Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతులందరికీ పెట్టుబడి పథకం అమలు

-రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటది -సమైక్య రాష్ట్రంలో మన నోళ్లు కొట్టి.. ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోయారు -దెబ్బతిన్న రైతాంగానికి పూర్వవైభవం తెస్తా: సీఎం కేసీఆర్ -వచ్చే ఏడాదిలోనే మనకు గోదావరి నీరొస్తది -యాసంగి నుంచి రైతులకు 24గంటల విద్యుత్ -ఎన్నికలనాటికి గ్రామ పంచాయతీలుగా తండాలు -గ్రామాల అభివృద్ధికి అందరూ కథానాయకులు కావాలె -తెలంగాణ ఆదాయాన్ని చూసి ప్రధాని ఆశ్చర్యపోయారు -శామీర్‌పేట మండలానికి రూ.100-120 కోట్లు -మీ ఊళ్లో ఇంటికి 6 మొక్కలు నాటండి -నాటిన ప్రతిమొక్కను సంరక్షిస్తే.. ఇంటింటికీ రెండు పాడిగేదెలిస్తాం -మీ గ్రామం, తండాలోని నిరుపేదలకు 100 డబుల్ బెడ్‌రూం ఇండ్లు -మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి గ్రామసభలో ముఖ్యమంత్రి కేసీఆర్

రాష్ట్రంలో భూముల లెక్కలన్నీ ఇక పక్కాగా ఉంటాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో దెబ్బతిన్న తెలంగాణ రైతాంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న కేసీఆర్.. ఈ క్రమంలోనే రైతులకు పెట్టుబడి కింద ప్రతి సీజన్‌కు ఎకరాకు నాలుగు వేలు చొప్పున వచ్చే యాసంగి పంట నుంచి ఇవ్వబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం పారదర్శకంగా ఉండేందుకు త్వరలోనే రాష్ట్రంలోని రెవెన్యూ రికార్డులన్నింటినీ క్రమబద్ధీకరించనున్నామని వెల్లడించారు. మూడు నెలల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని పల్లెలన్నీ పాడిపంటలతో వర్థిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పారు. మంగళవారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం పరిధిలోని కేశవరంలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం మూడుచింతలపల్లికి వచ్చిన ముఖ్యమంత్రి.. 1969 తెలంగాణ ఉద్యమ యోధుడు వీరారెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో సీఎం మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసుకోవాలంటే ప్రజలంతా సంఘటితమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. వచ్చే యాసంగినుంచి 24గంటల విద్యు త్ సరఫరాచేస్తామని ప్రకటించారు. మూడుచింతలపల్లి గ్రామానికి వరాలు కురిపించారు. సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే..

రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటది రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలంటే రైతు బాగుండాలి. రైతుకు కులం ఉండదు. అలాంటి ఆ రైతు బాగుండాలంటే అతనికి ము ఖ్యంగా నీరు, విద్యుత్, పెట్టుబడి కావాలి. ఆంధ్రలో రైతులు బాగుపడ్డారంటే అక్కడ రెండు డెల్టాలున్నాయి. ఉమ్మడి రాష్ర్టంలో మన నోళ్లు కొట్టి నీళ్లు తీసుకుపోయారు కనుక అక్కడ రైతులు బాగుపడ్డరు. మనకు కరెంటు పీడ పోయింది. ఇప్పడు బోర్లు వేసే బాధకూడా పోతది. వచ్చే యాసంగి నుంచి రైతుఖాతాల్లోనే ఎకరాకు రూ.4వేలచొప్పున వేస్తాం. కొందరు పెద్ద రైతులకు మేలు అనే ప్రచారంచేస్తున్నారు. తెలంగాణలో 25 ఎకరాలకు మించిన పెద్ద రైతులు లేరు. అంతా పారదర్శకంగా అర్హులైన రైతులకే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నం. గ్రామం యూనిట్‌గా రెవెన్యూ రికార్డులను క్రమబద్ధీకరించాలని సూచించిన. ఏ గ్రామంలో ఏ భూమి ఎవ్వరి పేరుమీద ఉంది? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మూడు నెలల్లోనే భూములను క్రమబద్ధీకరించడంతోపాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పాసుపుస్తకాలను ప్రతి రైతుకు ఇస్తం. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఇలా అనేక అంశాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నరు. కానీ భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి ఉండదు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం దెబ్బతిన్నది. ఒకప్పుడు ఇంటి ముందు బాలసంతాయన హార్మోనియం పట్టుకొని వస్తేనే సాటెడు.. బుడ్డెడు వడ్లను దానంగా పెట్టే రైతులు నేడు దీనావస్థలో ఉన్నరు. వారిని ఆదుకొని, దెబ్బతిన్న నా తెలంగాణ రైతాంగానికి పూర్వవైభవం తీసుకువస్తాను. మిత్తి లేని, అప్పుకాని పెట్టుబడి ఇవ్వాలనే నేను నగదును రైతుల ఖాతాల్లోనే వేస్తున్న. ప్రతి గ్రామంలో రైతు సంఘం ఏర్పాటుచేస్తున్నం. అలాగే గ్రామ రైతు సమన్వయ కమిటీని ఏర్పాటుచేస్తం. ఆ కమిటీ సంతకంచేసిన వారికే డబ్బులు వస్తయి. భూముల సర్వేకు అధికారులు వచ్చినప్పడు వారికి సహకరించి ఏ భూమి ఎవ్వరిదో స్పష్టంగా చెప్పాలి.

