Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతుల తరఫున నేనే ఉద్యమిస్తా!

-రైతుల ఓపికను ఇంకా పరీక్షించొద్దు -జాతీయ పార్టీలకు అది క్షేమం కాదు -ఆరు నెలల్లో చెనాక కొరాట పనులు పూర్తిచేస్తాం -చల్లటి జిల్లాలో అశాంతి రేపాలని చూస్తున్నారు -ఆదిలాబాద్ బహిరంగసభలో సీఎం కేసీఆర్

రైతు సంక్షోభానికి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే కారణమని తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. ఇంకా రైతుల ఓపికను పరీక్షించడం మంచిదికాదని జాతీయపార్టీలకు హితవు పలికారు. అవసరమైతే రైతుల తరఫున తానే ఉద్యమిస్తానని ప్రకటించారు. మంగళవారం ఆదిలాబాద్ డైట్ కాలేజీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ.. నిన్న నేను జాతీయ పార్టీలపై మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటా. గడిచిన 70 ఏం డ్లలో పెన్‌గంగ, గోదావరి నదుల నుంచి వేల టీఎంసీల నీరు సముద్రం పాలైంది. దేశంలో ఏటా 75 వేల టీఎంసీల నీటిని ప్రకృతి ఇస్తే, 24-25వేల టీఎంసీలు మించి వాడుకోవడం లేదు. రెండు జాతీయ పార్టీలు సిగ్గుతో తలదించుకోవాలి. చిల్లర మల్లర మాటలు కాదు. దమ్ముంటే కేసీఆర్ మాటకు జవాబు ఇవ్వాలి. 70 ఏండ్లు గాడిద పండ్లు తోమిండ్రా? అని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలకు కారకులెవరు? రైతుల పంటలకు మద్దతు ధర ఇస్తే నీ అయ్య ముల్లేమైనా పోతుందా? అని నిలదీశారు. ఉద్యోగులకు డీఏ పెంచినట్టు రైతులకు మద్దతు ధర ఎందుకు పెంచరని ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తమ ఎంపీలు రైతు సమస్యలపై నిలదీస్తారని చెప్పారు. ప్రధానమంత్రికి కూడా చెప్పాను. రైతుల ఓపికను ఇంకా పరీక్షించటం జాతీయ పార్టీలకు క్షేమంకాదు. మీ స్టోరీలను చాలా విన్నారు. అవసరమైతే రైతుల తరఫున నేనే ఉద్యమిస్తా.. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. పంటలకు మద్దతు ధర రాబట్టడానికే రైతు సమన్వయ సమితులు ఏర్పాటుచేశామని, రైతులను ధనిక రైతులుగా మార్చేందుకు కృషిచేస్తానని స్పష్టంచేశారు.

ఎల్‌ఈడీ వెలుగులు మా ఘనత నేను 30ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నా. కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీడీపీ.. టీడీపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్.. ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నవారు ఎండిన కంకులు, వరి ఆకులతో వచ్చేవారు. కానీ గ్రామాల్లో కరంటు రాలేదు. గోండు, కొలాం, ఆదివాసీ, గిరిజనగూడేల్లోని ప్రధాన కూడళ్లలో ఎల్‌ఈడీ బల్బులు తెచ్చి 24గంటల కరంటు ఇచ్చిన ఘనత గులాబీ కండువ వేసుకున్న మాదే అని ముఖ్యమంత్రి చెప్పారు. దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా రైతులకు 24గంటల విద్యుత్తు ఉచితంగా ఇస్తున్నామని అన్నారు.

కొట్లాటలొద్దు.. సుఖసంతోషాలతో బతుకుదాం మంచి జిల్లా, చల్లటి జిల్లా. గిరిజనులు ఉన్న జిల్లా. కోలాం, ప్రదాన్‌లు, గోండు, లంబాడాలు అన్నిరకాల ప్రజలు బతికే జిల్లాలో మన మధ్య జుట్లు ముడేసి అశాంతి నెలకొల్పాలని చూస్తున్నరు. వారికి ప్రజల్లో చెప్పుకోవటానికి ఏమీలేదు. ఈసారి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 106 సీట్లు వస్తయని సర్వేలు చెప్తున్నయి. వారికి ఓట్లేయరని తెలుసు. ఇది తెలిసి అశాంతి నెలకొల్పాలని చూస్తున్నరు అని సీఎం విమర్శించారు. తాగ్యాలు, బలిదానాలతో సాధించుకున్న రాష్ర్టాన్ని పాడిపంటలతో పచ్చని తెలంగాణగా మార్చుకోవాలని, సుఖశాంతులతో బతుకాలని అన్నారు. అంతేకానీ మనలోమనం కొట్లాడుకోరాదని హితవుపలికారు.

