-కాలనీ అసోసియేషన్ల సభ్యులను పార్టీలో చేర్చాలి -యువకులు, విద్యావంతులకు ప్రత్యేక కౌంటర్లు -సభ్యత్వ నమోదుపై టెలీకాన్ఫరెన్స్‌లో కేటీఆర్ -చురుకుగా చేస్తున్నారంటూ పార్టీ నేతలకు అభినందనలు

పట్టణప్రాంతాల్లో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మున్సిపల్ ప్రాంతాల్లో సభ్యత్వ నమోదుపై ప్రత్యేకదృష్టి సారించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదుపై సోమవారం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సభ్యత్వ నమోదు ఇంచార్జులు, సీనియర్ నాయకులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటివరకు ఎంత సభ్యత్వం నమోదైందో తెలుసుకున్నారు. పట్టణప్రాంతాల్లో విద్యావంతులు, వృత్తినిపుణులను స్వయంగా కలిసి సభ్యత్వం ఇచ్చేలా చూడాలని సూచించారు. పట్టణాల్లో రెసిడెంట్స్, కాలనీవెల్ఫేర్ అసోసియేషన్ల సభ్యులను కలిసి పార్టీలో చేరేలా చూడాలన్నారు.
పట్టణాల్లోని యువకులు, విద్యావంతులు పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నందున వారు స్వచ్ఛందంగా సభ్యత్వం స్వీకరించేందుకు వీలుగా ప్రత్యేకకౌంటర్లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఆన్లైన్లో కూడా సభ్యత్వ నమోదుకు కృషిచేయాలని చెప్పారు. ఎప్పుడైనా పురపాలికల ఎన్నికలుండే అవకాశమున్న నేపథ్యంలో పట్టణాల్లో నమోదు సాధ్యమైనంత త్వరగా, వీలైనంత ఎక్కువమందిని చేర్చేలా చూడాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకుల సందేశాలను కేబుల్టీవీలతోపాటు సామాజిక మాధ్యమాలను వాడుకొని యువతను సభ్యత్వానికి కదిలించాలని చెప్పారు.
పార్టీ నేతలకు కేటీఆర్ అభినందన సభ్యత్వ నమోదు చురుకుగా సాగుతున్నదన్న కేటీఆర్.. కార్యక్రమంలో పాల్గొంటున్న పార్టీ శ్రేణులను అభినందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నాయకులు సమిష్టిగా ఎక్కడిక్కడ సభ్యత్వనమోదు కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇంటింటికీ సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని తీసుకుపోవాలన్నారు. గ్రామాల్లో వ్యవసాయపనులు ప్రారంభమైన నేపథ్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పార్టీ అనుబంధసంఘాలు ఈ కార్యక్రమంలో మరింత క్రియాశీలం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా బీడీ కార్మికులు, భవననిర్మాణ కార్మికులు, ఆటోడ్రైవర్ల దగ్గరికి నేరుగా వెళ్లాలన్నారు.
ఇప్పటిదాకా జరిగిన పార్టీ సభ్యత్వనమోదుపై ఎప్పటికప్పుడు మండలాలు, పట్టణాలవారీగా నమోదు, పుస్తకాలు తిరిగి ఇవ్వడం, వాటి డిజిటలీకరణ ఎంతవరకు పూర్తయింది వంటి వివరాలను పార్టీకి అందించాలని కేటీఆర్ కోరారు. వాటిని ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు అందిస్తామన్నారు. పట్టణాలు, గ్రామాల్లో అంతటా పండుగ వాతావరణంలో సభ్యత్వనమోదు కొనసాగుతున్నదని, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఇంచార్జులు కేటీఆర్‌కు తెలిపారు. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికి 50 నుంచి 60 వేల సభ్యత్వనమోదు లక్ష్యాలను గడువులోగా పూర్తిచేస్తామని చెప్పారు.