Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతుకు పట్టాభిషేకం

-దేశానికే దిక్సూచి దేశ చరిత్రలోనే ఇది సువర్ణాధ్యాయం -తెలంగాణ వ్యవసాయరంగం దశ.. దిశ మార్చే సందర్భం -పంట పెట్టుబడి చెక్కులు.. పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ -కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ -రైతును రాజును చేయాలన్నదే మా సంకల్పం -దేశంలోనే ధనిక రైతులున్న రాష్ట్రంగా నిలువాలి -కొత్త రిజిస్ట్రేషన్ విధానంతో జూన్ 2 నుంచి మరో విప్లవం -ధరణి వెబ్‌సైట్‌లో అన్ని భూముల వివరాలు -జూన్ 2 తర్వాత రైతులకు రూ.5 లక్షల బీమా అమలు -తెలంగాణ స్పెషల్.. -ఆశవర్కర్లు, అంగన్‌వాడీలు, హోంగార్డులకు మన దగ్గరే అధిక వేతనాలు -24 గంటల కరంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ -20 శాతం సొంత రాబడి కలిగిన ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణే -వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు వెయ్యి పెన్షన్ ఇస్తున్నదీ మనమే -ఉపాధి హామీతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని తీర్మానం -కేంద్రం అన్ని పంటలకు ఇప్పుడున్న ధరలో నాలుగో వంతు పెంచి మద్దతు ధర ప్రకటించాలి -ప్రాజెక్టులు పూర్తయితే కోటి ఎకరాలకు సాగునీరు ఖాయం.. వ్యవసాయం పండుగ అని తెలంగాణ చేసి చూపెట్టాలి -కరీంనగర్ అభివృద్ధికి రూ.500 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటన -తెలంగాణను సాధించిన పార్టీ టీఆర్‌ఎస్ .. తెలంగాణను వేధించిన పార్టీ కాంగ్రెస్ -హుజూరాబాద్ బహిరంగసభలో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు

ఇది తెలంగాణ వ్యవసాయరంగం దశ.. దిశ మార్చే సందర్భం! రైతును రాజును చేయాలన్న ప్రభుత్వ దృఢ సంకల్పం! సాగుకు స్వర్ణయుగం తెచ్చి.. తెలంగాణ వ్యవసాయాన్ని దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలిపేందుకు ఉద్దేశించిన కార్యక్రమం! బంగారు తెలంగాణ నిర్మాణంలో వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి.. రైతుకు వెన్నుదన్నుగా నిలిచే పథకం! రైతుబంధు!! పేరులోనే అంతా ఉన్న మహత్తర పథకం.. పురుడుపోసుకుంది! ప్రతి పంటకు ఎకరాకు నాలుగు వేల రూపాయల చొప్పున ప్రభుత్వమే పంట పెట్టుబడి అందించే వినూత్న ఆలోచన ఆచరణరూపందాల్చింది! రాష్ట్రవ్యాప్తంగా పండుగలాంటి వాతావరణంలో సర్కారీ సాయాన్ని అందుకున్న అన్నదాతల మోములు మురిశాయి! వాటితోపాటే సంక్లిష్టమైన రికార్డులను సరిచేసి.. ఏ భూమి ఎవరిదో ప్రజల మధ్యే తేల్చి.. ఆ భూమికి అందజేసిన పటిష్ఠమైన భద్రతాఫీచర్లతోకూడిన పాస్‌పుస్తకాలు రైతుల చేతుల్లో మెరిశాయి! వెరసి.. స్వయంగా రైతు, రైతు సమస్యలు తెలిసిన పాలకుడు, వాటిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఉన్న నేత.. అన్నింటికి మించి.. అన్నింటినీ ఉద్యమంలానే చేపట్టే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా తెలంగాణ రైతుకు పట్టాభిషేకం జరిగింది! దేశ రైతాంగ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది! యావత్‌దేశానికి దిక్సూచిగా నిలిచింది!

కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రతి రైతుకు ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయం అందించడం దేశ రైతాంగ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ విషయంలో యావత్ దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలిచిందని చెప్పారు. వ్యవసాయం బాగుంటేనే దేశం బాగుంటుందన్న సీఎం.. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పూర్తయితే కోటి ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వ్యవసాయం బాగుండాలంటే భూములు, నీళ్లు, కరంటు ఉండాలని చెప్తూ.. ఇప్పటికే రికార్డుల ప్రక్షాళన పూర్తయిందని, వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఇవాళ్టి నుంచి పంట పెట్టుబడి కూడా అందిస్తున్నామని చెప్పారు. ఇక బంగారు పంటలు పండించాలని రాష్ట్ర రైతాంగాన్ని కోరారు. దేశంలో అత్యంత ధనికులైన రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణలోనేనని అంతా చెప్పుకోవాలని ఆకాంక్షించారు. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.4వేల చొప్పున రెండు పంటలకు కలిపి రూ.8వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రైతుబంధు పేరిట ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి-ఇందిరానగర్ వద్ద జరిగిన బహిరంగసభలో లాంఛనంగా ప్రారంభించారు.

