Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌.. సబ్‌ బక్వాస్‌

-మోదీ నినాదాలు ఘనం.. నిజంగ చేసింది శూన్యం
-మోదీ సర్కారుపై నిప్పులు చెరిగిన కేసీఆర్‌.. కేంద్రం పనితనంపై చర్చకు సవాల్‌
-ఏ నగరంలోనైనా తాను రెడీ అని చాలెంజ్‌.. జగిత్యాలలో భారీ బహిరంగ సభ
-ప్రధానమంత్రి మోదీ డైలాగులు బాగా చెప్తడు
-మేకిన్‌ ఇండియా అంటే పరిశ్రమల మూతనా?
-దేశం వీడుతున్న పెట్టుబడిదారులు
-కరెంటు సంస్థలు మన సొత్తు… ప్రైవేటుకెట్లిస్తరు?
-ఉచిత విద్యుత్తు రేవ్డీనా.. మరి ఎన్‌పీఏల రద్దేంది?
-ఇంకా ఎన్నిరోజులు ఈ మోసాలు?
-బీజేపీ రాష్ర్టాల్లో రేప్‌ లేని రోజున్నదా?
-వ్యాపారులు బాగుపడి, రైతు బిచ్చమెత్తుకోవాలా?
-అంగన్‌వాడీలకు నిధుల కోత.. బేటీ బచావేనా?
-ఎల్‌ఐసీ అమ్మకంపై యువత పిడికిలి బిగించాలి
-డైమండ్‌ ఆఫ్‌ ఇండియా మన తెలంగాణ రాష్ట్రం
-ధర్మపురి స్వామి, కొండగట్టు అంజన్న దయతోనే
-తెలంగాణ రాష్ట్రం, సత్వర అభివృద్ధి సాకారమైంది
-గోల్‌మాల్‌ గోవిందంగాళ్లు వస్తున్నారు.. జాగ్రత్త!
-ప్రచారాల హోరులో కొట్టుకుపోతే ఆగమవుతం
-ఒక్క పొరపాటు చేస్తే వందేండ్లు వెనక్కే
-దేశం మారాలె.. అండగా నేనుంటా..
-యువకులు, మేధావులు చర్చ పెట్టాలె
-మతపిచ్చిలో యువతరం పడిపోవద్దు
-జగిత్యాల సభలో సీఎం కేసీఆర్‌
-నాలుగైదు రోజుల్లో రైతుబంధు నిధుల విడుదల
-నియోజకవర్గాల అభివృద్ధికి మరో పదేసి కోట్లు
-వంద కోట్ల రూపాయలతో కొండగట్టు అభివృద్ధి
-మద్దుట్లకు లిఫ్ట్‌.. మండలంగా బండలింగాపూర్‌

ఈ దేశంలో రైతుబంధు ఇచ్చే రాష్ట్రం.. భూప్రపంచంలో రైతు బీమా ఇచ్చే దేశం ఇంకొకటి లేదు. రైతుబంధు, రైతుబీమా రెండూ అందిస్తున్న ఒకే ఒక్క జాగా తెలంగాణ మాత్రమే. చితికిపోయి, ఛిద్రమైపోయి, ఆగమైపోయిన రైతుల బతుకులు ఒక దరికి రావాలని, అప్పులు తీరాలని, బాకీపడే బాధ తప్పాలని, రైతాంగం స్థిరపడాలని తీసుకున్న నిర్ణయమిది.10 ఎకరాలకు మించి రైతుబంధు ఎందుకు ఇస్తున్నరు? దానికి పరిమితి పెట్టవచ్చు కదా? అని కొంతమంది మాట్లాడుతున్నారు. మన రాష్ట్ర రైతుల్లో 93.5 శాతం మంది 5 ఎకరాల లోపువాళ్లే. 5 నుంచి 10 ఎకరాల మధ్య ఉన్నవాళ్లు 5 నుంచి 6 శాతమే. 10 ఎకరాలకు పైన ఉన్నోళ్లు ఒక్క శాతమే, 25 ఎకరాలపైన ఉన్న రైతులు కేవలం 0.5 శాతమే. ఈ వాస్తవాలు చాలా మందికి తెలవదు కాబట్టే ఏదేదో అనుకుంటరు.
– సీఎం కేసీఆర్‌

