Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సాగు సంక్షేమ బడ్జెట్

-రూ.1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్
-రాష్ట్ర ప్రగతికి ప్రతిరూపంగా కేసీఆర్ పద్దు.. ఎన్నికల హామీల అమలుకు భారీగా నిధులు
-రైతు, వ్యవసాయం కేంద్రంగా వివిధ కార్యక్రమాలకు రూ.60వేల కోట్లు
-సంక్షేమరంగాలకు సుమారు రూ.47వేల కోట్లు
-అన్ని సంక్షేమ కార్యక్రమాలూ కొనసాగుతాయి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం
-సంక్షేమ ఫలాలు అందని కుటుంబం లేదు.. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పై ప్రజల అచంచల విశ్వాసం
-కఠిన ఆర్థిక క్రమశిక్షణ, అవినీతి నిరోధంతో స్థిరమైన ఆదాయాభివృద్ధి రేటు
-ఏప్రిల్ చివరికల్లా మిషన్ భగీరథ పనులు పూర్తి .. ఈ వానకాలం నుంచే కాళేశ్వరం నీళ్లు
-హైదరాబాద్‌లో ప్రతి పదివేలమందికి ఒక బస్తీ దవాఖాన.. త్వరలో ఈఎన్టీ-దంత వైద్య శిబిరాలు
-ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
-తెలంగాణలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి సీఎంగా రికార్డు
-రెవెన్యూ వ్యయం : రూ.1,31,629 కోట్లు
-మూలధన వ్యయం : రూ.32,815 కోట్లు
-రెవెన్యూ మిగులు : రూ.6,564 కోట్లు
-ఆర్థిక లోటు : రూ.27,749 కోట్లు (అంచనా)

తెలంగాణ రాష్ట్ర ప్రగతికి ప్రతిరూపంగా 1,82,017 కోట్ల రూపాయల భారీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీకి సమర్పించారు. బంగారు తెలంగాణ బాటలో.. రాష్ట్ర ఆర్థికవ్యవస్థ స్థితిగతులను మార్చివేయగల వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తూనే సబ్బండవర్ణాల సర్వతోముఖాభివృద్ధి కోసం సంక్షేమరంగాలకు సైతం గణనీయంగా కేటాయింపులు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను యథాతథంగా కొనసాగిస్తామన్న సీఎం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా అమలుచేసి తీరుతామని స్పష్టంచేశారు. ఈ మేరకు కొత్తగా ప్రకటించిన రైతు రుణమాఫీ, నిరుద్యోగభృతి, రెట్టింపు కానున్న పెన్షన్లు, రైతుబంధు కింద పెరుగనున్న పంటసాయం కోసం భారీగా నిధులు కేటాయించారు. ఇవాళ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రగతి, సంక్షేమ కా ర్యక్రమాల ఫలా లు అందుకోని కుటుంబమేదీ రాష్ట్రంలో లేదనడం అతిశయోక్తి కాదని సీఎం చెప్పారు. ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో మళ్లీ గెలిపించి, ప్రభుత్వంపై అచంచల విశ్వాసాన్ని వేనోళ్ల చాటారని పేర్కొన్నారు. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అనతికాలంలోనే దేశానికే తలమానికంగా నిలిచిందని, వ్యవసాయరంగ సమస్యల పరిష్కారంలో దేశానికే దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం 12.13 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. దాదాపు గంటపాటు ఏకబిగిన కొనసాగించారు. తెలంగాణలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి సీఎంగా రికార్డు సృష్టించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఉన్న పరిస్థితులను వివరిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించి, ఏయే అంశానికి ఎంత కేటాయింపులు చేస్తున్నదీ ప్రకటించడంతోపాటు.. ఓటాన్ అకౌంట్ పెట్టేందుకు గల కారణాలను వివరించారు. దేశంలో ఏ రాష్ర్టానికి సాధ్యంకాని రీతిలో తెలంగాణ స్థిరమైన ఆదాయాభివృద్ధి రేటును సాధిస్తున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి నాలుగేండ్లలో స్వీయ ఆదాయంలో 17.17% వార్షిక సగటువృద్ధి సాధించి, దేశంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కఠిన ఆర్థిక క్రమశిక్షణ, అవినీతి నిరోధానికి పటిష్ఠ విధానాల అమలుతోనే ఇది సాధ్యమవుతున్నదని స్పష్టంచేశారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి మిషన్ భగీరథ పనులు వంద శాతం పూర్తి చేసి, ప్రతీ ఇంటికీ మంచినీరు అందిస్తామని చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి ఈ వానకాలం నుంచే సాగునీరు అందిస్తామని స్పష్టంచేశారు. ఆసరా పింఛన్లు అందుకుంటున్నవారు కేసీఆర్ మమ్ములను కాపాడుతున్న పెద్ద కొడుకు అని, దేవుడిచ్చిన అన్న అని దీవించడం తన రాజకీయ జీవితానికి గొప్ప సార్థకతగా భావిస్తున్నానని చెప్పారు. హైదరాబాద్ నగరంలో పేదలకు వైద్య సేవలందించేందుకు ప్రతి పదివేల మందికి ఒక బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