లోయర్ పెన్‌గంగ ప్రతిష్టంభనను తొలిగించాం లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు గత ప్రభుత్వాల కాలంలో పెద్ద ఎలక్షన్ డ్రామాగా మారిందని సీఎం విమర్శించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలివితక్కువతనం వల్లే ఐదు దశాబ్దాల కల సాకారంకాలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక నేనే స్వయంగా మహారాష్ట్రకు రెండు మూడుసార్లు వెళ్లి ముఖ్యమంత్రిని కలిశా. అక్కడికి మంత్రి హరీశ్‌రావును, అధికారులను పంపించాను. నేను, మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ నగేశ్ కలిసి వెళ్లి అక్కడి మంత్రులతో మాట్లాడాం. ఇద్దరికీ ఉపయోగపడేలా సమస్యను పరిష్కరించాం. మీరు బతుకండి.. మమ్మల్ని బతుకనీయండి.. అని కోరాం. వారు ఒప్పుకున్నారు అని సీఎం వివరించారు. పెన్‌గంగ ప్రాజెక్టుతో వచ్చే ఆరు నెలల్లో ఆదిలాబాద్ జిల్లాలో 70 వేల ఎకరాలకు నీళ్లు రాబోతున్నాయన్నారు. జూన్, జూలై తర్వాత ప్రాజెక్టు పూర్తయ్యేలా ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు పనుల్లో వేగం పెంచాలని ఆదేశాలిచ్చానని తెలిపారు. తానే వచ్చి ప్రారంభోత్సవం చేస్తానని, ఈ ఏడాది ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు పారించి తమది ఎలాంటి పనిమంతుల ప్రభుత్వమో రుజువు చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు.

తెలంగాణకే కశ్మీర్.. ఆదిలాబాద్ ఆదిలాబాద్ నియోజకవర్గం తెలంగాణకే కాశ్మీర్‌లాంటిదని, కానీ, ఈ జిల్లాలో సమైక్య రాష్ట్రంలో జరుగాల్సిన అభివృద్ధి జరుగలేదని సీఎం కేసీఆర్ అన్నారు. సాత్నాల ప్రాజెక్టును చాలా ఏండ్లు పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాల్వల ఆధునీకరణకు రూ.28 కోట్లు మంజూరు చేసి, 24వేల ఎకరాలకు సాత్నాల ప్రాజెక్టు నుంచి నీళ్లు అందించే పరిస్థితి తెచ్చామని గుర్తుచేశారు. 28 చెరువులకు నిధులు ఇచ్చామని, 20 వేల ఎకరాల ఆయకట్టు వచ్చిందని అన్నారు. 18 చెరువులు కావాలని కొత్తగా ప్రతిపాదన ఉందని, దీనిని పరిశీలించాలని అధికారులకు చెప్పామని, త్వరలోనే వాటిని మంజూరు చేస్తామని చెప్పారు.

త్వరలో ఆదిలాబాద్‌లో డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ జోగు రామన్న చాలా హుషారు. లోయర్‌పెన్‌గంగ ఇస్తే చాలన్నారు. రూ.200 కోట్లు పనులు అడిగారు. ఆయన అడిగినట్లు ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు పెద్ద మాట. ఆదిలాబాద్‌లో 350ఎకరాల జాగా ఉంది. ఇందులో త్వరలోనే మినీ ఏరోడ్రమ్ ఏర్పాటుచేస్తాం అని చెప్పారు. బీఎస్సీ అగ్రికల్చరల్ కాలేజీ మంజూరుచేస్తున్నానని, త్వరలోనే దాన్ని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జోగు రామన్నకు తెలంగాణ సంస్కారం ఉంది. బోథ్ నియోజకవర్గంలో మరాఠీ మాట్లాడేవారు 30% ఉంటరని స్థానిక ఎమ్మెల్మే, ఎంపీ చెప్పారు. మరాఠీ జూనియర్ కాలేజీ కావాలని జోగు రామన్న కోరారు. దీన్ని మంజూరుచేసి తెలంగాణ కాస్మోపాలిటన్ సంస్కృతి భారతదేశమంత గొప్పగా ఉంటుందని చాటుతాం అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.