Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

శాశ్వతంగా నిలిచిపోవాలి

-యాదాద్రిని అణువణువూ పరిశీలించిన సీఎం కేసీఆర్
-వెయ్యేండ్లలో ఎవరూ చేయనివిధంగా నిర్మాణం చేపట్టాలి
-తొందర, తొట్రుపాటులేకుండా పనులు చేయాలి
-దక్షిణంవైపు నిర్మాణాలపై పలు సూచనలు చేసిన సీఎం
-శివాలయం శిల్పి పనులపై సంతృప్తి
-యాదాద్రికొండపై ముఖ్యమంత్రి కేసీఆర్ విహంగవీక్షణం

యాదాద్రిపై విహంగవీక్షణం.. కొండపై రాజగోపురాలు, ప్రాకారాలు అణువణువూ పరిశీలన.. పనులు బాగా జరిగినచోట ప్రశంస.. జరుగనిచోట సుతిమెత్తగా మందలింపు.. ఆలస్యమైనా పాంచరాత్ర ఆగమశాస్ర్తానుసారమే పనులు జరుగాలనే తపన.. వెయ్యేండ్లలో ఎవరూచేయని విధంగా నిర్మాణాలు చేపట్టాల ని సూచనలు.. ఆదివారం యాదాద్రిలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పర్యటన సాగిందిలా. 14నెలల తరువాత సీఎం కేసీఆర్ ఆదివారం యాదాద్రికి వచ్చారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి యాదాద్రికి వచ్చిన కేసీఆర్‌కు ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు జీ జగదీశ్‌రెడ్డి, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, గాదరి కిశోర్, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్, టీఆర్‌ఎస్ నేత ఉమామాధవరెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, సీపీ మహేశ్‌భగవత్, వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు ఘనస్వాగతం పలికారు. యాదాద్రి ఆలయ ప్రధానార్చకుడు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణకుంభస్వాగతం పలికారు. స్వామివారికి పూజలు చేసిన అనంతరం కేసీఆర్ ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన చేపట్టారు.

యాదాద్రి చుట్టూ విహంగవీక్షణం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలిక్యాప్టర్ ద్వారా 11.15 గంటలకు యాదాద్రికి చేరుకొన్నారు. తొలుత యాదాద్రి చుట్టూ విహంగవీక్షణం చేశారు. ప్రధానాలయం ఉన్న గుట్టతోపాటు, టెంపుల్‌సిటీగా అభివృద్ధి చేస్తున్న పెద్దగుట్ట, ప్రెసిడెన్షియల్ సూట్లు నిర్మించనున్న గుట్టను హెలిక్యాప్టర్ ద్వారా పరిశీలించారు. కొండపై దిగిన వెంటనే బాలాలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు నల్లంతీగల్ లక్ష్మీనర్సింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం జరిపారు. అనంతరం ప్రధాన దేవాలయం పునర్నిర్మాణం పనులను పరిశీలించారు. మండపాలు, గర్భగుడి, బాహ్య, అంతర్‌ప్రాకారాలు, మాడవీధులు, రథశాల, వ్రతమండపం, ధ్వజస్తంభం, ప్రసాదం కౌంటర్లు, శివాలయం పనులను పరిశీలించారు. ప్రధానాలయం ఉన్నప్రాంతంలో 14.5 ఎకరాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆ తరువాత టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తున్న గుట్టను సందర్శించి, పనులను పరిశీలించారు. రెండుగుట్టలను కవర్ చేస్తూ ఔటర్‌రింగ్ రోడ్డును నిర్మాణం చేస్తామని చెప్పారు. యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణం పనులన్నింటినీ సమాంతరంగా చేపట్టాలని ఆదేశించారు. వందల ఏండ్లపాటు నిలిచిపోయే శాశ్వత నిర్మాణం కాబట్టి ఎలాంటి తొందరపాటు.. తొట్రుపాటు లేకుండా పను లు నిర్వహించాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీపడవద్దని పేర్కొన్నారు.

