Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతులందరికీ చెక్కులు

-సాంకేతిక కారణాలు చూపి చెక్కులు ఆపొద్దు -చిన్నపాటి తేడాలుంటే పట్టించుకోవద్దు -రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు -నాన్ రెసిడెంట్ ఖాతాలకూ వర్తింపు -స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం -పండుగలా రైతుబంధు కార్యక్రమం -నగదు నిల్వలు సిద్ధంచేసిన ఆర్థికశాఖ -విదేశాల్లో ఉన్నవారికి పంపిణీ ఎలా? -సీఎం దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు

సాగుభూమి ఉన్న రైతులందరికీ పెట్టుబడి పథకం కింద చెక్కులు ఇవ్వాలని ప్రభుత్వం క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. చిన్నచిన్న సాంకేతిక కారణాలు చూపి చెక్కులు ఇవ్వడం నిలిపివేస్తే రైతులు ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నది. పెట్టుబడి చెక్కు తీసుకోవడానికి వచ్చిన రైతు.. ఖాతా నంబర్‌లోని భూములకు యజమానా? కాదా? అనేది ధ్రువీకరించుకుని చెక్కులు ఇవ్వాలని స్పష్టంచేసింది. ఇది లేదు.. అది లేదు.. అంటూ రైతులను వేధించవద్దని ఆదేశించింది. సాగుభూమి వివరాలకు సంబంధించి గుంటల్లో రైతులు చెప్పేలెక్కలకు, రికార్డులకు స్వల్ప తేడాలున్నా చెక్కులు ఇవ్వాల్సిందేనని, భారీఎత్తున ఎకరాలలో తేడాలుంటేనే పరిశీలించాలని తెలిపినట్టు సమాచారం. రైతులను ఏకారణం చేతనైనా ఇబ్బంది పెట్టే అధికారులపై చర్యలు తీసుకుంటామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రైతులకు చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీని ఒక పండుగలా చేపట్టాలని నిర్ణయించామని, ఈ పండుగ వాతావరణంలో రైతులు తమకు పెట్టుబడి రాదని దిగులుపడకూడదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇదివరకే అధికారులకు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. 67,87,228 ఖాతాలు క్లియర్రాష్ట్రవ్యాప్తంగా 72,09,694 రైతు ఖాతాలుంటే అందులో 67,87,228 ఖాతాలు క్లియర్‌గా ఉన్నాయి. ఇందులో 57,33,025 ఖాతాలకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇవ్వనున్నారు. అయితే ఆధార్ సీడింగ్ సమస్యవల్ల 49,93,619 ఖాతాలకు మాత్రమే ఇప్పటివరకు డిజిటల్ సంతకాలు పూర్తయ్యాయి. పట్టాదార్ పాస్‌పుస్తకం ఉన్నవారికే చెక్కులు ఇవ్వాలంటే కేవలం 49.93 లక్షల మంది రైతులకే ఇవ్వాల్సి వస్తుంది. దీంతో మిగిలిన రైతులు చాలామంది ఇబ్బంది పడుతారు. దీనిని గుర్తించి సర్కారు.. మొదట ఆధార్ సీడింగ్ కాకున్నా రైతులు తమ ఆధార్ కార్డు తీసుకొస్తే చెక్కులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇలాకూడా చాలామంది రైతులు మిగిలిపోయే ప్రమాదం ఉన్నదని గుర్తించిన సర్కారు, భూమిని సాగుచేసుకునే రైతులు పంపిణీ కేంద్రాలకు వస్తే వారి గుర్తింపును ధ్రువీకరించుకొని చెక్కులు ఇవ్వాలని ఆదేశించింది.