తండాలన్నింటినీ పంచాయతీలుగా మార్చుతం ప్రత్యేక గ్రామ పంచాయతీ కావాలని లింగాపూర్ తండావాసులు అడిగారు. ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు.. కానీ వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్రంలోని తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలు చే స్తాం. గ్రామంలో మహిళా సంఘం భవనం కావాలన్నారు.. ఎకరం లేదా అరెకరం స్థలంలో సుమారు రూ.30లక్షలతో మంచిగా భవనం నిర్మించి ఇస్తం.

చావునోటి వరకు పోయిన.. స్వరాష్ట్ర సాధన ఉద్యమం లో నేను కూడా చావునోటి వరకు పోయిన. మొత్తంగా తెలంగాణ సాధించుకున్నం. నాడు తెలంగాణలోని పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పక్షిలాగ తిరిగిన. ఢిల్లీలో కూడా చెప్పిన.. మా తెలంగాణ బంగారు చిలుక.. మా ప్రాంతాన్ని ఇతరులు దోచుకుంటున్నారని, మా రా ష్ట్రం మాకు వస్తే దేశంలోనే నంబర్‌వన్‌గా ఉంటదని చెప్పిన. అన్నట్లుగానే నాతో నాలుగైదుసార్లు ప్రధానమంత్రి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. మీ రాష్ర్టానికి నిధులు ఎలా సమకూర్చుకుంటున్నరు? అని అడిగిండ్రు. ప్రతి రాష్ర్టానికి సొంత ఆదాయం ఉంటుంది. దీనిని స్టేట్ ఓన్ రెవెన్యూ అంటరు. రాష్ట్ర స్వీయ ఆదాయంలో 21.7% వృద్ధితో దేశంలో నేడు తెలంగాణ ప్రథమ రాష్ట్రంగా అవతరించింది. ఆ రోజు నేను ఏమని వాదించినానో నేడు అది నూటికి నూరుశాతం నిజమైంది. నేను వచ్చి ఒక గ్రామానికి రూ.10కోట్లు ఇవ్వడంతోపాటు వెంటనే జీవోలు జారీ చేయగల్గుతున్నానంటే మనకు ఆదాయం ఉంది. అలాగే కమిట్‌మెంట్ కూడా ఉంది. మన రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందం. బంగారు తెలంగాణ కావాలంటే అందరు సంఘటితంగా కష్టపడాలె. ప్రభుత్వానికి సహకరించాలె.

వీరారెడ్డి పేరిట ప్రజావైద్యశాల.. మనుషులు పుడుతుంటారు.. పోతుంటారు. కానీ కొందరు చరిత్ర సృష్టిస్తారు. అలాంటి ఇద్దరు యోధులు ఈ మేడ్చల్ గడ్డపై పుట్టారు. ఇందులో ఎస్ వెంకట్‌రామిరెడ్డి, మరొకరు ఈ గ్రామ ముద్దుబిడ్డ వీరారెడ్డి. వీరిద్దరూ 1969 తెలంగాణ ఉద్యమంలో చెన్నారెడ్డికి కుడి ఎడమ భుజాలు. వీరారెడ్డి హయాంలో కట్టిన పశువుల దవాఖాన శిథిలావస్థలో ఉందని మీ సర్పంచ్ చెప్పారు. దానిస్థానంలో మంచి దవాఖాన కట్టిస్తాం. లకా్ష్మపూర్ వచ్చినప్పుడు, ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు, ఇక్కడి ప్రజలు 15-20 కిలోమీటర్లు పోతేతప్ప ప్రభుత్వ దవాఖాన లేదని చెప్పారు. ఇదే విషయంపై ఆరోగ్యమంత్రి లకా్ష్మరెడ్డితో మాట్లాడాను. సుమారు 14 గ్రామాల్లోని 30వేల జనాభాకు అందుబాటులో మూడుచింతలపల్లిలోనే ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటుచేస్తాం. వారంలోపే జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డితోపాటు లకా్ష్మరెడ్డి వచ్చి శంకుస్థాపన చేస్తారు. వీరారెడ్డి ప్రజావైద్యశాలగా నామకరణంచేస్తాం. ఆరు నెలల్లోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తాం.

