– జోరుగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ – గడువుకు ముందే లక్ష్యాన్ని దాటుతున్న జిల్లాలు – ఆనందంలో పార్టీ శ్రేణులు

సభ్యత్వాల నమోదులో టీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. గడువుకు ముందే లక్ష్యానికి మించి సభ్యత్వాలు నమోదవుతున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు, ఇతర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సభ్యత్వ నమోదుకు వస్తున్న స్పందనను చూసి పార్టీ నాయకులు సంబురపడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పలువురికి సభ్యత్వాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ భవిష్యత్తులో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగి ప్రజల గుండెల్లో మరింత నాటుకుపోతుందన్నారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని 39 గ్రామాల్లో నిర్వహిస్తున్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై మండల పార్టీ నాయకులు, ముఖ్య నేతలతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం రాయపర్తిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం 75వేల మార్క్‌ను దాటి లక్ష సభ్యత్వాల నమోదు వైపు పరుగులు పెడుతున్నట్టు తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇంచార్జి జన్ను జఖార్య తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ, అన్నోజిగూడ లో నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పార్టీ సభ్యత్వాలను అందజేశా రు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని పార్టీ నాయకులకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో మహబూబాబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మె ల్సీ సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఇదే జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో రాష్ట్ర కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పార్టీ సభ్యత్వం అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడ్గల్‌లో ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి చాడ కిషన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఉప్పునుంతల మండల కేంద్రంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జగిత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఇంచార్జి రూప్సింగ్ పలువురికి పార్టీ సభ్యత్వాలను అందజేశారు.