ఇదే సమయంలో కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాలను కూడా రైతులకు అందజేశారు. ధర్మరాజుపల్లె వాసులు సీఎం చేతుల మీదుగా చెక్కులు, పాస్‌పుస్తకాలు అందుకున్నారు. ఒకవైపు ఎండమండుతున్నా.. ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలనుద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ.. రైతును రాజును చేయడమే తమ సంకల్పమని పునరుద్ఘాటించారు. సమైక్య రాష్ట్రంలో ప్రాజెక్టులు పెండింగ్‌లో పడి ఉంటే నోరు మెదపని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తాము వాటిని పూర్తిచేస్తుంటే అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్ తెలంగాణను సాధించిన పార్టీ అయితే.. కాంగ్రెస్ తెలంగాణను వేధించిన పార్టీ అని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషిచేస్తున్నదంటూ అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా త్వరలోనే పథకాన్ని ప్రవేశపెడతామని ప్రకటించారు. ఈ రోజు దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రభాగాన ఉందని అన్నారు. దేశంలో 20% సొంత ఆదాయం కలిగిన రాష్ట్రం మనదేనని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తీర్మానిద్దామని ముఖ్యమంత్రి ప్రతిపాదించగా.. సభకు హాజరైనవారంతా హర్షధ్వానాలతో తమ ఆమోదాన్ని తెలిపారు. ఈ సభలో ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే..

సువర్ణ అధ్యాయం.. నవ శకానికి నాంది.. రైతుబంధు పథకం సామాన్యమైనది కాదు. 58 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేది. వీరికి చెక్కులు, పాసు పుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. ఈ పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయడానికి ఎన్నో రాత్రులు అధికారులు, మేము పనిచేశాం. దీని వెనుక సీనియర్ అధికారుల సహకారం ఉంది. ఎప్పుడైనా చరిత్రలో మీరెవరన్నా అనుకున్నారా? మన ఊరికే రెవెన్యూ అధికారులు వచ్చి, పదిరోజులు మన ఊళ్లోనే ఉండి, మన భూ రికార్డులు ప్రక్షాళనచేసి.. సంబంధిత ఫైళ్లు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడైనా చూశామా? బ్యాంకులో లోన్ తీసుకోవాలన్నా, పహాణీ తీసుకోవాలన్నా, వాటికోసం తిరిగి వేసారేవాళ్లం. ఈ ఇబ్బందులు తొలిగించేందుకే రికార్డుల ప్రక్షాళన చేపట్టాం. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 58 లక్షల పైచిలుకు రైతులకు పాస్‌పుస్తకాలతోపాటు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నాం.

దేశ రైతాంగ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. మనం బాగుండడమే కాదు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. అసోం నుంచి మహారాష్ట్ర వరకు.. ఉత్తర, దక్షిణ భారతాలు కావచ్చు.. ఈశాన్య, పశ్చిమ భారతం కావచ్చు.. యావత్‌దేశానికే ఈరోజు తెలంగాణ దిక్సూచిగా నిలుస్తున్నది. ఈ రోజు భూ ప్రక్షాళన చేసిన రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు. ప్రక్షాళనతోపాటు రూ.12 వేల కోట్లను బాజాప్తాగా బడ్జెట్‌లో కేటాయించి సగర్వంగా రైతుల చేతులో పెట్టి వారికి నమస్కారం చేస్తున్నా. ఇదొక అద్భుత నిర్ణయం. దేశంలో ఎక్కడా, ఎప్పుడు చేయలేని బృహత్తర కార్యక్రమానికి మనమే శ్రీకారం చుట్టాం. ఆ గౌరవం తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ర్టానికి, తెలంగాణ రైతాంగానికి దక్కుతుంది. రూ.6 వేల కోట్లు నిన్నటివరకే బ్యాంకులకు అందించాం. బ్యాంకు మేనేజర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మా రైతుల కోసం రిజర్వుబ్యాంకు నుంచి ప్రత్యేకించి తెప్పించి మీకిచ్చిన డబ్బు. ఈరోజు నుంచి తీసుకునే చెక్కులతో బ్యాంకులకు రైతులెవరు వచ్చినా వెంటనే వాళ్లకు డబ్బులివ్వాలి. రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. వ్యవసాయ రుణాలు మాఫీచేశాం. వ్యవసాయ ట్రాక్టర్లపై టాక్సులు రద్దుచేశాం. భూ రికార్డుల ప్రక్షాళనచేశాం. ఈరోజు రైతుకు పెట్టుబడి ఇచ్చుకుంటున్నాం.