దక్షిణంవైపు నిర్మాణాలపై సూచనలు
ప్రధానాలయం ప్రాకారం నిర్మాణం పనుల పరిశీలన అనంతరం సీఎం కేసీఆర్ కొండపై జరుగుతున్న విస్తరణపనులను పరిశీలించారు. దక్షిణం వైపు జరుగుతున్న పనులపై 25 నిమిషాలపాటు ఆరాతీశారు. దక్షిణగోపురం, వాహనశాల, సహస్రదీపాలంకరణ నిర్మాణాలను పరిశీలించారు. దక్షిణభాగంలో కొండను ఆనుకుని జరుగుతున్న ల్యాండ్ స్కేపింగ్‌ను ఇంకా సుందరంగా తీర్చిదిద్దాలని ఆర్కిటెక్ట్ ఆనందసాయిని ఆదేశించారు. రక్షణగోడను పెంచేందుకు వేసిన నాలుగు కాంక్రీట్‌పిల్లర్లను వెంటనే తొలగించాలని సూచించారు. అక్కడినుంచి పడమర భాగానికి చేరుకొన్నారు. సప్తతల రాజగోపురం నిర్మాణంపై సంతృప్తి వ్యక్తంచేశారు. కృష్ణశిలలతో ఆధారశిల నుంచి మహానాశిక వరకు ప్రపంచంలో ఎక్కడా రాజగోపురాలను నిర్మించలేదని స్థపతి డాక్టర్ ఆనందాచారివేలు ముఖ్యమంత్రికి నివేదించారు. దీంతో సీఎం కేసీఆర్ చాలా బాగా వచ్చిందంటూ ప్రశంసించారు. ఉత్తరభాగంలో నిర్మిస్తున్న శ్రీసత్యనారాయణవ్రత మండపాల విషయంలో పలు సూచనలు చేశారు. వ్రతమండపాల నిర్మాణం కోసం వేసిన నాలుగు పిల్లర్ల వల్ల ఈశాన్యం నుంచి కొండను చూసేవారికి మహారాజగోపురాలు కనిపించడంలేదని.. అదేవిధంగా ఈశాన్యంలో బరువు ఎక్కువగా ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్‌తేజ కూడా సలహా ఇవ్వడంతో వాటిని తొలగించాలని సీఎం ఆదేశించారు.

శివాలయం శిల్పి పనులపై సీఎం సంతృప్తి
శివాలయం పనులు జరుగుతున్న తీరుపై సీఎం సంతృప్తిని వ్యక్తంచేశారు. ప్రాకారం పనులు బాగున్నాయని అన్నారు. శిల్పి పనులు చక్కగా ఉన్నాయని ప్రశంసించిన కేసీఆర్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. తొగుట పీఠాధిపతి సూచించిన ప్రకారం పనులు జరుగుతున్నాయా? అని ఆరాతీశారు.

అద్భుతంగా మహామండపం: సీఎం ప్రశంస
శిల్పులు చెక్కిన ఆళ్వార్ స్తంభాలు.. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే కాకతీయ స్తంభాలు అద్భుతంగా ఉన్నాయని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. మహామండపాన్ని నిశితంగా పరిశీలించారు. మహామండపం లోపలికి వెళ్లడం, ఉపాలయాలతోపాటు, క్షేత్రపాలక ఆంజనేయస్వామి దర్శనం ఎలా జరుగుతుందనే విషయాలపై చర్చించారు. ఆలయంలో క్యూలైన్లు, భక్తులు బయటకు వెళ్లే మార్గాలు ఎలా ఉంటాయనేది పరిశీలించారు. లిఫ్ట్‌లు ఎక్కడ ఏర్పాటుచేస్తారు? వాటివల్ల భక్తులకు కలిగే ప్రయోజనాలను అడిగితెలుసుకున్నారు. మండల పూజలు చేసే భక్తులు శ్రీవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసేతీరును కూడా పరిశీలించారు.

అన్నదానసత్రం కోసం రూ.10కోట్లు విరాళం
యాదాద్రిలో అన్నదాన సత్రం నిర్మాణం కోసం హైద్రాబాద్, విశాఖపట్నంలో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజు వేగేశ్న ఫౌండేషన్ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రూ.10 కోట్లు విరాళం అందించారు. ఫౌండేషన్ అధ్యక్షుడు అనంతకోటి రాజు, కార్యదర్శి ఆనంద రాజు ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చెక్కురూపంలో విరాళం అందజేశారు. సత్రం నిర్మాణానికి ఇంకా ఎక్కువ వ్యయం అయినా భరిస్తామని ఈ సందర్భంగా హామీఇచ్చారు. యాదాద్రిలో అతిథిగృహాల నిర్మాణం చేసేందుకు రూ. 2 కోట్ల చొప్పున విరాళం ఇచ్చేందుకు 43 మంది ముందుకొచ్చారని ముఖ్యమంత్రి ప్రకటించారు. వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. సాయంత్రం 5.40 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరివెళ్లారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.