వాస్తవ అంచనాలకు అనుగుణంగా బడ్జెట్
రెవెన్యూ రాబడులను, వ్యయాలను పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్.. వాస్తవ అంచనాలకు తగ్గట్టు బడ్జెట్‌ను రూపొందించారు. ఈసారి కూడా సొంత పన్నుల రాబడులు బాగా పెరిగినప్పటికీ భారీ అంచనాలకు పోకుండా బడ్జెట్‌ను రూ.1.82 లక్షల కోట్లకు పరిమితంచేశారు. మొత్తం బడ్జెట్‌లో ప్రగతి పద్దు రూ.1,07,302 కోట్లు కాగా, నిర్వహణ వ్యయం రూ.74,715 కోట్లుగా ఉన్నది. రెవెన్యూ మిగులు రూ.6,564 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ రాబడులు రూ.1,38,193 కోట్లు కాగా, రెవెన్యూ ఖర్చులు రూ.1,31,629 కోట్లుగా అంచనావేశారు.

కీలక పథకాలకు భారీగా నిధులు
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఆసరా పెన్షన్లకు రూ.12,067 కోట్లు, బియ్యం సబ్సిడీకి రూ.2,744, షాదీముబారక్/కల్యాణలక్ష్మికి రూ.1,450 కోట్లు, నిరుద్యోగభృతికి ప్రత్యేకంగా రూ.1,810 కోట్లు కేటాయించారు. వ్యవసాయానికి రూ.20,120 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ.2,004 కోట్లు, నీటిపారుదలరంగానికి రూ.22,500 కోట్లు, ఎస్సీల ప్రగతినిధికి రూ.16,581 కోట్లు, ఎస్టీల ప్రగతినిధికి రూ.9,827 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు, ఆరోగ్యశాఖకు రూ.5,536 కోట్లు కేటాయించారు.

పెరిగిన క్యాపిటల్ వ్యయం
2019-20 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు భారీగానే పెరుగుతాయని బడ్జెట్‌లో అంచనావేశారు. 2018-19 బడ్జెట్‌లో రెవెన్యూ రాబడులు రూ.1,30,975 కోట్ల వరకు ఉంటాయని అంచనావేయగా దానిని రూ.1,19,380 కోట్లకు సవరించారు. వచ్చే ఆర్థికసంవత్సరానికి రెవెన్యూ రాబడులు రూ.1,38,193 కోట్లు, క్యాపిటల్ (పెట్టుబడి) రాబడులు రూ.43,865 కోట్లు ఉంటాయని అంచనావేశారు. రెవెన్యూ, క్యాపిటల్ రాబడులు మొత్తం కలిపి రూ.1,82,059 కోట్లుగా లెక్కవేశారు. భవిష్యత్తులో ఆస్తులను, సంపదను సృష్టించడానికి వెచ్చించే పెట్టుబడి వ్యయాన్ని (క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్) భారీగా పెంచారు. ఇప్పటికే దేశంలో అన్ని రాష్ర్టాల కంటే క్యాపిటల్ వ్యయంలో తెలంగాణ ముందున్నది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వ్యయాన్ని రూ.28 వేల కోట్ల నుంచి రూ.32 వేల కోట్లకు పెంచారు. కేంద్ర పన్నుల్లో వాటా కింద వచ్చే సంవత్సరంలో రూ.20 వేల కోట్లకు పైచిలుకు నిధులు వస్తాయని తాత్కాలిక బడ్జెట్‌లో అంచనావేశారు. మధ్యాహ్నం 1.08 నిమిషాలకు సీఎం బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత సభను శనివారం ఉదయం పది గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.

ప్రధాన కేటాయింపులివీ..

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.