కరంటు నిరంతరం సరఫరా చేసుకుంటున్నాం. మోటర్లు, స్టార్టర్లు కాలిపోయే రోజులు లేవు. ఉద్యమం చేసే సమయంలో భిక్షపతి అనే ఒక వ్యక్తి జమ్మికుంటలో కరంటు బిల్లు కట్టలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే.. నేను పరామర్శకు వచ్చి కళ్లవెంట నీళ్లు తీసుకొని వెళ్లాను. కానీ ఈ రోజు తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఈరోజు కరెంటు పోతే వార్త. 2014కు ముందు కరెంటు ఉంటే వార్త. ఇకముందు కరెంటు పోయే ప్రసక్తే లేదు. కొద్దిరోజులు గడిస్తే కొత్తగూడెంలో 800 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. తదనంతరం రాష్ట్రంలో రెప్పపాటుకూడా కరెంటు పోదు. వ్యవసాయానికి నీళ్లు కావాలి. నీళ్లు సమృద్ధిగా వస్తే బ్రహ్మాండంగా కష్టపడే మనుషులం ఉన్నాం. పంటలు పండించుకుంటాం. ఇదే ధర్మరాజుపల్లిలో రైతులు సొసైటీ పెట్టి గ్రామం మొత్తం సీడ్స్ తయారుచేస్తూ ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. అంతటి నైపుణ్యం మన రైతులకుంది. రాబోయేకాలంలో తెలంగాణలో పండించే పంటలకు ఆన్ డిమాండ్ ఉండాలె. ఆ తరహాలోనే మున్ముందు పంటలు వేయాలె. వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని నిరూపించి, దేశానికే తెలంగాణ రైతులు దిక్సూచి కావాలె. మీ బిడ్డగా అనాడు తెలంగాణ సాధిస్తానని చెప్పాను. మధ్యలో ఉద్యమం ఆపేస్తే రాళ్లతో కొట్టి చంపమని చెప్పాను. మాట మీద ఉండి, ఎన్ని అవమానాలు, ఇబ్బందులు, కఠిన పరిస్థితులు వచ్చినా తెలంగాణ సాధించుకున్నం. తెచ్చిన తెలంగాణను అద్భుతంగా, బంగారు పంటలు పండేలా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నం.

సెంటిమెంట్ జిల్లా.. కరీంనగర్ జిల్లా కేసీఆర్‌కు వ్యక్తిగత సెంటిమెంట్ ఉన్న జిల్లా అని మీ అందరికీ తెలుసు. ఇటీవల ఖమ్మంజిల్లా నుంచి ఒక వ్యక్తి వచ్చి.. కేసీఆర్‌గారూ.. ఎప్పుడూ కరీంనగర్ నుంచే ప్రారంభిస్తారు. మా సంగతేంటి? మా దగ్గరికి రారా? అని అడిగారు. మొట్టమొదట కరీంనగర్ జిల్లాలో ప్రారంభించి ఆ తదుపరి మీ దగ్గరికే వస్తానని చెప్పాను. కారణమేంటంటే కరీంనగర్ నుంచి ఏ పని మొదలుపెట్టినా వందకు వందశాతం విజయం సాధిస్తున్నాం. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుతున్నాం. అందుకే ఏ కార్యక్రమాన్నైనా కరీంనగర్ జిల్లానుంచే ప్రారంభిస్తున్నాం. ఇప్పుడే కాదు తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేపట్టిన సమయంలోనూ సింహగర్జన సభ ఈ గడ్డపైనుంచే ప్రారంభమైంది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. బక్క ప్రాణంగల కేసీఆర్ తెలంగాణ తేడు.. మధ్యలోనే విడిచిపెట్టి వెళ్తాడంటూ చాలామంది శాపనార్థాలు పెట్టారు. 14 సంవత్సరాల ఉద్యమకాలంలో ఎన్నో ఆటుపోట్లు, రాజీనామాలు, పోరాటాలు చేసి, తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఆకాశమంత ఎత్తు ఎగిరేసిన నాకు అండగా అన్ని విధాలుగా అండగానిలిచింది కరీంనగర్ జిల్లానే. అందుకే తెలంగాణ రాష్ట్రం సాధించడం సాధ్యమైంది.

ఆకారం చిన్నదే అయినా.. మా పని పెద్దది.. మా ఆకారాలు చిన్నగానే ఉన్నాయి. పొట్టిగానే ఉన్నం.. బక్కగానే ఉన్నం.. నన్ను చూసినా.. ఈటల రాజేందర్‌ను చూసినా సన్నగానే ఉంటాం.. కానీ పని చాలా పెద్దగా చేస్తున్నాం. కాంగ్రెస్ నాయకుల ఆకారాలు చూస్తే ఆరేడు అడుగులు ఉంటాయి.. ఒక్కొక్కరు 70, 80 కేజీలకు తక్కువ లేరు. కానీ వారికి మెదడులేదు.. పనిచేసే తెలివిలేదు. కమిట్‌మెంట్ లేదు. అందువల్లే గతంలో ఏమీ సాధించలేకపోయారు. ఈటల రాజేందర్ జిల్లాకు రూ.500 కోట్లు అడిగారు. రాజేందర్ మాట తీసేసే ప్రశ్నే ఉండదు. రాజేందర్ అత్యంత సన్నిహితుడే కాదు, తమ్ముడి లాంటి వారు. అందుకే కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు అప్పు తెచ్చయినాసరే రూ.500 కోట్లు మంజూరుచేస్తున్నా.