బానిసలుగా బతుకొద్దనే.. ఇంకొకరి కింద బానిసలుగా బతుకొద్దనే లక్ష్యంతోనే నాడు చెన్నారెడ్డితోపాటు వెంకట్‌రామిరెడ్డి, వీరారెడ్డి పోరాటం చేశారని వారిని ఈ రోజు స్మరించుకున్నం. కానీ ఈ రోజు మనం మంచిగా ఉన్నామా? అని ఆలోచించాలి. ఐకమత్యంగాలేము. జీవితాన్ని ఎక్కడో వెతుకుంటున్నం. అది మారాలి. అప్పుడెప్పుడో గజ్వేల్ సమీపంలో వ్యవసాయ భూమి కొన్నప్పుడు ఒకరిద్దరు రైతులను అడిగిన.. ఏమయ్యా ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఉంటాయా? అని. అప్పడు వాళ్లు మూడుచింతలపల్లి, లకా్ష్మపూర్ గ్రామాల చెరువులు నిండితే మన భూములలో ఊటలు వస్తాయి. ఫుల్లునీళ్లు ఉంటాయి అన్నరు. అలాంటి ఈ ప్రాంతం నేడు ఎడారిలా మారింది. ఈ ప్రాంతాన్ని చూస్తుంటే బాధ కల్గుతది. ఈ బాధ వచ్చే సంవత్సరం నుంచి మనకు దూరమైతుంది. మనకు త్వరలోనే గోదావరి నీళ్లు రాబోతున్నాయి. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని మేడ్చల్, కీసర, శామీర్‌పేట్, ఘట్‌కేసర్ మండలాలకు 70-75వేల ఎకరాలకు గోదావరి నీరు ఇస్తరు. నియోజకవర్గ పరిధిలోని 374 చెరువులను ఏటా నింపుతరు. ఒక్కసారి చెరువును నింపడం కాదు.. 365 రోజులు చెరువుల్లో నీళ్లుండేలా చర్యలు తీసుకుంటం. శామీర్‌పేట చెరువు కూడా నింపుతం. దానివల్ల చాలావరకు చెరువు కింది, కాలువల కింది రైతులకు మేలు జరుగుతది.

సమస్యల పరిష్కారానికి రూ.10కోట్లు.. మూడుచింతలపల్లిలో ఉన్న సమస్యలను మీ సర్పంచ్ చెప్పారు. అలాగే కలెక్టర్ ఎంవీ రెడ్డి బృందం సర్వేచేసి సమస్యలను గుర్తించింది. మోరీలు బాగులేవు.. రూ.1.30లక్షలు కావాలన్నారు. మరో రూ.50లక్షలు అదనం అయినా ఫర్వాలేదు. అవసరమైన నిధులిస్తాం. మూడుచింతలపల్లి నుంచి చీకటి మామిడి వరకు డబుల్ రోడ్ నిర్మిస్తాం. మూడుచింతలపల్లి నుంచి మునీరాబాద్, ప్యారారం మీదుగా యాదాద్రి వరకు బస్సు కావాలన్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలి. గ్రామంలో సమస్యల పరిష్కారానికి రూ.10కోట్లు ఇస్తాను. మరో రూ.5 కోట్లను కలెక్టర్ వద్ద ఉంచుతాను. చిన్నచిన్న సమస్యలు ఆ నిధులతో పరిష్కరించుకోవాలి.

మినీ స్టేడియం.. రేపు సాయాంత్రానికల్లా ట్రాన్స్‌ఫార్మర్లు యువకులకు ఆటస్థలం కావాలన్నారు. మూడుచింతలపలి,లక్ష్మాపూర్ గ్రామానికి వెళ్లే రూట్లో 30-40 ఎకరాల స్థలంలో మినీస్టేడియం ఏర్పాటుచేస్తాం. గ్రామంలో సీసీ రోడ్డు కావాలన్నారు. ఓ పెండ్లి చేసుకోవాలన్నా.. గ్రామసభ జరుగాలన్నా.. ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా మంచి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ అవసరం. రూ.70-80లక్షలతో కమ్యూనిటీ హాల్‌ను కూడా నిర్మిస్తాం. రోడ్లు, శ్మశానం, దోబీఘాట్, వెటర్నరీ హాస్పటల్, బీటీరోడ్డుకు ఇరువైపులా మోరీలు, 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు కావాలన్నారు. రేపు సాయంత్రానికల్లా మూడుచింతలపల్లిలో ఐదు 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటుచేస్తారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల వెంటపడి పనులు చేయించుకోవాలి.