జిల్లా సమీకృత కార్యాలయాల ప్రారంభోత్సవం, మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన తదితర అభివృద్ధి కార్యక్రమాల కోసం బుధవారం వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జగిత్యాల నీరాజనం పట్టింది. ప్రగతి కార్యక్రమాల నివేదన కోసం నిర్వహించిన సభకు…. గ్రౌండ్‌లో పట్టనంత జనం. లెక్కవేయలేనంత జనం. సభకు రాగలిగిన వారెందరో.. రాలేకపోయిన వారందరు! ప్రతి వీధిలో జనమే. పట్టణమంతా జనమే! జగిత్యాల నుంచి ఇటు కోరుట్ల దాకా.. అటు కొండగట్టుదాకా.. జనమే జనం. 1978లో జరిగిన జగిత్యాల జైత్రయాత్ర సభ తర్వాత పట్టణంలో ఇంత భారీ సభ జరగడం బహుశా ఇదే మొదటిసారి.

హోరెత్తే స్పందన, మిన్నంటే చప్పట్లు, ఎగిసిపడే పిడికిళ్ల సాక్షిగా, ఆ జనం సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కేంద్రంలోని మోదీ సర్కారు పనితీరును జగిత్యాల మైదానంలో ఎండగట్టారు. రాష్ట్రంగా తెలంగాణ సాధించినదేమిటో.. అది ఇన్నాళ్లూ ఎందుకు చేయలేకపోయారో విడమరిచి చెప్పారు. తనతో పాటే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ దేశానికి చేసిన ఒక్క మంచిపని ఏమిటో చెప్పాలని సవాల్‌ విసిరారు. మోదీ డైలాగులు బాగా చెప్తాడు. నినాదాలు ఘనం, నిజంగ చేసింది శూన్యం అని కేసీఆర్‌ చెప్తుంటే జగిత్యాల పిడికిళ్లు బిగించి సంఘీభావం పలికింది.

ఈ దేశానికి మోదీ ఏం చేశాడో దమ్ముంటే నిరూపించాలని, దీనిపై దేశంలోని ఏ పట్టణంలోనైనా చర్చకు తాను సిద్ధమని బస్తీమే సవాల్‌ అన్నారు. దేశం దివాలా తీస్తుంటే మోదీ డంబాచారాలు పలుకుతున్నాడని ఎద్దేవాచేశారు. అలనాడు ధర్మపురి నరసింహస్వామి ఆశీస్సులతోనే, పుష్కర స్నానం చేసి, తెలంగాణ ఉద్యమంలో విజయం సాధించామని గుర్తు చేసుకుంటూ, నేడూ భారత జైత్రయాత్రకు వెళ్దామా అని జగిత్యాల ప్రజల ఆశీస్సులు కోరారు. అభివృద్ధి కార్యక్రమాల జోరు, ముఖ్యమంత్రి వాగ్దానాల హోరు, మోదీపై వాగ్బాణాల తీరుతో జగిత్యాల శిగమూగింది.

మేక్‌ ఇన్‌ ఇండియా పేరుతో కొత్త పరిశ్రమలు తెస్తామని డాంబికాలు పోయిన కేంద్రప్రభుత్వం ఉన్న పరిశ్రమలను కూడా మూసేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ‘అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టుగా పరిస్థితి తయారైందని పేర్కొన్నారు. జగిత్యాలలో బుధవారం నిర్వహించిన బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు, ప్రధాని నరేంద్రమోదీ ఎనిమిదేండ్ల పాలనపై నిప్పులు చెరిగారు. మోదీ నినాదాల వెనుక ఉన్న మోసాన్ని ఎండగట్టారు.

