Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సభాసంఘం

రాష్ట్రంలో అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని, దళితులకు న్యాయం చేసేవిధంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఆ మేరకు ఈ పది జిల్లాల్లో కబ్జాకు గురైన అసైన్డ్ భూములపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సభాసంఘాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అన్ని పార్టీల సభాపక్ష నేతలు కూడా ఇందుకు మద్దతు పలుకడంతో సభాసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఇప్పటివరకు దళితులకు ఆశించిన విధంగా అభివృద్ధి జరగలేదన్నారు.

KCR in Assembly

-అసైన్డ్ సహా అన్యాక్రాంత భూములపై విచారణ వచ్చే బడ్జెట్ సమావేశంనాటికి నివేదిక: అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన దళిత, బీసీ, ఎండోమెంట్స్, వక్ఫ్, చర్చి, భూదాన్, అర్బన్ సీలింగ్ భూములపై దృష్టి -మద్దతు పలికిన అన్ని పార్టీల నేతలు

దళితులను ఆదుకోవడానికే సభాసంఘం -భూ కబ్జాకోరులను వదిలిపెట్టేది లేదు -అంకుశంలా పనిచేస్తాం – చట్టాన్ని అందరం గౌరవించాలి -కబ్జాల్లో 1.90 లక్షల ఎకరాలు : అసెంబ్లీలో సీఎం కేసీఆర్ -పొన్నాల భూ కబ్జాపై సభలో చర్చ -ఆధారాలు చూపిన మంత్రి హరీశ్‌రావు దళితులు, బీసీలు, ఎండోమెంట్, వక్ఫ్‌బోర్డు, చర్చి, భూదాన్, అర్బన్ సీలింగ్‌కు సంబంధించి ఇప్పటివరకు తెలంగాణలో 1.90 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు కబ్జాకు గురైనట్లుగా సీఎం తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకుని, తిరిగి దళితులు, ఆయా వర్గాలకే కట్టబెడతామని స్పష్టం చేశారు. సభాసంఘం అన్ని జిల్లాలు తిరిగి తయారుచేసే నివేదికను వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. కబ్జాచేసినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భూకబ్జా విషయంలో మాజీ మంత్రి, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ల్యాండ్ అసైన్డ్ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని సీఎం చెప్పారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసే ఉద్దేశం తమకు లేదని అన్నారు.

పొన్నాల కబ్జా చేసిన భూములను తిరిగి స్వాధీన పరుచుకోవాలని గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిందని సీఎం గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎండోమెంట్, వక్ఫ్, చర్చి, భూదాన్, అర్బన్ సీలింగ్‌కు సంబంధించి అన్యాక్రాంతానికి గురైన భూములపై సభా సంఘం ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ముందు పొన్నాల లక్ష్మయ్య స్వాధీనంలో ఉన్న అసైన్డ్ భూముల వ్యవహారంపై సభలో చర్చ జరిగింది. వరంగల్ జిల్లా, ధర్మసాగర్ మండలం, రాంపూర్ గ్రామంలో ఉన్న అసైన్డ్ భూములను పొన్నాల లక్ష్మయ్య దురాక్రమణ చేశారని సభ్యులు తాటి వెంకటేశ్వర్లు, ఏ ఇంద్రకరణ్‌రెడ్డి, కొండా సురేఖ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, దాస్యం విజయ్‌భాస్కర్ లేవనెత్తిన ప్రశ్నకు బుధవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ సమాధానం ఇచ్చారు.

ఆ తర్వాత పొన్నాల భూకబ్జాపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సుదీర్ఘంగా మాట్లాడారు. సభ్యుల ప్రశ్నలకు కూలంకషంగా వివరణ ఇచ్చారు. 1971లో రాంపూర్ గ్రామంలో దళితులకు చెందిన 106.01 ఎకరాల భూమిని పొన్నాల లక్ష్మయ్య కబ్జా చేశారన్నారు. దళితుల భూములపై 1987లో పొన్నాల లక్ష్మయ్య, రామ్మోహన్‌లు వేసిన రిట్ పిటిషన్‌లను హైకోర్టు తిరస్కరించిందన్నారు.

అదే సమయంలో అసైన్డ్ భూములు కొనుగోళ్లు, అమ్మకాలు జరుపవద్దని, ఇతరులకూ బదలాయించవద్దని హైకోర్టు తీర్పు చెప్పిందన్నారు. అయినప్పటికీ పొన్నాల లక్ష్మయ్య నిబంధనలు అతిక్రమించి మరో 8 ఎకరాల భూమిని కొన్నారని చెప్పారు. దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ అయ్యాయన్నారు. అప్పటి ప్రభుత్వం పొన్నాల వ్యవహారంపై ఉదారంగా వ్యవహరించిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఒకే జీవోపై ఏపీఐఐసీకి 75 ఎకరాలు, పొన్నాలకు 8.39 ఎకరాల భూమిని కట్టబెట్టిందన్నారు. అయితే ఏపీఐఐసీని కట్టబెట్టిన భూములకు 12 శాతం వడ్డీ చెల్లించాలని, అదే పొన్నాలకు కట్టబెట్టిన భూములకు వడ్డీ లేకుండా అప్పగించారని పేర్కొన్నారు.