నాడు నదులు ఎండినయి.. సమైక్య పాలనలో మన నదులు ఎండిపోయినయి. నా చిన్నతనంలో బస్సులో వస్తుంటే చూసేవాడిని. మే నెలలో కూడా పుష్కలంగా నీరుండే శామీర్‌పేట చెరువులో తుమ్మ లేచింది. ఒక్క పాలమూరు జిల్లా నుంచి 15-16లక్షల మంది వలసపోయే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే నేడు గోదావరి మీద ప్రాజెక్టులను కట్టుకొని, వచ్చే ఏడాదికి లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నం. యాదవ సోదరులకు 84లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఈ రోజువరకు సుమారు 10లక్షల గొర్రెలను పంపిణీ చేసినట్లుగా సమాచారం ఉంది. ఈ గ్రామంలో కూడా 62మందికి గొర్రెల యూనిట్లు అవసరం కాగా ఇప్పటికే 31 మందికి ఇచ్చారు. మిగిలిన వారికి త్వరలోనే ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.

అడవులపై విధ్వంసం జరిగింది మూడుచింతలపల్లిలో సుమారు 2160 ఎకరాల అటవీ భూములున్నాయి. నేడు అవి అడవులుగా లేవు.. ఎడార్లుగా మారినవి. దీంతో కోతులు ఇండ్ల మీద పడ్డాయి. వాటిని అడవులకు వాపసు పంపాలె. మనకు వానలు రావాలంటే విరివిగా మొక్కలు నాటాలె. గ్రామాలు మంచిగా కావాలె. నేడు 48-50 డిగ్రీలకు ఎండలు పోతున్నాయి. ఎంత డబ్బులున్నా బతుకలేని పరిస్థితి ఉంటే ఎందుకు? ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలను నాటాలె. సర్పంచ్‌లు తలచుకుంటే మీ గ్రామం పచ్చబడదా? ప్రతి సర్పంచ్ బాధ్యత తీసుకోవాలె. వీఆర్‌ఏ, వీఆర్వో, సఫాయీకర్మచారీలతోపాటు ప్రజల సహకారంతో మొక్కలు నాటి, సంరక్షించాలె. ఇక్కడ సుమారు 600 కుటుంబాలున్నాయి. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను నాటడంతోపాటు వాటికి మన కుటుంబ సభ్యుల పేర్లు పెట్టాలె. మరణించిన వారి పేరును కూడా పెట్టి వాటిని సంరక్షించాలె. మనం మంచినీళ్లు తాగేటప్పుడు ఒక మగ్గు నీరు పోయాలి. మూడుచింతలపల్లిలో ఇండ్లుకాదు, చెట్లు మాత్రమే కనిపించాలి. ఇలా పెంచిన వారికి ఉచితంగా రెండు పాడిపశువులను ఇస్తం. నిరుపేదలకు 100 (గ్రామ పేదలకు 50, తండాకు 50) డబుల్‌బెడ్‌రూం ఇండ్లను మంజూరు చేస్తాం అని సీఎం చెప్పారు. ఆరోగ్యం బాగలేకున్నా ఈ ఊరికి వచ్చానని, మిమ్ములను దర్శనం చేసుకున్నానని చెప్తూ సీఎం తన ప్రసంగం ముగించారు. ఆగస్టు 15 తరువాత మళ్లీ గ్రామాల్లో పర్యటిస్తానని సీఎం ప్రకటించారు. అనంతరం లక్ష్మాపూర్ లో నిర్మించతలపెట్టిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

మీ ఎమ్మెల్యే హుషారున్నడు.. మీ ఎమ్మెల్యే.. చాలా హుషారున్నడు మనిషి. మొన్న లక్ష్మాపూర్ వచ్చినప్పుడు సార్ మూడుచింతలపల్లి మిస్ అయ్యాం అన్నడు. సరే పోదాంలే అని ఇయ్యాలొచ్చిన. వస్తుంటే అలియాబాద్ దగ్గర, పోతారం చౌరస్తా మరికొన్నిచోట్ల మందిని నిలబెట్టిండు. దొడ్లకైతే రానీ గోద పేడ పెట్టదా అన్నట్లుంది ఈయన కథ. ఇయ్యాల నన్ను మంది ముందుకు తీసుకువచ్చి పడేసిండు అంటూ చమత్కరించారు.