‘మేకిన్‌ ఇండియా అంటే ఏంది? దాని ద్వారా వచ్చిన పరిశ్రమలు ఎన్ని? పిలగాండ్లు కాల్చే పటాకులు చైనా నుంచి రావడమా? పతంగులు ఎగరేసే మాంజా దారం చైనా నుంచి వస్తదా? దీపావళికి పెట్టే దీపంతలు కూడా చైనా నుంచి వస్తయా? ఆఖరికి భారత జాతీయ జెండా కూడా చైనా నుంచి దిగుమతి కావడమా? ఇదా మేకిన్‌ ఇండియా? ఊరూరా చైనా బజార్లు వెలుస్తున్నాయి. కోరుట్ల మిషన్‌ దవాఖాన పక్కన, జగిత్యాల అంగడి గద్దెల కాడ, కరీంనగర్‌ సర్కర్‌ గ్రౌండ్‌.. ఒకటేమిటి ఊరూరా చైనా బజార్లు ఎందుకు వెలుస్తున్నాయి? ఇండియా బజార్లు యాడపోయాయి? గోర్ల కత్తెరలు, కుర్చీలు కూడా చైనా నుంచి రావాల్నా? అవి కూడా మనకు చేయరాదా? ఎవరిని ప్రోత్సహిస్తున్నారు? దేశంలో పరిశ్రమలు మూత పడుతున్నాయి. లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి? పెట్టుబడిదారులు దేశాన్ని విడిచిపోతున్నరు. ఇదేనా మేకిన్‌ ఇండియా? ఎన్ని రోజులు ఈ మోసపు నినాదాలు? డంబాచారాలు? యువకులు, మేధావులు ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పిడికిలెత్తాలి. అండగా నేనుంటా’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

కరెంట్‌ను ఎట్ల ప్రైవేటీకరిస్తరు?
విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ‘కరెంటు ప్రైవేటీకరణ చేస్తం. మీటర్లు పెడతం. ముక్కుపిండి వసూలు చేస్తం అని మాట్లాడుతున్నారు. రైతులకు ఉచిత కరెంటు ఇస్తే అదేదో రేవ్‌డీ కల్చర్‌ అని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఎన్‌పీఏల పేరిట ఇప్పటికే రూ.14 లక్షల కోట్ల ప్రజలు ఆస్తులను కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వం దోచిపెట్టింది’ అని ధ్వజమెత్తారు. కరెంటు ప్రైవేటీకరణ చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. దశాబ్దాలుగా ప్రజల సొమ్ముతో రూ.లక్షల కోట్ల విలువైన సబ్‌స్టేషన్లు, జనరేటింగ్‌ స్టేషన్లు, కండక్టర్లు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయని, వాటన్నింటినీ నామమాత్రపు ధరలకు, ఇష్టమైన కార్పొరేట్లకు ఇచ్చేసి, ప్రజలపై రాళ్లు ఎత్తి బిల్లులు వసూలు చేస్తమంటున్నారని మండిపడ్డారు. ఈ ఆరాచం కొనసాగితే పెట్టుబడిదారుల రాజ్యమైతది తప్ప పేద ప్రజల సంక్షేమం ఉండబోదని సీఎం పేర్కొన్నారు. ఆ దిశగా అందరూ ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు.

మేకిన్‌ ఇండియా అంటే..
పేరు గొప్పల మోదీ సర్కారు పనితనాన్ని జగిత్యాల నడి బజార్లో కడిగి పారేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

-పిలగాండ్లు కాల్చే పటాకులు కూడా చైనా నుంచి రావడమా
-మేకిన్‌ ఇండియా అంటే.. పతంగుల మాంజా దారం కూడాచైనా నుంచి రావడమా
-మేకిన్‌ ఇండియా అంటే.. దీపావళికి పెట్టే దీపంతలు కూడా చైనా నుంచి రావడమా
-మేకిన్‌ ఇండియా అంటే.. ఆఖరికి మన జాతీయ జెండా కూడా చైనా నుంచి రావడమా
-మేకిన్‌ ఇండియా అంటే.. కోరుట్ల మిషన్‌ దవాఖాన పక్కన చైనా బజార్‌!
-జగిత్యాల అంగడి గద్దెల కాడ చైనా బజార్‌!
-కరీంనగర్‌ సర్కస్‌ గ్రౌండ్‌లో చైనా బజార్‌!
-ఒకటేమిటి.. ఊరికొకటి, గల్లీకొకటి చైనా బజార్‌!
-మరి మన ఇండియా బజార్‌ ఏది?
-మేకిన్‌ ఇండియా బజార్‌ ఏది?