తెలంగాణ సత్తా చాటిన అనుదీప్ తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలామంది చాలా శాపనార్థాలు పెట్టారు. మీకు కరంటే ఉండదు.. చిమ్మచీకటి రాజ్యమేలుతుంది.. మీకు తెలివిల్లేవు.. పరిపాలన చేయరాదు.. అంటూ విమర్శలుచేశారు.. ఆ సన్నాసులందరికీ నేను ఒకే ఒక్క సమాధానం చెప్తున్నా.. తెలంగాణ సత్తా ఏంటో మొన్న రుజువు చేసింది కూడా పాత కరీంనగర్ జిల్లానే. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి బిడ్డ అనుదీప్ సివిల్స్‌లో ఆలిండియా టాప్‌ర్యాంక్ సాధించడం గొప్ప పరిణామం. అనుదీపే కాదు ఆరేడు టాప్ ర్యాంకులు తెలంగాణకు వచ్చాయి.

ప్రజాప్రతినిధులు, అధికారులు రెండు చక్రాలు మంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, గొప్ప ఎమ్మెల్సీలు, 75 లక్షల మంది పార్టీ కార్యకర్తలతో ఈ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పనిచేస్తున్నది. అదే స్ఫూర్తితో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మొదలు వీఆర్వో వరకు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. వారందరికీ సభా వేదికనుంచి సెల్యూట్ చేస్తున్నా. కలెక్టర్ ధర్మారెడ్డి నీటి తీరువా మాఫీ చేయాలంటూ ఒక ప్రజాప్రతినిధిలాగా నా దృష్టికి తీసుకొచ్చి నాచే మాఫీ ప్రక్రియ చేయించారు. ప్రభుత్వ అధికారులుకూడా అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఎలా చొరవ చూపుతున్నారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. రైతుబంధు కార్యక్రమమైనా, నిరంతర విద్యుత్తు అయినా, రికార్డుల ప్రక్షాళన అయినా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో రెండు చక్రాల్లా పనిచేశారు కాబట్టే అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి.

అనేక రంగాల్లో నంబర్ వన్ మనమే.. కరంటే ఉండదని ఆనాడు విమర్శలు చేశారు. కానీ తెలంగాణ ఏర్పడిన అనతికాలంలోనే సమస్యను పరిష్కరించడమే కాదు పరిశ్రమలు, దుకాణాలు, రైతులతోపాటు అన్ని వర్గాలకు 24 గంటలపాటు సరఫరాచేస్తున్నాం. దేశంలో 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. అంతేకాదు హోంగార్డులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు అత్యధిక వేతనాలు ఇచ్చే రాష్ట్రం కూడా తెలంగాణే. వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం కూడా మనదే. ఎవరెన్ని శాపాలు పెట్టినా సత్యం, ధర్మం, మనవైపే ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా ముందుకుపోతున్నాం. ఇండియాలో 20% సొంత ఆదాయం కలిగిన రాష్ట్రం కూడా మనదే. వేరే వాళ్లు మనదాంట్లో సగం కూడా లేరు. మిగిలిన వాళ్లు పదిశాతం లోపలే ఉన్నారు. రేపటితరాల కోసం అవసరమైన క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ 28% చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. ఎవరెన్ని విమర్శలు చేసినా మీ అందరి దీవెనలతోనే విజయాలన్నీ సాధిస్తున్నాం.

నాడు కాంగ్రెస్ నాయకులు నోరు మెదపలేదు.. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ల మాట వింటే ఆగమైపోతారు జాగ్రత్త. ఆంధ్రా నాయకులు తెలంగాణ ప్రాజెక్టులను పండబెట్టి, మన పొలాలను ఎండబెట్టి.. 600 ఫీట్ల బోరు వేసుకునే గతి చేసి.. కరంటు సక్కగ ఇయ్యక, ట్రాన్స్‌ఫార్మర్లు, మోటర్లు కాలబెట్టి.. తెలంగాణను నాశనం చేస్తే.. ఆనాడు వారికి తొత్తులుగా మారి నోరు మెదపలేదు. చివరికి ఆనాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే ఒక్కరూ మాట్లాడలేదు. మళ్లీ వాళ్లే ముందుకు వచ్చి రకరకాల అబద్ధాలతో ప్రచారాలు చేస్తున్నారు. ఏ కారణంతో కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని చెప్తున్నారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. వేలమంది వచ్చి ప్రాజెక్టుకు సందర్శిస్తున్నారు. హైకోర్టు జడ్జిలు, సీడబ్ల్యూసీ వాళ్లు చూసి కాళేశ్వరం అద్భుత ప్రాజెక్టు అంటున్నారు. ఒక్కసారి కాళేశ్వరం నీళ్లొస్తే మిడ్ మానేరు, దిగువ మానేరు జలాశయాల్లో 365 రోజులు నీళ్లుంటాయి. ఈ ఏడాది చివరినుంచే మూడు పంటలు పండించుకోవచ్చు. ప్రాజెక్టుల సాధనకోసం కాంగ్రెస్ మాదిరిగా మేం వ్యవహరించలేదు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాం. తెలివిగా మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నాం. పెన్‌గంగకు 65 ఏండ్ల సమైక్య పాలనలో ఒప్పందాలు చేయలేదు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుల అగ్రిమెంట్ రాలేదు.