నీళ్లొస్తున్నాయో లేదోనని దిగిన.. ఇగ తిప్పుతున్నారు మూడు నాలుగు రోజుల కిందట పోతాపోతా నా నియోజకవర్గం పక్కనే ఈ గ్రామాలుంటంతో అక్కడ తాగునీళ్లు మంచిగా వస్తున్నాయా లేదా కనుక్కుందామని కొద్దిమంది గ్రామస్థుల వద్ద కారుదిగిన. అప్పుడు నా వెంట ఎవ్వరు లేరు. వాళ్లు నీళ్లు మంచిగా వస్తున్నాయి.. కానీ ఓ ట్యాంక్ కావాలి.. అంటే ఇస్తానని చెప్పి.. రెండు మూడు రోజుల్లో మీ ఊరుకు వస్తానన్న. ఇగ నన్ను వరుసపెట్టి తిప్పుతున్నరు. అయినా సరే ప్రజలకు మేలు జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అభివృద్ధి, ప్రజల అవసరాలు తీర్చేందుకు ఎన్ని నిధులు ఇవ్వడానికైనా ప్రభుత్వం సిద్ధం. అవసరమైతే శామీర్‌పేట మండలానికి రూ.100-120 కోట్లు ఇవ్వడానికైనా సిద్ధమే. నేను ఆనాడే చెప్పిన ఏ ఊరులోని యువతీయువకులు ఆ ఊరికి కథానాయకులు కావాలని. అలా అయితేనే గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తాయి.

కలెక్టర్ మంచోడు… మేడ్చల్ జిల్లాకు కలెక్టర్‌గా మంచి వ్యక్తి ఉన్నారు. వాళ్ల అమ్మనాన్న చదువుకోలేదు.. కానీ ఆయన చిన్నప్పటినుంచి కష్టపడి చదువుకొని నేడు జిల్లా కలెక్టర్‌గా ఉన్నాడు. ప్రజల కష్టం, సుఖం, మంచిచెడులు తెలిసినవాడు కాబట్టి.. లక్ష్మాపూర్, కేశవరం, మూడుచింతలపల్లి గ్రామాలకు మేమిచ్చే అనౌన్స్‌మెంట్‌తోపాటు కలెక్టర్‌కు రూ.5కోట్లు ఇచ్చి, ఈ గ్రామాల్లో ఉన్న గ్యాప్‌వర్కులను పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటా అని సీఎం చెప్పారు. అలియాబాద్, జగన్‌గూడ, పోతారం, లాల్‌గడి మలక్‌పేట్, ఉద్దమర్రితో పాటు మిగిలిన గ్రామాలలో ఉన్న సమస్యలపై స్కెచ్ రూపొందించాలని కలెక్టర్‌కు సూచించారు. ఈ గ్రామాలన్నీ తిరుగడంకంటే శామీర్‌పేట మండల కేంద్రంలోనే మీటింగ్ పెట్టుకొని అన్ని గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి నిధులిస్తే మంచిగుంటదేమో అని సీఎం అనగా.. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కల్పించుకొని ఐట్లెతే శామీర్‌పేట మండలం మొత్తం అయిపోతది అన్నారు. వెంటనే మళ్లీ సీఎం చమత్కరిస్తూ… ఆహా.. శామీర్‌పేట అయిపోగానే మరో మండలానికి పట్టుకుపోతవా అనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. ఈ సందర్భంగా సీఎం ఒక పిట్ట కథ చెప్తూ.. ఒక ఊళ్లే ఎగిర్తపు చుట్టం వచ్చాడట. పొద్దుగాల్నే.. పోతాపోతా అంటున్నాడట. ఆ ఇంట్లో ఉన్న ఓ పెద్దావిడ పోతేపోతివిగానీ బిడ్డా రాతిరిదింత సలి అన్నం ఉంది తినిపోతవా? అందట. హాహా ఎందుకు పెద్దమ్మా.. రాతిరిదింత తింట ఉడుకన్నం అయిందాక ఉంట అన్నడంట. ఇగో మీ సుధీర్‌రెడ్డి కూడా గిట్టనే ఉన్నడు.. అని సీఎం చమత్కరించడంతో మరోసారి సభికులు అంతా నవ్వేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.