చెక్కులపై వందశాతం సంతకాలు పూర్తయ్యాయి. చివరి నిమిషంలో ముద్రించిన చెక్కులు ముంబై నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నాయి.

హుజూరాబాద్‌లో లక్షమందితో సీఎం సభ.. పకడ్బందీ ఏర్పాట్లు రైతుబంధు సభకు అధికార యంత్రాగం పడక్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. మూడు రోజులుగా మంత్రి ఈటల రాజేందర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తూ రైతులకు అవగాహన కల్పించడంతోపాటు స్వయంగా సభకు ఆహ్వానం పలుకుతున్నారు. బుధవారం పలువురు టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి వీణవంక, మానకొండూరు నియోజకవర్గాల్లో పర్యటించి ముఖ్య కార్యకర్తలతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ, బొట్టు పెట్టి సభకు రావాలని ఆహ్వానించారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయ ని సాహసోపేత నిర్ణయం సీఎం కేసీఆర్ తీసుకున్నందున సభను అనుకున్నదానికన్నా విజయవంతంచేసి కృతజ్ఞతను చాటాలన్న భావనలో రైతులున్నారు.సభకు లక్ష మంది వస్తారని అంచనా వేసినా.. రైతుల స్పందన చూస్తేఅంతకు మించి అన్నదాతలు వచ్చి ముఖ్యమంత్రికి సంఘీభావం తెలిపే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, సీపీ హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌లో సీఎం సభ, పర్యటన ఏర్పాట్లను కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సీపీ కమలాసన్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం రాత్రి కరీంనగర్‌లోని కేసీఆర్ భవన్‌కు సీఎం చేరుకుంటారని, గురువారం ఉదయం 9-10 గంటల మధ్యలో రోడ్డుమార్గంలో బయలుదేరి రోడ్డుషో ద్వారా సభా ప్రాంగణానికి చేరుకుంటారని వివరించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని సభకు వచ్చే రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సభాప్రాంగణంలో స్ప్రింక్లర్ల ద్వారా చల్లని నీటి తుంపరలను వెదజల్లే ఏర్పాట్లు చేశామన్నారు. సభకు 1400 ఆర్టీసీ బస్సులు, 500 ప్రైవేట్ బస్సులు వచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్ సదుపాయం కల్పించినట్టు తెలిపారు. నాలుగు లక్షల వాటర్ ప్యాకెట్లను, లక్ష మజ్జిగ ప్యాకెట్లను సమకూర్చామని వివరించారు. హుజూరాబాద్ నుంచి జమ్మికుంట వరకు 50 చలివేంద్రాలను ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. సభా ప్రాంగణంవద్ద ఐదు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని, కంపార్ట్‌మెంట్లవారీగా పకడ్బందీ బారికేడ్లు, , ఒక్కో కంపార్టుమెంట్‌కు ఒక్కో ఇంచార్జి అధికారిని నియమించి రైతులకు అసౌకర్యం కలుగకుండా చేశామన్నారు.సీఎం పర్యటనను పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా పోలీసులు బుధవారం ఉదయం నుంచే విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. బందోబస్తు కోసం కరీంనగర్, రామగుండం, ఖమ్మం, వరంగల్ కమిషనరేట్లతోపాటు వివిధ జిల్లాలు, బెటాలియన్ల నుంచి వివిధ విభాగాలకు చెందిన 2300 మంది వివిధ స్థాయిల పోలీసు అధికారులు వస్తున్నారని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.

దారి మళ్లింపు.. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్టు సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. జగిత్యాల వైపు నుంచి వచ్చే వాహనాలు రేకుర్తి క్రాస్‌రోడ్డు, శాతవాహన వర్సిటీ, చింతకుంట, పద్మనగర్ బైపాస్, ఎన్టీఆర్ విగ్రహం మీదుగా వెళ్లాలని సూచించారు. వేములవాడ, సిరిసిల్ల నుంచి వచ్చే వాహనాలు పద్మనగర్ బైపాస్ రోడ్, ఎన్టీఆర్ విగ్రహం మీదుగా వెళ్లాలని చెప్పారు. పెద్దపల్లి, గోదావరిఖని ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు బొమ్మకల్ ైఫ్ల్లెఓవర్, బద్దం ఎల్లారెడ్డి విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం మీదుగా వెళ్లాలని సూచించారు. చొప్పదండి నుంచి వచ్చే వాహనాలు బొమ్మకల్ ైఫ్లెఓవర్, బద్ధం ఎల్లారెడ్డి విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం మీదుగా వెళ్లాలని, వరంగల్, హైదరాబాద్ నుంచి కొండగట్టు ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఎన్టీఆర్ విగ్రహం, పద్మనగర్ బైపాస్ రోడ్, చింతకుంట, శాతవాహన యూనివర్సిటీ, రేకుర్తి మీదుగా వెళ్లాలని వివరించారు.

చెక్కులు వంద శాతం సిద్ధం రైతుబంధు పథకం కింద చెక్కుల సరఫరా బుధవారం సాయంత్రంతో 100 శాతం పూర్తయింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన 16 మండలాలలోని రైతుల భూ రికార్డులను రెవెన్యూశాఖ ఆలస్యంగా బ్యాంకర్లకు అందించడంతో ఆయా గ్రామాల్లోని రైతుల చెక్కుల ముద్రణ ఆలస్యం అయింది. దీంతో 1.92 లక్షల మంది రైతులకు చెందిన చెక్కులను ప్రత్యేకంగా ముద్రించి, బుధవారం సాయంత్రం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో తెప్పించి, వ్యవసాయశాఖకు అందజేశారు. అనంతరం వాటిని మేడ్చల్‌లోని ఏడు, రంగారెడ్డి జిల్లాలోని తొమ్మిది మండలాలకు చెందిన అధికారులకు అప్పగించామని వ్యవసాయ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి తెలిపారు.