మంత్రి ఈటల నాకు ప్రీతిపాత్రమైన తమ్ముడు.. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌పై ముఖ్యమంత్రి తనకు ఎంతో ప్రీతిపాత్రుడైన తమ్ముడని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన ప్రసంగం ప్రారంభించే ముందు ఈటల గురించి చెప్తూనే.. కరీంనగర్ జిల్లా అంటే తనకు ఎందుకింత సెంటిమెంటో కూడా చెప్పారు. కరీంనగర్ జిల్లా ప్రజలు ఎంతో చైతన్యవంతులనీ, అలాగే ఈ జిల్లాకు నాయకత్వం వహిస్తున్న మంత్రి ఈటల రాజేందర్ అంటే తనకెంతో ఇష్టమని అన్నారు. అంతకుముందు మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.500 కోట్లు ఇవ్వాలని కోరిన విషయాన్ని సీఎం గుర్తు చేస్తూ.. రాజేందర్ అడిగిన ఏ పని అయినా తానెప్పుడూ కాదనలేదదనీ, ఇప్పుడు కూడా తన అప్తుడు అడిగిన నేపథ్యంలో.. అప్పుచేసైనా సరే రూ.500 కోట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈటల సన్నగా ఉంటాడనీ, తాను కూడా సన్నగానే ఉంటానని, అయినా పని మాత్రం పక్కాగా చేస్తామని ఒక సందర్భంలో ముఖ్యమంత్రి చెప్పగా.. సభలో ఒక్కసారిగా నవ్వులు వెల్లివిరిశాయి.

ఈ రోజు తెలంగాణ.. గొడవలకు పోకుండా మీరు బతుకాలి.. మేం బతుకాలి అంటూ పొరుగు రాష్ర్టాలతో సయోధ్య చేసుకుంటున్నది. ఈ క్రమంలోనే మహారాష్ట్రతో ఒప్పందంచేసుకున్నాం. కాళేశ్వరం, ప్రాణహిత చేవెళ్ల, లోయర్ పెన్‌గంగ, చనాఖా కొరాటా ప్రాజెక్టులకు ఒప్పందం చేసుకుని, ఢిల్లీ వెళ్లి, ఆ ఒప్పందాన్ని చూపించి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి పొందాం. తెలంగాణకు కేటాయింపు ఉన్న 950 టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి తీసుకోవడానికి అద్భుతమైన ఒప్పందాలు చేసుకున్నాం. కాంగ్రెసోళ్లలా ఇంట్లో పడుకోలేదు. ఒప్పందాలు చేసుకోకుండా కాల్వలు తవ్వలేదు. నీతిగా, నిజాయితీగా శాశ్వత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నీళ్లు పటిష్ఠంగా వచ్చేలా ప్రణాళికలు చేసుకున్నాం. భగవంతుని దయవల్ల అనుకున్న రీతిలో పనులు జరుగుతున్నాయి. పనులన్నీ పూర్తయి ఈ సంవత్సరం చివరికి నీళ్లు వస్తాయి. తదనంతరం తెలంగాణ నిత్యకల్యాణం.. పచ్చతోరణంలా ఉంటుంది. ఒక్క ఉత్తర తెలంగాణే కాదు.. దక్షిణ తెలంగాణలో దేవాదుల ప్రాజెక్టుద్వారా వరంగల్ జిల్లా, సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టుల ద్వారా ఖమ్మంజిల్లా, పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్‌నగర్‌జిల్లా, డిండి పథకం ద్వారా నల్గొండ జిల్లా.. ఇలా యావత్ తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. మాటలు ఊరికే చెప్పడంలేదు. 38 ఏండ్లు ఆంధ్రా సీఎంలు పెండింగ్ పెడుతుంటే నోరు తెరువని కాంగ్రెస్ నాయకులు ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, ప్రాజెక్టులను పూర్తిచేశాం. మహబూబ్‌నగర్ జిల్లా గణప సముద్రం చెరువు నిండిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నా. ఉద్యమ సమయంలో పల్లెపల్లెలో పల్లేర్లు మొలిసే పాలమూరులోనా అనే పాట రాసిన గోరటి వెంకన్న ఇప్పుడు గణపసముద్రం నిండిందని చిందేసి పాడే పరిస్థితి వచ్చింది.

అగ్రవర్ణాలకు త్వరలో తీపి కబురు ఎస్సీ, బీసీ, మైనార్టీలకు రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుచేశాం. ఇవి అద్భుతంగా ఉన్నాయి. వాటిలో తమ పిల్లలకూ అవకాశం కల్పించాలని బ్రాహ్మణ, రెడ్డి, వెలమ, కమ్మ, తదితర వర్గాలవారు వచ్చి కోరారు. వీటి మాదిరిగానే తమకూ కొన్ని పాఠశాలలు ఏర్పాటుచేయాలని అగ్రవర్ణాల్లోని పేదలు కోరుతున్నారు. కులం ఏదైనా పేదరికం ఒక్కటే. అగ్రకులాలలోని పేదలకు కూడా న్యాయం జరుగాలి. దీనిపై మంత్రులు, అధికారులతో చర్చిస్తున్నాం. త్వరలోనే తీపి కబురు అందిస్తాం. అగ్రకులాల్లోని పేదలెవరూ ఆగం కావద్దు. ఆందోళన చెందొద్దు.