ఈ విధంగా పొన్నాలపై అప్పటి ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరించిందని విమర్శించారు. మార్కెట్ విలువ ప్రకారం అప్పట్లో ఎకరానికి రూ.7లక్షల నుంచి రూ.10లక్షల విలువ చేసే భూములను కేవలం రూ.25,500కే అప్పటి ప్రభుత్వం కేటాయించిందని సభ దృష్టికి తెచ్చారు.

ఈ విధంగా దురాక్రమణకు గురైన దళితుల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రస్తుత ఎంపీ కడియం శ్రీహరి సహా దళిత నేతలు అప్పట్లో ధర్నా కూడా చేశారన్నారు. అప్పటి ప్రభుత్వం పొన్నాలకు భూములు కేటాయించడాన్ని కంప్ట్రోలర్ అండ్ జనరల్ (కాగ్) తప్పుబట్టిన విషయాన్ని కూడా మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చారు.

ఆయన కబ్జా చేసిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, దళితుల భూములను తిరిగి దళితులకే కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వం ఏపీఐఐసీకి కట్టబెట్టిన భూమిని తిరిగి పొన్నాలకు ఇస్తూ తీసుకువచ్చిన జీవో చట్టానికి వ్యతిరేకంగా ఉందని హరీశ్ స్పష్టం చేశారు. దళితుల భూములకు సంబంధించి చట్టం ఉల్లంఘించిన వారికి ఆరు నెలలు జైలు, రూ.10ల జరిమానా లేక రెండు శిక్షలూ అమలు చేయాల్సి ఉంటుందని అసైన్డ్ చట్టంలో పొందుపరిచినట్లు మంత్రి పేర్కొన్నారు.

దళితులకు కేటాయించిన భూములు కబ్జాకు గురైతే ప్రభుత్వం తిరిగి వాటిని స్వాధీనం చేసుకుని వారికే కేటాయించాలని చట్టం చెబుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు పొన్నాలపై చర్యలకు హైకోర్టు ఆదేశాల ప్రకారం 2007లో నోటీసులు జారీ అయినా.. అవి ఇప్పటికీ పెండిగ్‌లోనే ఉన్నాయని చెప్పారు. అలాగే గత ప్రభుత్వం 2013లో కూడా ఏపీఐఐసీ జోనల్ అధికారికి నోటీసులు ఇచ్చారని, అవికూడా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

గత ప్రభుత్వంలో పొన్నాల మంత్రిగా వ్యవహరించడం వల్ల ఆయనకు నోటీసులు జారీ చేయడానికి అధికారులకు సాధ్యంకాలేక పోయిందని భావించాల్సి వస్తున్నదన్నారు. ఆ నోటీసులు ప్రస్తుతం వరంగల్ జోనల్ అధికారి వద్దే ఉన్నాయని చెప్పారు. దళితుల భూములు కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్న హరీశ్.. ఈ విషయంలో ప్రభుత్వానికి అన్ని పార్టీల మద్దతు కావాలని విజ్ఞప్తి చేశారు. తాము దళితుల దగ్గర భూములు కొన్న మాట వాస్తవమేనని అప్పట్లో వరంగల్ జిల్లా కలెక్టర్‌కు పొన్నాల అఫిడవిట్ కూడా ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు.

ఒక మంత్రి స్థానంలో ఉన్న పొన్నాలకు దళితుల భూములు కొనుగోలు చేయకూడదన్న విషయం కూడా తెలియకుండా పోయిందా? అని హరీశ్ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ మాట్లాడకూడదని ప్రతిపక్షనేత జానారెడ్డి అన్నారు. దీనిపై హరీశ్ స్పందిస్తూ.. దళితుల భూములను కాపాడాలని ప్రభుత్వం భావిస్తుంటే.. ఈ విధంగా మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు.

సభా సంఘానికి అన్ని పార్టీల మద్దతు పొన్నాల భూ దురాక్రమణతోపాటు రాష్ట్రంలోని పది జిల్లాల్లో దురాక్రమణకు గురైన అసైన్డ్ భూములను పునరుద్ధరించే విషయంలో సభాసంఘం వేయాలనుకుంటున్న ప్రభుత్వానికి తాము మద్దతు తెలియజేస్తున్నామని ప్రతిపక్షనేత జానారెడ్డి అన్నారు.

టీడీపీ తరఫున ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. పొన్నాల లక్ష్మయ్య భూకబ్జాలపై ఎన్నో సంవత్సరాల నుంచి రాంపూర్ గ్రామ ప్రజలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారన్నారు. గత ప్రభుత్వాలు వాటిని పట్టించుకోలేదని చెప్పారు. వాటిని స్వాధీన పరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో తాము ప్రభుత్వానికి తప్పకుండా సహకరిస్తామని తెలిపారు.

హన్మకొండ మండలంలో కూడా 200 ఎకరాల దళిత భూములు కూడా కబ్జాకు గురయ్యాయని, వాటిని కూడా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని కోరారు. సభ్యులు రామచంద్రారెడ్డి, ఆహ్మద్‌పాషాఖాద్రి, సంపత్, సున్నం రాజయ్య, అక్బరుద్ధీన్ ఒవైసీ ఇతర సభ్యులు అసైన్డ్ భూముల కబ్జాలపై సభా సంఘం వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందులో అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు మతపెద్దలను కూడా సభ్యులుగా నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.