చెక్కుల పంపిణీలో విధివిధానాలివే.. చెక్కుల పంపిణీ సందర్భంగా లబ్ధిదారులు, అధికారులు అనుసరించాల్సిన, పాటించాల్సిన అంశాలపై ఇప్పటికే వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు కరపత్రాలద్వారా ప్రచారం నిర్వహించారు. వారంపాటు చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించింది. ఇవీ వివరాలు.. -చెక్కుల పంపిణీకి నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. -మొదటి కేంద్రంలో 1బీ, పహాణీని పరిశీలిస్తారు. -రెండో కేంద్రంలో పట్టాదార్ పాస్‌బుక్, చెక్కు అందజేస్తారు. -మూడో కేంద్రంలో రైతు సంతకం తీసుకుంటారు. -నాల్గో కేంద్రంలో ఫిర్యాదులు స్వీకరిస్తారు. -గ్రామంలో చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ సందర్భంగా ఏర్పాటుచేసిన కౌంటర్లలో రైతులు వారి చెక్కులు ఏ కౌంటర్లలో ఉందో స్లిప్పు మీద ఉన్న నంబరును బట్టి గుర్తించాలి. -ఏ కౌంటర్లలో ఏ నంబర్ పాసుబుక్కులు ఉన్నాయో ప్రత్యేకమైన తెరపై ప్రదర్శిస్తారు. -ఆధార్‌కార్డు ఒరిజినల్, జిరాక్స్ కాపీ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. -పట్టాదారు మాత్రమే చెక్కును తీసుకోవడానికి రావాలి. -పట్టాదారు అనారోగ్యంతో ఉంటే అధికారులు ఇంటికి వెళ్లి అందజేస్తారు. -సంబంధిత అధికారులకు రైతులు ఒరిజినల్ ఆధార్‌కార్డు చూపించిన తర్వాత చెక్కు ఇస్తారు. -ఆధార్‌కార్డు నంబర్ ఇవ్వనివారికి పాస్‌బుక్కు ఇవ్వరు. కేవలం చెక్కులు మాత్రమే ఇస్తారు. చెక్కులు తీసుకొని ఆధార్ జిరాక్స్ ఇవ్వాలి. -భూమి వివరాలు సరిగ్గా పడకపోయినా, చెక్ మీద మొత్తం తక్కువగా ముద్రించినా వెంటనే వాటిని ఆ ప్రాంతంలో ఏర్పాటుచేసిన కౌంటర్లలో గ్రీవెన్స్ ఫారంలో నింపి అధికారులకు అందజేయాలి.

మరింత నగదు కావాలి -ఆర్బీఐని కోరిన ఎస్సెల్బీసీ -పంట సాయానికి అన్ని ఏర్పాట్లుచేశాం -ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్

రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఇస్తున్న పంట పెట్టుబడి సాయానికి మరికొంత నగదు అవసరమని తెలంగాణ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఆర్బీఐకి తెలియజేసింది. మిగిలిన మొత్తాన్ని అందజేయాలని కోరింది. రైతులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న 59 లక్షల చెక్కులకు సరిపడా నగదును ఇవ్వడానికి రూ.5,700 కోట్లు అవసరమని కమిటీ చైర్మన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ స్వామినాథన్ తెలిపారు. ఇందులో ఇప్పటికే కొంత నగదును ఆర్బీఐ సరఫరా చేసిందని చెప్పారు. రైతుబంధుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించింది. మొదటివిడత పంట సాయాన్ని 58.33 లక్షల మంది రైతులకు అందివ్వడానికి 59 లక్షల చెక్కులను ముద్రించింది. చెక్కుల ముద్రణకు చాలా శ్రమపడాల్సి వచ్చిందని, దానికయ్యే ఖర్చులను తెలంగాణ ప్రభుత్వమే భరిస్తున్నదని స్వామినాథన్ చెప్పారు. అతితక్కువ సమయంలో ఒక్క ఎస్‌బీఐ 26 లక్షల చెక్కులను ముద్రించిందని, పథకానికి నగదు సమస్యలేకుండా ఏర్పాట్లను చేస్తున్నామని చెప్పారు.

రైతులు చెక్కులు ఇలా మార్చుకోవచ్చు.. ప్రభుత్వం ఇచ్చే చెక్కును రైతు అదే బ్యాంకుకు సంబంధించి తెలంగాణలో ఏ శాఖలో నైనా సమర్పించి నగదు పొందవచ్చు. చెక్కును నగదుగా మార్చుకునే సమయంలో బ్యాంక్ సిబ్బందికి ఒరిజినల్ పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు (మరేదైనా గుర్తింపుపత్రం) చూపించాల్సి ఉంటుంది. చెక్కును నగదుగా కాకుండా తమ అకౌంట్లలో జమ చేసుకోవాలనుకునే వారు పాస్‌బుక్‌ను కూడా బ్యాంకుకు వెంట తీసుకువెళ్లాలి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.