మద్దతు ధరకు యుద్ధం చేయాలి వ్యవసాయం బాగుంటేనే దేశం బాగుంటుంది.. వ్యవసాయం బాగుండాలంటే రైతుకు ముఖ్యంగా భూమి, నీళ్లు, పెట్టుబడితోపాటు మద్దతు ధర కావాలి. మద్దతు ధరకోసం మనమంతా యుద్ధం చేయాలి. ప్రధానమంత్రితో కొట్లాడాలి. మన ఎంపీలు ఇప్పటికే కొట్లాడుతున్నరు. రైతుకు కనీస మద్దతు ధర రావాలి. మనం అసెంబ్లీలో తీర్మానంచేసి పంపించాం. ఈరోజు రైతు వేదికగా తీర్మానం చేస్తున్నా.. మీరందరూ చప్పట్లు కొట్టి ఆమోదించాలి. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనీ, కూలీలకు ఇచ్చే డబ్బు సగం ప్రభుత్వం, సగం రైతు భరించాలన్న నా అభిప్రాయాన్ని ఆమోదించాలని కోరుతున్నా. (సీఎం ఈ మాట చెప్పగానే సభకు హాజరైనవారందరూ పెద్ద ఎత్తున హర్షాధ్వానాలు చేస్తూ, చేతులెత్తి ఆమోదించారు.) కేంద్రం అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలి. తియ్యటి, పుల్లటి మాటలు చెప్పడం కాదు. మీకు చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే ఇప్పుడిస్తున్న మద్దతు ధరలో నాలుగోవంతు పెంచి ఇవ్వాలి.

అన్ని వర్గాలకూ న్యాయం.. రాష్ట్రంలో జరిగే సంక్షేమం దేశంలో ఎక్కడైనా జరుగుతున్నదా? ఏ వర్గం సంక్షేమాన్నైనా ఈ ప్రభుత్వం వదిలిపెట్టిందా? రాష్ట్రంలో 40 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నం. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, విద్యాలయాల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నం. ప్రభుత్వ దవాఖానలో ఎవరైనా చనిపోతే పైసా ఖర్చులేకుండా ప్రత్యేక వాహనాలు ఇచ్చి మృతదేహాన్ని వారి ఇంటికి పంపిస్తున్నం. ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 30% రిస్క్ అలవెన్సు ఇస్తున్నం. అన్నదాత అకాల మరణం చెందితే కుటుంబం రోడ్డున పడకుండా రూ.5 లక్షల బీమా పథకాన్ని అమలుచేస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణనే. జూన్ 2 తదుపరి బీమా పథకాన్ని అమల్లోకి తెస్తం. రెండేండ్ల తర్వాత ధనిక రైతులు ఎక్కడున్నారని ప్రశ్నిస్తే ఆ కీర్తి తెలంగాణ రైతులకు దక్కాలె. యాదవ సోదరులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.5వేల కోట్లతో గొర్రెలు కొనుగోలుచేసి ఇచ్చాం. తద్వారా ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు యాదవులు సంపాదించారు. చేనేత కార్మికులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా 50% సబ్సిడీపై నూలు, వివిధ రకాల రసాయనాలు ఇవ్వడంతోపాటు వారు నేసిన వస్ర్తాలను ప్రభుత్వమే కొనుగోలుచేస్తున్నది. మత్స్యకార్మికుల సంక్షేమంకోసం వెయ్యి కోట్ల రూపాయలతో చేప పిల్లలు కొనివ్వడమే కాకుండా భవిష్యత్‌లో వారికి కావాల్సిన వలలు, మరబోట్లు తదితర సౌకర్యాలు కల్పిస్తాం. మైనార్టీల సంక్షేమానికి 130 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిథ్యం వహించే కేంద్రం తన బడ్జెట్‌లో రూ.4వేల కోట్లను కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.2వేల కోట్లను కేటాయించింది. ఇంత డబ్బు దేశ చరిత్రలో ఏ రాష్ట్రమూ కేటాయించలేదు. మిషన్ భగీరథ పథకాన్ని చూసి ప్రపంచమంతా అబ్బురపడుతున్నది. రాబోయే 15, 20 రోజుల్లో గ్రామాలకు నీళ్లొస్తయి. మరో మూడు నెలల్లో ఇంటింటికీ నల్లాలు ఫిట్‌చేసి సురక్షిత నీటిని ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తద్వారా ప్రజలు రోగాలబారిన పడకుంటాఉంటారు.