10 వేల పరిశ్రమల మూసివేత
ప్రధాని మోదీ నినాదాలన్నీ మోసపూరితమేనని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కరెక్టుగా తెలంగాణ ఏర్పడినప్పుడే దేశానికి మోదీ ప్రధాని అయ్యారు. ఆయన ఈ 8 ఏండ్ల పాలనలో ఏ రంగంలో, ఏం మంచి జరిగింది? సాగునీరా? కరెంటా? మంచినీరా? మంచి జరిగింది ఏ రంగం? సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ నినాదం సబ్‌ కా బక్వాస్‌. ఎక్కడన్న జరిగిందా? వికాసమున్నదా? బేటీ పడావో, బేటీ బచావో అని నినాదమిచ్చారు. కానీ అంగన్‌వాడీ నిధుల కట్‌ చేసి, వాటితో బేటీ పడావో కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. కేంద్రం తప్పుడు విధానాల కారణంగా మేకిన్‌ ఇండియాలో పరిశ్రమలు రావడం అటుంచి, 10 వేల పరిశ్రమలు దేశంలో మూతపడ్డాయి. 50 లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. సంవత్సరానికి 10 వేల మంది బడా పెట్టుబడిదారులు దేశాన్ని వదిలిపెట్టి పోతున్నారు. దీనిపై దేశంలో ఎక్కడంటే అక్కడే, ఏ నగరమంటే ఆ నగరంలో చర్చకు నేను సిద్ధం. సమాధానం చెప్పే, చర్చకు వచ్చే దమ్ము మీకున్నదా? అని కేంద్రానికి సీఎం కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. ఎన్ని రోజులు ఈ మోసపు నినాదాలు? అని నిప్పులు చెరిగారు.

మతపిచ్చిలో పడి కొట్టుకుపోవద్దు
ఉత్తరభారత దేశంలో, బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళలపై రేప్‌లు, దళితులపై దౌర్జన్యం జరుగకుండా ఒక్కరోజైనా గడిచే పరిస్థితి లేదని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘దేశ రాజధాని ఢిల్లీలో 75 ఏండ్ల స్వాతంత్య్రం తరువాత కూడా 24 గంటల కరెంటు లేదు. మంచినీళ్లు రావు. ఇదా కావాల్సింది? ఈ భారతదేశం కోసమేనా మహనీయులు త్యాగాలు చేసింది? ఇకనైనా ఈ దేశం మారాల్సిన అవసరమున్నది. నదులు భూమి మీదికి వచ్చి తెలంగాణ ఎట్లా పచ్చబడ్డదో, అట్లాగే దేశమంతా బాగుపడాలె. కడుపునిండా దేశానికి కరెంటు రావాలె. ఒక్క తెలంగాణ బాగుపడితే కాదు. తెలంగాణ జీఎస్డీపీ రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.11 లక్షల కోట్లకు చేరింది. తెలంగాణ లెక్క కేంద్ర సర్కారు పనిచేసి ఉంటే మన జీఎస్డీపీ రూ.14 లక్షల కోట్లు ఉండేది. కేంద్రం చేతగానితనం వల్లే మనం రూ.3 లక్షల కోట్లు నష్టపోయాం. చదువుకున్నవాళ్లను, టీచర్లను, ప్రొఫెసర్లను, ఆర్థిక నిపుణులను అడిగితే అన్ని విషయాలు తేటతెల్లమవుతాయి.

కేంద్ర ప్రభుత్వానిది, ప్రధాని మోదీది అంతా మాటల గారడి. చుట్టూ ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలి. లేదంటే ప్రమాదంలో పడతాం. గోల్‌మాల్‌ గోవిందం గాళ్లు, అడ్డగోలుగా మాట్లాడేటోళ్లు, కారుకూతలు కూసేటోళ్లు ఈ రోజు మన మధ్య తిరుగుతున్నారు. వారందరినీ గమనించాలి. ఇకనైనా అప్రమత్తంగా లేకపోతే ఒక ఒరవడిలో, మత ప్రచార హోరులో పడి కొట్టుకుపోతే, మళ్లీ ఆగమైతాం. ఒక్కసారి దెబ్బతింటే వందేండ్లు వెనక్కు పోతాం. విద్యావంతులు, యువకులు, రచయితలు, మేధావులు గ్రామాల్లో దీనిపై చర్చ పెట్టాలి. నాడు తెలంగాణ నాయకత్వం చేసిన ఒక్క చిన్న ఏమరపాటు వల్ల 60 ఏండ్లు గోసపడిన జాతి మనది. గోల్‌మాల్‌ గోవిందం గాళ్లను నమ్మి ఆగం కావద్దు. ఎవరినీ నిందించడానికి చెప్పడం లేదు. అనాడు ఒక మాట చెప్పిన. నా వెంట నడవండి. గ్యారంటీగా తెలంగాణ వస్తదన్న. నరసింహస్వామికి అదే మొక్కిన. అందరి తోడ్పాటు. స్వామి దయ. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అద్భుతంగా పురోగమిస్తున్నది. ఈ రోజు భారతదేశం కూడా అట్లా మారాలె. భారత రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలె. ఈ దుష్ట సంప్రదాయాలు పోవాలె’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

