-మీడియాతో రాష్ట్ర వ్యవసాయమంత్రి నిరంజన్‌రెడ్డి
-గోయల్‌తో రాష్ట్ర మంత్రులు,ఎంపీల బృందం భేటీ

యాసంగిలో తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మరోసారి స్పష్టం చేశారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వానకాలంలో అదనపు పంట కొనుగోలుపై లిఖిత పూర్వక హామీకి డిమాండ్చేయగా ఒకటి రెండు రోజులు సమయం కోరారని, అధికారులతో చర్చించి నిర్ణయం చెప్తానని తెలిపారని పేర్కొన్నారు. దీనిపై స్పష్టత వచ్చేవరకు ఢిల్లీ వదిలి వెళ్లేది లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి తేల్చి చెప్పారు. తాము రైతుల కోసం ఢిల్లీకి వచ్చామని, రాజకీయం చేసేందుకు రాలేదని అన్నారు. ధాన్యం సేకరణ, సీఎమ్మార్ వేగవంతంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో రాష్ట్ర మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వర్రావు తదితరులు మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ… ఈ వానకాలంలో కేంద్రం ఇచ్చిన 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు టార్గెట్ నేడో రేపో పూర్తవుతుందని తెలిపారు. ఈ అంశాన్ని కేంద్ర మంత్రి కూడా ఒప్పుకొన్నారని తెలిపారు. మరో 10-12 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నదని, మిగిలిన కోతలు పూర్తయితే మరో 5 లక్షల టన్నుల ధాన్యం రావొచ్చని తెలిపారు. కేంద్రం టార్గెట్ పూర్తికావడంతో మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటే కేంద్రం నుంచి లిఖిత పూర్వక హామీ కావాలన్నారు. రాష్ట్రం కొనుగోలు చేసిన తర్వాత కేంద్రం తీసుకోని పక్షంలో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. రాష్ట్రంలో సీఎమ్మార్ సేకరణలో జరుగుతున్న జాప్యాన్ని కేంద్రమంత్రికి వివరించినట్లు తెలిపారు. తమ ముందే రైల్వే మంత్రి, ఎఫ్‌సీఐ అధికారులతో మాట్లాడి.. సమస్య ఉన్నట్టు ఒప్పుకొన్నారని తెలిపారు. ఇకపై రాష్ట్రం నుంచి సీఎమ్మార్ సేకరణ, తరలింపును వేగవంతం చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ప్రతి నెల 10 లక్షల టన్నుల సీఎమ్మార్ ఇచ్చే కెపాసిటీ ఉన్నప్పటికీ ఎఫ్‌సీఐ తీసుకోవడం లేదనే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.
తప్పులు మీవి.. నిందలు మాపైనా?
తప్పులు కేంద్రం వద్ద పెట్టుకొని రాష్ట్రంపై నిందలు వేయడంపై నిరంజన్‌రెడ్డి ఆసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడం చేతగాక.. రాజకీయం చేస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాత విధానాలతో తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగి, భారీగా పంట దిగుబడి వచ్చిందని వెల్లడించారు. ఏడేండ్ల క్రితం 35 లక్షల మె ట్రిక్ టన్నుల పంట దిగుబడి ఉంటే, నేడు 3 కోట్ల టన్నులకు చేరుకొన్నదని చెప్పారు. రైతు విజయంలో బీజేపీ పాత్ర ఏమీ లేదని, వ్యవసాయ అభివృద్ధిలో కేంద్రం ఏకాణ పైసా ఇవ్వలేదని తెలిపారు. ఇక ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర బీజేపీ నేతల వైఖరిని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ బిడ్డ కాదా? తెలంగాణ రైతులకు మేలు చేయాల్సిన బాధ్యత ఆయనకు లేదా? అని ప్రశ్నించారు.