ప్రభుత్వ వైద్యులు కష్టపడుతున్నారు ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు విశ్వాసం పెరుగుతున్నది. ఉస్మానియా దవాఖానది వెయ్యి పడకల సామర్థ్యం కాగా, 1800 నుంచి రెండువేల మంది రోగులు ఉంటున్నారు. అయినప్పటికీ వైద్యులు ఓపికతో వైద్యం అందిస్తున్నరు. సరిపోయే బెడ్స్ లేక, రోగులను వెళ్లగొట్టలేక వరండాలో, చెట్ల కింద వైద్యం అందిస్తున్నరు. వీటిపై రకరకాల కథనాలు రాయడం మంచి పద్ధతి కాదు. పాజిటివ్ కోణంలో ఆలోచన చేయాలి. గర్భిణులకు కేసీఆర్ కిట్ అందిస్తుండటంతో ప్రభుత్వ దవాఖానల్లో నాలుగైదు రెట్లు ప్రసవాలు పెరిగినయి.

తెలంగాణ సాధించింది టీఆర్‌ఎస్.. -తెలంగాణను వేధించింది కాంగ్రెస్ -అందరికీ అన్నీ ఇచ్చాం.. మీ దీవెనలివ్వండి..

కొన్ని గుంటనక్కలు రాజకీయ స్వార్థపరులు అవాకులు, చెవాకులు పేలుతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నరు. 60 ఏండ్లు మనల్ని గోస పెట్టి, మోసంచేసి, కాల్చి చంపి ఇబ్బందులకు గురిచేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఇక్కడిది కావచ్చు, ఢిల్లీది కావచ్చు. ఎవరేం చెప్పినా, ఎవరెన్ని పిచ్చి కూతలు కూసినా.. సత్యం ఒక్కటే. టీఆర్‌ఎస్ తెలంగాణ సాధించిన పార్టీ.. కాంగ్రెస్ తెలంగాణను వేధించిన పార్టీ. వాస్తవాలన్నీ మీ ముందున్నాయి. కలలో కూడా అనుకోని అద్భుతమైన పనులు.. ప్రపంచంలో ఎక్కడా లేని వ్యవసాయదారులకు పెట్టుబడి, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేని భూ రికార్డుల ప్రక్షాళన చేసి మీ ఇంటికే వచ్చి పనిచేసేది టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవునా.. కాదా? ఒక్కసారి ఆలోచించాలి. మేం డప్పు కొట్టి చెప్పాల్సిన అవసరం లేదు. చేసిన పనులన్నీ మీ అనుభవంలో ఉన్నాయి. ధర్మం, న్యాయం వైపే ప్రజలు ఉంటారన్న సంపూర్ణ విశ్వాసం నాకున్నది. ఇంత బలంగా, ధైర్యంగా నేను ముందుకు పోతున్నానంటే మీరిచ్చే అండదండలు, ఆశీర్వచనాలు, దీవెనలే కారణం. అవే నాకు పెద్ద పెట్టుబడి. ఆ దీవెన మీరు కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఇదే పద్ధతిలో ముందుకెళ్లి తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా తయారు చేసుకోవాలి. సాధించుకున్న తెలంగాణలో మా రైతు సోదరులకు రూ. 12వేల కోట్లు పెట్టుబడి ఇచ్చే అదృష్టం కలిగిన గొప్ప వ్యక్తిగా సంతోషపడుతున్నా. కరీంనగర్ జిల్లా నుంచే ఈ పథకం ప్రారంభం కావడం, ఇది వంద శాతం విజయం సాధిస్తుందని మనవి చేస్తున్నా.

జూన్ రెండు తర్వాత మరో విప్లవం జూన్ రెండునుంచి తెలంగాణలో మరో విప్లవం రాబోతున్నది. ఇప్పటికే రికార్డుల ప్రక్షాళన పూర్తిచేసుకున్నాం. కరంటు బాగుచేసుకున్నాం. ఈరోజు మోటర్లు, స్టార్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలడంలేదు. దీనివల్ల రాష్ట్రంలో దివాలా తీసింది ట్రాన్స్‌ఫార్మర్లు రిపేర్ చేసే దుకాణాలు, జనరేటర్లు అమ్ముకునే దుకాణాలే. కాంగ్రెస్ పార్టీ కూడా దివాళా తీసింది. వాళ్లు తప్ప మిగతా వాళ్లంతా సంతోషంగా ఉన్నారు. రైతాంగం బాధలు పూర్తిగా పోవాలన్న ఉద్దేశంతోనే జూన్ 2 నుంచి మరో విప్లవాత్మక సంస్కరణ అమల్లోకి తేబోతున్నాం. భూములు అమ్మినా, కొన్నా, లంచాలు ఇయ్యక తప్పని పరిస్థితి. ఆర్వోఆర్ కావాలన్నా, ఈసీ కావాలన్నా, నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగాల్సివచ్చేది. కానీ భారతదేశానికే ఒక దిక్సూచిలా రిజిస్ట్రేషన్ విధానంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాం. రిజిస్ట్రేషన్ అధికారాన్ని ఎమ్మార్వోలకు అప్పగించాం. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 2 తర్వాత పూర్తిగా అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి. వాటిని కొనసాగిస్తూనే అదనంగా 430 మండలాల్లో తహసీల్దార్లే రిజిస్ట్రేషన్ చేస్తారు.

రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ధరణి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. వారంలో సంబంధిత రైతుకు అన్నిరకాల పత్రాలు పోస్టుద్వారా పంపిస్తారు. దీనిద్వారా భూ వివాదాలు ఉత్పన్నం కావు. బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. రాష్ట్రంలో జూన్ 2 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్‌బుక్కులను బ్యాంకు మేనేజర్లు తీసుకోరు. మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. పంట రుణాల కోసం రైతులు బ్యాంకులకు వెళ్తే.. బ్యాంకు మేనేజర్ ధరణి వెబ్‌సైట్‌లో రైతుకు భూమి ఉందా? లేదా? చూసి రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాల్లో పట్టాదారుని పేరు తప్ప అనుభవదారుని కాలం ఉండదు. ఇందులో భాగంగానే కౌలు రైతులకు రైతుబంధు పథకాన్ని వర్తింపజేయడం లేదు. రైతుబంధు పథకం రైతుల ప్రయోజనాల కోసం ఉద్దేశించిందే తప్ప అనుభవదారులకోసం కాదు. మొత్తం రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉందని అధికారులు నివేదికలు ఇచ్చారు. అందుకే పంట వేశారా? లేదా? అనేది చూడకుండా అందరు రైతులకు రైతుబంధు పథకాన్ని వర్తింపజేస్తున్నాం. ఏవైనా రెండు, మూడు చెక్కులు ఇవ్వడంలో ఆలస్యమైతే ఎవరూ ఇబ్బంది పడొద్దు. వాటినికూడా పూర్తిస్థాయిలో పరిశీలించి అందిస్తాం. డబ్బులతో వ్యవహారం.నిధులు దుర్వినియోగం కావద్దనే ఉద్దేశంతోపాటు అర్హులైన రైతులకే అందించాలనే లక్ష్యం ప్రభుత్వానికి ఉంది. ఇటువంటి సమయాల్లో రైతు సమన్వయ సమితి కీలకపాత్ర పోషించాలి. ప్రతి గ్రామంలో అర్హులైన రైతులకు న్యాయం జరిగేలా చూడాలి. సమైక్య రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో ధాన్యం నిల్వ చేసుకోవడానికి గోడౌన్ల సామర్థ్యం పెంచాం. రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండాచేశాం. ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలను ఆదుకుంటున్నాం. సబ్సిడీపై వివిధ రకాల పథకాలు రైతులకు అందిస్తున్నాం. తెలంగాణ సాధన కోసం నిమ్స్ దవాఖానలో చావు బతుకుల మధ్య ప్రయత్నం చేశా. దాదాపు చనిపోతా అనుకునే సమయంలో మీరందరూ ఉద్యమాలుచేస్తే.. ఢిల్లీ దిగి వచ్చి తెలంగాణ ప్రకటన చేసింది. వచ్చిన రాష్ట్రం ఆరు నూరైనా సరే.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సరే.. కోటి ఎకరాలు పచ్చబడేదాక కేసీఆర్ నిద్రపోడు.

దేశానికి దిక్సూచి పంట పెట్టుబడి పథకం -దేశంలో రైతుకు అండగా నిలిచింది తెలంగాణ సర్కారే -రైతు బంధు కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌కుమార్ రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి ఇవ్వడంతో తెలంగాణ దేశానికి దిక్చూచిలా మారిందని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. ఈ పథకంతో తెలంగాణ రైతుల్లో భరోసా కలిగిందని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఇందిరానగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభమైన రైతుబంధు పథకం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. విత్తనం మొదలుకొని పెట్టుబడిదాకా తెలంగాణ ప్రభుత్వం రైతుకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. మొదటిసారి ఎంపీగా రైతులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీచేసే కార్యక్రమంలో పాల్గొనడం తనకు దక్కిన అదృష్టమని అన్నారు. చాలా మంచి కార్యక్రమం తెలంగాణ రైతుల కోసం జరుగుతున్నది.. రైతుల కండ్లలో ఆనందం కనిపిస్తున్నది. రైతుకు అండగా తెలంగాణ సర్కారు ఎల్లప్పుడూ ఉంటుంది. విత్తనం నుంచి దుక్కి దున్నడం, ఎరువులు వేయడం వరకు పంట పెట్టుబడి ఇస్తున్నది. రైతులకు సాగునీటికి ఇబ్బంది రాకుండా ఉండటంకోసం 24 గంటల నిరంతర విద్యుత్‌తోపాటు ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్నది. చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేసింది. రైతులు పండించిన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల ద్వారా గిట్టుబాటుధరకు కొనుగోలు చేస్తున్నది. దీంతో తెలంగాణ రైతులంతా ధీమాతో వ్యవసాయం చేస్తున్నారు. తమకు సర్కారు అండగా ఉందన్న భరోసా యావత్ తెలంగాణ రైతాంగానికి కలిగింది. అని జోగినపల్లి సంతోష్‌కుమార్ తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.