తెలంగాణలోనే బీడీ కార్మికులకు పెన్షన్లు
గతంలో ఏ ప్రభుత్వం, ఏ నాయకుడూ చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, సిరిసిల్ల, బాల్కొండలో లక్షల మంది బీడీ కార్మికులున్నా ఏనాడూ వారి గోస ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 16 రాష్ర్టాల్లో బీడీ కార్మికులున్నారని, తెలంగాణలో తప్ప వారికి ఎక్కడా పెన్షన్లు ఇవ్వటంలేదని తెలిపారు. ఒక్క తెలంగాణలోనే కోట్ల రూపాయలను వెచ్చిస్తూ నెలకు రూ.2016 పెన్షన్‌ ఇస్తున్నామని చెప్పారు. ‘అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్‌ వన్‌గా ఉన్నది. అయినా ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉన్నది. కొనసాగుతున్న పనులను త్వరత్వరగా పూర్తి చేసుకోవాల్సి ఉన్నది. ధర్మపురి ప్రాంతంలో రోళ్లవాగు ప్రాజెక్టు పనులను పూర్తిస్థాయిలో చేసుకోవడంతోపాటు వ్యవసాయ స్థిరీకరణ జరుగాల్సి ఉన్నది. అవన్నీ బ్రహ్మాండంగా పూర్తి చేసుకొందాం. అందుకు అండగా నేనుంటా. గతంలో అన్ని జిల్లాలకు ఇచ్చినట్టుగానే కరీంనగర్‌, జగిత్యాల జిల్లాల్లోని ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున అదనపు నిధులు మంజూరు చేస్తున్నా’ అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

ఎల్‌ఐసీ మీ జాగీరా? అబ్బ సొత్తా ?
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అమ్ముతూ, ఉన్న ఆస్తులను ఊడగొడుతున్నదని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ‘ఎల్‌ఐసీ అంటే గ్రామాల్లో కూడా అందరికీ తెలుసు. అంత గొప్పగా ప్రజలకు దగ్గరైంది. ఎల్‌ఐసీలో దాదాపు 25 లక్షల మంది ఏజెంట్లు పనిచేస్తున్నారు. లక్షల మంది ఉద్యోగులున్నారు. కేంద్ర బడ్జెట్‌కు సమానంగా రూ.35 లక్షల కోట్ల ఆస్తులు కలిగిన సంస్థ అది. అంత గొప్ప సంస్థను కూడా కేంద్ర పాలకులు అమ్మేస్తం.. ప్రైవేట్‌ చేస్తమంటున్నారు. నేనడుగుతున్నా.. ప్రజల సొత్తు.. మీ జాగీర్‌లాగా, మీ అబ్బ సొత్తులాగా కార్పొరేట్లకు కట్టబెడతారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎల్‌ఐసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యువకులు పిడికిలెత్తాలి. ఎల్‌ఐసీ ఏజెంట్‌ మిత్రులారా? పిడికిలి బిగించి మీరు సైనికులు కావాలె. మన ఆస్తిని కాపాడాలె’ అని పిలుపునిచ్చారు.

టీఆర్‌ఎస్‌ జగిత్యాల జిల్లా కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించిన అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును సన్మానిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌. చిత్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీలు ఎల్‌ రమణ, భానుప్రసాదరావు, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్‌, సుంకె రవిశంకర్‌

జగిత్యాల బహిరంగ సభ వేదికపై సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తుండగా చప్పట్లు కొడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, జగిత్యాల జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత

సీఎం కేసీఆర్‌ పాల్గొన్న జగిత్యాల బహిరంగ సభ వేదికపై మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎంపీలు దీవకొండ దామోదర్‌రావు, వెంకటేశ్‌ నేతకాని, ఎమ్మెల్సీలు ఎల్‌ రమణ, భానుప్రసాదరావు, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్‌, సుంకె రవిశంకర్‌, రసమయి బాలకిషన్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు, గిడ్డంగుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయిచంద్‌ తదితరులు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.