స్థానికంగాలేని భూ యజమానులకూ వర్తింపు సమైక్య పాలకులు అనుసరించిన వ్యవసాయ ప్రతికూల విధానాలవల్ల భూ యజమానులు చాలామంది బతుకుదెరువు కోసం పట్నం బాట పట్టారు. కూలీలుగా, వాచ్‌మెన్‌లుగా, పరిశ్రమలలో కార్మికులుగా మారారు. హైదరాబాద్‌తోపాటు ముంబై, భీవండి, పుణె, సూరత్, చెన్నైలాంటి నగరాలకు వెళ్లి బతుకుతున్నారు. మరికొంతమంది గల్ఫ్‌దేశాలకు వలసవెళ్లారు. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో రెవెన్యూ అధికారులకు వీరు అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయాభూముల రైతులను నాన్‌రెసిడెంట్ రైతులుగా రికార్డుల్లో నమోదుచేసుకున్నారు. ఆధార్ సీడింగ్ చేయించుకోనివారిలో వీరుకూడా ఉన్నారు. వీరి భూములను ఇతర కుటుంబసభ్యులు, బంధువులు సాగుచేస్తున్నారు. ఈ భూమి సాగుచేయడానికి పెట్టుబడిని అక్కడ కూలి చేసి పంపిస్తున్నారు. రైతుబంధు చెక్కుల పంపిణీ నేపథ్యంలో చెక్కులు తీసుకునేందుకు రావాల్సిందిగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారికి ఇక్కడి బంధువులు, చేను సాగుచేస్తున్న తోటి రైతులు సమాచారం అందించారు. ఈ మేరకు కొందరు తమ గ్రామంలో చెక్కులు పంపిణీ చేసే రోజు తెలుసుకుని తిరిగి వస్తున్నారు. ఇలా వచ్చిన రైతులకు కూడా చెక్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విదేశాల్లో ఉన్నవారికి ఎలా? బతుకుదెరువు కోసం గల్ఫ్, ఇతర దేశాలకు వలస వెళ్లిన వారికి చెక్కులు ఎలా అందించాలన్న విషయంలో స్పష్టత లేదు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి భారీ ఎత్తున విదేశాలకు వలసవెళ్లారు. భూమి వలస వెళ్లినవారి పేరుతో ఉంటే.. ఆ భూములను ప్రధానంగా వారి భార్యాపిల్లలు లేదా తల్లిదండ్రులు సాగుచేస్తున్నారు. భూమి యజమానికే చెక్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గల్ఫ్ తదితర దేశాల నుంచి చెక్కులు తీసుకోవడానికి రావడం అనేది దాదాపు అసాధ్యం. రానుపోను ఖర్చులే అధికంగా ఉంటాయి. కానీ, సదరు వలస రైతులకు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి చెక్కులు ఆయా రైతు కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటాయి. అయితే, సాంకేతికంగా సమస్య ఎదురవుతున్నది. ఈ పరిస్థితుల్లో వారికి ఏవిధంగా పెట్టుబడి చెక్కులు అందజేయాలన్న దానిపై కసరత్తు జరుగుతున్నది. క్షేత్రస్థాయి అధికారుల నుంచి ఈ సమస్య గురించి తెలుసుకున్న కలెక్టర్లు ప్రభుత్వానికి వివరించగా, ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. నాన్ రెసిడెంట్ ఖాతాలు 10 లక్షల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో దాదాపు మూడు లక్షల ఖాతాలు విదేశాలలో ఉండే రైతులకు చెందినవేనని భావిస్తున్నారు.

నగదు ఏర్పాటు చేస్తున్న సర్కారు పెట్టుబడి చెక్కులకు సొమ్ము పంపిణీ చేయడానికి ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఖజానాలో సొమ్ము నిల్వ ఉంచుతున్నది. వివిధ ఆదాయమార్గాల్లో వచ్చిన సొమ్మును ఖర్చుచేయకుండా రైతుల కోసమే ప్రత్యేకంగా అట్టిపెట్టింది. గత 15 రోజులుగా పకడ్బందీగా వ్యవహరిస్తూ ప్రతి రైతుకు సొమ్ము అందేలా పటిష్టమైన చర్యలు తీసుకున్నది. ఇప్పటివరకు రూ.4,144 కోట్లను ఖజానాలో జమచేసింది. మరో రెండుమూడు రోజుల్లో ఆరువేల కోట్ల వరకు నిల్వలు చేరుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే బ్యాంకుల్లో ఎట్టి పరిస్థితుల్లో నగదు కొరత రాకుండా రిజర్వుబ్యాంకు నుంచి కావాల్సినంత నగదును తెప్పించారు. రూ.40 వేల నుంచి ఆపైన పెట్టుబడి అందుకునే పెద్దరైతులు ఆ చెక్కులను తమ ఖాతాల్లోనే జమ చేసుకుంటారని భావిస్తున్నారు. ఎకరం నుంచి ఐదెకరాల వరకు భూమి ఉండే చిన్నరైతులే ఎక్కువగా చెక్కులను నగదుగా మార్చుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో నగదు కొరతకు ఆస్కారం ఉండబోదని అధికారులు స్పష్టంచేస్తున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.